ప్రేమ -కొరకు, ప్రేమ వలన, ప్రేమ చేత

“జిప్సీ, జూప్సీ లు కనబడ్ట్లేదండి. పారి పోయినట్లున్నాయి”  అంటూ మూర్చిల్లి కుప్ప కూలి పోయింది 60 ఏళ్ల మనోరమ గారు.

పేపరు  చదువుతున్న ఆవిడ భర్త జగన్నాధం గారు ఒక్క చిరు నవ్వు నవ్వి ” నిన్ను ఎన్ని రోజులు భరిస్తాయి, కుక్క పిల్లలు అయితే మాత్రం” అని మళ్ళా తన పేపర్లో తల దూర్చాడు.

*************************************************************************************”నాకు చాలా భయంగా ఉంది ప్రొఫెసరు విల్సన్ గారు.”

“మీరు ఇంకా చిన్న పిల్ల కాదు  సరోజినీ గారు.”

“కానీ ఒక్క మాట ఇంట్లో చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తోంది”

“మనం 20 యేళ్లగా చెప్పి ఎదురు చూస్తున్నాము, ఋతువులు మారి పోతున్నాయి, సంవత్సరాలు  దొర్లి పోతున్నాయి. ఇంకా ఎదురు చూడటంలో అర్థం ఉన్నదా. నన్ను నమ్మండి” అని వణికి పోతున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని భరోసా ఇచ్చాడు ప్రొఫెసర్ విల్సన్.

ఇద్దరు బస్లో కూర్చొని ఎప్పుడు బయలుదేరుతుందా అని ఎదురు చూస్తున్నారు.

***********************************************************************************

“ఒరేయ్! ఎర్రోడ, పోలేరు, నూకాలు, మన లచ్చి – వీరయ్య మన కంట్లో కారం కొట్టి పారిపోయారు. దొరికితే అడ్డంగా నరికేయండి వాడిని” అని తన తల పాగా విసిరి కొట్టి పలుగు తీసుకొని పరుగెట్టాడు దొంగల నాయకుడు బసవన్న.

బసవన్న లచ్చి మేన మామ. దారి కాచి దొంగతనాలు చేయటం .అతడి కుల వృత్తి. లచ్చి తల్లి ఏవిరినో నమ్మి మోసపోయి, లచ్చికి  జన్మని చ్చి కన్ను మూసింది. అప్పట్ నించి తండ్రిలా సాకడు బసవన్న.

వీరుడు రెండేళ్ల క్రితం తమ గూడెం లో చేరాడు, దొంగ తనం చేసిన డబ్బు అంతా తెచ్చి బసవన్న చేతిలో పోస్తాడు, కానీ నాయకత్వ లక్ష్యణాలు లేవని  అతడికి లచ్చి ని  ఇవ్వాటానికి మనసు ఒప్పలేదు అతడికి. కానీ లచ్చికి అతడు అంటేనే ఇస్టం. అందుకే తన మావయ్య లేని సమయంలో పారిపోదాం అని చెప్పి అతడిని లక్కెళ్ళి పోయింది.

వీరూడికి  పారిపోవటం ఇష్టం లేకున్నా, ఆమె పట్టుదల కి తన వెంట వచ్చి దారి మధ్యలో మనసు మార్చి తిరిగి ఆమె మావయ్య అంగీకారంతో పెళ్ళి చేసుకుందామని అంగీకరించాడు.

వారిద్దరు కూడా ఇదే బస్ ఎక్కారు.

**********************************************************************************

అదే బస్ లో  షామ, రఘు  అప్పటికే ప్రయాణం చేస్తూ వచ్చారు. వారిద్దరు 2 నెలల క్రితమే ఇంట్లో నించి వెళ్ళిపోయి ఇపుడే తిరిగి ఇంటికి వెళుతున్నారు.

“షామ నాకు ఒకటే బెంగ, ఇపుడు మా వాళ్ళు నిన్ను నల్ల పిల్ల అని ఒద్దని అంటే నన్ను విడిచి వెళ్ళిపోతావని”  అన్నాడు రఘు బాధతో పూడిపోయిన  గొంతుని పెకిలిస్తూ.

