సంరక్షకుడు

హేమంత  ఋతువు,  పుష్య మాసం, రాత్రి 7.30 నిమిషాలు.

కుండపోతగా వాన కురుస్తోంది నిడివి లేకుండా. రోడ్డులు ఏరులై పారుతున్నాయి, చెరువులను తలపిస్తూ..రోడ్డు మీద పిట్టడు పురుగు లేదు, అందునా ఎం‌ఎల్‌ఏ క్వార్టర్స్ ప్రాంతం అవ్వటం చేత ధగ ధగ కాంతులు  విరజిల్లే  వీధి దీపాలు మాత్రమే మిధిలకు తోడున్నాయి.

ఎంత రిపోర్టర్ అయినా చీకటి పడిపోయిందని కంగారూ పడుతూ తాను రికార్డు చేసుకున్న మంత్రి గారి ఇంటర్వ్యూ  భద్రంగా స్కూటి డిక్కీలో కుక్కి, ఇగ్నీషన్ ఆన్ చేసి, ఫ్లాట్ టైయర్ అని గుర్తించి బాధగా నిట్టూర్చింది. ఆలశ్యానికి అమ్మ పడే కంగారు గుర్తుకొచ్చి ఫోన్ చేయబోతే, “చార్జింగ్ అయిపోయి చచ్చిపోయా అంటూ”, ఆమె మొబైలు కూడా ఆమెకు దీటుగా  నిట్టూర్చింది. ఆమె పొద్దున తొమ్మిదిన్టికే, రేపటి ఆదివారం  టి.వి. షో అయిన, ‘ నేటి మేటి దంపతులు’  కోసం మంత్రి గారిని, ఆయన సతీ మణిని ఇంటర్వ్యూ తీసుకోటానికి వచ్చింది. ఇద్దరిలో ఒకరికి తీరిక దొరికితే మరొకరికి ముఖ్యమైన పనులు, ఫోనులు వస్తున్నాయి, ఇద్దరు వేరు వేరు జిల్లాల నించి మంత్రులు అవ్వటం వల్ల. మొత్తానికి ఇద్దరి నించి తనకు కావలసిన సమాచారం తీసుకొని, నమహ అనిపించే సరికి ఇదిగో రాత్రి 7.30 నిమిషాలు అయింది.

చివరికి స్కూటిని ఒక్క తన్ను తన్ని, ఆటో కోసం నాలగు అడుగులు బండిని తోసుకుంటూ బయలు దేరింది.  స్కూటి ఆమె వంక చూసి చురుక్కున కసిరింది, సెల్ ఫోన్ కూడా మొరాయించింది కదా, మరి దాని కన్నా నేను ఎక్కువ ఖరీదు, అంతే కాక ఈవిడ 50 కే‌జిల బరువు మోసే నన్ను కాలితో కొట్టింది, దాన్ని మాత్రం పర్సులో బద్రంగా పెట్టి భుజాన మోస్తోంది” అనుకోని తనలో తాను కుమిలిపోయింది. ఆమె అదృష్టం కొద్ది ఏకంగా క్యాబ్ వచ్చింది.

ఆమె గబుక్కున అందులో కూలబడి, “మలక్పేట్ ఛే నంబర్” అని ఆదేశిచింది డ్రైవర్ని.అతడు ఆమె పూర్తిగా తడిసి ఉండటం, బండి వదిలి కార్లో దూకటం చూసి “రు.500./- ఎక్స్ట్రా అవుతాది ” అన్నాడు నిర్మోహమాటంగా.

“500 ఎక్స్ట్రానా???!! దేనికి, నువ్వేవరో తెలీకుండా క్యాబ్ ఎక్కాను, అమ్మాయిని, అయినా రిస్క్ తీసుకున్నది నేను, ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి” అన్నది కళ్ళు  అరిటాకులంత చేసి.

“అడోళ్ళయితే ఏంది మదర్ థెరిస్సావ? ఎట్లా నమ్మలే? ఏమో నీ కోసం గ్యాంగ్ వస్తే, నిన్ను రేప్ చేయబోతే, నేనయితే  అడ్డుపడను కానీ, వాళ్ళ సేఫ్టీ కోసం నా బొక్కలు ఇరగ దీస్తరు.. మరి అది రిస్క్ కాదా?అది కాక ఈ టైంల ఎం‌ఎల్‌ఏ క్వార్టర్స్ నించి వస్తున్నావ్ నిన్ను ఎట్లా నమ్మేది, నా నెత్తి మీదకు ఏమి రాదా? ఇది కూడ్కా రిస్క్ కాదా?నిన్ను నేనెట్ల నమ్మాలే ?”

“నీ పేరు ఏంది” అడిగింది మిధిల?

“బోసు, సుభాష్ చంద్ర బోసు” అన్నాడు ఇకిలిస్తూ పళ్ళు.

“బోసు, నీకు శరమున్నద? అంతా మంచి పేరు పెట్టుకొని డర్పుట్ లెక్క మాట్లాడుతున్నావ్.”

“ఈ ఆడొళ్లతో ఎటు మాట్లాడినా దమాక్ తెగుతుంది.మా లాంటి మంచోళ్ళకి అన్నీ వైపులా కొరడా దెబ్బలేనమ్మ, నువ్ మంచి దానివైతే నిన్ను జాగ్రత్తగా నీ ఇంటి కాడ దింపాల, నడిమిట్లో ఏదన్నా అయితే  పోలీసు స్టేషన్  చుట్టూ    తిరగాలే……”

“సరే ఇప్పుడేమంటవ్? అట్నే ఇస్తాలే గాని, బండి తీయి..లేట్ అయితే అమ్మ పరిశాన్ అవుతాది”.

వెంటనే అతను కాలుస్తున్న బీడీ కింద పడేసి కార్ స్టార్ట్ చేసి, “మరి బండి” అన్నాడు అనుమానంగా”

ఆమె  నాలుక కరుచుకొని , బండి రోడ్డు పక్క సందులో అయిమూలగా పార్క్ చేసి, ఇంటర్వ్యూ తాలూకు పెన్ డ్రైవ్ని పర్సులోకి వేసుకొని తిరిగి కార్ ఎక్కింది. కార్ డోర్ మూసే సమయానికి ఎవరో ఒక పెద్దాయన డోర్ పట్టుకొని ఆపి, ” అమ్మ బాగా గుండెలో నొప్పిగా ఉంది, మా ఆవిడ చొక్కా జేబులో మందులు పెట్టటం మర్చిపోయినట్లుంది, కాస్త ఆసుపత్రికి తీసుకెళతారా? అని ప్రాధేయ పడ్డాడు..’ఆయన వర్షంలో బాగా తడిసి పోయాడు’ అని ఆయన లోదుస్తులు  బయటకు కనబడుతూ,  ‘గుండె నొప్పి తీవ్రంగా వుందని’ కంది పోయిన ఆయన మొహం  చెప్పకనే చెప్పాయి వారిరువిరికి.

“నువ్వేం భయపపడకు సామి, ఈ పక్కనే ఒక ముల్టీ స్పెషాలిటీ  దవాఖానా  ఉంది, కార్ ఎక్కు” అన్నాడు బోసు. మిధీల నెమ్మదిగా కార్ వెనుక సీట్లో గిల గిల  కొట్టుకుంటున్న ఆయన్ను పడుకో పెట్టి  కంగారుగా ముందు సీట్లో కూర్చున్నది. 4 .కి.మీ ల తర్వాత, ఒక ఆసుపత్రి దగ్గర ఆపి అందరినీ అప్రమత్తం చేసి మొత్తానికి వైద్యం మొదలెట్టారు.

ఆసుపత్రి రెసెప్షన్లో ఫోను చార్జింగ్ పెట్టి అమ్మకి ఫోన్ చేద్దామనుకొనే లోపు ఆమెకే ఒక కాల్ వచ్చింది. ఆ టైములో కూడా తెలియని నంబరు నించి కాల్ రావటంతో ” హలో” అన్నది చాలా చిరాకుగా”

“మిధిల, ఆ పెద్దాయాన్ని దిల్షుక్ నగర్ బస్ డిపొట్ కాడా వదిలేసి నీ దారిన నువ్ పో” అని ఒక కర్కశమైన మగ గొంతు హెచ్చరించింది.

“ఏంటి”? మీరెవరు, నన్ను బెదిరించటానికి” అన్నది ఆమె కోపంగా.

“నీ రిపోర్టర్ తెల్వి ఆపి, చెప్పింది చేయి” అన్నాడు అవతలి వ్యక్తి.

” నీకు ఏమన్నా మెంటలా? వైద్యం మద్యలో ఏం చెప్పి తీసుకు రావాలి, కావాలంటే నువ్వే వచ్చి ఇక్కడే చంపుకో, నాకు ఆర్డర్లు వేస్తే టాక్సీ బిల్లు నేను కట్టలేను” అని ఫోను పేట్టేసింది.

వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇంకో రెండు గంటలు ఆలశ్యం అవుతుందని చెప్పి, తల ఆరుబెట్టుకుంటూ కూర్చుంది. ఇదంతా చూసిన బోసు, అల్లాడిపోతు, “ఎవరో నిన్ను బెదిరిస్తే, ఇంత తీరిగ్గా కూర్చున్నావ్, పైగా చంపుకోమంటున్నావ్, నీకు జాలి లేదా పెద్దాయన మీద?” అన్నాడు విస్తుపోతూ.

“జాలా?ఎందుకు?నేను విలేఖరిని. నిప్పు లేనిదే పొగ రాదు అని తెలుసుకోటానికి పక్షం కాలం కూడా పట్టలేదు. ఆ పెద్దాయన ఏం చేశాడో నీకు తెల్సా? వెనకలా ఏం జరిగిందో నీకు నాకు ఎవరు చెప్తారు? మనన్ని సహాయం చేయమన్నాడు చేశాము, అంత వరకే.పైగా వాడికి ఇంత మందిలో వచ్చే ధైర్యం ఉంటే నన్నెందుకు ఆ మారుమూలకి రమ్మంటాడు. ”

“గట్లనా? సరే అయితే. నువ్వు ఇట్లే ధైర్యంగా ఉండు, నాకు మంచి గిరాకిలోచ్చే టయము, ఎయిర్పోర్టు కాడా, నే పోవాలి ఇంక.” అన్నాడు చల్లగా జారుకుంటూ.

“అట్లాంటే ఎట్లా ఆయన్ని ఇంటి కాడా నేనేట్ల దింపాలే?

“1000 ఎక్స్ట్రా అవుద్ది”

“ఆయన మీద నాకెంత జాలి ఉందో నీకు అంతే ఉంది అని, నీ డ్రైవింగ్ చూస్తేనే అర్థం అయింది, కాసేపు ఓపిక పట్టు.”

“అట్లా కాదు, నాకేదో పెద్దాయన వ్యవహారం డేంజరు కొడుతోంది. నన్ను వదిలి తల్లి, నీ బాన్చంద్, కాల్ మొక్కుతా”

“డేంజర్ కాబట్టే ఇక్కడ్నే ఉండు, రేపొద్దున్న నీ ఫోటో టి.వి.లో పడొద్దా ?”

“టి.వి.లో పడుద్దో, లేక గోడ మీదున్న ఫోటో ప్రేములో పడుద్దో, ఎవరికి ఎరుక, అసలే పెళ్ళాం పిల్లలు ఉన్నోడిని, నన్ను మర్చిపో తల్లి”

ఇంతలో నర్సు  వచ్చి, ” ఆయన  ఇప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్నారు, మీరు చూడొచ్చు అన్నది.

ఇద్దరు వెంటనే ఆయన గది కేసి పరుగుల నడక సాగించారు. డాక్టరు అస్సలు మాట్లాడ కూడదని హెచ్చరించి, బయటకు వెళ్ళిపోయాడు. మిధిల, బోసు ఆయన కేసి తమ చల్లని చూపులు ప్రసరించారు చిరు నవ్వుతో, అంతేగా మరి, “చావు బతుకుల్లో ఉన్న నిన్ను ఒకడు చంపటానికి వస్తున్నాడని చెప్పలేరు కదా”!

ఆయన అది ఖాతరు చేయకుండా, ఆక్సిజను మాస్కు తీసి “కారు వెనుక సీటులో ఒక సి.డి. పెట్టాను. అందులోనే ఎడ్డ్రెస్సు కూడా ఉంది, దయ చేసి వారికి అందించండి” అన్నాడు.

” మీ వాళ్ళ ఫోన్ నంబరు చెప్పండి, కబురు చేస్తాం మీ పరిస్దితి గురించి,” అన్నారు వారు.ఆయన  గట్టిగా ఒక అరుపు అరిచి కన్ను మూశాడు. బోసు చివరి ఆశతో పరుగున డాక్టరును పిలిచి చూబించగా ఆయన పెదవి విరిచి వెళ్ళిపోయాడు.

బిలబిల మంటూ ఆసుపత్రి స్టాఫ్ వచ్చి ఆయన శవం పక్కన వీరిద్దరిని నిల్చోపెట్టి ఫోటో తీశారు. అర్థం గాని బోసు వింతగాను, అర్థం చేసుకున్న మిధిల రోతగాను వారిని చూశారు.వారు ఏ మాత్రం సిగ్గు బిడియం లేకుండా “మీ పాటికి మీరు ఆయన్ని వదిలేసిపోతే మా గతి ఏం గాను?” అని పని అయిపోయినట్లు వెళ్ళిపోయారు బోసు చేతిలో 4 లక్షల బిల్లు పెట్టి.

“నా 40 ఏళ్ళ జీవితం, జీతం రెండు చాలవు, ఇప్పుడేం చేద్దాం”? అన్నాడు. మిధిల పెద్దాయన శవాన్ని ఒక నర్సుకి అప్పగించి ఇప్పుడే వస్తాము అని బోసుని తీసుకొని పోలిసే స్టేషన్ కి బయలు దేరింది. మార్గ మధ్యలో కార్ వెనక అంతా క్షుణ్ణంగా పరిశీలించింది, కానీ ఆయన చెప్పినట్లు సి.డి ఏం దొరకలేదు. పోలీస్ సస్టేషన్ వద్ద దిగి లోపలికి వెళ్ళేంతలో వీరిద్దరి మీద తుపాకి గుళ్ళ వర్షం కురిసింది. అప్పటికే అప్రమత్తంగా వున్న వారిరువురూ ఎలాగో తప్పించుకొని స్టేషన్ వెనక గోడ దగ్గర కలిశారు. బోసు ఆమె మీద విరుచుకు పడి ” నే ముందే చెప్పాను నన్ను ఇందులో ఇరికించకు అని ఇప్పుడు చూడు ఏమైపోయిందో”? అన్నాడు తడబడతూనే  భయకంపితుడై.

ఆమె అంతకన్నా చిరాకుతో, “సరే అది వదిలేయ్ ఇపుడెం చెయ్యాలో చెప్పు?” అన్నది. ఇంతలో పక్క నించి వారి తలలకు గన్ పాయింట్తో గురి పెట్టారు ఆగంతకులు. చేసేది లేక వారిని అనుసరిస్తూ వారు చూపిన కార్ ఎక్కబోయారు.అంతలో మెరుపులా ఒక వల పై నించి వారి మీద పడి అమాంతం గాల్లోకి లాక్కుని ఎత్తి హెలికాప్టర్లో కుదేసింది. కింద నించి తుపాకి గుళ్ళు వీరిని వెంటాడాయి.  సీట్లో పడ్డ అరగంటకి, ఇద్దరూ తాము బతికే ఉన్నామని నిర్ధారించుకొని కొద్దిగా తెప్పరిల్లారు. ఆశ్చర్యంగా  పైలెట్నీ చూస్తున్న మిధిలకు మాస్క్ వల్ల అతని మొహం కనిపించటం లేదు, మంచు వర్ణపు దుస్తుల్లో మెరుపు వీరుడిలా కనిపించాడు అతడు. బోసు సూటిగా చూస్తూ నువ్వు ఎందుకు మమ్మల్ని కాపాడవ్? నువ్ మాతో ఏం చేయదల్చుకున్నావ్? అని నిలదీశాడు.

అతడు చాలా నిశ్చలమైన గొంతుతో ” భయపడకు నీ లాగా నేను దారిన పోయిన దారిద్రాన్ని, మీద వేసుకొను,  నీతో నాకేం పని లేదు,” అన్నాడు.

“అంటే పై నించి కిందకి తోసేస్తావా సంద్రంలోకి ” అన్నాడు కిందున్న సముద్రం చూసి.

అతడు మౌనంగా చాపర్ ని నడుపుతున్నాడు, పెనుగాలులకు చాపర్ కంపించకుండా. మిధిల కల్పించుకొని మమ్మల్ని మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళు” అన్నది .

“మిధిల, మీరు రెండు రోజులు నేపాల్ లో ఉండ బోతున్నారు. ఆ తర్వాత పంజాబ్ లో 5 రోజులు ఉంటారు.అటు పైన నేనే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదులుతాను,  అన్నాడు.”

ఆ మాటల్లో అమెకు, “నీకు తెలియాల్సింది చెప్పాను, ఇంత కన్నా మిగితాది నీకు అనవసరం, అన్నిటికి పూచీ నాది అనే భరోసా”  గోచరించాయి, చేసేది లేక మౌనంగా ఉండిపోయింది.

బోసు మాత్రం ఆంజనేయ స్వామి దండకం మనస్సులోనే జపిస్తున్నాడు.

*********************************************************************

“ఏంటి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఒక దగ్గరే కూర్చొని గూడుపుటాణి చేస్తున్నారు అంటూ ఒక ఆవిడ ‘టి కప్పుల ట్రే’ తో వచ్చింది వీరి ముందుకు.  మిధిలకు ఆవిడని చూసి ఏం జరుగుతోందో అర్థం కాలేదు, “అర్ధ రాత్రి ఒంటి గంటకు  మంచులో మెరుపు వీరుడు ఈ భవనం లాన్ లో మమ్మల్ని వదిలి వెళితే, ఇప్పుడు ఉదయమ౦ ఎనిమిదింటికి ఈవిడ వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తోంది” అనుకుంటూ ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంది.

“ఇంతకీ మీరెవరు ” అడిగాడు బోసు, ఆవిడ పై మర్యాదతో, ఇచ్చిన టి ఆబగా తాగుతూ.

“నేను మీ మెరుపు వీరుడి చెల్లెల్ని”

“మీ అన్నయ్యకు పేరు లేదా” అన్నది మిధిల.

“ఉన్నది కానీ నువ్వు పెట్టిన పేరు ఇంకా బాగున్నది” అన్నది ఆమె.

“మరి నీ పేరు” అన్నది మిధిల.

“మెరుపు వీరుడి చెల్లెల్ని.”

“సొ మీకు తెలుగు కూడా బాగా వచ్చు.” ఎంక్వయిరీ చేసింది మిధిల లోని రిపోర్టర్

“18 భాషలు వచ్చు” అన్నది ఆమె నిగర్విలా.

“మమ్మల్ని ఎవరు ఎటాక్ చేశారో మీకు తెలుసా”

“మీ రిపోర్టర్ మెదడు పక్కన పెట్టి కాసేపు అలా కొత్త దేశం చూసి రండి”

“మీరు మీ అన్నయ్య ఏదో దాస్తున్నారు మానించి” అన్నది మిధిల కాస్త స్వరo పెంచి.

