ఉత్కృష్ట

” నా పేరు శవం, ఒక అమ్మాయి చచ్చిపోయిన  తర్వాత మరలా జీవం పోసింది, కానీ ఎటు వెళ్ళాలో చెప్ప లేదు. నాకు ఎలా బతకాలో తెలీటo లేదు, పూజారి గారు ” అన్నాడు బతికొచ్చిన శవం.

పూజారి గారు, సగం నిద్రలో లేచి అతని మాటలు విని, ఉలిక్కిపడి, “పీడ కల కన్నట్టు ఉన్నావు, వెళ్ళు ఇంటికి నాయన ” అన్నారు ఆత్మీయంగా

“లేదండీ, మీరు విన్నది నిజమే, చచ్చి పడి ఉన్న నన్ను ఒక డాక్టరు బతికించి, పారిపోయింది.ఇపుడు ఎక్కడుందో తెలీదు, పైగా మా వాళ్ళు నన్ను నన్నూగా, గుర్తించట్లేదు, గుళ్ళో పని ఇప్పిస్తారా” అన్నాడు లోగొంతుకతో.

“ఓహ్, ప్రేమ వ్యవహారమా, అన్నీ సర్దుకుంటాయిలే, ఈశ్వర కృప నీకు అందుతుంది, వెళ్ళి రా నాయన”

“కాదండీ నన్ను నమ్మండి, నేను చనిపోయాను, ఒక అమ్మాయి ఎందుకో నన్ను బతికించింది.”

“చూడు నాయన! నాకు గుడి తలుపులు తెరిచి, సుప్రభాత సేవ చేసే సమయం దగ్గర పడింది, నేను వెళ్ళాలి, అదిగో అక్కడ రాత్రి మిగిలిన ప్రసాదం తిని వెళ్ళు” అని వెళ్ళిపోయాడు ఆయన.

అతడు ప్రసాదం ఆబగా తిన్నాడు, “ఇంత ఆకలి వేసిందంటే నేను మామూలు మనిషిని అయిపోయాను, కానీ ఆమె ఎవరు?మళ్ళీ ఎందుకు బతికించింది…..?” అతడి తలలో ఆలోచనల టోర్నోడలు దాడి చేస్తున్నాయి.

అతడిని, వెనక్కి తిరిగొచ్చిన పూజారి గారు, “కావాలంటే నాతో పాటు ఈ గుళ్ళో ఒక మూల పడుకో, ” అని పూజ కోసం వెళ్ళిపోయాడు.

అతను ఇది విని వైరాగ్యపు నవ్వు నవ్వి  బతికించి చంపుతున్నా అమ్మాయి నువ్వెక్కడ అనుకూనాడు.

*******************************************************************************

“హే ప్రబంద! ఇక నీ ప్రాక్టికల్స్ ఆపి రావే, కాలేజీ గంట కొట్టి అందరూ వెళ్లిపోతున్నారు”

“అబ్బా నువ్వు వెళ్ళు, నీకు తెల్సు కదా, నాకు ప్రాక్టికల్స్ అంటే ప్రాణo అని”

“అక్కడ మీ ఆయన కూడా అదే అంటున్నాడు”

“ఛీ ! నోర్మూసుకొని వెళ్ళవే”

ఆమె వెళ్ళగానే అందరూ వెళ్ళారో లేదో అని ధృవీకరించుకొని, తాను రహస్యంగా దాచుకున్న ఒక కార్టన్ పెట్టె లోని మందులు తీసి 20 రకాలుగా వేరు వేరు మందులు తయారు చేసింది.

ఇంతలో కాలేజీ వాచ్మేన్ వచ్చాడు” అమ్మ ప్రబంధ.! నువ్వు, మెడికో విద్యార్థినివే, మెరిట్ విద్యార్థినివే, కానీ నేను ఇంటికి వెళ్ళాలి కదా” అన్నాడు నవ్వుతూ

వెంటనే అతని చేతిలో ఒక 100 నోటు పెట్టి, రోజులాగే ముందు గేట్ తాళం వేసుకొని వెళ్ళిపో, నేను నా పని అయిపోయాక, వెనక గోడ దూకి వెళ్ళిపోతాను” అన్నది.

అతడు తలొంచుకొని ఆ నోటు కళ్ళకద్దుకొని ” జాగ్రత్త అమ్మ” అని వెళ్ళిపోయాడు.

ఇంతలో “ప్రభా, శవం రెడీ.” అంటూ, ముకుళ్ వెనక కిటికీ దగ్గర నుండి రహస్యంగా ఆమెను పిలిచాడు.

ఆమె తాను కలిపిన మందులు అన్నీ ఒక్కోటి అతనికి గది లోనే ఉండి కిటికీ నుంచి అందించి, “ఒక్క చిన్న మిల్లీ చుక్క కూడా ఎక్కువ తక్కువ వేయకు” అంటూ ఇచ్చింది.

అతడు అన్నిటిని ఆ శవం నోట్లో వేయ సాగాడు కిటికీ అవతల నుంచి తీసుకొని. సుమారు 20 మందులు వేశాక శవం లో కొద్దిగా చలనం  కనిపించింది.

“సక్సెస్”.  అంటూ ముకుళ్ గట్టిగా అరిచాడు.

కంగారు పడిన ప్రభంద  “భాగో” అంటూ అరిచింది.

వాచ్ మన్ ఉండేది పక్కన ఉన్న గుడిసెలోనే అవ్వటం తో ఒక్క పరుగులో వచ్చి, .”ఇక్కడ ఏదో మగ గొంతు విన్నాను” అన్నాడు.

“అంతా నీ భ్రమ, నువ్వేగా తాళం వేసుకున్నది బయట నించి ఎవరు వస్తారు ఇంతలో” అన్నది కంగారు కప్పిపెడ్తూ.

“నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు టైమ్ 7.30 అయింది, నువ్వు ఆడ పిల్లవి, నాకు మాట వస్తుంది వెళ్ళమ్మ ఇంక ”

ఆమె 500 నోటు ఇచ్చింది, ఈసారి

అతడు, చేతులు వెనకకి పెట్టి “డబ్బు కక్కూర్తి పనులు చేసి ఉన్న ఉద్యోగం పోగొట్టుకోలేను” అని ఆమెను పంపేశాడు.