” అదంతా ఇపుడు ఆలోచించద్దు,  నువ్వు విశ్రాంతి తీసుకో” అన్నది, దుప్పటి అతని చెవుల దాకా కప్పుతూ షామా

బస్సు బయలుదేరింది.

*************************************************************************************

బస్సు వేగంతో ముందుకు వెళ్ళిపోతోంది,  పొడుగాటి చెట్లను నిసి రాత్రి చీకట్లకు  వదిలేసి. చల్లవి అయిన బలమయిన గాలులు  తమను  ఈ జంటలు పట్టించుకోవట్లేదని కిటికీ ల గుండా రెట్టింపు హోరుతో తమ బల ప్రదర్శనకు దిగినాయి. దానితో జంటలు మరింత దగ్గర అయి ఒకరిని ఒకరు పొదవి పట్టుకున్నారు.

డ్రైవర్ అస్లం  రెప్ప వేయకుండా దృస్టీ అంతా తన గమ్యం మీద పెట్టి నడుపుతున్నాడు. మేఘాల గర్జనలకు ఉలిక్కి పడుతున్నారు వెనక ప్రయాణీకులు, తను మాత్రం తన దృష్టిని  కాసింత కూడా  మళ్ళించలేదు. తన 25 యెళ్ల్ల గవర్నమెంటు బస్సు డ్రైవరు ఉద్యోగంలో అతను ఎప్పుడు తాగి బస్సు నడపలేదు.

కాసేపటికి ఒక ఒక స్టాప్లో బస్ ఆగింది. అక్కడ ఒక వృద్ధ జంట 75, 70 ఏళ్ళ వారు ఎక్కారు.

వారిద్దర్ని చూడగానే వారి ఇద్దరి మధ్య ఏదో పెద్ద అగాధం ఉందని తెల్సిపోతోంది కుర్ర జంటలకు.

వారిద్దరు ఎవరి డబ్బులు వారిచ్చి  ఎవరి టికేట్టు వారు తీసుకున్నారు. చేరవల్సింది ఒకటే గమ్యం అయినా కూడా, ఎడ మొహం  పెడ మొహం పెట్టుకు కూర్చున్నారు ఇద్దరు.

బస్సు కదిలే చివరి నిమిషంలో జిప్సీ, జుప్సీలు ఎగిరి గెంతేసి బస్సులో కూల బడ్డాయి.

జుప్సీ తన స్నేహితురాలు అయిన  జీప్సీ ని  చూసి నిమురుతూ ” ఇన్ని రోజులు మనం రోజు విడిచి రోజు అయినా ఆ కసాయి చేతుల్లో చికెన్ పీసులు తిన్నాము, ఇప్పుడు అవి కూడా వుండవు. పైగా నేనే నిన్ను వీధి కుక్కల నించి కూడా కాపాడాలి.” అన్నది.

జీప్సీ చిన్నబుచ్చుకున్న మొహంతో ” నువ్వే నా ధైర్యం, నీకు నచ్చకపోతే వెనక్కి వెళ్ళిపోదాO” అన్నది.

“లేదు నిన్ను ఇంత చిన్న చిన్న విషయాలకు వదులుకుంటాన?” అని నొచ్చుకున్నాడు జుప్సీ

************************************************************************************

డ్రైవర్ వర్షపు తాకిడికి, హోరు గాలులకు తాళ లేక బస్సును ఒక కాఫీ హబ్ దగ్గర నిలిపాడు.

బస్సు నిలిపింది ఆలస్యం తాతగారు గొడుగు వేసుకొని పరిగెత్తి, తన కాఫీ తాను తాగుతున్నారు. అమ్మమ్మ గారు చీర కొంగుని తల మీద కప్పుకొని వర్షపు చినుకులని తప్పించుకుంటూ వెళ్ళి ఆయనకు దూరంగా కూర్చొని ఒక చోట కాఫీ తాగుతున్నారు.

వీరిద్దరిని చూసిన షామ  రఘుని పిలిచి ” ఎంత కోపమున్న, కనీసం గొడుగు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు తాత గారు, అంత కోపం ఎందుకు ?”అని అడిగింది.

రఘు మాత్రం తన వారి గురించి ఆలోచిస్తూ ఆమెకు సమాధానం చెప్పలేదు.