అన్నీ తెలియాలని అనుకోకు, కొన్ని తెల్సి తెలియకుండా వుంటేనే  నీకు నీ భవిష్యత్తుకి  మంచిది.అన్నయ్య మిమ్మల్ని సరిగ్గా 7 వ రోజు భారత్  లో దింపుతాడు, అది మాత్రం భరోసా ఇవ్వగలను” అని వెళ్ళిపోయింది ఆమె.

“వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు బోసు, వాళ్ళు చేసిన పాపం మన నెత్తి మీద రుద్ది, మనన్ని కాపాడినట్లు నటిస్తున్నారు” అంటూ తన భయాన్ని పంచుకున్నది ఆమె.

“చాల్లే ఊరుకొమ్మ!, మొన్న మెరుపు వీరుడు, ఇవాళ ఈవిడ అంతా భరోసా ఇచ్చారుగా, మనం ఒక రెండు రోజులు ఓపిక పడితే మన దారి మనం చూసుకోవచ్చు.”

“అయ్యో బోసు మనం మన ఇంటికి వెళ్ళాక మన వారిని వీరు వాదులుతార? పూర్తిగా తెలుసుకోకుండా ఇంటికి వెళ్తే మీ వాళ్ళకు ఏం కాదని నమ్మకం నీకుందా”? నిలదీసింది బోసుని మిధిల.

“భయపడకండి! అన్నయ్య మీ ఇద్దరి కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు ఇప్పటికే” అంటూ వీరి సంభాషణలోకి మరలా చేరింది ఆమె.

ఎక్కడ నించి విన్టోందో అర్థం కాని వారు, “అంతా మోసం, మీకెలా తెల్సు మా వాళ్ళ గురించి, నిజం చెప్పండి” అన్నది  మిధిల గట్టిగా పట్టుబట్టి.

“మిధిల నువ్వు ఆవేశానికి అద్దం పట్టినట్లు ఉంటావు, పూర్తి విషయం నీకు చెప్పలేను” అన్నది ఆమె నిస్సంకోచంగా.

“అదే ఎందుకు ?” నాకు తెలియాలి”

“అయితే రా” అంటూ ఆమెను మాత్రమే ఒక హోం థియేటర్ ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది. లోపలికెళ్ళిన 15 నిమిషాలకు మిధిల మొదట నిశ్చేస్టురాలైంది తర్వాత పెద్ద పెట్టున రోదించింది. బయట ఉన్న బోసు “తలుపులు తీయండంటూ” లబోదిబో అన్నాడు. ఆవిడ తలుపు తీసింది, అప్పటికే స్క్రీన్ ఆఫ్ చేసి ఉంది.మిధిల ముఖం ఏడుస్తూ ఎర్రటి కుంకుమ  వర్ణాన్ని అలుముకున్నది.

“అమ్మ మిధిల! ఏం చేసింది ఈవీడ నిన్ను, ఏం చూబించి నిన్ను బెదిరించింది”? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు కంగారుగా.

ఆవిడ చల్లటి నీళ్ళ బాటిల్ మిధిలకు అందించి ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వి ” ముందే చెప్పానుగా, ఆమెకు నిజO తెలిసే అవసరం లేదని. అయినా వినలేదు.”

మిధిల అడ్డుపడి “వదిలేయి అన్నయ్య నీతో చెప్పే విషయం అయితే నేనే చెపుతాను కదా” అన్నది.బోసుకి కొద్దిగా పరిశ్దితి అర్థం అయింది.

“నిశ్చితార్థం  ఆగిపోతుంది ఆమెది చెప్పమంటావా?” అన్నది ఆవిడ.

ఇద్దరు ఆమెకేసి చూస్తుండి పోయారు మౌనంగా. ఆవిడ మరలా నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ “నువ్వు మాత్రమే కాదు మిధిల, నేను కూడా నీ లాగా 10 యేళ్ళ క్రితం వాడి బాధితురాలిని, ఇంట్లో వాళ్ళకి మొహం చూపించుకోలేక, చనిపోతున్నానని చెప్పి ఉత్తరం వ్రాసి వచ్చి ఇక్కడ మీ లాంటి వారికి నీడగా ఉన్నాను.

*****************************************************************************

నేపాల్ సూర్యాస్తమయాన్ని, వేటానతరం తృప్తికరమైన కిలకిలరావాల పక్షులను వీడియోలో బంధిస్తోంది మిధిల.

“మిధిల” అంటూ ఆమెను బోసు పిలిచాడు.

“రా బోసు, చూడు నేపాల్లో కూడా అస్తమిస్తున్న సూర్యుడు  ఎర్రాగానే ఉన్నాడు. గూళ్ళకు తిరిగి వచ్చే పక్షుల కూడా మన భారత్లో లాగానే తృప్తిగా వస్తున్నాయి. మరి ఒక్క మనిషి మాత్రం ఎందుకు గంట గంటకి ఒకలా,  ప్రాంతానికి దేశానికి ఓ రకంగా ఉంటాడో కదా!?”

“నీ అంత చదువుకోలేదు మిధిల నేను”

“దీనికి చదువుకోవాలిసిన అవసరంలేదు”

“అలా అయితే నీ పరిస్దితి ఏంటో తెల్సుసుకోవచ్చా నేను. ” అడిగాడు బోసు నిర్వేదనగా.

మిధిల నిట్టూర్చి “తెలియకుండా నాతో పాటు ఈ ఊబిలో పడ్డావు. నీకు తెలియకపోతే ఎలా?నేను ఆ రోజు ఎం‌ఎల్‌ఏ క్వార్టర్స్ కి ఇంటర్వ్యూకి అని వెళ్ళాను. అందరితో పాటు నేను విసిటర్స్ రూంలో కూర్చోని ఉన్నాను. మంత్రి గారు ఆయన భార్య వారి పనులు అంటూ  బిజీగా ఉన్నారు.  అందరితో పాటు ఒక గ్లాసు జూస్ తాగను, 10 నిమిషాలకు నా మస్తిష్కం నా ఆధీనం తప్పింది. నా అనుమతి లేకుండా నా మస్తిష్కం వేరే వారి ఆధీనంలోకి వెళ్ళి ఆసాంఘీక కార్య కలాపాల్లో పాల్గొంది. తిరిగి నా చోటికి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నీ మర్చిపోమన్నది.”

“అంటే ఆ రెండు గంటలు నువ్వు, నీ ఆధీనంలో లేవు.”?

“నేనే కాదు నా లాగే వయస్సులో ఉన్న 75 మంది ఆడపిల్లలు వివస్త్రలుగా కరాళ నృత్యాలు చేశాము, పైశాచికంగా పసి పిల్లల గొంతులు కోశాము. ఆ నెత్తుటితో ఆ నీచుడికి అభిషేకం చేశాము.”

“ఎవరు ఆ నీచుడు”? మంత్రి గారా?

“కాదు కాదు, ఆయన దేవుడు..”

“మరి ఎవరు. ?”

“నన్ను ఇంతకు మించి అడగకు బోసు”

“నాకు తెలియాలి మిధిల…”

“నాకు కూడా తెలియదు, కానీ ఖచ్చితంగా మంత్రిగారు కాదు, నాకు తెలిస్తే నీకు చెప్తానులే.”

“మరి మిగితా 75 మంది ఏమైనారు.”

“అదే మెరుపు వీరుడు కనిపెడుతున్నాడు., అదే కశ్యప్”

“బాధ పడకమ్మ, నీకుగా తప్పు చేయలేదు. నువ్వు భాద్యురాలివి కాదు.”

“కానీ వాడు ఆ వీడియోను నా ఇష్టపరంగా చేసినట్లు చూపి, వాడి పనులకు నన్ను వాడుకొనే పధకంలో ఉన్నాడు.”

దేవుడున్నాడు. అదే కశ్యప్ రూపంలో ఇక్కడికి చేర్చాడు. ఇకపోతే మీ కాబోయే శ్రీవారు కూడా నీలాగే చదువుకున్నాడు కాబట్టి….”

“అన్నిటికి చదువుతో ముడి పెడతావ్, నీకు చదువు అంటే అంతా గౌరవమా? చదువు వేరు జ్ఞానం వేరు బోసు”

“అంటే”?..

“శ్రీ వారు పరాయి వారు అయిపోయి కొన్ని గంటల అవుతున్నాయి.నేను మంచి దానిని అని తెలుసట. కానీ తన వారిని నొప్పించలేడట!!!”

“పోనిలే ఈ సారి చదువుకున్న వాడు కాకుండా జ్ఞానం ఉన్న వాడు దొరుకుతాడు,” అని పెద్దగా నవ్వాడు వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ.

“అవును నీ కళ్ళెందుకు నా కోసం వర్షిస్తున్నాయి.”

“ఒక మనిషి కి కళ్ళుగా పుట్టాయి కాబట్టి”

వారిద్దరి వెర్రి నవ్వులకు అక్కడి పక్షులు బెంబెలిత్తి గూళ్ళు వదిలి ఎగిరిపోయాయి.

*********************************************************************************

“గుడ్ మార్నింగ్ సువర్చలా, నీ రెస్యూమే చూశాను, నీ తెలివితేటలకు మీ సీనియర్స్ అంతా ముక్కున వేలేసుకున్నారు. నా పర్సనల్ సెక్రెటరి కమ్ లీగల్ సలహాదారు పోస్ట్ నీకే ఇవ్వాలని ఉన్నది, కానీ…” అంటూ ఆగిపోయాడు మంత్రి శఠగోపం.

“ఆమె కంగారుగా మరెందుకు జాప్యం సర్?. ఏదన్నా బాడ్ రిమార్క్ రాలేదు కదా?” అన్నది సందేహంగా.

“అదేం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా పవర్ఫుల్ పీపల్ అయి ఉంటారు, కాబట్టి నాకన్ని పవర్ఫుల్గా కనిపించాలి, వినిపించాలి. నీ పేరు కొంచెం హోమ్లీ గా ఉంది, పాత కాలం అమ్మాయిలాగా. విసిగిపోయాను.. ఈ గృహీణులను పోలే  లేడి ఎంప్లాయిస్తో వర్క్ చేయించుకొని, ఎప్పుడు లీవ్లు అనే అభ్యర్ధనలు, వంగి వంగి దండాలు చూసి చిరాకు పుట్టేసింది.. నన్ను పాతికేళ్లకే,  50 ఏళ్ళ తాతని చేస్తూ 40 యేళ్ళ ఆంటీలు కూడా కాళ్ల మీద పడి దేవుడిని చేసేశారు.ఇపుడు నాకు 51 వ ఏడు, 70 యేళ్ళ ఆవిడ కూడా,  “అన్న” నా  అంటూ కాళ్ళ మీద పడుతుంది. నువ్వే నా ఆఫీసు కి కళ తీసుకు రావాలి.”

“మీ సమస్య అర్థం అయింది. మాడమ్  కాలం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది.”?

“బతికే వుంది, వాళ్ళ పుట్టిల్లు అయిన జైపూర్లో, నా రాజకీయ జీవితo మొదలయ్యింది ఆవిడని పాణి గ్రహణం చేసుకున్నాకే.”

“ఏదన్నా దీర్ఘ కాల వ్యాధా, అక్కడే ఉండిపోయారు.?”

“మరే, పుట్టింటి మమకారం అనే నయం కానీ జబ్బు ” అని పెద్దగా నవ్వాడు.

ఆమె అదిరిపడి, “ఇందుకే మమకారం ఇంకా ఎక్కువ పెంచుకొని వెళ్లిపోయుంటుoది” అని మనసులో నవ్వుకొని, “నా నామకరణం మీరే చేస్తే రేపట్నించి జాబ్లో జాయిన్” అవుతాను అన్నది.

“జన్నత్”

“అలాగే కానివ్వండి”

“అదేంటి, నీకు ఆత్మ గౌరవం లేదా, నీ మతమే మార్చినట్లు అనిపించలేదా? నీ అస్థిత్వం కోల్పోయినట్లు లేదా. ఇదే సినిమాలో అయితే ఆ రెస్యూమే నా మోహన కొట్టి వెళ్లిపోయుంటుంది హీరోయిన్” అని మరలా పెద్దగా నవ్వాడు.

“మీ సమస్య మీ మాట గౌరవించినందుకా లేక నా పేరును మీరిచ్చే జీతం కోసం కుదువ పెట్టినoదుకా అన్నది.

అతను “నేనప్పుడప్పుడు ఇలా జోక్స్ వేస్తూ ఉంటాను, ఆహ్లాదకరమైనన వాతావరణం కోసం, తప్పు పట్టుకోకు . నీ దగ్గర పైకి వచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి”  ఆమెను మొత్తంగా పరికిస్తూ…అన్నాడు గంభీరంగా. అటు పై “నాకు పెద్దగా మంచి పేరు లేదు, నా వద్ద పని చేయటం, అందునా నీ భర్త మానసిక స్దితి సరిగా లేకపోవటం నీకు ఇబ్బంది కలగొచ్చు , ఆలోచించుకొని పనిలో చేరు” అన్నాడు తాను ఒక స్త్రీ లోలుడని చెప్పకనే చెప్తూ.

“పర్వాలేదు, మొరిగే కుక్క కరవదని మా బామ్మ చెప్తూ ఉండేది” అని చటుక్కున నాలుక కరుచుకున్నది జన్నత్.

అతను పెద్దగా మరలా నవ్వి, “దిస్ ఇస్ వాట్ ఐ నీడ్, టూ ఆక్టివ్” అన్నాడు.

“థాంక్ యు సర్, అయితే నేను రేపు మార్నింగ్ జాయిన్ అవ్వాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో ఈ పూటే పడాలి”.

“ఈ ఆఫీసు అంతా ఇక నీ చేతిలో ఉంటుంది, గో అండ్ గెట్ యువర్ లెటర్” అని బిజీగా వెళ్ళిపోయాడు శఠగోపం.

ఆర్డరు తానే పురమాయించుకొని తెప్పించుకోవటం ఆమెకు ఒకింత గర్వంగా అనిపించింది.

********************************************************************************

చిన్నగా సంతూర్ వాయిద్యం వినబడుతుండగా, చిరు చీకటిలో, సంఝా సమయపు ఎర్రటి జిలుగులతో, ఉండి ఉండి వీచే చల్లని పిల్ల తెమ్మరలతో ఆహ్లాదకరంగా ఉన్నది డాబా గార్డెన్ రెస్ట్రారంట్.

కశ్యప్ దాదాపుగా 3.5 గంటల నించి సువర్చల కోసం ఎదురు చూస్తున్నాడు.టేబల్ క్లాత్ మీద తన నిరీక్షణకు గురుతుగా “సు.. సు” అంటూ ఎన్నో సార్లు వ్రాసుకున్నాడు.

ఆమె రానె వచ్చింది. తన పేరుని చూసి విసురుగా వేయ్టటర్ని పిలిచి, ఈ టేబల్ క్లాత్ మార్చి వేరేది వేయమని పురమాయించింది.

ఆమె సంగతి తెల్సిందే అన్నట్లు అతడు “కూర్చో సు” అన్నాడు.

“నాకు చాలా పని ఉంది, ఏంటో త్వరగా చెప్పు”అన్నది.

“అదే నువ్వు నా శత్రువు శఠగోపం దగ్గర చేరటం నాకు నచ్చలేదు”

“నీకు నాకు ఏంటి సంబంధం, నీకెందుకు నచ్చాలి” అన్నది కరుకుగా.

“సిగ్గులేదా నీకు? జరిగిందేంటో నీకు తెలీదా” అంటూ అతను మండి పడ్డాడు.

“నీ చనిపోయిన చెల్లెలి కోసం బతికున్న నా ఇద్దరి చెళ్ళళ్ళను జీవ సమాధి చేయటానికి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయావు. మా నాన్న 8 ఏళ్ళు కష్ట పడి ఉన్న ఒక్క ఇల్లు అమ్మి సొంత కూతురిని నన్ను కాదని నీ చదువు కోసం ధార పోసారు, ఎందుకు? నన్ను పెళ్ళి చేసుకొని మమ్మల్ని ఉద్దరిస్తావని, కానీ నువ్వు, చివరి పరీక్ష సమయానికి పగ పేరుతో దేశం విడిచి పారిపోయావు. మా నాన్నని తిరిగి మామూలు మనిషిని చేయటానికి, నా చెల్లళ్ళ చదువు, పెళ్ళి కోసం ఒక డబ్బున్న మానసిక రోగిని చేసుకున్నాను.

“కావొచ్చు, నా వల్ల అన్యాయం జరిగింది ఒప్పుకుంటాను, కానీ  దారుణమైన నా చెల్లెలి చావు నన్ను ఆ దారిలో నడిపించింది.”

“ఆ వెధవ ఒక్క రోజు మత్తు మందు ఇచ్చి నీ చెల్లెలి జీవితం పాడు చేస్తే, నువ్వు నన్ను ప్రేమ అనే మత్తులో కొన్ని ఏళ్ళు మభ్యపెట్టి నన్ను నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి పారిపోయావు, నా మొదటి శత్రువ్వి నువ్వే, గుర్తుంచుకో”

“ఇది దారుణం.నేను ఇంకా నా మనస్సులో  నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను.”

“ఎవడికి కావాలి నీ గాలివాటపు ప్రేమ. రెండేళ్ళు చచ్చావో బతికావో కూడా తెలీలేదు.ఉన్న ముగ్గురి కూతుళ్ళను ఎర వేసాడు రామారావు (మిధీల తండ్రి) అయినా అందరినీ వదిలి వెళ్ళిపోయాడు అని కూతలు కూసిన ఈ లోకానికి నేను ఒక్క దాన్నే ఎలా ఎదుర్కొనగలను, అని ఆలోచించావా అసలు.”?

“నీది మూర్ఖత్వం.”

“అవును, నాది మూర్ఖత్వం. నీది మగ అహభావం తో కూడిన స్వార్థం, ఇప్పుడు కూడా నీ ప్రాణ భయంతో వచ్చావు కానీ, నా మీద ప్రేమతో కాదు, మా నాన్న మీద విశ్వాసంతో కాదు.”

“ఒకే, ఒప్పుకుంటాను, నాది తొందరపాటు. మీ ఆయన ఎలాగో మానసిక రోగి కదా, నన్ను పెళ్ళి చేసుకో, అతడికి వైద్యం చేయించి, బాగు పడ్డాక వేరే అమ్మాయితో పెళ్లి చేద్దాం.”

“నేను నీ ఉంపుడుగత్తెని కాను, నువ్ రమ్మంటే రావటానికి, పొమ్మంటే పోటానికి.”

“నువ్వు ఆడదానివా? ఎంత వివరించాను అప్పటి నా పరిస్దితి. అయినా విన్నావా నన్ను నమ్మవా? ఏమైపోయింది ఆ తడి కన్నులతో ఎదురు చూసే సువర్చల, చచ్చిపోయిందా?”

“కాదు చంపబడింది, గుడ్డిగా నమ్మినందుకు కోలుకోలేని దెబ్బ తగిలి చచ్చిపోయింది.”

“కాలం నా మీద నీకున్న కోపాన్ని చల్లారుస్తుంది ‘సు’.

“అది ఈ జన్మలో జరగదు.”