ఆమె ఆ శవం ఏమైంది, అనే ఆలోచనలతోనే తన హ్హస్టల్ గదికి చేరుకున్నది. తల స్నానం చేసిన వెంటనే, మరలా ముకుళ్ కి ఫోన్ చేసింది, ఆ బతికిన శవం గూర్చి ఆరా తీయటానికి. కానీ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉన్నది అర్ధ రాత్రి రెండు గంటల్ వరకు, “ఏమయిపోయాడు, అప్పుడే పారిపోయాడు కదా, ముకుల్?” అని అలాగే ఎప్పుడు తెల్లరుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది.

***************************************************************************

“మనిషి ప్రాణాలు, తిరిగి తెచ్చి ఇవ్వలేరు ఎవరు. మేం డాక్టర్లo మాత్రమే, దేవుళ్ళo కాదు” అనే పదాలు చెరిపేసి, తమ ఆప్తులకు మరో జన్మ ప్రశాదించాలనుకొనే కొన్ని మమతానురాగ చెకోర పక్షుల కోసం, తల్లి తండ్రులకు, వరంగా ప్రసాదించాలని, ఆమె ధ్యేయం.

తన తండ్రికి తన పరిశోధనలకై  వీలైనంత సహాయం చేయమని కోరింది, కానీ అతడు తల్లి లేని పిల్ల అవ్వటం చేత, ఇలాంటి వింత ఆలోచనలు చేస్తున్నది, అనుకోని ఆమెకు డాక్టరు కోర్సు మధ్యలోనే వివాహo చేశాడు.

కానీ ఆమె పడ్డ ఒంటరితనం, తన తల్లి తనకు తిరిగి కావాలనే బలమైన పట్టుదల ఆమెను డాక్టరు కోర్సు వైపు నడిపి, పరిశోధనలు చేసేలా ప్రేరిపిస్తోంది, కానీ పూర్తిగా ఆమె ప్రయోగాలు ప్రతిసారి చివరిలో బెడిసికొడుతున్నాయి.ఈ  సారి పూర్తిగా శవం బతికిందని నమ్మకం  రాగానే వాచ్మేన్ వల్ల బతికిన శవం మిస్ అయింది.

మళ్ళీ తను అంతగా పెట్టుబడి పెట్టలేదు, కనుక అతడినే పట్టుకొని తన ప్రయోగం సఫలీకృతం చేయాలనుకొని నిశ్చయించుకున్నది.

********************************************************************************

బతికిన శవం అటు ఇటు తిరుగుతోంది, గమ్యం తెలీక. అడుక్కు తిందామంటే ఇదివరకటి ఆత్మాభిమానం ఎదురొచ్చి నిలదీస్తోంది అతడిని. కానీ ఆ మునపటి జీవితపు తెలివి తేటలు ఇప్పుడు మాత్రం పనికి రావటం లేదు. ఆకలి మంటలకు తాళ లేక తనను ఆమె అసలు ఎందుకు బతికించిన్దో అర్థం కాక, మళ్ళీ ఎందుకు జీవం కలిగిందని కక్షగా జీవనం నడుపుతున్నాడు.

రోజు చీకటి పడ్డాక మౌనంగా పూజారి గారి వద్ద కూర్చుంటాడు, ఆయన  తన కోసం చదువుకొనే శ్లోకాలన్నీ వింటాడు, అతడికి అవి ఎంత వరకు అర్థంవుతుందో తెలీదు కానీ, ఆ శ్లోకాలు అతని మనస్సుకి స్వాంతన మాత్రం ఇస్తున్నాయి.

చివరికి పూజారి గారికి నెల రోజులు పట్టింది ఇతడి వ్యధ ఏంటో. ఒక రోజు గుళ్ళోనే నిద్రకు ఉపక్రమించే తరుణంలో “పోనీ మీ తల్లి గారు కూడా నిన్ను గుర్తు పట్టలేదా” అని అడిగాడు.

“నన్ను కనగానే నా తల్లి కనుమూసింది”

“మరి మీ తండ్రి గారు”?

” నా కోసం ఎన్నో ఏళ్ళు, మరో పెళ్ళి చేసుకోకుండా వుండిపోయాడు, కానీ నేను పోయిన సంవత్సరం నేను చనిపోయాక , ఈ మధ్య నే పెళ్ళి చేసుకున్నాడు, వయసై పోయి వండి పెట్టె వారులేక. ఆవిడ నేను ఆస్తి కోసం వచ్చాను అని గెంటేసింది.”

“నీకు ఏమి గుర్తు లేవా? నిన్ను గుర్తించటానికి.”

“ఏమి గురుతు లేదు, నా మాతృ భాష తప్ప..!!”

“అభ్యసించిన విద్య”?

“ఏది గురుతు లేదు, ఆలోచిస్తే బుర్ర బద్దలైపోతోంది, జీవనం కష్టంగా ఉంది.. అందుకే ఆ అమ్మాయి రావాలి, నన్ను ఎక్కడ నుండి తవ్వి తీసిందో నాకు తెలిస్తే మా నాన్న దగ్గరకి చేరుకోగలను. .”

“నిన్ను ప్రేమించిన అమ్మాయా ఆమె”?

“కాదు, నాకు అలా ఎవరు లేరు”

“అయితే డాక్టర్లన్నా అయ్యుండాలి, లేదా, క్షుద్రకులు అయినా అయ్యుండాలి.”

“అవును ఒక లేడి డాక్టరు, ఎన్నో కంపు కొట్టే మందులు అందిస్తుంటే, ఒకడు నా నోట్లో పోసాడు. నన్ను బలవంతంగా బతికించారు. తర్వాత అతడు ఎందుకో పారిపోయాడు, నేను అతడిని వెంబడించి అతడి ఇంటికి చేరుకున్నాను, నాలుగు తన్నాను కూడా. నా ఉనికేంటి, దానికి అర్థం చెప్పమని. ప్రబంధ చెప్పింది చేశాను, ఆమెనడిగి గంటలో ఆమె అడ్రెస్ ఇస్తా మళ్ళీ రా అన్నాడు. గంట వరకు వాడి ఇంటి ముందే కూర్చుని లోపలి వెళ్ళాక చూస్తే ఉరేసుకుని ఉన్నాడు.”