దానితో ఆమె కుతూహలం చంపుకోలేక నేరుగా ఆవిడ దగ్గరకు చేరి ” అదేంటి అమ్మమ్మ గారు, తాత గారు మీ కోసం కనీసం గొడుగు కూడా పట్టుకోలేదు.” అన్నది.

ఆవిడ కాఫీ ఆఖరు సిప్పు లాగిస్తూ, “నా మాట అటుంచు, నువ్వేంటి ఆ పిల్లాడు కంటికి  మంటికి ఏడుస్తుంటే నువ్వు ఏదో పెద్ద పధకం వేసినట్లు ఉన్నావు ,  ప్రేమ మీద గౌరవం కూడా లేదా నీకు? నువ్వు పెద్ద రంగు కూడా లేవు.. ” అన్నది గుక్క తిప్పుకోకుండా..

ఆవిడ ఇప్పుడే కదా మమ్మల్ని చూసింది అప్పుడే ఎలా కనిపెట్టింది, అనుకుంటూ విస్తు పోయిన షామ ” బస్ ఎక్కి మాట్లాడుకుందాం రండి” అన్నది.

ఆవిడ రెండు వేడి వేడి పాల గ్లాసులు కొని ఆ కుక్క పిల్లలకు పోసి రా అని పురమాయించింది షామకి.

ఆవిడ దయకి, తమకి రాని ఆలోచనలకు- షామ విపరీతమయిన గౌరవాన్ని పెంచుకున్నది ఆవిడ మీద.

*********************************************************************************

వేడి వేడి పాలు తాగిన జీప్సీ జూప్సీలు బస్ అంతా తిరుగుతూ కోలాహలం చేస్తున్నాయి.

అమ్మమ్మగారికి సీట్ లో కూర్చోవటానికి సహాయం చేస్తూ షామ ” అవును… మీకు ఎలా తెల్సు మా గురించి…”? అన్నది.

దానికి ఆవిడ, “మీ గురించే కాదు అక్కడ ఎర్ర చీరలో మెరిసిపోతోన్దే, పక్కన పరాయి దేశం వాడితో ..వాళ్ళిద్దరు  కూడా మీ బాపతే, కాస్త మీ కంటే ఆలస్యం అంతే” అన్నది కిసుక్కున నవ్వుతూ.

ఆవిడ బ్రైన్ పవర్ కి  కళ్ళార్పకుండా షామ చూస్తూ కూర్చుంటే, ఆవిడ తన చిరునవ్వుతో సరోజినీ గారిని పలకరించి రమ్మని సైగలు చేసి తన వద్దకు రప్పించుకున్నది క్షణంలో.

ఆమె వచ్చిన మరు క్షణం ఆవిడ ప్రశ్నల వర్షం కురిపించింది.  ” ఏమ్మా! పరాయి దేశం వారి మీద భరోసా తో వచ్చేశావు, వారికి మనలాగ పట్టింపులు  ఏమి ఉండవు. రెండు రోజుల మురిపెం అంతే” అన్నది.

“ఏ దేశం అయినా, ఏ భాష అయినా, మనసు దాకా వస్తే ఏవి అడ్డుగోడలు కాలేవు. ఇక ప్రేమ అని పేరు పెట్టుకున్నాక అనుమానాలకు తావు ఉండదు.  నా కోసం 20 ఏళ్ళు ఎదురు చూశాడు. ఈ ఎదురు చూపులను కూడా అతడు సంతోషంగా స్వీకరించాడు  కానీ వేరే అమ్మాయిల కోసం పరితపించలేదు, ఈ సమయం వృధా అని అనుకోలేదు. ఇంక ఎందుకు అనుమానించాలి” అన్నది దృఢ మనస్కురాలై సరోజినీ .

వారిద్దరు నోరు తెరిచి “20 ఏళ్ళు ఎదురు చూశాడా”?, అని నిద్రపోతూ తూలుతున్న అతన్ని చూసి జాలి పడి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.

అమ్మమ్మ గారు తిరిగి శామా వైపు చూసి “నువ్వు చెప్పు ఇప్పుడు.  తప్పించుకోలేవు నా నించి” అన్నది నవ్వుతూ.