*******************************************************************************

కశ్యప్ ప్రియురాలి తో గొడవపడి కుమిలిపోతూ బాగా తాగి తూలుతూ నేపాల్ లోని తన ఇంటికి చేరుకొనే సరికి అర్ధ రాత్రి 2 .గంటలు అయింది.

మిధిల అతడిని గుర్తించలేక ఎవరో ఆగంతుకుడు అనుకోని లాన్ లో పడి ఉన్న గునపం తో మెడ మీద ఒక్క వేటు వేసింది. ఆ దెబ్బకు అతడు “అబ్బా” అంటూ బాధతో కింద పడ్డాడు.

అతడి చెల్లెలు “అన్నయ్య!!!” అంటూ కంగారుగా వచ్చి ఫస్ట్ ఏయిడ్ చేసింది, ఇంకా నయం ఇంకాస్త బలంగా కొట్టున్టే అన్నయ్య పరిస్డితి ఎలా ఉండేదో.” అన్నది ఆమె.

తనను రక్షించిన వాడిని కొట్టాననే బాధతో మిధిల వెళ్ళిపోయింది  తన గదికి.

********************************************************************************

తెల్లారి అసలు డాక్టరు వచ్చి మెడ చుట్టూ కట్టు కట్టి పది రోజులు ప్రయాణాలు మానుకోమని చెప్పి వెళ్లిపోయాడు.

“క్షమించండి”!! అంటూ మరలా మిధిల అతడి గదికి వచ్చింది. ఆమెను చూస్తూనే అతడు, నీ తొందర పాటు వల్ల కొన్ని ముఖ్యమైన పనులు మూలన పడ్డాయి, నీకు ఈ రిపోర్టర్ జాబ్ ఎవడు ఇచ్చాడు అసలు,” అంటూ మండి పడ్డాడు.

“మొన్న ఉన్న గౌరవం ఇవాళ లేదు, నా జీవితం పాడైందని లోకువ చేస్తున్నారు. గతి లేదని మాత్రం అనుకోకండి” అన్నది రోషంగా ఆమె.

“అదిగో మళ్ళీ అదే ఆవేశం, వాడెవడో తప్పు చేస్తే నీకు అంగ వైకల్యం వచ్చినట్లు ఏంటా మాటలు?ఇంతకు ముందు నువ్వు మిధిలవే, ఇప్పుడు మిధిలవే. ఒక మగాడు పాడు చేస్తే పాడవ్వటానికి మీ జీవితాలు కాగితపు ముక్కలు కావు. మీకు భగవంతుడు జన్మ నిచ్చింది మా లాంటి మూర్ఖులని సరిదిద్దటానికి. కానీ మీరు? చిన్న లోపం జరిగితే మొత్తం జీవితనికి ఆపాదించుకొని మీకు మీరే పది సార్లు పతితలం అన్నట్లు ముద్రించుకుంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ చాలా సహజమే, ఈ రోజుల్లో  ఒక ఆడపిల్లకి 100 మంది అన్నలుంటే, 1000 మంది కీచకులు ఉంటున్నారు. పక్కోడి చెల్లెల్ని తల్లి లాగా భావించే రోజులు ఎప్పుడో పోయినాయి. నేనన్నది నాకున్న బాధతో. ‘సు’ నా మీద కోపంతో శఠగోపం దగ్గర పన్లో చేరింది. ఎలా భరించను? వాడు నా శత్రువుకి కుడి భుజం లాంటి వాడు.”

“క్షమించండి.”

“అసలు మీ ఆడొళ్లకేమన్నా బ్రైన్లో సెపరేట్ చాంబర్స్ ఉంటాయా, ఒకటి ప్రేమించటానికి ఇంకోటి అపార్థం చేసుకోటానికి.”

మిధిల మౌనంగా ఉండిపోయింది.

“అడిగేది నిన్నే” అంటూ అరవబోయి, విరిగిన మెడ కలుక్కుమనటంతో ఆగిపోయీ  తన ఆక్రోసాన్ని  అదిమి కన్నీరుగా చిలికించాడు. ఆ కన్నీరు నేరుగా శివుని పాదాలు తాకిందో ఏమో, గంగను ఝంఝామారుతంగా భూమి మీదకు ఒక్కసారిగా జారవిడిచాడు తన జటాజూటాల బంధనాలను విసురుగా విదిలిస్తూ..తుఫాను రూపములో…

**************************************************************************

10 రోజులు తర్వాత కూడా మిధిల, బోసు భారత్ చేరుకోలేక పోయారు. ఆగిపోయిన పనుల కోసం హడావిడిగా బయలుదేరాడు కశ్యప్. బోసు అతని వెనకాలే పొద్దుట్నించి తచ్చాడుతూ వాళ్ళ ప్రయాణం కోసం తెలుసుకోటానికి నానా ప్రయాశ పడుతున్నాడు. ఇదంతా గమనించినా కూడా కశ్యప్ మౌనంగా తన అనధికార ప్రతినిధులకు తన సందేశాలు పంపుతూ తన పనిలో తను ఉన్నాడు. సహనం నశించి ఏమి చేయలేక మిధిల సోఫాలో దిళ్ళను విసిరి, లాన్లో గడ్డి కసిగా పీకి తన అక్కసు వెళ్ళకక్కుతోంది అతడి మీద.కశ్యప్ దగ్గరికి ఎలాగో ధైర్యo చేసి వెళ్ళిన బోసుని చూడగానే అతడే, “నాకు మిమ్మల్ని నా దగరే ఉంచుకొని ఉచితంగా పోషించాలనే ఆశ ఎంత మాత్రం లేదు. నా మెడ విరగకొట్టకుండా ఉంటే ఇప్పటికి మీరు వెళ్ళి వారం అయ్యుండేది.” అన్నాడు కరుకుగా.

బోసు నిరాశగా మిధిల కేసి చూశాడు.

మిధిల చాపర్ ఎక్కి బయలుదేరుతున్న అతన్ని చూసి, “నీ చాపర్ లో ఒక నట్టు విప్పి పారేస్తే నువ్వు నాలాగే వెళ్ళి వేరే దేశంలో పడతావ్” అని అరిచింది దూరం నించి.

అతడు బోసుని పిలిచి “నేను లీగల్ హీరోని కాను, కాబట్టి నా పనులు అర్ధ రాత్రి మొదలై, అర్ధ రాత్రి అంతం అయి, అర్ధ రాత్రే ఇంటికి వస్తాను, కాబట్టి దయ చేసి నా మీద దాడులు చేయకండి, మీ స్త్రీ శక్తి ని మీకు మాత్రమే ఉపకరించుకుంటే చాలు అని తెలుసుకోండి అలా కాదు ఇప్పుడే వెళతామ్ , ఛస్తామ్ అంటే  నాకే అభ్యంతరం లేదు వెళ్ళొచ్చు ” అని వెళ్ళిపోయాడు.

*****************************************************************************

జన్నత్ తన పనిలో చేరీ రెండు రోజులు కాక ముందే అన్నీ భాద్యతలు ఆమె నెత్తిన పడ్డాయి ఆమె నైపుణ్యం వల్ల.

“జన్నత్ కొత్తగా మానిఫేస్టో ప్రవేశపెట్టాలి, ఏం రాస్తే బాగుంటుంది” అన్నాడు శఠగోపం

“ఆడపిల్లల జోలికొస్తే రెండు కనుగుడ్లు వారి నించి లేదా వారి కుటుంబం నించి ఆడపిల్లల బంధువులకే డొనేట్ చేయిస్తాం” అని చెప్పండి.

భళ్ళున నవ్వాడు అతడు, టేబల్ మీదున్న కాగితాలు అన్నీ ఎగిరి కింద పడ్డాయి. ఆమె ఏవగింపుగా చూసేసరికి, “నా నవ్వన్తే, పట్టించుకోకు, నువ్వు చెప్పినది అమలు చేస్తే ముందు నా కళ్ళే పెరుక్కుపోవల నువ్వ్” అన్నాడు అతగాడు.

ఆమెకు అరికలి మంట అంటే ఏంటో తెల్సింది,  నిదానంగా “మానిఫెస్టో ప్రేసెంటేషన్ కి టైమ్ అయింది పదండి” అన్నది.

మీటింగ్లో అందరూ తమకు తెల్సిన, అనుకూలంగా ఉన్న పాయింట్లన్నీ చెప్తూ వచ్చారు. అసలు ప్రొఫెషనల్ నిర్దేశించినవి ప్రజలకి లేదా ప్రజలకి మాత్రమే ఉపయోగపడేవి అని పెదవి విరిచారు. ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సమయం శఠగోపానికి వచ్చింది.

అందరి ఆలోచనలు విన్న అతడు, ఒక్కోటి చదివాడు.రైతు రుణమాఫీలు, స్త్రీలకు చిన్న పెట్టుబడుల వ్యాపారాలు, పిల్లలకు ఆడవారికి ఉచిత వైద్య శిబిరం.

అన్నీ చదివి చివరిగా “జన్నత్ నీకు నచ్చిందా?” అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అందరికీ అతడి మీద విరుచుకుపడాలనే అనిపించినా, లోపలే రగిలిపోతు ఆయన పార్టీ పెద్ద కాబట్టి ఆగిపోయారు. “నీ మనసులో ఏం ఉందో చెప్పు జన్నత్ నాకు మీటింగ్స్” చాలా ఉన్నాయ్ అన్నాడు అసహనంగా.

ఆమె రైతు ఋణ మాఫీల బదులుగా, రైతులకు ఉచిత వ్యవసాయపు  క్రొత్త విధానాలను చూపే బడులు కావాలి-అందులో పూర్తిగా వర్షాధారం కానీ సేద్యం, కొత్త విధానాలు, సారవంతపు నేలలను శాస్త్రీయ పద్దతిలో సాగు చేసుకొనే ఉచిత శిక్షణ, వారే ఆన్లైన్లో ధాన్యం అమ్మకాలు చేసుకొనే వీలు కల్పించాలి. అప్పుడు వారు ప్రభుత్వానికి ఋణ మాఫీలు చేయమని బిచ్చమెత్తే పరిస్దితి రాదు, పైగా దళారీల అరాచకాలు, వడ్డీ వ్యాపారాల దగాలు అరికట్టొచ్చు.

రెండోది, ఎన్ని రోజులని, స్త్రీలకు చిన్న పెట్టుబడులంటూ గ్రామాలకే పరిమితం చేస్తారు, ఇపుడు ప్రపంచదేశాలు  ఒక ఇంటర్నెట్ కుగ్రామమలు. వారి నైపుణ్యాలను  బయటి దేశాలకు  పరిచయం చేసి కొత్త వ్యాపారాలు వెసులుబాటు కల్పించాలి. మన మహిళలు ఎక్కడ చేయి పెట్టినా పండేది బంగారమే అని మనం గుర్తించాలి. ఎక్కువ సమయం వారిని కొత్త విధానాలను పుణికిపుచ్చుకొనే వైపు మరల్చాలి.అప్పుడు సగం నిరుద్యోగం నిర్మూలన అవుతుంది.పైగా వారే ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వగలుగుతారు.

మూడు ఉచిత వైద్యo రానున్న మూడేళ్ళల్లో తొలగించాలి, ఆ ఖర్చుని సమతుల ఆహారం మీద కేoద్రీకరించాలి, అందుకు గాను కుటుంబ ఆరోగ్యం, దాని పరిణామాలు దేశం మీద ఎంత ప్రభావితం చూపుతాయో విరివిగా ప్రచారం చేయాలి. అని ముగించింది.

“అవి చెప్తే మాకేo వస్తాయ్ నీ వల్ల? అని ఒక్కడు ఓటు వేయాడు, చేతిలో డబ్బు పడాలి.సెక్రెటరీ వి సెక్రెటేరి లా ఉండు” అన్నాడు ఒక మంత్రి గారు ఆమెను పురుగుని చూస్తున్నట్లు చూస్తూ.ఆమెకు కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

శఠగోపం కాసేపు మౌనం వహించి, “మూడో పాయింటు అంత నచ్చలేదు జన్నత్,  ఆ ప్లాన్లో ఇందాక నా క్యాబిన్లో చెప్పావే, ఆడోళ్ళ జోలికొస్తే, వచ్చిన వాడివి లేదా వాడి ఇంట్లో వాళ్ళ కళ్ళు పెరికి ఆడపిల్ల  కుటుంబానికి డొనేట్ చేస్తామని, అది వ్రాసి ముగించి ప్రెస్ రిలీస్ చేయమని వెళ్లిపోయాడు “.

జన్నత్ ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుండిపోయింది, మిగితా వారందరూ..సూది బడితే వినబడేన్త నిశ్శబ్దాన్ని అనుభవిస్తూ కూర్చున్నారు.

************************************************************************************

రాత్రి 11.30 గంటలు.

“సర్, నేను ఇంక మా ఇంటికి వెళ్ళాలి, పొద్దున్న 6.00 గంటలకు మళ్ళీ రావాలి, అన్నది జన్నత్ తాగి తాగి బార్లో బల్ల మీద పడున్న శఠగోపంతో.

“మీ వారు తిట్టలేరు కదా, మతిస్దిమితమ్ లేనోడు కదా జన్నత్”

“మతి లేనిది ఆయనకు కానీ నాకు కాదు కద సార్” అన్నది ఆమె.

అంత మైకంలోను ఆమెను మసక కమ్మిన కళ్ళతో చూడాలనే ప్రయత్నం చేశాడు శఠగోపం. “నువ్వు నా నమ్మకం పొందటానికి నాటకాలు ఆడుతున్నావ్ కదా” అన్నాడు అనుమానంగా నవ్వుతూ..

“మీరేలా అనుకున్న పర్వాలేదు, ఇంక నేను వెళ్ళాలి” అన్నది ఆమె నిస్సంకోచంగా.

“నా మీద నీ అభిప్రాయం” అన్నాడు అతడు చాలా చిన్నపిల్లాడిలా.

“గుర్తుంపు పలుకుబడి ఉన్న, ఒక అన్నాధ మనసు”

“జాలి పడుతున్నావా, ఒక హీరో కనబడలేదా నీకు?

“అస్సలు కనబడలేదు, లేకపోతే నిన్న కాక మొన్న వచ్చిన నన్ను మీ గురించి మీరు అడిగి తెల్సుకోవలా, మెరేంటో మీకు తెలీదా, లేక ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదా”.

“అహంకారం, తెలివి, ఆడపిల్లను  ఒక గ్లాస్లో పోస్తే అది జన్నత్ అవుతుందేమో. వాళ్ళ అభిప్రాయం నాకు తెల్సు, నీ అభిప్రాయం కావాలి అనుకున్నాను”

“స్త్రీ లోలుడు”

“హహ..హహ్హ..థాంక్స్, చాలా థాంక్స్, ఇదే నాకు కావాలి.. ఒక అమ్మయ్తో తిట్లు తినాలి అర్గుమెంట్స్ కావాలి. ఇంక వెళ్ళు కావాలంటే రేపు లీవ్ తీసుకో, పో” అన్నాడు బ్రoహాండమ్ బద్దలయ్యేలా నవ్వుతూ.

“థాంక్స్” అని ఆమె వెళ్లిపోయింది.

************************************************************************************

తెల్లవారి 7. 30 నిమిషాలు.

మీటింగ్ కి అందరూ వచ్చి కూర్చున్నారు, హడావిడిగా లేచాడు శఠగోపం రాత్రి తాగింది ఇంకా దిగకపోయినా , “అయ్యో ఇలా పడుకున్నాను ఏంటి, అసలే తాగి జన్నత్ ను  రావొద్దని,  ముఖ్యమైన వారికి మెసేజ్ చేయనేలేదు అనుకుంటూ తన కార్యాలయానికి పరుగెట్టాడు. అప్పటికే అందరూ వచ్చి ఇతడి కోసం ఎదురు చూస్తున్నారు..”అంటే జన్నత్ నిన్ననే చెప్పి వెళ్ళిపోయింది”  అనుకుంటూ ఉండగా “మీటింగ్ స్పీచ్ ప్రిన్టౌట్స్” అంటూ అతడి చేతికి అందించింది.

“నువ్వు రావక్కర్లేదు అన్నాను కదా!” అన్నాడు అయోమయంగా, మనస్సులో మాత్రం తన పరువు కాపాడినందుకు సంతోషిస్తూ.

“జీతం తీసుకుంటూ పని చేసే నాకు, ఎప్పుడు సెలవు పెట్టాలో, పెట్టకూడదో తెల్సు, మీరు తాగిన మైకంలో సెలవు ఇచ్చినా నేను తీసుకోలేను కదా”! అని గడియారం కేసి చూస్తూ అరగంటలో ఓపెనింగ్ సెర్మనీ కి  వెళ్ళాలి, అక్కడ ఎలెక్షన్ ఫండ్స్ సహాయం చేస్తాన్నారు” అని వెళ్లిపోయింది.

శఠగోపం నివ్వెరపోయాడు. మీటింగ్ ముగించుకొని, “నీ పేరు సువర్చలగానే ఉండనీ, జన్నత్ వద్దు” అన్నాడు.

“ఎందుకు?”

“ఎందుకో అలా అనిపించింది అంతే.”

“వద్దు మీకు హోమ్లీ సెక్రెటరీస్తో బోర్ కొట్టిందని ముందే  చెప్పారు, అయినా పేరులో ఏమున్నది, మనిషి గుణంలో ఉంటుంది సర్ అంతా”

“కావాలంటే ఉద్యోగం రాజీనామా చేయి, నీకు సంవత్సర జీతం ఇప్పిస్తాను, వెళ్ళిపో, నాకు నిజంగానే బోర్ కొట్టింది. నిన్న నేను తాగి వాగాను, కానీ నిజమే వాగను, నాకు ఇలా చిలిపిగా, గొడవలు పడే వాళ్ళు కావాలి, నన్ను తిట్టే వాళ్ళు కావాలి, కవ్వించాలి, తెలివిగా ఉంటూ నా పనుల్లో సహాయ పడాలి, నా చిరాకులు భరించాలి.”

“నేను ఓకే అన్నాను కదా, మిమ్మల్ని ఎలా అదుపులో పెట్టాలో నాకు తెలీకపోతే కదా”!

“కానీ నిన్ను చూస్తే భయం వేస్తోంది.తప్పుగా మాట్లాడి నిన్ను బాధిస్తానేమో అనిపిస్తోంది. ఇలాంటి వాటికి అలవాటు పడ్డ అమ్మాయిలు, చాలా మంది అమ్మాయిలు ఇంకా నాకు దొరుకుతారు.”

“కానీ నాకు ఇంత మంచి జీతం దొరకదే.”

“కానీ నేను నీ కోసం మారలేను సువర్చల”

“ఆల్రెడీ మారిపోయారు సర్, జన్నత్ అనే పేరు మర్చిపోయారు , ఇదే మార్పు అంటే” అని వెళ్ళిపోయింది ఆమె.

******************************************************************************

లంచ్ అవర్లో: పేరుమోసిన రెస్టారన్ట్ లో.

అన్నీ పనులు పూర్తి చేసుకొని మరలా కొత్త ఊర్ల ప్రచారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు శఠగోపం, సువర్చల.