“మరి నీ తండ్రి, ఇల్లు ఎలా గుర్తొచ్చాయి”?

“పది రోజులకి గుర్తొచ్చి నేనే వెళ్ళాను. తన కొడుకు పోలికలు ఉన్న ప్రతి వాడు తన కొడుకుగా దగ్గరకి తీసుకోలేను అని పంపేశారు, అందుకే ఆ అమ్మాయి నా గొయ్యి అడ్రెస్ చెప్తే మా  నాన్నకు చెప్పాలి.”

“సరే, అప్పటి దాకా ఓపిక పట్టి, ఈ గుడి ఆవరణలోనే ఉండు. సేవలు చేయి, ప్రసాదమే భోజనంగా భావిoచు. అంత కన్నా ఎక్కువ ఈ బీద బ్రమ్హడు నీకు ఏమి అందించలేడు. అంతే కాదు నీది పునర్జన్మ కాదు,  క్రితం జన్మ కాదు, నిజానికి మీ తండ్రికి చెందిన వాడివి కూడా కాదు, ప్రాణం పోగానే బంధాలు తెగిపోతాయి, అసలు శివాంశతో కూడిన జీవుడివా, శివం లేని శవానివా అర్థం కావటంలేదు. కనుక ఆలయo లో మాత్రం అడుగు పెట్టకూడదు. నీ అస్థిత్వం ఋజువయ్యే వరకు, దూరంగా వుండు, హోమలు చేశాక, కొన్ని నియమాలు పాటించాక నిన్ను అనుమతిస్తాను.”

“పోనీ నన్ను ఒక అనాధగా నైనా గుర్తించి లోనికి రానివ్వండి. వానకు తడవలేను కదా! ఎండకు ఎండలేను కదా! శరీరం ఉన్నది కదా! మాట్లాడుతోoది  కదా!…ఊపిరి ఉంటే అది శివాంశమే కదా!”

“నువ్వు అనాధవి కూడా కాదు నాయన, నీ పుట్టుక విచిత్రమైనది, నన్ను క్షమించు, ఆ కాత్యాని అంగీకారం లేనిదే నిన్ను అనుమతించలేను.”

“అయితే నేను ఊపిరి పోసుకున్న శవాన్ని మాత్రమే అంటారు. అవునా”!

“బాధ పడకు, అమ్మాయిని వెతుకు, నీ తండ్రి నిన్ను గుర్తించి హోమాలు చేయిస్తే, నీవు అన్నిటికి మరలా యోగ్యుడవు అవుతావు”

“మరి అప్పటి దాకా నా పేరు ఏంటి…?”

గుర్తింపు లేని జన్మ కనుక, నీడ లేని జీవనం సాగిస్తున్నావు కనుక “ఉత్కృష్ట గా పిలవబడి అందరిలో నీ కష్టం చాటి చెప్పు, చూద్దాo,  ఏదో శాస్త్రం నిన్ను రక్షించక మానదు.”

************************************************************************************

ప్రబంధ, నాలుగో  సవత్సరంలో అడుగు పెట్టింది, బతికిన శవం ఎటు వెళ్ళిందో తెలీక వెతుకుతూనే ఉన్నది. “ముఖం గుర్తున్నది, కానీ ఏమన్నా మార్పులు జరిగి ఉంటే, పుట్టిన పాపాయి మొఖం మారిపోయినట్లు, మరలా మారిపోయి ఉంటే ఎలా గుర్తించగలను”  ఇలా అర్థంలేని ప్రశ్నలు ఆమెను వేధించ సాగాయి.

ఈ లోగా తన భర్త గుర్తొచ్చి, తన ఆశయాన్ని అతనికి చెప్పింది, అతను సగం వినగానే “ఇది సృస్టీ విరుద్ధం, సృస్టికి ప్రతి సృస్టీ చేయటం మహా పాపం” అంటూ నోరు మూయించేశాడు. దానితో ఇంకో శవాన్ని కొని ప్రయోగం చేసే తాహతు ఆమె దగ్గర లేకుండాపోయింది. ఇంతలో ఆమె తండ్రి వద్ద ఆమెను దింపేసి, “కొన్ని రోజులు మీ అమ్మాయికి బుద్ధులు చెప్పి పంపండి, చదివి నన్ను ఉద్దరించక్కర్లేదు ” అన్నాడు.

ఆమె తండ్రి తల పట్టుకుని కూర్చొని, “ఎందుకమ్మ నీకు ఈ విపరీతమయిన ఆలోచనలు, ఒక మనిషి చనిపోయాడు అంటే మన ఋణం అంత వరకే అతడితో, తిరిగి పుట్టిస్తే, ఋణానుబంధం లేక ఎవరితో బతకుతాడు? గాలికి, భూమి కూడా బరువు అయిపోతాడు. భార్య, బిడ్డలు, తల్లి తండ్రులు, అక్క చెల్లెళ్ళు ఇదంతా రుణానుబంధమే తల్లి, ఆ ఋణం తీరిపోగానే వెళ్ళిపోవాలి, తప్పదు. ” అని విలపించాడు.

“నాన్న, నాకు అమ్మ కావాలి, నన్ను పుట్టించి, ఆ దేవుడు, నాకు మా అమ్మకి ఋణం లేదంటే నేను నమ్మాలా, ఊరుకోవాలా?, నేను తెచ్చుకుంటా మా అమ్మని.”

“చూడు తల్లి, తల్లి అవసరం ఎవరికైనా బాల్యంలో ఎక్కువగా వుంటుంది, నువ్వు ఆ దశ దాటి కౌమార దశకు చేరుకున్నావు, నీకు నీ భర్త ముఖ్యం ఇప్పుడు, తల్లి ఉన్నా కూడా నన్ను విడిచిపెట్టినట్లు విడిచి వెళ్ళవా?, పెళ్ళాయ్యాక పుట్టింట్లో ఉండకూడదు కదా?”

“కానీ నా బాల్యంలో ఆవిడ లేదు, కనుక ఇప్పుడు నాకు కావాలి.”

“సరే తల్లిని తెచ్చుకొని, తర్వాత నువ్వు బాల్య దశకు చేరుకొనే ప్రయోగాలు చేస్తూ కూర్చో, ఉన్న జీవితం ప్రయోగాలకే అంకితం చేసుకొని లేని దాని కోసం  పరితపిస్తూ ప్రేతాత్మగా మిగిలిపోదు గాని” అని రౌదృడై వెళ్ళిపోయాడు ఆయన.