షామ గట్టిగా నిట్టూరుస్తూ ” దాచేదేమీ లేదు, వేళ్ళేటపుడు నాతో సంతోషంగా వచ్చాడు. కానీ అతడి మనస్సు కుటుంబం వద్ద, శరీరం మాత్రమే నా వద్ద, అందుకే  తిరిగి అతడి కుటుంబాన్ని అతడికి అందించి నా బాద్యత దించుకుంటాను” అన్నది.

అమ్మమ్మ గారు ” హాసి పిడుగా! నల్ల పిల్లవని గేలి చేశాను కదటే, నీ లాంటి పిల్లలు దేవతాంసలు” అన్నది కళ్ళు తుడుచుకుంటూ…తన చీర కొంగుతో.

మరి మీ సంగతి అన్నారు వారు, “మీరు కూడా తప్పించుకోలేరు” అన్నట్లు కొంటెగా.

” మా ఇద్దరి పెళ్ళి నాకు 14 ఏళ్ళు, ఆయనకు 17 ఏళ్లప్పుడు జరిగింది. మొదటి రాత్రి ఆయనని చూసిన నాకు భయంతో ఏడుపు వచ్చింది, అంతే ఆయన కోపం తెచ్చుకొని ఈ రోజుకి నాతో మాట్లాడరు.”

” మరి మీరు పలకిరించకపోయారా పెద్ద అయ్యాక అయినా?” అన్నది సందేహంగా షామా.

“నాకు ఊహ కన్నా ముందు సిగ్గు తెలిసింది, ఆయనని చూసిన ప్రతి సారి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయే దాన్ని, అది ఆయనకు కోపం వచ్చేది.”

అందరూ కాసేపు మౌనంగా వుండిపోయారు.

షామా కధను  విన్న  వీరుడు, రఘుని గూర్చి తెల్సుకోని, తనని కూడా లచ్చి ఇలాగే అపార్థం చేసుకొని వదిలేస్తుందని, ఆమెను అప్పటికప్పుడు ఎలాగోలా నమ్మించాలని తాత గారి పర్సు కొట్టేసి డబ్బులు ఆమెకు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు.

అలాగే రెప్ప పాటు కాలంలో నిద్రిస్తున్న ఆయన జేబులో నించి పర్సు దొంగలించి, 20 వేల నగదు తీసుకొని, పర్సుని ముందు ఉన్న 3 సీట్ల అవతల విసిరేశాడు.

అది వచ్చి సరోజినీ కాళ్ళకు తగలటంతో ఆవిడ తీసి చూస్తే అందులో అమ్మమ్మ గారి ఫోటో, ఒక ఉత్తరం  ఉన్నాయి. అందరూ తాత గారిదే అని గ్రహించి తెరిచి చూడగా  ఇలా ఉంది.

ప్రియమైన రత్నకి,

నేను అంటే నీకు ఎంత సిగ్గో నాకు నువ్వన్టే  అంతే సిగ్గు. ఎలా చెప్ప గలను, నేను మగాడిని. మన మొదటి రాత్రి నన్ను చూస్తూనే బిగ్గరుగా ఏడ్చావు, నిన్ను చూసిన ప్రతి సారి ఆ పసి పాపే కనిపిస్తోంది. క్షమించు. నా సిగ్గుని కప్పి పుచ్చుకోవటానికి కోపం నటిస్తున్నాను.

శ్రీధరం

అది చదివిన ఆవిడ కళ్ళు గట్టు తెగిన చెరువులు అయినాయి. వెంటనే ఆయన సీటు దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మీద చేయి వేసింది పలకరింపుగా, కానీ ఆయన పక్కకి ఒరిగిపోయాడు విగత జీవిగా…

ఆయనని చూసిన ఆమె కూడా నిస్సబ్ధంగా ఆయన మీదే కుప్ప కూలిపోయింది.

అస్లం వారిద్దరు చనిపోయారు అని ధృవీకరించుకొని ప్రయాణీకులని వేరే బస్సు చూసుకోమని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి వైపు బండి మళ్ళించాడు.