“సు” అంటూ చాలా మృదువుగా పిలిచే సరికి వెనక్కి తిరిగి చూశాడు శఠగోపం. ఎదురుగా సువర్చల కేసి చూస్తున్న కశ్యప్ నిల్చుని ఉన్నాడు.

అతడికి అర్థం అయింది,  ఆమె ముఖ కవళికలు గమనించ గానే, “మొగుడు మానసిక రోగి అయ్యేసరికి సువర్చల ని చూసిన  ప్రతి ఒక్కరికీ “సు” అని పిలవాలని అనిపిస్తోందా?” అని హూంకరించాడు శఠగోపం,  కశ్యప్ మీద. “నిన్ను ఇంత దూరం ఎవరు రానిచ్చారు, సెక్యూరిటి” అంటూ మండిపడ్డాడు కూడా. కశ్యప్ సువర్చల వంక బేలగా చూస్తూ నీకు ఇది న్యాయం కాదు అన్నట్టుగా నిలబడి ఉన్నాడు.

“నీ చీకటి సామ్రాజ్యానికి నేను శత్రువునని ముందే చెప్పాను, వెళ్ళు ఇక్కడ నించి అన్నది.” శఠగోపం విస్తుపోయాడు.

“కావాలంటే ఇక్కడే చంపేయ్, కానీ నాది చీకటి సామ్రాజ్యం అని మాత్రం పిలవకు, ఆడవారిని రక్షించే ఒక గూడు మాత్రమే” అది అని శఠగోపానికేసి చూసి ఆగిపోయాడు.

శఠగోపo అతడి కళ్ళల్లో స్వచ్ఛత చూసి జావ కారిపోయాడు, తాను కొన్ని లక్షల ప్రజలను శాసించే అధికారినని మరచి ఒక సామాన్య మనిషిగా తన హృదయంతో అతడిని చూడ సాగాడు.

కశ్యప్ ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని, “గడిచిన కాలాన్ని తిరిగి తెచ్చివ్వలేను కానీ, నీ కోపాన్ని కరిగించలేనంటావా?” అన్నాడు

ఆమె అతడి చెంప చెళ్లుమనిపించి, “నేను పరాయి వ్యక్తి భార్య అని మర్చిపోకు” అన్నది. పక్కనున్న శఠగోపం  ఇబ్బందిగా అక్కడి నించి లేచి వెళ్లిపోయాడు, ఫోన్ వచ్చినట్లు నటిస్తూ.

*******************************************************************************

మిధిల లాంటి మరి కొంత మందిని ప్రమాదం జరగక ముందే కాపాడిన, కశ్యప్ కొంత మందిని మిధిల స్థాయికి చేరుకున్నాక కాపాడకలిగాడు. కొంత మందిని వారి ఇళ్ళకు పంపాడు, ఒక ఇద్దరినీ గత్యంతరంలేక తనతో పాటు నేపాల్లోని తన అనుచరుడి ఇంట్లో ఉంచాడు. బోసుకి వారిద్దరికి ధైర్యం చెప్పమని పంపాడు. అసలే “సు” చేస్తున్న పనులకి, అన్న మాటలకి తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు అతడికి. కేవలం యాంత్రికంగా పని చేసుకుపోతున్నాడు, వేయి సంద్రాల ఘోష ఎగసి పడుతుంటే, రంపపు కోతను  అనుభవిస్తూ తన అనుచరులకు సూచనలు ఇస్తున్నాడు. ” సు” ని దింపారా, సారీ ఆ అమ్మాయిని పంపేసారుగా , రెండో “సు” ని, అదే అమ్మాయిని వాళ్ళ నాన్నకు అప్పగించారు కదా.” అంటూ పరాగ్గా పని చేస్తున్నాడు అతడు.

“సు” వల్ల నీకు సమస్య ఏంటి కశ్యప్?” సూటిగా అడిగింది మిధిల కశ్యప్ ను.

“నా ఆపరేషన్స్కి చెక్ పెడుతుందట. నన్ను ఉరి కంబం ఎక్కిస్తుందట. ”

“అమాయుకురాలు, నువ్వు తలుచుకుంటే ఒక్క నిమిషంలో తనని మట్టు పెట్ట…”

ఆమె మాట పూర్తి కాక ముందే ఆవేశంతో ఆమె చెంప మీద కొట్టబోయి తమాయించుకుని “నన్ను ఒంటరిగా వదిలేయండి కాసేపు” అన్నాడు.

ఆమె అవమాన భారంతో అక్కడ నుండి వైతొలిగింది..

తన జ్ఞ్యాపకాల నిధులను కళ్ళు మూసుకొని తెరిచాడు, రెండు జళ్ళకు ఎర్రటి రిబ్బన్లు కట్టుకొని , వడ పప్పు తన వైట్ యూనిఫార్మ్లో  బద్రంగా దాచి, ఎర్రటి చీమలు కుడుతున్నా ఓర్చుకుంటూ  తన కోసం ఎదురు చూసిన “సు” ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు కశ్యప్.

“ఆట కాదా హరా, ప్రేమ పుట్టించేది నువ్వే, చిదిమేలాగా భస్మాస్త్రం వేసేది నువ్వే, కాత్యాయిని కూడా అడ్డు పడదా నీకు, లేక నువ్వు ఆవిడ మాట పెడ చెవిన పెడతావా….లేక  నీ ప్రేయసి నీకు దక్కేనని మేమంటే అలుసా !!!”

*****************************************************************************

12 ఏళ్ళ క్రితం…

“సు”!! మీ నాన్న వస్తున్నాడు పారిపోన్డి ” అంటూ పదిహేడేళ్ళ కశ్యప్,  ఆమె ప్రియుడు శాంతా రామ్ అలియాస్  రాముడు అనబడే  వాడ్ని గుట్ట కిందకు తోసి అతడి స్థానంలో అతడు కూర్చున్నాడు సువర్చలకు సన్నిహితంగా.

ఊర్లో ఎవరో సువర్చల వేరే అబ్బాయితో తుప్పల్లో కనబడిందని ఆయన చెవిన వేశారు. అది తెలిసి ఆయన బెత్తం పట్టుకు వాయిద్దామని వచ్చారు, తీర చూసే సరికి ఆమె, కశ్యప్ కనబడ్డారు. ఆయన ముసి ముసి నవ్వులతో  “వెధవది పిల్లలు కలిసి ఉంటే ఊళ్ళో వాళ్ళు చూడలేరు కదా!” అనుకుంటూ వెనుతిరిగాడు.

“హమ్మయ్య !! “అంటూ ఊపిరి పీల్చుకున్నారు రాముడు సువర్చల.. “నువ్వే రాకపోతే ఇవాళ వాళ్ళ నాన్న నా వీపు చీరేసే వాడురా, చాలా థాంక్స్ రా!!” అన్నాడు రాముడు.

“ఫర్వాలేదురా, ఇది పల్లెటూరు, 12 యేళ్లకు పెళ్లిళ్లు చేస్తారు, 6 యేళ్ళు నిండని పిల్లల్ని 60 యేళ్ళ పై బడ్డ ముసల్దాన్ని రేప్ చేస్తారు, కానీ 17 ఏళ్ళ వాళ్ళు ప్రేమించుకుంటే  సహించరు. మీరే జాగ్రత్తగా ఉండాలి” అంటూ పెద్దరికం చూపిచ్చి వెళ్లిపోయాడు కశ్యప్.

సువర్చల, రాముడు తమ స్నేహితుడిని చూసుకొని మురిసిపోయారు.

******************************************************************************

కశ్యప్ తండ్రి సువర్చల తండ్రి చిన్న నాటి స్నేహితులు,అతడి తండ్రి ఆరోగ్యం ఎప్పుడు అంతంత మాత్రమే అవ్వటంతో సువర్చల తండ్రి తన పొలాల లెక్కా జమాలు చూడమని తన వద్దే పనిలో పెట్టుకుని వారి కుటుంబాన్ని అన్నీ రకాల ఆదుకోవటంతో పాటు కశ్యప్ అతడి చెల్లెలి పోషణ చదువు బాద్యతలు కూడా నెత్తిన వేసుకున్నాడు. స్నేహితుని ఆరోగ్యం బాగుపడాలంటూ అన్నీ గుళ్ళకు భార్యతో సహా ప్రదక్షణాలు చేసేవాడు, విదేశాలకు తెలిసిన వారి సహాయంతో పంపే వాడు కూడా, మెరుగైన వైద్యం కోసం.

10 వ తరగతి వరకు చదువు తప్ప వేరే ధ్యాసలేని సువర్చలకు, కాలేజీలో అడుగు పెట్టిన మరుక్షణం నించి కుర్రాళ్ళ ఆటంకాలు మొదలయ్యాయి. దానితో ఆమెకు తోడుగా కశ్యప్ ను కూడా ఆమె కాలేజీలో వేసారు సువర్చల తండ్రి. ఎంత మందికి పడని ఆమెను నానా పాట్లు పడి శాంతా రామ్ ఒప్పించాడు. సువర్చల కూడా ఒప్పుకోవటంతో కశ్యప్  ఆమెకు సహాయ పడక తప్పలేదు, చిన్నప్పటి  నించి స్నేహితురాలు కదా ఎంతైనా, ఆమె నిర్ణయం సరి అయినది అవుతుందని కశ్యప్ నమ్మకం. సువర్చల చదువు అటక ఎక్కటానికి ఎంతో కాలం పట్టలేదు ప్రేమలోకపు ద్వారాలు తెరిచాక.

కూతురు కశ్యప్ మాయలో పడి చదవట్లేదు అనుకోని సువర్చల తండ్రి, ఇంట్లోనే అల్లుడు పుట్టాడు అనుకోని మురిసిపోయి ఆమెను చదువుకోమని ఒత్తిడి తేకుండా తన మిగిలిన ఆస్తిని కశ్యప్ చదువు మీద పెట్టాడు.తన భార్య పుట్టింటి నించి ఆస్తి వచ్చింది, అత్తగారు కాలం చేయటంతో.  అది కూడా అతడి తండ్రి ఆపరేషన్ కోసం ఖర్చు చేసాడు, కానీ దక్కించుకోలేకపోయారు. ఆ దిగులుతో కశ్యప్ తల్లి మంచాన పడింది. సొంత చెల్లెలుగా భావించి ఆమె కోసం కూడా ఖర్చు పెట్టాడు, తన మిగిలిన ఇద్దరు కూతుళ్లను కశ్యప్ చూసుకుంటాడు అనే భరోశతో.

కశ్యప్ కూడా ఒక పక్క తల్లికి సేవ చేస్తూనే ఇంజనీరింగ్ మీద అతి శ్రద్ధగా చదివే వాడు. ఈ లోగా రాముడు ఇంటికి పట్నం నించి అతడి అత్త కూతురు వచ్చింది. ఆమె పట్నం సొగసులకు సువర్చల వెలిసిపోయిన బొమ్మలా కనిపించింది అతడికి. ఆమె పట్నపు సోషలిశమ్, అందులోనూ ఇంట్లోనే దొరకటం అతనికి చాలా అనువుగా అనిపించింది,   ఆమె చిలిపి మాటలు అతడికి  మరింత ధైర్యాన్ని ఇచ్చింది. అన్న కూతురే అవ్వటంతో అతడి తల్లి కూడా ఇద్దరినీ చూసి మురిసిపోయేది,  సువర్చల ఎంత ప్రేమించినా కట్టుబాట్లకు లోబడీ  ” అన్నీ పెళ్ళైన తర్వాతే” అంటూ అర మైలు దూరంలో ఉంచింది. . ఇపుడు సువర్చల ఫోన్ కాల్ ఒక ప్రమాదపు గంటలా వినిపిస్తోంది అతడికి. పూర్తిగా ఆమె గూర్చి ఆలోచనే మర్చిపోయాడు. సువర్చల దిగులు చూసి కశ్యప్, రాముడు ఇంటికి వెళ్ళి ” ఒక్క సారి అయిన కలిసి పోరా, ‘సు’ బెంగ పెట్టుకుంది” అని చెప్పాడు.

“అరేయ్ ఇంటి నిండా చుట్టాలు, ముఖ్యమైన వ్యక్తులు, అయినా ఏంటి రా అది? నా లోకంలో  తను తప్ప ఇంకెవరూ ఉండకూడదా, కుక్క పిల్లలా తన చుట్టూ తిరగాల నేను. ముందు బుద్ధిగా చదువుకోమను” అని కసిరి పంపేశాడు కశ్యప్ ను.

కశ్యప్ కు మిధీల మీద ఉన్న గౌరవంతో, రాముడిని ఏం చేయలేక మౌనంగా కదిలాడు, ఆమెకు మాత్రం వాళ్ళింట్లో అత్తకు బాలేదు, బామ్మకు బాలేదు అంటూ రెండు నెలలు ఎలాగో  నెట్టుకొచ్చాడు.

కానీ ఒక రోజు సువర్చల పట్టు పట్టి రాముడు ఇంటికి వెళ్ళింది, కశ్యప్ ను తోడుగా తీసుకొని. అక్కడ అదే సమయానికి రాముడు తన పట్నం మరదలికి లంగా వోణి ఎలా కట్టుకోవాలో నేర్పిస్తున్నాడు ఇంట్లో ఎవరు లేని సమయంలో. సువర్చలకు తన కలల సౌధం కూలినట్లుగా కనిపించింది, కాలి కింద భూమి చీలిపోయి పాతాళంలోకి  పడ్డట్లుగా అనిపించింది. కశ్యప్ ఆవేశంగా అతడిని లాగి ఒక్కటి కొట్టాడు. రాముడు ” నా మరదలి ముందే కొడతావా అంటూ చొక్కా పట్టుకొని,  మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు,  ఎప్పుడు రొమాన్స్ చేయలేదని ఏంటి గారెంటీ. నువ్వు నవిలి పారేసిన చూయింగ్ గంని నాకు అంటిస్తావా”? అన్నాడు.

సువర్చల కశ్యప్ చేయి పట్టుకొని రెండో మాటకి తావు లేకుండా లాక్కెళ్ళిపోయింది. పట్నపు మరదలికి కశ్యప్ ఆవేశం వెనక బాధ, సువర్చల చెక్కిళ్ళ మీద కన్నీటి ధార, అన్నీ పూస గుచ్చినట్లు చెప్పాయి. అన్నిటి కన్నా ముందు అతడు సువర్చలను ‘చూయింగ్ గం’ తో పోల్చటం, అతడి  వ్యక్తిత్వాన్ని ప్రస్పుటంగా తెలియ చేసింది. మరు క్షణం పెట్ట బేడ సర్దుకొని ఆ మిట్ట మధ్యానం లో వెళ్లిపోయింది.

************************************************************************************

తర్వాత సువర్చలను మామూలు మనిషిని చేయటానికి కశ్యప్ కు  సంవత్సర కాలం పట్టింది, అతడి ఒక అకడమిక్ ఇయర్ త్యాగం చేయవలసి వచ్చింది. ఇదంతా చూసిన సువర్చల తండ్రి వీరిద్దరి ప్రేమ గొడవలే కారణం అనుకోని ముందు చదువు పూర్తి చేయండి తానే పక్కనుండి పెళ్ళి చేస్తానని సర్ది చెప్పే వాడు అమాయకంగా.

సువర్చలకు అనుక్షణం వెన్నంటి ఉండి, చివరికి ఆమె ప్రేమ లో పడ్డాడు కశ్యప్, కానీ ఆమెకి చెప్పే ధైర్యం అతనికి చాలట్లేదు, ఆమె తండ్రి మాట ఇచ్చినపుడు మాత్రం కాసేపు స్ధిమిత పడతాడు, కానీ సువర్చలకు తన మీద ఉన్న  అభిప్రాయం తెలీక తనలో తానే సతమతమయ్యేవాడు. సువర్చల మరలా కశ్యప్ సహాయంతో చదువులో పూర్తిగా నిమగ్నం అయింది, రాముడ్ని తన హృద్యాంతరాళ్ళలోంచి తొలగించి శుద్ది చేసుకున్నది. చదువులో ఆమె తిరిగి రాణించింది. తన 23 వ ఏడు పుట్టిన రోజున తన తల్లి, తండ్రి, ఊరి సమక్షంలో, “కశ్యప మహా ముని నన్ను వరించునా? లేదా ? ” అంటూ తానుగా ప్రపోస్ చేసింది. అప్పుడు తెలిసింది అతడికి తన హృదయ ఘోషను సువర్చల మిస్ అవ్వలేదని, ఆఖరు పరీక్ష అయిపోయిన మర్నాడే పెళ్లి ముహూర్తాలు చూడమని చెప్పాడు. కశ్యప్ పేరున తన మిగిలిన ఆస్తులు వ్రాశాడు ఆమె తండ్రి అదే క్షణాన. .అతడి చెల్లెలి పెళ్ళి తన సొంత ఖర్చులతో చేశాడు.

కాపురానికి పంపే సమయంలో కశ్యప్ చెల్లెల్ని తమ ఊరి పొలిమేర్ల లోని గుడికి పంపారు ఆనవాయితి ప్రకారం. అక్కడ ఎవరో వశీకరణ ప్రయోగం చేసి రెండు రోజుల తర్వాత ఆమెను విడుదల చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నది. వారిని వేటాడటానికి చివరి పరీక్ష వదిలి ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకొని కశ్యప్ వెళ్ళిపోయాడు రాత్రికి రాత్రి..

పాత పగలతో శాంతా రామ్, “కశ్యప్, సువర్చలను తన ఇద్దరి చెల్లెళ్ళను వాడుకొని పరారయ్యాడు” అంటూ పుకార్లు  పుట్టించాడు. ఆమె తల్లి గుండెపోటు తో మరణించింది, తండ్రి జీవచ్ఛవం అయినాడు. కశ్యప్ తల్లి ముద్దాయి లా నిలబడింది ఊరి వారి ముందు. సువర్చల రోడ్డున పడిన కుటుంబ రక్షణ కోసం మతిస్దిమితమ్ లేని ఒక వ్యక్తిని చేసుకున్నది, అతడి అన్నయ్యలు అతడి వాటా ఆస్తి, అతడిని ఆమెకు అప్పగించి బరువు దించుకున్నారు.

ప్రస్తుతం కశ్యప్ తల్లి, సువర్చల కశ్యప్ మీద అసహ్యంతో బతుకు వెళ్ళదీస్తున్నారు,

*************************************************************************************

“స్వామి! ఎవరో కశ్యప్ అట, మన స్థావరాల మీద స్వైరవిహారం చేస్తున్నాడు. ఆడోళ్లందరిని తప్పిస్తున్నాడు.వాడికి ఓ తల్లి, మాజీ ప్రియురాలు ఉన్నారు. కానీ ఎక్కడుంటాడో కనిపెట్టలేకపోతున్నాం.”

“వాడికేంటి మన మీద అజ, పాత పగోడ!!!”??

“ఇంకా పూర్తిగా తెలీట్లేదు స్వామి. పోలీసు మనిషి కూడా కావచ్చు”

“పోలీసోడైతే మన జోలికొచ్చే సమస్యే లేదు, వాడి చెల్లెనో అక్కనో మనోళ్ళు చెడిపుంటారు. బాధను మించిన శక్తి ఇంకోటి ఉండదు ఈ ప్రపంచంలో. 24 గంటల్లో వాడి బాధ నయం చేద్దాం, అమ్మోరికి తల అయిన, వాడి గుండెకాయ అయిన పర్వాలేదు, రెండు నైవద్యానికి పనికి వస్తాయి, ఆ పని చూడు”అని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు దిగంబర స్వామి.