ఆమె బయటకు వెళ్ళి నింగి కేసి చూస్తూ, “నీ ఆటలు సాగవు ఇంక, బంధాలు పెంచి, తుంచేసి, పాపం పుణ్యం అంటే నమ్మే మూర్ఖురాలిని కాను” అంటూ శపధం చేసింది.

*************************************************************************************

చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టాక  ప్రబంధకు పట్టుదల మరింత పెరిగింది, తండ్రి ఆఫీసు వెళ్ళాక తనకు కావల్సిన సమాచారం కోసం ఇంటెర్నెట్ లోనూ, రెటైరు అయిన వైద్యులతోనూ చర్చించి కావల్సిన సమాచారం పోగు చేసుకున్నది. కానీ పూర్తి గా ఒక ప్రయోగం చేస్తే కానీ తన ఆశయం సఫలీకృతం కాదు. ఇంక అతడిని  (ఉత్కృష్ట) అన్వేషించటం మొదలెట్టింది.

సాయంకాలం తిరిగి తిరిగి ఇంటికి చేరేది తండ్రి వచ్చే సమయానికి, కానీ నెలలు గడిచిన అతను కనబడ లేదు. ఒక రోజు నైరాశ్యం ముసురు కమ్మినట్లు ఆమెను కమ్ముకున్నది, వాకిట్లో కూర్చోని శూన్యంలోకి చూస్తూ ” అమ్మ! నేను నిన్ను మరలా పుట్టించాలనుకుంటే సరిపోదు, నువ్వు కూడా మరలా పుట్టాలి, నా కూతురిని చేరుకోవాలి అని అనుకోవాలి. ఈ ప్రయత్నం సఫలీకృతం కాలేదంటే  నీకు నాకు ఋణం లేదని నువ్వే  అన్నట్లు భావిస్తాను”  అనుకోని ఉబికిన కంటి గంగను తన కనుసన్నల్లోనే బిగించింది గండి పడకుండా..

ఇంతలో “పూలు, చామంతి పూలు, గులాబీ పూలు” అంటూ ఒక యువకుడు ఆమె ఇంటి ముందు నిల్చునాడు. మసక కళ్ళను తుడుచుకొని అటు వైపు చూసింది, ఆశ్చర్యం!!! అతడే ..అతడే తాను జీవం పోసిన ఊపిరి లేని శరీరo, తన ప్రయోగాల ఫలం, తనకు తన తల్లికి మద్య్హ వారధి అతడే.”

తన తల్లికి దండం పెట్టుకున్న మరుక్షణం అతడు చేరుకున్నాడు, అంటే ఆమెకు తనను కలవటం ఇష్టమే. అనుకుంటూ రివ్వున అతడిని చేరింది, ” నీ పేరు ఏంటి” అన్నది ఎగసే శ్వాసను అదుముతూ…

“ఉత్కృష్ట, అయినా ఎందుకు నా పేరు మీకు ?”

“నాకే కావాలి, నిజం చెప్పు, నువ్వు తిరిగి వస్తే మీ వాళ్ళు నిన్ను చేర దీశారా, నీకు అన్నీ గుర్తున్నాయా?”

“అంటే మీరు..?

“అవును నేనే, నిన్ను మరలా బతికించాను”

“కాదు, బతికించి అనుక్షణం చంపుతున్నారు.”

“అదేంటి, 25 ఏళ్ళు కూడా నిండని నువ్వు చనిపోతే నిన్ను బతికించాను, ఎందుకంటే నువ్వు ఇంకా జీవితంలో ఏది రుచి చూడలేదని, కావాలంటే 70, 80 ఏళ్ళ వాళ్ళను కూడా బతికించగలను, కానీ నీ వయస్సుకు నేను ప్రాముఖ్యత ఇచ్చాను.”

“బతుకు రుచి చాలా చేదుగా ఉంది, దయ చేసి ఇంకో ముప్ఫై మందులు వేసి చంపేయండి, లేదా నా గొయ్యి అడ్డ్రెస్సు చెప్పు, నా తండ్రి బోలెడు ఆస్తి ఉన్నోడు, నేను పూలమ్ముకొని బతుకుతున్నాను ఇక్కడ.”

“పిచ్చి గా మాట్లాడకు, నీ తల రాత ను నేను తిరగ వ్రాస్తాను”

“ఇంకా ఏం ఆడుకోవాలి తల్లి నువ్వు నాతో, పిల్లి మీద ఎలుక మీద చేసుకో నీ ప్రయోగాలు, నా మీద చేస్తే ఎలా?

“వాటికి ప్రాణం ఉంది కానీ, భావాలు, అంతరంగాలు, బంధాలు లేవు కదా”?

“అలా అని నా నవనాడుల మీద నువ్వు నీ ఆధిపత్యం చలాయిస్తావా? దేవుడున్నాడు, గుర్తుందా?”

“ఒక వేళ ఆ దేవుడే నీకు మరో జన్మ నిచ్చాడు ఏమో?”

“కాదు నీ స్వార్థం కోసం, నాకు లేని జీవితం నాకిచ్చి, నావి కాని కష్టాలను నాకు బహూకరిస్తే నేను తీసుకోవాలా “?

“తీసుకోవాలి, ఎన్నో బంధాలను తిరిగి పునరుద్ధరించాలంటే నువ్వు ఈ మాత్రం కష్ట పడాలి”

“పడను, నా వల్ల కాదు”

“అయితే నేను నీకు నీ గొయ్యి అడ్రెస్ చెప్పను.”

“ఇది అన్యాయం, ఎవరయినా బతికుండగా హింసిస్తారు, నువ్వు చచ్చిన నన్ను బతికించి ఇలా హింస పెట్టడం బాగాలేదు”

ఆమె తన ఇంటి గేటు వెసుకొని, ” నీ ఇష్టం, 3 రోజులు  సమయం ఇస్తున్న, ఆలోచించుకో ” అని వెళ్ళిపోయింది.

*********************************************************************************

“పూజారి గారు, పూజారి గారు “!! అంటూ పరిగెట్టుకొచ్చాడు, ఉత్కృష్ట.