అందరు దిగి వెళ్ళిపోయినా, వీరుడు- లచ్చి, అస్లం కు తోడుగా ఆసుపత్రి కి వెళ్ళి,  దొంగలించిన సొమ్ముని వారి చివరి అంత్య క్రియలకు ఉపయోగించి, వారిద్దరి సమాధులు పక్క పక్కనే ఉండేట్లు ఏర్పాటు చేశారు, కనీసం ఇక్కడయిన వారు మాట్ల్డుకుంటారు అనే ఆశతో.

చివరకు ఎటు వెళ్ళాలో తెలియక చివరి బస్ స్టాప్లో కూర్చుండి పోయారు.

వారిని వెతుక్కుంటూ వచ్చిన బసవన్న ” వెర్రిగా నవ్వుతూ, మీరేంత అమాయుకులురా? పారిపోయి మన గూడెం  దగ్గరలోనే కూర్చున్నారు, ఎలా బతుకుతార్రా?” అన్నాడు.

వీరుడు మాత్రం, ” నేను లచ్చిని ఒప్పించి వెనక్కి తీసుకొని వద్దామని వచ్చాను.  అయినా మంచి నాయకుడు- మంచి మొగుడు కాలేడు, మంచి మొగుడు- మంచి నాయకుడు కాలేడు. నువ్వే నా గురువ్వి, చెప్పు నేనేం కావాలో “అన్నాడు

బసవన్న నిర్ఘాంత పోయి, “నీ నిజాయితీ ని నీ చేతగాని తనం అనుకున్నారా, నాతో ఉండి మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు,  ఇంకెక్కడికయిన వెళ్ళి కూలి పన్లు చేస్కోని అయినా సుఖంగా బతకండి” అన్నాడు.

*************************************************************************************.

షామా, రఘు తలలు దించుకొని అతడి కుటుంబం ముందు నిల్చున్నారు.

పది మంది ఉన్న అక్కడ , నిస్సబ్ధం రాజ్యమేలుతుంటే,  షామా దానిని ఛేదిస్తూ ” తప్పు నాదే. అతడిని నేనే బలవంతంగా తీసుకెళ్ళాను, కానీ అతడి మనస్సు  మీ దగ్గరే ఉంది. మీ అబ్బాయిని మునపటి  లాగా స్వీకరించండి, నేను అతని జోలికి ఇంక రాను” అన్నది

రఘు తాత గారు, ” ఒరేయ్ నూతి దగ్గర ఒక్క బకేట్ నీళ్లూ తల మీద గుమ్మరించుకొని రా” అని ఆదేశించారు.

షామా ఆయనని చూసి నిట్టూర్చి వచ్చిన పని అయిపోయినట్లు మెట్లు దిగుతుండగా, ఒక సుతి మెత్తని చేయి ఆమెను గట్టిగా పట్టుకొని వెనెక్కి లాగింది. ఆమె ఎవరో కాదు, రఘు తల్లి.

ఆమెను బర బర లోపలికి ఈడ్చుకుంటూ వెళ్ళి రఘు తాత గారి ముందు నిల్చోబెట్టి, ” కోడలు నలుపు అయితే కులమెల్ల నలుపు అనేది పాత సామెత. కుటుంబ బంధాలను కాపాడే గుణం ఎంత మందికి ఉంటుంది” అన్నది.

ఆయన తన కళ్ళ జోడు తీసి విసిరి కొట్టాడు, రఘు వాళ్ళ అమ్మని అనుసరించాడు.

************************************************************************************

“క్షమించండి నాన్న, మీ సమ్మతం కోసం ఎదురు చూసి చూసి చివరికి మేము ఓడిపోయాము” అని ఫోన్ చేసింది సరోజినీ దేవి.

” అవునమ్మ. మాది నిప్పులు కడిగే వంశం. నువ్వు చల్లగా వుండు. తాత గారి పేరుకి మచ్చ రానివ్వలేను, నువ్వు ఇంక ఎప్పుడు అగ్రహారానికి  రాకు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు, అల్లుడు గారిని అడిగానాని చెప్పు.” అని ఫోన్ పేట్టేశారు ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.

చిరు నవ్వుతో ఆమె ఫోన్ పెట్టేస్తూ కిటికీ లోంచి  లాన్లో,  జీప్సీ జూప్సీలతో ఆడుతున్న విల్సన్ ని చూసి ఆనంద భాష్పాలు కురిపించింది.

*************************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s