*************************************************************************************

కశ్యప్ సార్ వాడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు, సువర్చల మాడమ్ ఇంటి దగ్గర కూడా పహరా  వేశారు. మీ అమ్మగారు కూడా అక్కడే ఉండటం తో మీరు అక్కడకి వస్తారని వాడి నమ్మకం.

“ఇంక ఎంతో కాలం పట్టదు, రాని వాడ్ని నన్ను వెతుక్కుంటూ రమ్మను, చావుకు ఎదురొస్తాను అంటే నేను ఎవరిని అడ్డు పడటానికి.” అని తన పనిలో నిమగ్నమైనాడు కశ్యప్.

*************************************************************************************శఠగోపం గారు మన పార్టీ మేనిఫేస్టోకీ ఫేస్బుక్లో లైక్స్ మీద లైక్స్ వస్తున్నాయి, కాకపోతే ఒక్క చదువుకున్న, విజ్ఞ్యత వున్న వర్గం నించి మాత్రమే, మిగితా వారంతా కామెంట్ బాక్స్ బద్దలయ్యేలా పస లేనివి అని తిడుతున్నారు అంటూ రిపోర్ట్స్ పట్టుకొచ్చాడు సీనియరు మంత్రి సర్వోత్తమ రావు.

“వారి తిట్లే మనకు ఆశీర్వాదాలు”

“కొత్త సెక్రెటరీ గారు వచ్చాక సార్ పూర్తిగా మారిపోయారు”

“తప్పేం లేదు కదా!!”

“అవును ఆవిడ భర్తకు మెంటల్ కదా, తప్పు లేదు లేండి”

“మెంటల్ ఆవిడ భర్తకు మాత్రమే, నాకు- ఆవిడకు కాదు. నేను స్త్రీ లోలుడినే కానీ రేపిస్ట్ని కాను. ఆవిడ అంగీకారం లేకుండా లోబర్చుకొనే ఉద్దేశ్యం నాకు లేదు. అయినా  స్త్రీలోని మంచి  అభిప్రాయాలకు పట్టం కట్టే వాడు చేతగాని వాడో లేక ప్లే బాయ్ కానక్కర్లేదు,  పట్టం కట్టే మగ వారిలో నేను ఒకడిని.

“మీరు మీ వయస్సు మర్చిపోతున్నారు.”

“నువ్వు నీ స్థాయి మర్చిపోతున్నావు” అన్నాడు గంభీరంగా.

ఆ మాటకు నీళ్ళు నమిలాడు ఆయన కంటే సీనియర్ అయినా కూడా, మంత్రి సర్వోత్తమరావు.

తిరిగి శఠగోపం శాంతించి, “క్షమించండి, నేను స్త్రీ లోలుడుని కావొచ్చు , కానీ ఆమె పురుషలోలురాలు కాదు.ఆమె కోసం కాదు ఆ మానిఫేస్టో అంగీకరించింది. నాకు 51 వ ఏడు, ఇన్నాళ్ళు ప్రజలకి తాత్కాలిక సౌకర్యాలు చూపాను. ఇప్పుడు నవ సమాజ నిర్మాణం కై పరిగెడుతున్నాను.ఆమె స్థానంలో మీరున్నా సరే నేను ఆ మేనిఫేస్టోని అంగీకరించేవాడిని.” అన్నాడు.

ఏడవలేక నవ్వి, భయం భయంగా వెళ్ళిపోయాడు అక్కడ నించి సర్వోత్తమ్.

శఠగోపం చాలా సరదాగా ఉండే మనిషి, కానీ వృత్తిలో మాత్రం ఏది కావాలో, ఎక్కడ కావాలో ,ఎంత కావాలో చాలా స్పస్టత కలిగిన వాడు. అక్కర లేనిది, పాము కుబుసం విడిచినట్లుగా నిర్దాక్షణ్యంగా వదిలేస్తాడు, హంసలా పాల నించి నీటిని విడ దీస్తాడు, తనకి అడ్డు వచ్చిన వారిని సింహమై వేటాడతాడు. అందుకే పూర్తిగా 40 ఏళ్ళు నిండకుండానే రెండు సార్లు ముఖ్య మంత్రి పదవిని అలంకరించి, మరో సారి పోటీ పడుతున్నాడు.

*******************************************************************************

“సువర్చల మొన్న వచ్చిన వ్యక్తి “…అంటూ ఆగిపోయాడు, శఠగోపం.

“నా గతంలో ఒక ముఖ్య పాత్ర”.

“ఆ పాత్ర ఇప్పుడు పాలను మోస్తోందా, లేక నీటిని మోస్తోందా…”

“విషాన్ని మోస్తూ మొసలి  కన్నీరు కారుస్తోంది”

“మగవాడు బాధను, ఆక్రోశాన్ని బయటకు చెప్పుకోలేడు సువర్చల.”

“కనుకనే పిరికివాడిలా పారిపోతాడు.”

“సమస్యలను పరిష్కరించుకోవాలి కదా…”

“అవును, కానీ పాత సమస్యలు తవ్వుకోకూడదు కదా…”

“అయితే నీ భర్తకి నేను వైద్యం చేయిస్తాను, నేనెందుకు సహయం చేస్తున్నానో నీకు బాగా తెల్సు.” అని ఆమె కళ్ళల్లోకి చూశాడు అతడు.

“వైద్యం చేయించి నయం అయ్యాక , నీ పెళ్ళానికి నేను తాత్కాలిక మొగుడిని అని పరిచయం చేస్కుంటారా?” అని ఆమె అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది.

“సరే నా కోసం ఎన్నో అర్జీలు ఎదురు చూస్తున్నాయి పల్లెల నించి, వాటికి నువ్వే పరిష్కారాలు  పంపి మానేజ్ చేయి కొంచెం”

ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. అతడు ఆశ్చర్యపోతూ “ఏంటి ఈ అమ్మాయి, ఇంత మౌనంగా వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయి అయితే సెక్సువల్ హర్రాస్స్మెంట్ కేస్ పెడతానని చెప్పి బెదిరించేది ఇష్టం లేకపోతే, లేదంటే నేనో ముఖ్య మంత్రిని కాబట్టి ఎగిరి గన్తేసేది. పి‌రికిది అయితే ఉద్యోగం వదిలి పారిపోవాలి, ఇవేo చేయకుండా ఇక్కడే ఉంటూ నన్ను గౌరవిస్తుంది..ఎందుకు??? ” ఎందుకు?” అనుకుంటూ  తన కుక్క పిల్లని దగ్గరకి తీసుకున్నాడు.

ఇంతలో ఆయన భార్య నుంచి ఫోన్ వచ్చింది.ఇష్టం లేకుండానే పిక్ చేశాడు. ఫలానా అవార్డుల ఉత్సవాలకు వెళ్ళాలి. నేను కారు దిగే సరికి మీ కార్య కర్తలు ఆటోగ్రాఫ్ అంటూ నా చుట్టూ మూగాలి. అక్కడకి ఇలియానా, అనుష్క, తమ్మన్నా కూడా వస్తున్నారు, వాళ్ళ ముందు నేను తీసిపారేసినట్లు ఉండకూడదు కదా!!” అంటూ గల గల నవ్వింది.

“వాళ్ళంటే కష్ట పడి సినిమాల్లో నటించారు. నువ్వు ఏం చేశావు, నటివా, రచయిత్రివా, సోషలిస్టువా, టీచరువా? కనీసం గృహిణివా?”

“ఒక స్త్రీ లోలుడిని భర్తగా భరిస్తున్నాను,  భూదేవికున్న సహనం ఉండాలి. నేను స్త్రీ లోలుడిని కాదు కాదంటారా?” అన్నది ఆమె నిష్టూరంగా.

“నువ్వే ఒక స్త్రీవి, నీకు ఆ ఛాన్స్ లేదులే, సరే నీ కోసం రేపు 30 మందిని పంపుతానులే. చాలా?”

“చీప్ గా 30 మందేనా, ఏర్ పోర్ట్ లో 30 మంది, ఈవెంట్ హాల్ వద్ద ఒక 50 మందిని పంపండి, మా నాన్న ఇచ్చిన దర్పమే కదా మీరు అనుభవిస్తున్నది అంతా…”

“అలాగే హోమ్ మినిస్టరు గారు” అన్నాడు అతను వాతావరణం చల్లబరుస్తూ ….తర్వాత ఫోన్ కట్ చేసింది ఆవిడ.

ఆయన భారంగా నిట్టూర్చి , “ఏంటో ఈ విచిత్రమయిన  జీవితాలు,  సువర్చల మతి లేని మొగుడు, మతి ఉన్న నేను దాదాపు ఒకటే, మాకు కూడా భార్యలు ఉన్నారు” అనుకున్నాడు.

*********************************************************************************

పెగ్గు మీద పెగ్గుతో అర్ధ రాత్రి మూడు అయినా తాగుతూనే ఉన్నాడు కశ్యప్.

అతడికి ఎదురుగా కూర్చోని ఉన్న బోసు మిధిలా అతడి తత్వం బోధ పడక, అడ్డు పడ లేక అవస్థ పడుతున్నారు.

బోసు వద్దని వారిస్తున్నా చివరికి మిధిల చొరవ తీసుకొని, “నువ్విలా తాగి తాగి ఒళ్ళు గుల్ల చేసుకో, అక్కడ ఆవిడ గారు మంత్రి గారితో చిందులు వేస్తోంది. నువ్వు ‘సు’ ‘సు’ అంటూ దేవదాస్ అవుదువు గాని, ఆవిడ లక్షలు ఆర్జిస్తుంది. అలాంటి ఆడ దాన్ని ఎడం కాలితో తన్ని వేరే అమ్మాయిని పెళ్ళాడాలి కానీ  బేలగా ఆమె కోసం ఇంత మదన పడటం ఏంటి?”.

“నేను నీ బాయ్ఫ్రెండ్ లాంటి వాడిని  కాను,  నీది కానీ తప్పుకి పీటల  మీద పెళ్ళి ఆపేయటానికి. ‘సు’ గురించి మాట్లాడే హక్కు నీకేమున్నది. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పార్కుల్లో తిరిగి ఐస్ క్రీమ్లు షేర్ చేసుకొని, చిన్న కస్టo రాగానే  టాటా చెప్పుకున్నారు. వాడు నిన్నొదిలేస్తే, పొరా అనుకోని రెండు రోజుల్లో మర్చిపోయావు, నిజం చెప్పు మిధిల రెండు రోజుల్లో మర్చిపోగల శక్తి ఉన్నది అంటే అది ప్రేమ ఎందుకు అవుతుంది. ఉంగరాలు మార్చుకుంటేనో, దండలు మార్చుకుంటేనో  పెళ్ళి కాదు, భాద్యతలు పంచుకుంటే, బంధాలు నిలుపుకుంటే ప్రేమ , పెళ్లి అవుతుంది. నువ్వు వాడు నిన్నొదిలేసేటప్పుడు ఎందుకు వదిలేస్తున్నావ్ అని అడిగి వుంటావు, కానీ ఎపుడైనా ఎందుకు నిన్ను ఇస్టపడుతున్నాడో అడిగావా? అడిగినా వాడు ఒక సినిమా డైలాగ్ కొడతాడు. మీరు పడిపోతారు డ్యూయేట్లు పాడుకుంటారు, కష్టం రాగానే అంతే సులువుగా వీడి పోతారు.’ సు’  ని గుండెల్లో పెట్టుకున్నానని, దాని బాయ్ ఫ్రెండ్, దాన్ని ‘చూయింగ్ గం’ అనే దాకా నాకు తెలీలేదు. ఆ క్షణమే అది నా భార్య అయిపోయింది. దానికి నా మీద పిచ్చి ప్రేమ, అందుకే ఒక పిచ్చోడీకి భార్యగా వుంటోంది. ఒక్క సారి వెళ్ళి కశ్యప్ ను  చంపేస్తున్నాను అని చెప్పు, మరు క్షణం నువ్ వుండవు.

“నీ భ్రమ, నిన్ను ఉరి కంబం ఎక్కిస్తా అంటోంది అని నువ్వే చెప్పావ్.”

“నన్ను ఈ చీకటి సామ్రాజ్యం నించి రక్షించటానికి, మామూలు జీవనం సాగించటానికి హింస పెడుతోంది.”

“తాగి వాగకు, అది ఒక ప్లే బాయ్ దగ్గర పనిచేస్తోంది, డబ్బు అవసరంలో ఉన్నది.నేను నమ్మను.”

“డబ్బు అవసరమా? అతడు పెద్దగా నవ్వాడు, “ఎప్పుడైనా నీకు కానీ వారికోసం ఉన్న ఆస్తిని ధార పోశావా, మీరంతా ఒక్క ఐదు నిమిషాలు లేటుగా వచ్చినా, డ్రాప్ చేయకపోయినా బ్రేకప్ చెప్తారు. అది నాలో ఉన్న స్నేహితుడి కోసం ఉన్న ఆస్తి ధారపోసింది, అది ఏంటి మొత్తం దాని కుటుంబం నా కోసం మా నాన్న కోసం రోడ్డున పడింది.”

“ఇప్పుడు పగ సాధిస్తోంది కదా” అన్నది మిధిల  ఆమెను ఒక పురుగులా అసహ్యంచుకుంటూ…

అతడు మిధిలకు అతి సమీపంలోకి వచ్చి, “నువ్వు నీ ఎక్స్ కి ఫోన్ చేసి నువ్వు లేకుండా బతకలేను అని బతిమిలాడు” అని ఫోన్ ఇచ్చాడు.

“నెవర్, ఆ రాస్కల్ నా” !!!అంటూ దూరంగా జరిగింది.

“చిన్న ప్రయత్నం చేస్తే బంధం నిలబడుతుందేమోననే  ఆశ కూడా నీకు లేదు, వాడితో పెళ్ళికి సిద్ధమయ్యావు, కానీ నా సువర్చల జస్ట్ స్నేహితుడి కోసం రోడ్డున పడింది, దానికి నన్ను శిక్షించే హక్కు ఉన్నది. మీ లాగా మొగుడ్ని కొనుక్కోవాలని అనుకోలేదు, అందుకే పిచ్చోడికి కూడా కట్టుబడి ఉన్నది. పో ఇక్కడ నించి” అన్నాడు కసిగా…

మిధిల గతుక్కుమన్నది.

ఆడ దానికి ఆడదే శత్రువు, నా ‘సు’ ఎక్కడున్నా నాదే, చూస్తాను ఎన్ని రోజులు సాధిస్తుందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు కశ్యప్.

************************************************************************************

“శఠగోపం నిన్ను రెండు సార్లు ముఖ్య మంత్రిని చేశాను, ఆ కశ్యప్ సాక్షాధారాల తో సహా ప్రతి పక్షాల్లో చేరాడు. నాకు ఇప్పుడు సహాయ పడకపోతే ఇంకెపుడు నీ సహాయం కూడా అవసరం పడదు, ఉరి కంబం తప్పదు కాబట్టి.”

“ఏయ్ దిగంబర స్వామి, నువ్వు బయట వాళ్ళకి స్వామి వి, నాకు కాదు, నాకంటే రెండింతల క్రూరుడివి, రౌడీవి, ఒకటి కాదు ఇద్దరు కాదు, కనబడ్డ ప్రతి ఆడ పిల్లని చెరిచారు నువ్వు నీ శిష్యులు, ఇప్పుడు నా దగ్గరకి వస్తే, నన్ను ఉరికొయ్యకు వేళ్ళాడమంటావా? ఒప్పుకుంటాను నువ్వే నన్ను ముఖ్య మంత్రిని చేశావు అని, కానీ ప్రతి దానికి ఆ మాట అడ్డు వేస్తే అయిపోతుందా.. చట్టం ఒకటి ఉంది… కాస్త మనకి కూడా సిగ్గు ఉండాల కదా, ఎక్కడ దుర్వినియోగం చేయాలో, చేయకూడదో అని…!!” అని ప్రశాంతంగా సిగిరేట్ ను యాష్ ట్రే కి రుద్ది తన నిస్సహాయతను ప్రకటించాడు. శఠగోపం.

ఇంతలో అక్కడకు సువర్చల వచ్చింది తన ఫైల్ మీద సంతకo కోసం, ఆమెను చూస్తూనే స్వామి గయ్యన విరుచుకు పడ్డాడు, “నేను ఉన్నప్పుడు ఎవర్ని రానివ్వొద్దని ఎన్ని సార్లు చెప్పాలి” అంటూ.

శఠగోపం వంచిన తలెత్తకుండా కూర్చున్నాడు ఆమె ముందు, ఆమె మౌనంగా టేబల్ మీద ఫైల్ పెట్టి వెళ్ళిపోయింది.

దిగంబర స్వామి శఠగోపం కాళ్ళ దగ్గర కూర్చుని “పోనీ లీగల్ గా తప్పించకపోయిన, ఒక ఉపాయం ఉంది నాకు నువ్వు  సహాయం చేయగలవా”.. అని అర్ధించాడు.

“ఏమిటది, ఇప్పుడు ఎలెక్షన్స్ వస్తున్నాయి, తెలీకుండా ఏ వాగ్దానాలు చేయలేను.”

“చాలా చిన్న పనే, ఆ కశ్యప్ కు ఒక మాజీ ప్రియురాలు, ఒక తల్లి ఉన్నారు, వారిని అడ్డు పెట్టుకొని నేను బయట పడాలి, ఒకరినో లేక ముగ్గురినో చంపక తప్పదు. నువ్వు కళ్ళు మూసుకోవాలి.”

“పిచ్చి గాని ఎక్కిందా, ముగ్గురు బాడీలు ఎక్కడ కప్పెడతావ్, ప్రతి పక్షాల వాళ్ళు ఊరుకోరు, దుమ్మెత్తి పోస్తారు”

“అది నాకు వదిలే, నేను చూసుకుంటాను.”

“మాటల్తో పోనీక ఎందుకు ఈ గొడవ అంతా, అసలే మహిళా మండళ్ళ గోల ఎక్కువగా ఉంది, బయట.”

“చూద్దాం, సాధ్యమైనత వరకు, కానీ వాడు శృతి మించితే, ఆ పై వాడి లీలను నేను ఎలా ఆపగలను” అని చిరు నవ్వు నవ్వాడు కాస్త భరోసా దొరికేసరికి.

అతడు వెళ్ళిపోగానే రెకార్డ్ చేసిన ఫోన్ వీడియోను భద్ర పరచమని తన అనుచరులకు సైగ చేశాడు శఠగోపం.

*************************************************************************************

“బోసు వాడికేమన్నా మెదడు మోకాల్లో ఉందా? వాడిని చట్టానికి అప్పగిస్తానన్న దానితో ఇంకా కలల సౌధం కట్టుకుంటున్నాడు.”

“మంచి కి చెడు కు తేడా తెలిసిన వాడు కాబట్టి, మంచిని చెడుగా చూపించలేడు, ఋణం మర్చిపోలేదు.”

“అంటే నువ్వు కూడా కశ్యప్ నే సమ్ర్ధిస్తున్నావా? మీ అందరికీ పిచ్చి పట్ట లేదు కదా?”