“ఏమిట్రా, చీకటిలో ఆ పరుగులేమీటీ, ఆ పిల్ల కనబడిందా ఏమిటి?”

“అవును మీకెలా తెలుసు”?

“నీకు ఇప్పుడు అంతా కన్నా ముఖ్యమైన లక్ష్యం ఏముందిలే కానీ, ఇంతకీ ఏమన్నది, అడ్రెస్ చెప్పిందా?

“లేదు, ఆవిడ ఇంకా ఏదో ప్రయోగం చేయాలట, అందుకు నా శరీరం కావలట, చచ్చిన వాళ్ళని బతికించి వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పి, చచ్చిన బంధాలకు తిరిగి ప్రాణాలు పోస్తుందట, అప్పటి దాకా చెప్పదట”

“ఏమిటి, విపరీత ధోరణి, పిల్ల మనసు మంచిదే కానీ, అదెలా సాధ్యం, అందరికీ పోయిన వాళ్ళతో బంధాలు నిలబెట్టుకొనే ఆశ ఉండి ఉండాలి కదా! ఈ రోజుల్లో తండ్రి ఛస్తే ఎప్పుడు ఆస్తి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, పెళ్ళాం ఛస్తే కొత్త పెళ్ళాం కోసం ఎదురు చూస్తున్నారు. .”

“అదే నేను చెప్పేది, నా మీద ఇలా పగ పట్టినట్లు ప్రయోగాలు  చేస్తోంది, నేను కుక్కనా, పిల్లినా మీరే చెప్పండి.”

“పద నేను వచ్చి ఆ పిల్లకు నచ్చ చెప్తాను, అని గుడి తాళాలు వేసి, పరుగు నడకన బయలుదేరారు ఆయన అతడి తో సహా”

” ప్రబంధ గారు! త్వరగా బయటకు రండి”! అంటూ అరిచాడు ఆమె ఇంటికి చేరుకోగానే అతడు.

“ఆమె తన తండ్రికి, వినబడలేదని నిశ్చయించుకొని, తలుపు మెల్లిగా వేసి వీరి వద్దకు వచ్చి, “ఏంటి మూడు రోజుల  సమయం ఇచ్చానుగా, ఇంత రాత్రిలో ఎందుకు వచ్చావ్?” అన్నది లోగొంతుకతో.

“మా పూజారి గారికి నీ వాదం ఏదో వినిపించు, ఆయన నీ కన్నా పెద్ద వారు, సర్వం తెలిసిన వారు”

“నమస్కారం అండి, మిమ్మల్ని వాకిట్లోనే నిల్చోపెట్టి మాట్లాడుతున్నాను, క్షమించండి, మా నాన్న గారికి తెలిస్తే ,పెద్ద గొడవ అవుతుంది”

“ఎంత అమాయకురాలివి తల్లి, నీతో విభేదించే వారికి నీ లోటు పాట్లు చెప్పుకుంటున్నావు. నేనో, వీడో  ఆయనకు చెప్తే , ఏం చేస్తావ్, ఎంత కాలం గుట్టు దాచగలవు”?

“నిజమే, కానీ బంధాల విలువ తెలిసిన వారు ఎవరు, నా ప్రయోగానికి అడ్డు పడరు, ఆ నమ్మకం తోనే”

“చూడు తల్లి,  లోకం ఎన్నాడో మారిపోయింది, బతికుండగానే చంపేస్తున్నారు, మాటల్తోనో, మోశాలతోనో, అలాంటి రోజుల్లో, తిరిగి బతికించుకొనే అంత శ్రమ ఎవరు తీసుకుంటారు.హింస పెట్టె మొగుడు ఛస్తే బాగుండు అనుకొనే వాళ్ళకు, సమాజం మరలా బతికించుకోమని  ఆడ వారి మీద  ఒత్తిడి తెస్తుంది కదా!!”.?

“నా ప్రయోగం కేవలం బంధాల కోసం పాకులాడే వారికి మాత్రమే, దాని వెల కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అందరికీ అందుబాటులో వుండనివ్వను.”

“సృష్టికి ప్రతి సృష్టి చేస్తే ,ముందు నీకే ప్రమాదం, ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు తల్లి”

“ఫర్వాలేదు, నేను నా తల్లిని కలుసుకోవాలి, అప్పటి దాకా నా జీవితానికి అర్థం లేదు.”

మరి ఉత్కృష్ట సంగతి ఏంటి, ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాడు, . నీ స్వార్థం కోసం ఒక ప్రాణిని హింస పెడుతున్నావు, ఒక స్త్రీ

“అందుకే అతను ఎంత తొందరగా, నాకు సహకరిస్తే, అంత తొందరగా బాధల నుండి విముక్తుడవుతాడు.”

*************************************************************************************

“పాపిష్టిది, శనికి మారు పేరు, దానికి నేనే కావాలా, నువ్వన్న చెప్పవా దానికి, నువ్వు నాతో ఆడుకుంటే నాకో తృప్తీ. కానీ అదెవ్వరు నాతో ఆడుకోటానికి” అంటూ  దేవుడు దగ్గర తన మొర వెళ్ళకక్కుతున్నాడు, ఉత్కృష్ట.

“పోనీ రా! ఇంత అందమైన జీవితం మరలా నీకు ప్రసాదించింది, ఆనదంగా మలుచుకో, హాయిగా వుండు” అన్నారు పూజారి గారు..

“ఎలా ఉండేది, నా చదువు మర్చిపోయాను మొర్రో అంటే వినబడదా మీకు? పిలిచి ఎవడన్నా డబ్బులు ఇస్తాడా?, మీరేమో నీడ కూడా లేకుండా ఈ మట్టి నేల మీద చాప ఒకటి ఇచ్చి పడుకోమన్నారు” అని ఏదో గుర్తు ఒచ్చినట్లు పరుగెట్టాడు.

ప్రబంధ దగ్గరకు చేరుకొని, “ఈ బతుకు మీరు పెట్టిన బిక్ష, మీరే చంపండి” అంటూ కాళ్ళు పట్టుకున్నాడు ఆమె పడక గదిలో. అదే సమయానికి ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. ఆమె మీద అగ్గి మీద గుగ్గిలం అయిపోయి, ” ఛ! మీ ఇంటి దగ్గర వదిలితే, మీ నాన్న కస్టన్నా బుద్ధి చెప్తాడనుకున్నాను, కానీ నువ్వు ఇంత బరిదేగిస్తావనుకోలేదు” అంటూ అరిచాడు.

“నేను చేప్పేది కొంచెం వినండి, ఆవిడ చాలా మంచిది.” అన్నాడు ఉత్కృష్ట

“అవునా? నువ్వు ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పడ్డావ్, జీవితాన్ని ప్రసాదించిన దేవత అని ఎవర్ని అంటారో తెల్సా? పడక గదిలో ఒక మగాడు ఒక ఆడ దాని కాళ్ళ మీద పడితే అర్థం తెల్సా”

“తెలీదండి, నాకు అన్నీ తెలివితేటలు లేవు, కానీ నేన్నది నిజమే, ఆవిడే నాకు ప్రాణ భిక్ష పెట్టింది.”

“పెడుతుంది, ఎందుకు పెట్టదు, కలికాలం! మొగుడు వదిలేస్తే సీతలా  తలుచుకు తల్చుకు ఏడవటానికి కృత యుగం కాదు కదా, ఇంకో మగాడికి దేవత అయిపోతారు, ఛ!” అంటూ వెళ్ళిపోయాడు.

ఇదంతా అప్పుడే వచ్చిన ఆమె తండ్రి చూస్తూ మౌనంగా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి పోయాడు.

ఉత్కృష్ట గిల్టీగా ఫీల్ అవుతూ, ముందే చెప్పొచ్చుగా, నేను నీ పడక గదిలోకి రాకూడదని, నేను విలువలు అన్నీ మర్చిపోయాను” అని వెళ్ళిపోయాడు.

********************************************************************************

“పూజారి గారు, పూజారి గారు, మీరన్నది నిజమే, సృస్టికి ప్రతి సృస్టీ చేస్తే భగవంతుడు ఆమెను శిక్షిస్తాడు అన్నారు కదా! అది నిజమే అయింది, ఆమెను నన్ను ఆమె భర్త అనుమానించి నానా అభాండాలు వేసి వెళ్ళిపోయాడు.”

“అయ్యో అలాగా! ఎంత దురదృష్టం, ఉన్న బంధాలు పోగొట్టుకొని, చనిపోయిన బంధాల వెనక ఆ పరుగులేమీటీ ఆమెది”?

****************************************************************************8

ఎండకు తాళ లేక ఉత్కృష్టుడికి జ్వరం బాగా వచ్చింది. పూజారి గారు తనకు తోచిన మందులు వేసి వైద్యం కూడా చేశారు, అయినా ఆయన లేని సమయంలో  అతడికి మరలా తిర్గబెట్టింది,. గుడి మెట్లు ఊడ్చే  కృష్ణవేణి అతడికి సేవలు చేసింది, కొంచెం కుదుట పడ్డాక తన 5 ఏళ్ళ కూతురిని అతనికి తోడుగా ఉంచి, గుడి పన్ల మీద బయటకు వెళ్ళింది. ఆ పాప అతడికి తడి గుడ్డ నుదుటున వేసి, ఆరి నప్పుడల్లా మరలా తుడుస్తూనే ఉన్నది, వేడి ఎక్కువగా ఉండటం తో. అతడు వాంతులు చేసుకున్నప్పుడల్లా, బేసెన్ నోటి దగ్గర పెట్టి సేవలు చేస్తోంది. “నీకు ఇల్లు లేకపోతే మా ఇంట్లో పడుకో, ఇక్కడ ఎండ చాలా ఉంది” అన్నది పాప.

అతడు చిన్నగా నవ్వి “లేదమ్మ, నా దరిద్రం నీకు పట్టకూడదు, ఇలాగైనా చావని, నన్ను, ఆ మహా తల్లి నన్ను బతికించి ఇలా ఇరుకున పెడితే, ఆ దేవుడు ఈ రోగం ఇచ్చి సహాయం చేస్తున్నాడు”అన్నాడు ఆవేశంగా.

“ఎవరు ఆ మహా తల్లి”

“నీకు అర్థం కాదు కానీ, నువ్వు ఇంట్లోకి వెళ్ళు కాసేపు, ఇందాకట్నించి ఎండలో నే నాతో పాటు ఉన్నావు” అని పాపను  పంపేసి కళ్ళు మూసుకున్నాడు.

ఒక వారానికి పూర్తిగా కోలుకున్నాడు, పాప వారం రోజులు అతనికి చేదోడు వాదోడుగానే వున్నది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడ్డది. అతనికి జీవిత0 మంచి ఉత్శాహంగా అనిపించింది.

6 నెలలు గడిచాయి. పాప కృష్ణవేణి, ఆమె భర్త, పాప లకు కూడా తన గురించి చెప్పకుండా దాటవేస్తూ వచ్చాడు, పాప ఎక్కడ దూరం అవుతుందో అని. తనకో కొత్త కుటుంబం ఏర్పడ్డట్లు అనిపించింది పాప అతడిని మామ అని పిలుస్తుంటే.

.************************************************************************************

ఈ‌ రోజు మన ఉత్కృష్ట జీవితంలో ఒక మలుపు తిరుగే రోజు, వరదలు ఉధృతంగా ముంచెత్తాయి, నిల్చునే చోటు లేక ఊరంతా గుడిలో తల దాచుకున్నారు, మన వాడికి ఆ కాస్త నీడ కూడా లేదు. జనాల ఆర్త నాదాలు పెరిగి పోతున్నాయి, ఉన్న నాలుగు గోడలు సరిపోక, నిల్చోనే స్థలం దొరకటమే కష్టంగా ఉంది, ఈ లోగా గోడలు కూలుతున్నాయి, ఒక పక్క నించి. ఈ గొడవకి ఎవరు ఎక్కడ ఉన్నారో తెలీయని పర్స్దితి, కరెంటు కూడా పోవటంతో. పాప అగమ్యగోచరం తో గుడి బయటకు వచ్చి వరదలో కొట్టుకు పోయి, మరునాడు పక్కనే ఉన్న నాలా లో తేలింది.