“అసలు నీ ఆరాటం ఏంటి అతడి విషయంలో, కొంప తీసీ ‘సు’ ని సైడ్ చేసి నువ్వు ఎంట్రీ ఇద్దామనా”?

“ఎవరు నేనా? ఆ తల తిక్కోడినా, నాకు జీవితం మీద చాలా పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి, ఇప్పుడే ఒక మూర్ఖుడిని వదిలించుకొని మళ్ళా ఇంకో  మూర్ఖుడినా తగులుకొనేది? అది పెళ్ళి అయిన పిల్ల, డబ్బు కోసం ఒక ప్లే బాయ్ దగ్గర పని చేస్తోంది. నాకు వీళ్ళ గోల విచిత్రంగా ఉన్నది, దాన్ని ఎలా నమ్ముతాడు, ఒక కులట అవ్వకుండా ఉంటుందా, ఇన్ని రోజులలో”

“కశ్యప్ కూడా ఒక చీకటి సామ్రాజ్యానికి అధిపతి, చేసేది మంచి పనే అయినా, న్యాయ స్థానం ముందు ఒక దోషి, మరి నువ్వు ఇక్కడ నెల రోజుల నించి ఉంటున్నావు, నువ్వు చెడిపోయావా”? సూటిగా అడిగాడు బోసు.

“కశ్యప్ ఆమెను వెనకేసుకొస్తే దాని కారణం పాత ప్రేమ, మరి నువ్వు ఎందుకు అంతగా సమర్దిస్తున్నావ్, ఒక వేళ నీ భార్యకే  శఠగోపం వద్ద జాబ్ వస్తే ఒప్పుకుంటావా, నువ్వు వద్దన్నా చేస్తే అనుమానించవా ఆవిడను?”

“అనుమానిస్తాను, శఠగోపం వైపు నించి అలోచిస్తే, కానీ నా భార్య వైపు నించి ఆలోచిస్తే అది దేవత, తులసి చెట్టు ఎక్కడున్నా తులసి చేట్టే కదా, అలాగే సువర్చల గారు కూడా అంతే, మళ్ళీ నాకెలా తెల్సు అనకు, కశ్యప్ కళ్ళల్లో ప్రేమ చెప్పింది ఆవిడ నడవడిక గూర్చి” అని వెనక్కి తిరిగి చూడకుండా బోసు వెళ్ళిపోయాడు.

**********************************************************************************

రాత్రి 12.00

మిధిలకు నిద్ర పట్టటం లేదు,  బోసు మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి, “ఎందుకని, అంత నమ్మకం ఆవిడ మీద ? ఆమె ఒక కోపిస్టీ, మాటల తూటలతో అందరినీ గాయ పరుస్తుంది. కశ్యప్ కళ్ళల్లో ప్రేమ చెప్పిందా ఆమె నడవడిక గూర్చి!!!, ఆ నిరక్షర కుక్షికి కనబడింది, నాకు కనబడలేదా?”

ఇలా ఎన్నో ప్రశ్నల తాకిడి ఆమె మస్తిష్కాన్ని జలగల్లా పట్టి వేధించాయి ఆ నిసి రాతిరిలో….ఒక్క ఉదుటన  దుప్పటి పక్కకి నెట్టి కశ్యప్ గది కేసి వెళ్లింది, అతడు ఆదమరచి నిదరోతున్నాడు. ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా, కేవలం జీన్స్ ఫాంట్ వేసుకొని, ఒక పక్కకి తిరిగి పడుకున్నాడు.ముఖం మీద చిరు చెమట కనబడుతుండటంతో మరో పక్కకి అతడిని కదిపే ప్రయత్నం చేసింది,  అతడి విశాలమైన ఛాతీ మీద ‘సు’ అనే అక్షరం చూసి,  పక్కనే ఉన్న బీర్ సీసా తీసి తన హద్దులు దాటి అతడి ఛాతీ మీద ఒంపేసింది కోపంగా. అతడు కాస్త పక్కకి జరిగి “ఏంటి ‘సు’ చిన్న పిల్ల లా” అంటూ నిద్ర మత్తులోనే మరో వైపు తిరిగి పడుకున్నాడు.

సీసా నేలకేశి కొట్టి లాన్ లో కూర్చున్నది మిధిల.మరలా రోషంతో అతడి గదిలోకీ వెళ్ళింది, చంద్రుని కాంతి అతడి చెక్కిళ్ళ మీద పడుతుంటే నీలపు రేఖల వర్ణానికి, మేరేసే హిమగిరులే గుర్తుకొచ్చాయి ఆమెకు, నిద్రావస్థలో ఉన్న అతడి పెదవులు మధ్య మధ్యలో చిరు నవ్వులు చిందిస్తూ అర్ధ చంద్రాకారాన్ని సూచిస్తున్నాయి.మరో సారి ‘సు’ అనే అక్షరాలు చూద్దామని అతడిని మృదువుగా నెట్టింది, అతడు ఆమె చేయి పట్టుకొని ‘సు’ ఎప్పుడొచ్చావ్ అంటూ ఆమె మీదకు వాలాడు.అతడి వెచ్చటి శ్వాస ఆమెకు మత్తెక్కించటానికి ఎక్కువ సమయం పట్టలేదు. కనులు మూసుకొన్నది, అతడు స్పృహలోకి వచ్చి ఒక్క సారిగా వదిలేశాడు ఆమె చేతిని.

“క్షమించండి మీరు ఇక్కడ, ఈ సమయంలో” అంటూ సందేహంగా చూశాడు, పక్కనున్న బీర్ సీసా కొంచెంగా వివరించాయి.

ఆమె ఉబికి వస్తున్న కన్నీటి తో అతడి గది నించి పరుగులు తీసింది.

*******************************************************************************

మరు నాడు ఉదయo మిధిల తను చేసిన పనికి గిల్టీ ఫీల్ అవుతూ తన గది దాటి బయటకు రాలేదు. కశ్యప్ వెళ్ళిపోయాడని తెలుసుకున్నాక అతడి గదిలో “క్షమించండి” అంటూ నోట్ పెట్టింది. మరలా చిన్న పని ఉండి తిరిగి వచ్చిన కశ్యప్ ఆ నోట్ ను చూసి “ఇక్కడ ఒక అమ్మాయికి తెలివి ఎక్కువ అయి, మెదడు వాపు వ్యాధితో బాధ పడుతోందని అందరికీ తెల్సు, కావున క్షమించడమైనది”  అని వ్రాసి వెళ్ళిపోయాడు.

అది చూసిన బోసు అసలేం జరుగుతోందో తెలీక బుర్ర బద్దలు కొట్టుకున్నాడు.

***********************************************************************************

రింగులు  రింగులుగా సిగిరేట్ పొగను వదులుతున్నాడు, గాల్లోకి శఠగోపo, మధ్య మధ్యలో భార్యా  సమేతంగా తన ఆఫీసుకొచ్చిన, తన స్నేహితుని భార్యను ఇంద్రుడి వెయ్యికళ్ళను అప్పు తెచ్చుకొని చూస్తున్నాడు.ఆవిడ తన భార్యకు చెల్లెలి వరుస కూడా అవుతుంది, 48 నించి 50 మధ్య వయస్కురాలు, మనవారలిని చూపించటానికి వచ్చింది దూరపు చుట్టం కనుక.అతడిని గమనించిన సువర్చలకు నవ్వు ఆగలేదు. ఆమెను చూసిన వెంటనే అతడు ఉలిక్కిపడి “నువ్వింకా వెళ్ళిపోలేదా, ఆఫీస్ టైమ్ ఎప్పుడో అయిపోయింది కదా!” ఆంటూ వాచీ చూసుకున్నాడు.

ఆమె ముసి ముసి నవ్వులు నవ్వుతూ, “రేపు మీటింగ్ వాయిదా వేసుకోమని చీఫ్ సెక్యూరిటి ఆఫీసర్ మీకు చెప్ప మన్నారు, అందుకే వెనక్కి వచ్చా” అన్నది.

“ఎందుకట”?

“నక్సల్స్ ప్రాంతం కనుక సెక్యూరిటీ ఇప్పట్లో ఇవ్వటం  కష్టం అంటున్నారు”

“మనకు నక్సల్స్ సమస్య కొత్తది కాదుగా! ఇవాళేంటి వింతగా మాట్లాడుతున్నారు”

“అదొక్కటే కాదు కారణం, మన అప్పోసిషన్ లీడర్ మురహరి కూడా  రేపే మీటింగ్ పెట్టుకున్నారు కదా, అదే ప్రాంతంలో, సొ ఒక్క సారె ఇద్దరికీ ఇవ్వటం కష్టం అంటున్నారు.”

“ఓహ్  అదా, అలా చెప్పమను, ఇప్పుడు ఎలెక్షన్స్ కదా,  ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో అని రెండు పడవల్లో కాళ్ళు పెడుతున్నారు వాళ్ళు” అని పళ్ళు నూరి, అది సరే ఇప్పుడు నువ్వు చూసింది ఎవరికి తెలీకూడదు.”

“మీరు చేసేది తప్పు అని మీ మనసుకు తెల్సి కూడా మానుకోరు, ఇంక పక్క వారికి తెలిస్తే మాత్రం మీకేంటి”

“బాగా  అడిగావు,  కానీ పుట్టుకతో వచ్చిన బుద్ది, ఎన్నో సార్లు మానుకుందామని అనుకుంటా, కానీ ఏదో తెలీని శక్తి అటే లాగుతోంది.”

“బలహీనతులున్నాయని ఒప్పుకుంటున్నా, అది బలం కాదు,  మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేనపుడు అది మానసిక దౌర్బల్యమే అవుతుంది.”

“గట్టిగా అరవకు తల్లి,  వాడు నా చిన్న నాటి స్నేహితుడే కాదు, నా రాజకీయ జీవితానికి ఒక మంత్రి లాంటి వాడు, రాజకీయ దురంధరుడు. వెధవ ఆ పిల్లని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఒక్క రోజు దాని మొహం చూడడు, ఎప్పుడు సంపాదనా యావే.”

అతడు అంత ఓపెన్ గా మాట్లాడటం ఆమెకు ఇబ్బందిగా అనిపించి, ఒక్క ఉదుటున లేచి “మీటింగ్ వాయిదా గూర్చి పర్సనల్ గా చెప్పమన్నారు, అందుకే రావాల్సొచ్చింది, ఇక నేను వెళతాను”  అన్నది.

 

అతడికి గిల్టీ ఫీలింగ్ కలిగి “నాకు కొంచెం నోటి దూల అని నిన్ను ఉద్యోగంలో చేర్చుకొనే  ముందే చెప్పాను,”  అన్నాడు.

“గుర్తుంది,  లేకపోతే ఈ పాటికి ఆవిడకు విషయం తెల్సి, మీ రెండు చెంపలు కమిలి 10 నిమిషాలు అయి ఉండేవి” అని వెళ్ళిపోయింది.

***********************************************************************************

“రేయ్ ఆ దిగంబర స్వామి, ఓ పిల్ల ఫోటోలు పంపుతాడు, నే చెప్పాను కదా ఆ పని చేయండి.” అన్నాడు శఠగోపం తన లాన్ లో మొక్కలకి నీళ్ళు పోస్తూ..

“చాలా కష్టం, పైగా పాపం సార్” అన్నాడు అతడి అనుచరుడు చేతులు కట్టుకొని, అతడి ముందు.

“మన పని ఆ పిల్లని తీసుకెళ్ళి గోడౌన్ లో పడేయటమే, మిగితాది స్వామే చూసుకుంటాడు”

“ఆ అమ్మాయి మన సువర్చల మాడమ్ సార్”

హతాశుడయ్యాడు అతడు, నువ్వెళ్ళు నేను చూసుకుంటాను అని అతడిని పంపేసి, హడావిడిగా ఫోన్ తీసి, స్వామికి కాల్ చేసి, నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూశావా .”అని అడిగాడు.

“చూడలేదు, నాకంత టైమ్ లేదు, అయిన అన్నీ నేనే చూసుకుంటే ఇంక  నువ్వు ఎందుకు” అని ఫోన్ కట్ చేశాడు.

“అతడికి నెత్తిన పాలు పోసినట్లు అనిపించి, నా చేతులతో నేనే సువర్చలను వీడికి బలి ఇవ్వాల?” ఎలా ఆ పిల్లను రక్షించాలి” అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు.

**********************************************************************************

“సర్, సువర్చల మాడమ్ ని, మీ అమ్మ గారిని కిడ్నాప్ చేయాలని పధకం వేశాడట స్వామి”

“కానీ అమ్మ సువర్చలకు నేను సహాయపడాలన్న వాళ్ళు నా మాట వినరు, నేనంటేనే మండి పడుతున్నారు.” అని నిట్టూర్చాడు కశ్యప్.

***********************************************************************************

శఠగోపం సువర్చలను పిలిచి “నీకు నా సెక్రెటరీ గా సమస్యలు రావోచ్చు, కొన్ని రోజులు నీ కుటుంబం తో సహ నా బంగళా లో ఉండే ఏర్పాటు చేస్తాను, మీ వాళ్ళతో మాట్లాడి చెప్పు,” అన్నాడు.

ఆమె, అతడిని  గుడ్లు ఉరుముతూ చూసి “ఇంత కంటే ఉద్యోగం రాజీనామా చేసే ఆలోచన బాగుంటుందేమో ఆలోచించండి” అన్నది.

“నా లాంటి వాడు రామా అన్నా తప్పుగానే వినబడుతుంది, తప్పు నీది కాదులే, నేనే నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను, వెళ్ళు ” అన్నాడు.

*************************************************************************************

సువర్చల, కశ్యప్ తల్లి సూపర్ మార్కెట్ కు  వెళుతున్నారని తెల్సి, స్వామి మనుషులు మాటేశారు.వారిద్దరు విషయం తెలీక చాలా స్వేచ్ఛగా షాపింగ్ చేస్తున్నారు.  ఇద్దరు చేరో వైపు షాపింగ్ చేస్తుండటంతో వారికి కిడ్నాప్ చేయటానికి అనువుగా లేదు. ఎదురు చూసి చూసి చివరికి వారు బయటకు రాగానే బంధించటానికి అతి సమీపంలో మాటు వేశారు, ఇద్దరు బలమైన మనుషులు. సువర్చలను ఒక పక్క, అతడి తల్లిని ఒక పక్క బలవంతంగా వాన్ లోకి ఎక్కించారు మరో ముగ్గురు.

వెంటనే స్వామికి ఫోన్ చేసి” స్వామి మన కన్నా ముందే ఎవరో కిడ్నాప్ చేశారు, మనోళ్ళను తోసేసి”  అన్నాడు అతడి అనుచరుడు.

అతను ఫోన్ కట్ చేసేసి, ఆ పిల్ల ఫోటో చూసి, ఇది శఠగోపం పని అనుకున్నాడు.

20 నిమిషాల్లో శఠగోపo ఆఫీసుకి ఉత్తరం వచ్చింది, “మీ పర్సనల్ సెక్రెటెరి  కిడ్నాప్ అయింది, నీ పదవిని మర్చిపో, ఇట్లు స్వామి,” అంటూ.

అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు అతడు ఉత్తరం చదవగానే, “నీ పాపాల్లో కూడా నేను భాగం పంచుకోవాలా, లేదంటే నా పదవీకే ఎసరు పెడతావా” అంటూ స్వామి కి ఫోన్ చేసి, “నీకు పిచ్చి పట్టిందా, నేను కూడా జైల్లో కూర్చుంటే ఎవడు నిన్ను రక్షించేది” అన్నాడు.

“సువర్చల నీ మనిషి అని తెల్సి, నాకు సహాయం చేయకుండా దాగుడుమూతలు అడుతావా? ఇప్పుడు నువ్వు నాతో పాటు కూర్చో జైల్లో.

“నాకేంటి సంబంధం”

“ముఖ్య మంత్రి గారు స్త్రీ లోలుడని అందరికీ తెల్సు. కాబట్టి నువ్వే దాచవని ఒప్పుకొని, కశ్యప్ని చంపి నాకు కనబడు”

“నువ్వు కిడ్నాప్ చేసి, నా మీద పెడ్తున్నావా, ఆపు నీ నాటకాలు”

ఈ లోగానే ఎదురుగా టి.వి. లో ‘ముఖ్య మంత్రి గారి సెక్రెటెరి కిడ్నాప్’ అంటూ వార్తలు జోరుగా స్క్రోల్ అవుతున్నాయ్

“స్వామి అవతలి వైపు నించి నవ్వి, ప్రతిపక్షాలు నీ పీక ముందు నొక్కి తర్వాత టైం ఉంటే నా పీక నొక్కుతారు, జాగ్రత్త” అని ఫోన్ పెట్టేశాడు.

శఠగోపం “ఎక్కడున్నా సువర్చలను నా ముందు నిలబెట్టాలి” అంటూ ఆదేశాలు జారీ చేశాడు.

ఒక పక్క మంచి మనిషికి ఏమవుతుందో అని, మరో పక్క తన పదవికి ఎసరు వచ్చిందనే బాధతో ఆయన కూలబడిపోయాడు.

అతడి అనుచరుడు నిదానంగా ఇంతకుముందు సువర్చలను కిడ్నాప్ చేయమని స్వామి కాళ్ళ మీద పడిన దృశ్యం  రెకార్డ్ చేసిన వీడియోను చూపాడు, “మర్చిపోవద్దు” అంటూ.

శఠగోపం అతడిని చూసి,  “శభాష్, మనకి భయం లేదు కాకపోతే, సువర్చల ని కూడా సురక్షితంగా తీసుకు రాగలిగితే” అని తెప్పరిల్లాడు.

 

*************************************************************************************

సువర్చల, కశ్యప్ తల్లికి కాళ్ళు చేతులు కుర్చీకి కట్టివేయబడి ఉండగా వాళ్ళు ఎందుకు బంధించబడ్డారో కూడా తెలీక కట్లు విప్పమని గిల గిల కొట్టుకుంటున్నారు.

మిధిల, కశ్యప్ వారి పరిస్దితి చూసి “దయ  చేసి కొంచెం ఓపిక పట్టండి, అంతా నిదానంగా చెప్తామ్” అని బుజ్జగిస్తున్నారు.”

“మీరు మనుషులేనా, మమ్మల్ని కోడినో, కుక్కనో లాక్కొచ్చినట్లు లాక్కొస్తారా? ఎవరు అసలు మీరు ?”అంటూ మరలా మొదటికొచ్చారు.

వారికి ఎదురుగా, కశ్యప్ వచ్చి నిల్చున్నాడు మౌనంగా. అతడి తల్లి నిశ్చేస్టురాలై పోయింది, పన్నెండు సంవత్సరాల తర్వాత మొదటి సారిగా చూస్తోంది కన్న కొడుకును. ఇంతకు ముందు మిధిల ద్వారా, ఆమెను కలిశాడనే తెల్సు కానీ, అతడి వృత్తి ఏంటో తెలియలేదు ఆవిడకు.

అతడు కన్నీటితో ఆవిడ కాళ్ళ మీద పడి, ” ప్రపంచంలో ఏ కొడుకుకి తన తల్లిని బంధించి, క్షమించు అని అడిగే పరిస్దితి రాకూడదు, నాకొచ్చినట్లు” అన్నాడు.