ఉత్కృష్టుడి ప్రాణం పోయినంత పని అయింది, నిర్జీవమైన పాపను చూసిన కృష్ణవేణి దంపతులు మూర్చిల్లారు. ఒక్క ఊదుటున పాపను ఎత్తుకొని ప్రబంధ దగ్గారకు పరిగెట్టాడు. ఊరంతా అతడు చేసే పనికి విస్తు పోయి వెనక పడ్డారు, అతడి ఉద్దేశ్యం తెలీక. పూజారి గారికి అర్థం అయి, ఊరందరిని ఒక్క హూంకరింపుతో అదుపు చేసి అతడికి దారి ఇవ్వమన్నారు.

“పది నిమిషాల్లో పాప శరీరంతో అతడు ప్రభందను చేరుకున్నాడు. ఆమె మౌనంగా చూసి నేను ఏం చేయలేను, నా భర్త నన్ను అపార్థం చేసుకున్నాడు, మీ శాపాలు ఫలించాయి” అన్నది.

“అలా అనకండి, మీరు చెప్పేది ఆ రోజుల్లో అర్థం కాలేదు, ఇప్పుడు ప్రాణం విలువ తెలిసింది”

“ఓహ్ మీకు తెలియగానే సరిపోయిందా, ఇప్పుడు నేను కూడా ప్రాణం విలువ లేదని తెల్సుకున్నాను, నేను ఏం చేయలేను అన్నది”

“అంత మాట అనకండి, నాకు జీవితం మీద మరలా ఆశ పుట్టింది ఈ పాప ముద్దు ముద్దు మాటలు విన్నాక, అక్కడ పిల్ల తల్లి తండ్రి మూర్ఛ పోయారు కూడా, కావాలంటే నేను మీరు చెప్పిందల్లా చేస్తాను.”

ఆమె మౌనంగా ఉన్నది. అంత సులభం కాదు కదా అని ఎలా చెప్పాలో తెలీక.

ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చి “అమ్మ ప్రభా, అంతగా ప్రాధేయ పడుతున్నాడు కదా, ఎందుకు ఆలస్యం, కావాలంటే ఇల్లు అమ్మి నీకు డబ్బు ఇస్తాను, ఆ ప్రయోగం చేయి తల్లి” అన్నాడు

“అదేంటి నాన్న, నాకు డిమాండ్ పెరిగిందనా మీరు కూడా  ప్రోత్సహిస్తున్నారు”

“కాదు తల్లి, నిజం చెప్తాను. కానీ అంతా కన్నా ముందు, నువ్వు నీ భర్త తో చల్లగా ఉండాలనుకున్నాను, కానీ కట్టుకున్న భార్యను నమ్మని ఒక వ్యక్తి కోసం నీ చేతిలో ఉన్న శక్తిని నిరుపయోగించుకోనక్కరలేదు అని చెప్తున్నాను.”

ఆమె కంట నీరు ధారాలుగా ప్రవహించింది, మనుషులకు తమ పిల్లలకు ఆపద వస్తే గాని, మంచితనం పుట్టుకు రాదు అనుకోని.

“పాప శవం అక్కడ పెట్టండి, కానీ ఆమె మీద ప్రయోగం చేయలేను శరీరం తట్టుకోలేదు, చాలా చిన్న వయస్సు కనుక.” అన్నది ఒక నిర్ణయానికి వచ్చి.

” సరే నా మీదే చేయండి” అన్నాడు ఉత్కృష్ట.

ఆమె మరల తన మందుల పెట్టెను తెరిచింది.

*************************************************************************************

ప్రయోగాల్లో అతడికి మందుల వల్ల వచ్చే నెప్పులు, బాధలు, ఊహలు, భయాలు, ఉష్ణోగ్రత తేడాలు అన్నీ ఆమె నోటు చేసుకో సాగింది.సుమారు 30 గంటల కృషి తో ఆ మందులు అన్నీ శరీరాలకు ఒకేలా  ఉపయోగించవచ్చు అని తేల్చుకున్నది.

పాప కి ఉపయోగించింది, 48 గంటల తర్వాత హుషారుగా లేచి కూర్చున్నది పాప. ఆశ్చర్య పోవటం లోకం వంతయింది. కొంత మంది నోళ్ళు వెళ్లబెట్టారు, పాప తల్లి, తండ్రి  మురిసిపోయారు. పూజారి గారు నిన్ను శపించి తప్పు చేశాను, తల్లి అంటూ మనసు చిన్నబుచ్చుకున్నారు.

అందరికీ ధన్యవాదాలు చెప్పి పంపి, తన తండ్రిని తన తల్లి శరీరం ఎక్కడ ఉందో చెప్పమన్నది.

“మన సంప్రదాయం ప్రకారం, పెళి అయిన స్త్రీని చితి మీద కాల్చి వేస్తాం కదా తల్లి, ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయావు” అంటూ ఆయన నీళ్ళు నమిలాడు.

“అవును నాన్న, బహుశా కాలి బూడిద అయిన శరీరాన్ని తీసుకు రాగలమేమో సైన్సు ద్వారా కానీ, మనం వద్దు అనుకోని పాత ప్రియుడి తో వెళ్ళిన అమ్మని ఎలా తేగలదు ఏ శాస్త్రమైనా”?

“ఆయన ఒక్క సారిగా నిశ్చేస్టుడైపోయాడు, ఆవిడ చేసిన పని, నీ జీవితానికి మచ్చ తీసుకురాకూడదని ఇన్ని రోజులు చనిపోయిందని చెప్పి లోకాన్ని నమ్మించాను, అందుకే నీ ప్రయోగానికి అడ్డు పడ్డాను” అన్నాడు కన్నీటితో..

“మీరు నోరు విప్పక పోయినా మన బంధువుల నోళ్ళు మీ ముందు మాత్రమే మూసుకొని వుండేవి నాన్న, మీ కళ్ళు మాత్రం ఎప్పుడు చెప్తూనే ఉండేవి, నాకు నిజం తెలియాల్సి ఉన్నది అని..”.  అని ఆమె బయటకు వచ్చి, ఉత్కృష్టుడిని నిద్ర లేపి “ఇదిగో నిన్ను, ఈ ప్రాంతపు శ్మశాన వాటిక నుంచి తెప్పించాను,  నిన్ను తెచ్చిన అతను  తన వ్యక్తిగత సమస్యలతో అప్పుడే చనిపోయాడు.ఇంక నాకు తప్ప ఎవరికి నీ విషయం తెలీదు పూజారి గాఋ వల్ల సమస్య రాదు, కనుక మీ నాన్నకి చెప్పి మరల నీ జీవితం నువ్వు అనుభవించు” అన్నది.

“ఇంత పుణ్యం కట్టుకున్నారు, మీరే స్వయంగా వచ్చి మా నాన్నకు చెప్తే నా పని సులువు అవుతుందని అనిపిస్తోంది”

మౌనంగా అతడిని అనుసరించింది ఆమె.

******************************************************************************

“మీకో శుభ వార్తా, మీ అబ్బాయిని మళ్ళీ మీ కోసం, నే తీసుకొచ్చాను, భగవంతునితో పోరాడి” అంటూ ఆయన దగ్గరికు వెళ్ళింది, అడ్డు వచ్చిన అతడి రెండో భార్యను లెక్క చేయకుండా.

“ఆయన అతడిని చూసి, వాడిని పాతి పెట్టగానే మా బంధాలు తెగిపోయినాయి అమ్మ, వెళ్ళమని చెప్పు “అన్నాడు.

“అదేంటి మీకు కొంచెమైన పాతికేళ్లు పెంచుకున్న కొడుకు మీద ప్రేమ లేదా?”

ఆయన మాట్లాడకుండా కోపాన్ని నిగ్రహించుకుoటున్నాడు.

“ఎంతో ప్రయాశ పడి బతికించాను. ఇలా కుక్కపిల్లను తరిమేసినట్లు తరిమేస్తున్నారు, ఓహ్! రెండో భార్యకి భయ పడుతున్నారా” అన్నది వ్యంగ్యంగా…

“ఎందుకమ్మ అంతా ప్రయాశ పడ్డావు? ఉన్న జీవితాన్ని ఉపయోగించుకోలేని వాడికి, రెండో జీవితం ఇచ్చి మరలా ఎందుకు తల్లి అందరినీ బాధిస్తున్నావు. కన్న తల్లి కని,  చనిపోతే వాడి కోసం రెండో జీవితం వెతుక్కోకుండా వాడి మీదే ప్రాణాలు పెట్టుకొని పెంచాను, చదువు అయ్యే వరకు బానే ఉన్నాడు, ఆ మాయదారి పట్నంకి వెళ్ళాడు, అమ్మాయిల పిచ్చిలో పడ్డాడు, ప్రతి అమ్మాయి వెనక ప్రేమ ప్రేమ అంటూ వెంట పడ్డాడు, ఎవరు వీడి మాట కాదంటే, రోడ్డు మీదే ఆ పిల్లను దుర్భాషలాడటం, ఆ పిల్ల మీద లేని పోనీ పుకార్లు పుట్టించటం, లేదా కాపురాలు కూల్చటం, పోస్టర్లు పెట్టడం. అందరూ చూస్తూ ఊర్కోలేక ఇంటి మీదకు రోజుకో తగాదా రూపంలో వచ్చే వారు, అయినా సిగ్గు లేదు, అలాగే ఒంటి మీదకు 25 ఏళ్ళు తెచ్చుకున్నాడు. చివరికి కొంత మంది వీడి మీద ఒక అమ్మాయిని ప్రయోగించి దేవదాసును చేస్తే, పాపం ఈ భగ్న ప్రేమికుడు, తండ్రి గురించి ఆలోచించకుండా ఉరేసుకు చనిపోయాడు. వీడి తల్లి, వీడిని కనటానికి ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు, నన్ను తండ్రిని చేయటానికి దాని ప్రాణం పణంగా పెట్టింది, కానీ వీడు ఆ మాత్రం ఆలోచించకుండా వీధి కుక్క బతుకు చేసుకొని, నా పరువు తీశాడు. కావాలంటే నా ఆస్తి మొత్తం వ్రాసి ఇస్తాను, నా రెండో భార్యని కూడా ఖాతరు చేయను, కానీ నా కంట మాత్రం పడొద్దని చెప్పు, నేను వీడిని ఆ రోజే గుర్తించి కూడా వద్దనుకున్నాను” అని రెండు చేతులకు నమస్కరించాడు.

*******************************************************************************

పూజారి గారి వద్ద ప్రబంధ, ఉత్కృష్ట తల దించుకొని కూర్చున్నారు.

“ఏమిటి నీ చరిత్ర ఇంత హేయమైనదా?!! నమ్మ సఖ్యంగా లేదురా , నువ్వు ఇంత కిరాతకుడివి అని” అంటూ ఆయన ఆశ్చర్య పోయారు.

“అది జరిగిపోయింది, ఇప్పుడు అతడు ఆ జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాడు, ఆయన గుర్తు చేసినా ఇతడికి గుర్తుకు రాలేదు, ఆ జీవితం గుర్తు చేసి ఉన్న జీవితం పాడు చేయలేం కదండీ” అన్నది ప్రబంధ.

“మరి ఇంకేం ఆస్తి ఇస్తా అన్నాడు గా ఆయన, వెళ్ళి తెచ్చుకోమను”

“నాకొద్దు పూజారి గారు, తెలీక తప్పు చేశాను, బహుశా ఆయన పడ్డ బాధ నాకు తెలీటం కోసమే ప్రబంధ నన్ను మరలా బతికించుంటుంది. నన్ను నేను మనిషిగా మలుచుకున్నాకే మరలా ఆ గడప తొక్కుతాను” అన్నాడు ఉత్కృష్ట.

.”అప్పటి దాకా ఎక్కడ ఉంటావు రా” ? ఆయన కసిరారు

“నా దగ్గర ఉంటాడు,  నేనొక వైద్యురాలిని, నాకు మనిషికి ప్రాణం పోసే శాస్త్రమే కాదు, బ్రతికించాక ఎలా బ్రతకలో తెలిపే శాస్త్రం కూడా తెల్సు. దానికి తెల్సిన ఆచారం ఒకటే ఉంది, అదే “మానవతా ఆచారం”.  అంటూ అతడి చేయి పట్టుకొని తన ఇంటి వైపు తీసుకెళ్ళింది ….ప్రభంధాలకు అందని మానవతా బంధాలను ముడులు వేసిన ..ప్ర…బంధ…….

 

********************మానవత్వం పరిమళించాలి ప్రతి శాస్త్రం ద్వారా********************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s