“అత్త!, వాడి మొసలి కన్నీటికి కరిగిపోకూ, తప్పు చేయటం, తర్వాత మనన్నే సర్దుకుపోవమనటం వాడికి బాగా అలవాటు, మనుషులంటే లోకువ, మమతా ప్రేమ అంటే అవహేళన, నా మాటే వినక ఏం చేస్తారు అనే అహంభావం” అంటూ పెనుతుఫానులా మారింది సువర్చల.

“అమ్మా చెల్లెల్ని దారుణంగా చంపితే, చూస్తూ ఊరుకొనే చేతగాని వాడిని కనలేదు నువ్వు” అంటూ కట్టలు తెగిన కన్నీటితో నేరస్థుడిలా తల దించుకు నిల్చున్నాడు అతడు.

“చాల్లే ఆపరా, నువ్వు చెల్లెల్ని పోగొట్టుకుంటే నేను కూతుర్ని పోగొట్టుకున్నాను, అందుకని మనన్నే నమ్మిన వారిని రోడ్డున పడేస్తావా?, నీ పగ కోసం వారు నమ్మి నీ పేరున పెట్టిన ఆస్తులను దుర్వినియోగం చేస్తావా?, నీకు తల్లి మీద ప్రేమ ఉందిగా, మరి సువర్చల తల్లి నీ మూలంగా చనిపోయింది, తండ్రి బతికున్న శవం, మరి నీ మీద కూడా వాళ్ళకి పగ ఉంటుంది కదా?”

“అందుకు అతడు రోజు బాధ పడుతూనే ఉన్నాడు” అన్నది మిధిల కలగచేసుకొని.

“అమ్మాయ్, నువ్వున్డు, ఇది మా కుటుంబ విషయం, నిన్న కాక మొన్న వచ్చి, ఏం తెల్సని మాట్లాడుతున్నావ్” అని కసిరింది ఆవిడ.

బోసు కల్పించుకొని, స్వామీజీ వీరిని హత్య చేయటానికి ప్రయత్నిస్తున్న విషయం” చెప్పాడు వివరంగా

సువర్చల అతడిని చుర చుర చూస్తూ, ” నీ పాపాల వాట మాకు కూడా పంచుతున్నావన్న మాట” అంటూ వెళ్ళిపోయింది.

సువర్చల కోపo చూసి తల్లడిల్లిన కశ్యప్ తల్లి ఆమెనే అనుసరిస్తూ వెళ్ళిపోయింది. కశ్యప్ బోసుని పిలిచి, ” అమ్మకి, ‘సు ‘ కి ఏ లోటు రాకుండా చూసుకో” అని వెళ్ళిపోయాడు అక్కడ నుండి.

***************************************************************************

కశ్యప్ జీవితంలో మళ్ళీ జీవం వచ్చింది, అమ్మ, ‘సు’ తిట్టినా కూడా ‘నా’ అనే వాళ్ళ దగ్గర ఉండటం అతడికి ఆత్మ తృప్తిని ఇస్తోంది. వారి కోపంలో అర్థం ఉంది, ఎలాగో వారికి సర్ది చెప్పుకోవాలి అనుకుంటూ వారి గదికి వెళ్ళాడు.

అతడు వెళ్ళే సరికి వారు ఇరువురు ఎవరికో ఫోన్లో సూచనలు ఇస్తున్నారు. ” మందులు  సరి అయిన సమయానికి వేస్తున్నారా? అస్తమాను గది లోనే కూర్చోబెట్టక  అలా చల్లా గాలిలో తిప్పన్డి, రెండు పూటలా బట్టలు మార్చకపోతే అతనికి నచ్చదు, ఉంటాము” అంటూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి ఫోన్ ముగించారు.

వారి సంభాషణ బట్టి కశ్యప్ కి అర్థం అయింది అది సువర్చల భర్త గూర్చి అని, ఆమె కేసి చూస్తూ ” ఎలా ఉన్నది ‘సు’, మందులు పని చేస్తున్నాయా, మెరుగు పడిందా, ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరం” అని అడిగాడు, గుండెల్లో గుచ్చుకుంటున్నా కూడా.

“ఇపుడు ఆమె పరాయి వాడి భార్య, నువ్వు ‘సు’ అనటం కన్నా, సువర్చల అని పిలిస్తే నా పెంపకానికి  మరియాద ఇచ్చినట్లు ” అన్నది అతడి తల్లి వారిద్దరి మధ్య సరిహద్దులు గీస్తూ.

“విన్నావుగా” అన్నట్లు చూసింది సువర్చల

“అమ్మ, సువర్చల గారు, దయ చేసి అర్థం చేసుకోండీ, నేను మీ శత్రువుని కాను”

“అవును, నీకు మా శత్రువు అనే పెద్ద పదవి మేము ఇవ్వలేము, నువ్వు మాకు పరాయి వాడివి, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఎంత తొందరగా మమ్మల్ని పంపితే అంత ఋణ పడి ఉంటాము” అన్నది ఆవిడ.

“అమ్మ నేను నీ అసలు కొడుకిని ”

“నీతో వాదించే తీరిక నాకు లేదు, నా కొడుకు సువర్చల భర్త.పగ కోసం మేలు కోరిన కుటుంబాన్ని రాచి రంపాన పెట్టే వాడు నా కొడుకు కాదు”  అని ధ్యానంలో మునిగిపోయింది ఆవిడ కళ్ళు మూసుకొని, అతడు ఎదురుగా నిల్చున్నా  కూడా.

‘సువర్చల గారు, మీరైన మా అమ్మకి చెప్పండి” అన్నాడు ఆమెకేసి తిరిగి.

“అసలు నిప్పుల్లో తోసిందే నువ్వు, రక్షిస్తున్నట్లు నాటకాలు” అన్నది ఆమె.

అతడు మౌనంగా కదిలాడు అక్కడ నించి. చాటుగా ఇదంతా చూసిన బోసుకి , శత్రువు గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే కశ్యప్, తన తల్లి ముందు ఇంత బేలగా నిల్చుండటం చూసి, హృదయం ద్రవించిపోయింది.

******************************************************************************

సువర్చల ప్రవర్తన చూసిన బోసుకి  ఇక ఆమె కశ్యప్ ని క్షమించదు అని అర్థం చేసుకొని, కశ్యప్ ను అతడి  తల్లిని దగ్గర చేయాలని నిశ్చయించుకున్నాడు, ఆమె లేని సమయంలో కశ్యప్ గూర్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ ఆవిడ సువర్చల తండ్రి తమ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నాడో తెలిపి, కశ్యప్ ను సమర్దించి  వారికి ద్రోహం చేయలేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది.

మిధిలకు మాత్రం సువర్చలను 24 గంటలు అనుసరిస్తూ పరీక్షిoచడమే సరిపోతోంది. ఆమెను చూసిన బోసుకి, అరికాలి మంట నెత్తికెక్కింది, ” మనకి ఇంత సహాయం చేశాడు, కాస్త ఆ తల్లి కొడుకులను కలిపితే నీ సోమ్మేo పోతుంది” అంటూ ఆమె మీద తన అసహనాన్ని కసిగా వ్యక్తపరిచాడు.

“ఆ రోజు ఏమన్నారు, ‘సు’ మహా సాథ్వీ, స్త్రీత్వం ఉట్టిపడే నారీ మణి, అని. మరి క్షమించటానికి మనసే లేనిది స్త్రీ అవుతుందా?.ఒకటి చెప్తా విను, కశ్యప్ కు తల్లి మీద ప్రేమ లేదు, ఉంటే కూతుర్ని పోగొట్టుకొన్న సమయంలో తన తల్లికి అండగా వుండాలి, ఆవిడకు కొడుకు మీద ప్రేమ లేదు, ఉంటే పన్నేండళ్ళ తర్వాత కనిపిస్తే ఆ తల్లి పలకరించాలి, అక్కున చేర్చుకోలేదు, ఆవిడదీ ఇంకో రకమైన పగ, ఇక పోతే సువర్చల కి కృతజ్ఞ్యత లేదు, తన ప్రేమికుడు మోసం చేస్తే తిరిగి మామూలు మనిషిని చేశాడన్న కృతజ్ఞ్యత లేకుండా కశ్యప్ మీద పగ పెట్టుకున్నది. వారికి నచ్చ చెప్పే అంత పరిపక్వత నాకు లేదు. ” అని విసురుగా గదిలోంచి వెళ్ళిపోయింది.

**********************************************************************************

శఠగోపానికి సువర్చల జాడ తెలీక నానా తంటాలు పడుతున్నాడు, నిజంగా స్వామే కిడ్నాప్ చేయించి తెలీనట్లు నటిస్తున్నాడు అని ప్రగాఢ నమ్మకం అతడికి. కశ్యప్ ను వెతికి సువర్చల గూర్చి ఆరా తీశాడు, కానీ అతడు సువర్చలను తాను కూడా వెతికిస్తున్నట్లు చెప్పి తప్పించుకున్నాడు తప్ప నిజం చెప్పలేదు.

విపక్షాల నుండి విపరీతమయన దాడి ఎదురైనది అతడికి. తన అవసరాలకి ఉపయోగపడలేదని ఆమెని దాచి హింస పెడుతున్నాడని పుకారు పుట్టించాడు స్వామి తన మీద నింద పడకుండా, పైగా కశ్యప్ ఆమె మాజీ ప్రియుడు అని తెల్సి అతడిని కూడా చంపే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ చిలవలు పలవలుగా చెప్పుగోసాగారు నెటిజన్లు.

***********************************************************************************

“మిధిల చీర కట్టుకొని వచ్చి మా ఇద్దరిలో ఎవరు బాగున్నారు” అని దూరం నించి సువర్చలను చూపించింది. మిధిలను చూసిన కశ్యప్ కు మతి పోయినంత పని అయింది, పాల సంద్రానికి చీర కట్టిందా, లేక మంచు తునకలను నడుముగా మలచుకున్నదా అన్నట్లు ఉంది. గొంతులో గుటక కిందకి పడట్లేదు, పడిందంటే ఈ పిల్లకి తను ఫ్లాట్ అయిపోయినట్లు అర్థం అవుతుందని చాలా గంభీరంగా మొహం పెట్టుకొనే ప్రయత్నం చేశాడు. జారుగా వదిలిన ఆమె నల్లని కురులను చూస్తుంటే నల్లని మేఘాలను ఇంత దగ్గరగా ఎపుడు చూడలేదేనే భావన కలిగింది. ఆమె చీర ప్రతి అంచు ఒక అందమైన ఖనిజాన్ని నిక్షిప్త పరిచాను అన్నట్లు గర్వంగా ధగ ధగ మెరిసిపోతోంది.

‘సు’ ఎక్కడ..? అన్నాడు సమాధానం చెప్పకుండా.

“ఫ్లాట్ అయీపోయావ్ కదా, నాకు తెల్సు, ఇంకెందుకు బెట్టు అన్నది” ముద్దుగా దగ్గరికి వస్తూ…

అతను ఒక్క ఉదుటున లేచి కుర్చీలోంచి, ” స్వామి అరెస్టుకీ అన్నీ సిద్దమయినాయి, ఇంక నువ్వు బోసు 3 రోజులలో భారత్ లో ఉంటారు” అని వెళ్ళిపోబోయాడు.

ఆమె అతడి చేయి పట్టుకొని “నిన్ను నువ్వు మోసం చేసుకోకు” అన్నది.

సరిగ్గా అదే సమయానికి ‘సు’ అక్కడికి వచ్చి వారిని చూసి రాకూడని సమయoలో వచ్చినట్లు అనిపించి ,ఇబ్బంది పడుతూ  ” క్షమించండి, అత్త ఉన్నదేమో అని వచ్చాను” అని వెళ్ళిపోయింది.

పరాయిదానిలాగా ఆమె క్షమించమనటం,  అతడికి హృదయ వేదనను కలిగించింది.

“ముక్కలు అవుతున్న హృదయాన్ని ఎన్ని సార్లు ముక్కలు చేస్తావ్” అన్నట్లు కోపంగా ఆమె వైపు చూశాడు అతడు. మిధిల వెంటనే వెళ్ళిపోతున్న ‘సు’ ని చూపుతూ ఎలా ఉన్నది నీ మాజీ ప్రియురాలు , కాలకూట విషానికి చీర కట్టినట్లు లేదు…?”  అన్నది గర్వంగా.

“అవును , నా జ్ఞ్యాపాకలకు రూపం కల్పించి, ప్రాణంపోస్తే, మల్లెపోగులను మాటలుగా బహూకరిస్తే, కొలను తామరాలకులను  చీరగా చుడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది” అన్నాడు.

“అందుకే నిన్ను తామరాకు  మీద నీటి బొట్టులా జారవిడిచేసింది” అన్నది.

అకస్మాత్తుగా ‘సు’ వెనక్కి వచ్చి “తను బురదలో ఉన్నానని తెల్సి  తామర పూలు బురదలోనే ఎందుకు జీవిస్తాయో మాత్రం ఏ ఆరు గజాల చీరలకు, జీన్సు ప్యాంటులకు, స్కర్టులకు అర్థం కాదు” అని వెళ్ళిపోయింది.

అతడు ఆమె మాటలు పట్టించుకోకుండా ‘సు’ వెళుతున్న వైపే చూస్తున్నాడు, బోసు వీరందరిని దగ్గరుండి కశ్యప్ తల్లికి చూపాడు.

ఆమెకు నోట మాట రాలేదు కశ్యప్ ప్రస్తుత పరిస్దితి చూసి.

***********************************************************************************

రాత్రి 10.00

కశ్యప్ నిద్ర రాక పచార్లు చేస్తున్నాడు తన గదిలో, అతడి తల్లి భారమైన మనస్సుతో అతడిని పిలిచింది, “నాన్న! కాశ్యపా! ఇంకా నిద్ర పోలేదా” అంటూ …

ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు అతడు, గోదారి గట్టు తెగినట్లు రోదించ సాగింది ఆవిడ. అతడు మౌనంగా కన్నీరు కారుస్తూ అడుగు ముందుకి వేయలేని స్థబ్దుడై ఆవిడనే ఆర్ద్రతతో చూస్తుండిపోయాడు.

“నాకు తప్పదు కాశ్యపా, నా పోయిన కూతుర్ని సువర్చలలో చూసుకుంటున్నాను, ఆ కుటుంబానికి మనమెంతో ఋణపడి ఉన్నాము.”

అతడు తల్లిని గట్టిగా కావలించుకొని ” నాకు తెలుసమ్మా, నువ్వు చేస్తున్నది అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాను, నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదు” అన్నాడు పసి పిల్లాడిలా విలపిస్తూ…

ఆ క్షణం  యశోద కృష్ణులని అతి దగ్గర నించి చూసిన భావన కలిగింది బోసుకి.

” పసితనంలో ఏదో చేశావు, ఇకనైనా వెళ్ళిపోదాం రా, తండ్రి” అంటూ బుజ్జగించింది ఆవిడ.

“అమ్మ, పన్నెండు ఏళ్ళుగా కష్ట పడ్డది, ఇలా మధ్యలో వదలటానికి కాదు, ఆ స్వామి ని పట్టివ్వగానే నేనే లొంగిపోతాను”

“నా గురించి ఒక్క సారి ఆలోచించు, ఉన్న ఇద్దరు పిల్లలు పచ్చగా ఉండటం ఈ కళ్ళతో చూసుకోలేను కదా, చెల్లిని  ఎవరో చంపితే, వాళ్ళ కోసం నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం నేనెలా చూసేది”

“తప్పదమ్మా, అందరూ అలా అనుకోబట్టే వాడు కనబడ్డ ప్రతి అమ్మాయిని వాడుకుంటున్నాడు, నాకేం పోయిందిలే అనుకుంటే నేను మనిషిని కానీ, ఒక అన్నని కాను”

“దానికి ఒక చట్టo ఉంది కాశ్యపా”

“ఏది, ఎక్కడ ఉన్నది? చూపించు”

ఆవిడ మౌనంగా నిల్చున్నది.

“స్త్రీని ఒక విలాస వస్తువుగా చూస్తు, హింసించే వాళ్ళకి చట్టం తో సమాధానం సరిపోదు, దాన్ని ఎలా హింస పెట్టారు, అణువణువు వీడియోలు తీస్తూ, ఆడదనే జాలి కూడా లేకుండా మదించి తెగ బడ్డారు నా చెల్లెలి మీద. పిల్లా పాపలతో చల్లగా ఉండాల్సిన పిల్లని, నగ్నంగా క్యామరాల ముందు నిల్చోబెట్టి వికటాట్టహాసాలు చేశారు, నా గతి ఏ అన్నకి పట్టనివ్వను. ఒక సిగరెట్టుని నలిపినట్టు నా చెల్లెలి జీవితం నలిపేస్తే ఎవరికి చెప్పుకోలేక బలవంతంగా చచ్చిపోయింది, నాకు కూడా మొహం చూబించుకోలేక. ఇప్పుడు చెప్పు, చట్టాలు ఉన్నాయా? ఉంటే నేను వెళ్ళి .”అయ్యా నాకు న్యాయం చేయండి అని బతిమిలాడాల?” తన ధర్మం మరిచింది అమ్మ ధర్మం, అందుకే నేను తీసుకున్న చట్టానికున్న చెదలు దులుపే భాద్యతను.”

“నీ గుండెల్లో ఇంత అగ్ని జ్వాలలు రగులుతున్నాయని నిజంగా అనుకోలేదురా, నేను కూడా కాలం ఒరవడిలో మరచిపోయాను” అంటూ ఆలోచనలో పడింది ఆవిడ.

“సహజమే అమ్మ, మనిషి ఉన్నంత కాలమే ప్రేమ, చనిపోగానే కట్టే కాలిపోతుంది, వారి వేదన కూడా బూడిదలో కలిసి గాలిలో ధూళిగా ఎగిరిపోతుంది” అన్నాడు కణ కణ మండే ఎర్రటి కన్నులతో…..

********************************************************************************

తెల్లారి 10 అవుతున్న కశ్యప్ నిద్ర లేచినా గాడి దాటి బయటకు రాకపోవటంతో మిధిల కంగారుగా తలుపు కొట్టింది.  అతడు నిద్ర కళ్ళతో తలుపు తీసి ” అర్ద రాత్రి అపరాత్రి అని లేకుండా ఎంట బాదుడు అంటూ” కసురుకున్నాడు.

వెనకాలే వచ్చిన సువర్చల బారెడు పొద్దెక్కినా  లేవకుండా, పైగా ఆడపిల్లని కసురుకుంటావా, సంస్కారం కూడా విడిచేశారన్న మాట” అంటూ పళ్ళు నూరింది.

“నేనమనుకోలేదులే, కాస్త డోసు ఎక్కువైతే ఇంతే, అయిన నువ్వేళ్ళు నే చూసుకుంటా” అన్నది మిధిల.

“పోనీ ఇంకో రెండు బాటిల్స్ తెచ్చి ఇవ్వు” అన్నది, సువర్చల.

“కశ్యప్ అడగాలే గాని, షాంపైన్ తో నేను రెడీ” అన్నది అతడి చేయి పట్టుకొని…

ఒక్క సారి ఉరిమి చూసింది కశ్యప్ ను సువర్చల, అతడు …కంగారుగా “5 నిమిషాల్లో స్నానం చేసొస్తాను” అని మిదిల చేయి విడిపించుకొని వెళ్ళిపోయాడు.

సువర్చల, స్తిమిత పడుతూ మిధిల దగ్గరకు వచ్చి “నీ వీపు సాపు చేయాలంటే నన్ను పిలు, అదే …నీకు స్నానం చేసేటప్పుడు సహాయం కావాలంటే నన్ను పిలు” అన్నది..

మిధిలకు కస్సున కోపం వచ్చి, “ఎందుకు ఆంటీ నా మీద ఇంత ప్రేమ” అంటూ గుర్తు చేసింది ఆమెకు వివాహం అయిందని.

“ఎందుకా? దేశం కానీ దేశం, తేట లేని నీళ్ళు తీటా పట్టించున్టే, వదిలిద్దమని….. ” అన్నది పళ్ళు నూరుతూ…

తీట తీర్చటానికి, తాడు కట్టటానికి కశ్యప్ శ్రమ తీసుకుంటాడులే, నువ్వు విశ్రాంతి తీసుకో, ఆశ్లే పిచ్చి మొగుడితో అలసిపోయి వచ్చున్టావ్, ఇది నీకు పుట్టిల్లు అనుకో అన్నది” మూతి మూడు వంకరాలు తిప్పుతూ…

ఇది నాకు పుట్టిల్లని ఎవరు చెప్పారు అంటూ సువర్చల గబ గబ అతడి బెద్శీట్స్ సర్దా సాగింది.

మిధీల ఆమెను చూస్తూ ” సర్దు, బాగా అందంగా సర్దు, ఇది మిధిలా నగరం అవ్వబోతోంది కదా” అన్నది సిగ్గు పడుతూ

సువర్చల ఒక్క సారిగా సర్దినవన్నీ కింద పడేసి, బ్రహ్మచారుల గది అందంగా వుంటే ప్రతి నాగుపాము  మంచం మీద కెక్కుతుంది అదిలించే వాళ్ళు లేక” అన్నది కోపంతో రగిలిపోతు.

“ఆంటీలకు మల్లెపూల దండ కూడా నాగు పాము లాగా కనబడితే ఆరోగ్యం బాగా లేదని అర్థం” అన్నది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ.

సువర్చలకు ఉక్రోషం పొడుచుకొచ్చి, ఒక్క సారిగా ఎడ్చింది.  అప్పుడే వాష్ రూమ్ లో నించి బయటకు వచ్చిన కశ్యప్ కంగారూ పడి ” ఏమైంది” అని అడిగాడు.

“చూడు కశ్యప్, తను పిచ్చి మొగుడితో వేగలేక అలసిపోయి వచ్చిఉంటుందని, నీ గది సర్డొద్దని అన్నానని కోపగించుకుంటోంది” అన్నది మిధిల.

” సు” ఇది నీ పుట్టిల్లు అనుకో, శ్రమ తీసుకోకు” అన్నాడు కశ్యప్.

ఆ మాటకు ఆమెకు “ఇది నా పుట్టిల్లా, అంటే పరాయి దాన్న, ఇద్దరిదీ ఒక్క మాట అయిపోయింది” అనుకుంటూ వెళ్ళిపోయింది చాలా కోపంగా…

ఆమె కోపం చూసిన కశ్యప్, “భర్తను పిచ్చి వాడంటే ఎంత ఏడుస్తున్నావ్, పూర్తిగా నన్ను మర్చిపోయావ్” అనుకుంటూ పక్కనున్న పూల కుండిని విసిరి కొట్టి, మిధిల మీద కోపంతో ” ఆమె భర్తను పిచ్చి మొగుడని అనే హక్కు నీకెవ్వరు ఇచ్చారు? నీకు లేదా అన్నీ తెలిసిన పిచ్చి?” అని వెళ్ళిపోయాడు తలుపు బలంగా తోస్తూ…

“బాగుంది  ఇద్దరు మాట్లాడుకోరు కానీ, ఇద్దరిదీ ఒకే మాట” అనుకుంటూ తలుపు ఆమె కూడా బలంగా తోస్తు వెళ్ళిపోయింది.

*********************************************************************************

“బోసు, మిధిలకు  కశ్యప్ అంటే ఇస్టo లా ఉన్నది కదూ ” అడిగింది కశ్యప్ తల్లి.

“అలా అనిపిస్తుంది, కానీ కశ్యప్ కు అలా ఉన్నదని నాకు అనిపించటంలేదు.”

“ఏం ఆ పిల్లకి ఏం తక్కువట, ముందు వీడినే ఇష్ట పడే పిల్ల దొరకటం ముఖ్యం కదా?”

“కావచ్చు, కానీ ..”

“వాడు పగ ప్రతీకారం ఆంటూ వాడి భవిష్యత్తు మర్చిపోయాడు. నువ్వు ఒక సారి అడిగి చూడు నా ముందు”

“సువర్చల గారు..” అని ఆగిపోయాడు.

“సువర్చలకు పెళ్ళి అయిపోయింది కదా, తెల్సో తెలీకో ఆ పిల్లని పోగొట్టుకున్నాడు, ఇక ఆ మాట అప్రస్తుతం” అని హడావిడిగా మిధిల కోసం వెళ్ళిపోయింది ఆవిడ.

“ఒక సమస్య పరిష్కారం అయిందనుకుంటే ఇంకోటి మొదలయింది ఏమిటి” అని బోసు కళ్ళు తేలేశాడు.

అతడి గది బయట నిల్చోని ఉన్న సువర్చల, “నీ వెనక నే వేసిన అడుగుల గురుతులు చెరిగి చాన్నాళ్ళయిందని నాకెందుకు అర్థం కాదు కశ్యప్”  అనుకుంటూ ….చాటుగా…మాటుగా… తన కనురెప్పలకి సైతం ఉబికి  వస్తున్న కన్నీటిని కనబడనివ్వకుండా, జాగ్రత్త పడుతూ…..పెల్లుబికిన ప్రేమను   హృదయాంతరాళ్ళలో ….పూడ్చేస్తూ….. శాశ్వతంగా…వైతొలగింది

**********************************************************************************

సువర్చలను చూసిన ప్రతి సారి, కశ్యప్ జీవితంలో జీవం నింపినట్లుగా ఉన్నది, ఆమె తన ఇంట్లో అలా స్వేచ్చగా తిరగటం, అతడి ఇంటికి కొత్త శోభాలు వచ్చినట్లు అనిపిస్తోంది అతడికి.

అతడి తల్లి సువర్చలను” ‘సు’ కశ్యప్, మిధిల ఒకరినొకరు ఇష్ట పడుతున్నారు, త్వరలో వారి తల్లి తండ్రులతో మాట్లాడాలి, నువ్వేమంటావ్” అని అడిగింది

“మంచిదే కదా! ముందు ఈ చీకటి సామ్రాజ్యాన్ని వదిలి వేయమనండి”

“వాడి మీద నీకు ఇంకా కోపం పోలేదు తల్లి, వాడు చనిపోయిన చెల్లెలి ఆత్మ శాంతి కోసం, బతికుండగానే వాడికి వాడే చితి పెట్టుకున్నాడు”

“అత్త! సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ అర్ధాంతరంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం, అది మాట మాత్రం చెప్పకపోవటం, బతికి ఉన్నాడో లేదో తెలీని అగమ్యగోచరం, నేను మర్చిపోలేదు ఆ దుఖం. ”

“ఒప్పుకుంటానమ్మ, నా కోసం వాడిని క్షమించు, నా కూతురెటు లేదు, నువ్వు ఇలా ఉంటే నా ఒక్కగానొక్క కొడుకు సంతోషంగా వుండలేడు”

“నేనిపుడు ఏం చేయాలి”

“వాడిని మిధిలతో పెళ్ళికి ఒప్పించాలి, ఇదివరకటి లాగా వాడితో స్నేహంగా ఉండాలి.”

అప్పుడే అక్కడకి వచ్చిన బోసు  గతుక్కుమన్నాడు, ఆవిడకు ఎలా చెప్పాలో తెలీక.

**************************************************************************

“కశ్యప్ ఎలా ఉన్నావ్” అంటూ పలకరించింది, సువర్చల.

అనుకోని పలకరింపు సువర్చల నించి రావటం అతడికి కోటి లతా మాలికలు ఒక్క సారి తాకినట్లు అనిపించింది. హృదయపుటంచులను ఎవరో గిలిగింతలు పెట్టినట్లు అనిపించి, సన్నటి కన్నీటి తెర కంటిని కమ్మేస్తే,  గొంతు పలకలేక మూగపోయి, కాలాన్ని ఇలా ఈ క్షణం ఆపేయమని దేవుడిని వేడుకున్నది.

“మాట్లాడ కూడదని ఒట్టు పెట్టుకున్నావా..” అని అతడి కళ్ళల్లోకి తొంగి చూసింది.

ఒక్క సారిగా ఆమెను అల్లుకుపోయాడు, అతడు, ఆ బిగి కౌగిలికి ఒక్క సారి ఆమె అవాక్కు అయిపోయింది. ఒక్క సారిగా అతడిని వెనక్కి తోసేసింది.

వెనక నించి బోసు ఇబ్బందిగా కశ్యప్ ముందు వచ్చి నిల్చున్నాడు. “మీతో ముఖ్యమైన విషయం చెప్పమని సువర్చల గారిని అమ్మ గారు పంపారు” అన్నాడు.

కశ్యప్ అనుమానంగా ఆమె కేసి చూశాడు, “అమ్మ పంపితే వచ్చావా?, అంటే నాతో మాట్లాడాలని అనిపించి రాలేదా?” అన్నట్లు.

బోసు …ఇబ్బంది పడుతూ  గొంతు సవరించుకొని, “చెప్పండమ్మ” అన్నాడు

“అదే… మీరు, మిధిల ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని అమ్మ గారికి తెల్సి, ఇంక ఆలస్యం ఎందుకు అని ఆవిడ అనుకుంటున్నారు”

అతడికి ఆమెను చాచి పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చి తమాయించుకొని, “ఆమెకు ఇష్టమైతే  నాకు ఇష్టమే” అన్నాడు తనని తాను సంభాళించుకొని.

“నాకు ఇష్టమే అంటూ మేడ మీద నించి మిధిల అరిచింది” అతడు ఊహించని విధంగా…

అతడు, బోసు అవాక్కైపోయారు ఆ ఊహించని పరిణామానికి. అతడి తల్లి కూడా వచ్చి “శుభం, అమ్మ సువర్చల! మొత్తానికి మన కశ్యప్ని పెళ్ళి పీటలు ఎక్కిస్తున్నావ్, త్వరలోనే మీ ఆయనకు కూడా నయం అయిపోతే ఇంక మీ ఇద్దర్ని చూసుకుంటూ కాలం గడిపేస్తా” అంటూ అతడి తల్లి పొంగిపోయింది

కశ్యప్ కు  అసలేం జరుగుతుందో అర్థం అయ్యేలోపే సువర్చల పూర్తిగా దూరం అయిపోయిందని అర్థం అయింది. కానీ అతడికి మిధిల మీద ఎలాంటి అభిప్రాయం లేదు. తన తల్లి చేయి పట్టుకొని నడిపిస్తున్న సువర్చలనే చూస్తూ నిల్చున్డి పోయాడు.

.************************************************************************************

శఠగోపం ఎంత ప్రయ్త్నించినా , సువర్చల జాడ దొరకలేదు,  విపక్షాల పోరు ఎక్కువ అవ్వటంతో స్వామి తన కాళ్ళు పట్టుకుంటూ ఉన్న వీడియో ను టెలికాస్ట్ చేశాడు.దానితో దుమారం అటు మళ్ళింది. స్వామిని  అర్రెస్ట్ చేశారు. మిధిల, సువర్చల చేత స్వామి మీద కేసులు పెట్టించాడు కశ్యప్.  ఆడపిల్లలను లైంగిక వేధింపులు గురి చేసినందుకు, పసి పిల్లలను మూఢ నమ్మకాలకు బలి ఇచ్చినందుకు స్వామికి ఉరి శిక్ష పడింది.

కశ్యప్ చీకటి సామ్రాజ్యపు కార్యకలాపాలు కూడా బయట పెట్టక తప్పలేదు ప్రభుత్వం ముందు. సమాంతర ప్రభుత్వం నడిపే ప్రయత్నం, చట్టాన్ని చేతుల్లోకి తీస్కునే ప్రయత్నం ఆరోగ్యకరమయిన సమాజానికి హానిగా పరిగణిస్తూ అతడికి 5 యేళ్ళ శిక్షను కోర్టు ప్రకటించింది.

సువర్చల చొరవ చేసుకొని అతడికి శఠగోపం ద్వారా, అతడి పూచీకత్తు మీద విడుదల చేయించింది.

*************************************************************************************

విడుదల కాగానే వడి వడిగా  కశ్యప్ సువర్చలను వెతుక్కుంటూ ఆమె ఇంటికి చేరాడు. అక్కడ అతడి తల్లి కోసం వెతికాడు, “అమ్మ ఏది ‘సు’? నిన్నే అమ్మ ఎక్కడ అని అడుగుతున్నాను”

“నీ పేర్న అభిషేకం చేయించటానికి గుడికెళ్ళారు” అన్నది అతడి కోపానికి బెదిరిపోతు.

“అభిషేకాలా?, ఒక పక్క చావు బాజా మోగించి, నువ్వు కలకాలం చల్లగా ఉండు అంటే ఎలా ‘సు’?”

“ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తున్నావా కశ్యప్” అంటూ ఆమె వెనక్కి అడుగు వేసింది.

“ఎవరి మీదో కాదు, నీ మీదే, నేనంటే నీకు ఇష్టం లేదంటే ఎందుకు విడుదల చేయించావు”?

“మన రాత నిర్ణయించింది నువ్వే కాదా కశ్యప్, ఇప్పుడు అనుకోని ఏం లాభం”

” అయ్యో, ‘సు,’ నీకెందుకు అర్థం కాదు. అది విధి లిఖితo. పైగా నీ భర్త తో నువ్వేం సంతోషం గా లేవు, నాకొక్క అవకాశం ఇవ్వు అని బతిమిలాడుతున్నాను. అతనికి నువ్వు జీవితాంతం సేవ చేసినా మెరుగు పడే అవకాశం లేదు,  నేను వేరే అమ్మాయిని చేసుకుంటే నువ్వు భరించగలవా?” అంటూ ఆమెని తనకు దగ్గరగా తీసుకున్నాడు.

ఆమె అతడిని విడిపించుకొని లోపలికి వెళ్ళిపోయి   తలుపులు వేసుకున్నది నిస్సబ్ధంగా.

అతడు అక్కడ నించి నిష్క్రమించాడు తిరిగి తెచ్చుకోలేని కాలానికి పశ్చాత్తాప పడుతూ…

******************************************************************************

మిధిల -కశ్యప్ వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఆమె చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని కూర్చున్నది.

“కళ్యాణ మండపానికి బయలుదేరండి పెళ్ళి కూతురు గారు” అంటూ హడావిడి చేసింది సువర్చల మిధిల వద్ద.

“సువర్చల! నా స్నేహితలందరు కశ్యప్ ఎలాoటి వాడు అని అడుగుతున్నారు, నాకు అతడి గూర్చి పెద్దగా తెలీదు, నువ్వు చెప్పు ప్లీజ్, లేదంటే ఆ మాత్రం తెలీకుండానే పెళ్ళికి ఒప్పుకున్నావా? అని నవ్వుతారు” అని అడిగింది మిధిల.

” గరళాన్ని కూడా చిరునవ్వుతో అదిమి పెట్టే భవహరుడని చెప్పు. అమ్మ ముందు ముప్పయి ఏళ్ళు దాటినా కూడా, పసి పిల్లాడల్లే ఉండే యశోద కృష్ణుడని చెప్పు, సహనంలో భూమాతకి తీసిపోడని చెప్పు, స్నేహంలో కల్మషం అంటే తెలీని కర్ణుడు లాంటి వాడని చెప్పు, ప్రపంచం అంతా ప్రేమమయం అని నమ్మే వాడని చెప్పు. నమ్మిన సిద్ధాంతానికై  ప్రాణాలు లెక్క చేయని వాడని చెప్పు. ఒక్క ముక్కలో, ప్రతి అమ్మాయి నా భర్త ఇలా ఉంటే బాగుండు  అనేలా ఉంటాడని చెప్పు.” అని ఆమె వస్తున్న కన్నీటిని దిగమింగుతూ పనుందంటూ వెళ్లిపోయింది.

మిధిల నేరుగా కశ్యప్ ఉన్న గదికి వెళ్ళి,  పక్కనున్న బోసును విసురుగా పక్కకి తోసి ” నాకు సువర్చల పద్దతి నచ్చలేదు, మీతో చనువుగా ఉండటం అస్సలు నచ్చలేదు, ఆమె ఎవరు అని నా స్నేహితులు అడిగితే ఏమని బదులివ్వను”? అని కసిరింది.

” ఒక గ్రీష్మ కాలపు చల్లని పిల్ల తెమ్మర అని చెప్పు,  వసంత కాలంలో కూసే తొలి కోయిల గొంతు అని చెప్పు, మమతకి విలువలకి పుట్టినిల్లు అని చెప్పు, నిశ్వార్ధానికి, క్షమకు కేర ఆఫ్ అడ్రెస్ అని చెప్పు, నా సిద్ధాంతాలకు బలి అయిపోయిన ఒక ఆడ పిల్ల అని చెప్పు, మొత్తానికి ఈ కశ్యప్ పోగొట్టుకున్న జీవితం అని చెప్పు” అన్నాడు ఉబికి వస్తున్న కన్నీటికి అడ్డు కట్ట వేస్తూ.

మిధిల కశ్యప్ తల్లిని అక్కడ నిల్చోబెట్టి, “విన్నారు కదా ఆంటీ ! అక్కడ ఆవిడ ప్రేమని, ఇక్కడ కశ్యప్ మనో వేదనని, వీళ్ళు బయట పడటం లేదని, సమస్యల వలయంలో ఇరుక్కొని ప్రేమకు బూజు పట్టించారని నాకు అర్థం అయి, మీ చేత ఇంత నాటకం ఆడించాను” అన్నది, స్దిమిత పడుతూ…

బోసు ఆశ్చర్య పోతూ ” అంటే నువ్వు కశ్యప్ ను ఇష్ట పడలేదా” అని అడిగాడు.

ఈ కశ్యపుని హృదయాంతరాళ్ళలోకి వెళ్ళి స్విమ్ చేసోచ్చాను, అక్కడ సువర్చల తాలూకు జ్ఞ్యాపకాల శిల్పాలు బోలెడు ఉండటంతో, నేనెక్కడ వాటి అడుగున నలిగిపోతానో అని, నా ఆలోచన విరమించుకున్నాను” అన్నది, కిల కిలా నవ్వుతూ…

కశ్యప్ తల్లి  ” సువర్చల సుఖం కన్నా నాకేం కావాలి, ఈ రకంగా మా అన్నయ్య ఋణం తీర్చుకొనే అవకాశం దొరికింది” అంటూ సువర్చలను పిలిచి వారిని ఒక్కటి చేసింది.

 

*******************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s