గమనం

“సమయం రాత్రి 10.30 గంII “

“హేయ్! ఆపండి, మిమ్మల్నే..” అంటూ బస్ వెనకాల పరుగెట్టింది తీక్షణ.

బస్ ఆగకుండా వెళ్ళిపోయింది, సమయం మించి పోవటంతో

“ఛ! ” అంటూ చేతిలో ఉన్న రిజర్వేషన్ టికెట్స్ నలిపి విసిరికొట్టింది.

అక్కడే కూర్చోని ఉన్న ఒక 35 యేళ్ళ వ్యక్తి అయోమయంగా చూస్తు, ఆమె కోపం చూసి ఠక్కున ఫోటో తీశాడు ఆమెను.

ఆమె అది చూసి కోపంతో ఊగిపోతు అతడి ఫోన్ లాక్కొని తన ఫోటోని డీలీట్ చేసి, ” ఎంత ధైర్యం ఉంటే నా అనుమతి లేకుండా నా ఫోటో తీస్తావ్”? అన్నది ఆమె.

అతను మళ్ళీ ఇంకో ఫోటో తీయబోయి ఆగిపోయి, “మరేం చేయమంటారు గుంటూరు బస్ ఎక్కబోయి, గోవా బస్ ఎక్కాను, తోచక అందరి ఫోటోలు తీస్తున్నాను” అన్నాడు.

“ఇలా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే అలాగే అవుతుంది. .”

“ఇంకో బస్ ఉందేమో ఈ టైంకి” అంటూ గూగుల్ ఓపెన్ చేసి, “ఇప్పుడు వెళ్లిందే ఆఖరు బస్సు” అన్నాడు.

ఆమె నిరాశగా అక్కడున్న కుర్చీలో కూలబడింది. అతడు ఠక్కున మళ్ళీ ఫోటో తీశాడు ఆమెను.

ఆమే అతడి ఫోన్ విసిరి కొట్టింది.

అది గడ్డిలో పడటంతో సేఫ్ గా ఉందని చూసుకొని ఊపిరి పీల్చుకొని, “క్యాబు బుక్ చేసుకొని   వెళ్ళండి, అప్పటి దాకా నేను మీకు తోడుగా ఉంటాను  ” అన్నాడు.

తన డెడ్ ఫోన్ చూబించింది ఆమె అతడికి మౌనంగా …

అతడు కిసుక్కున నవ్వి ” ఈ మాత్రానికేనా అంత కోపం… సరే చెప్పండి నేనే బుక్ చేస్తాను…” అన్నాడు తనుకొస్తున్న నవ్వుని ఆపుకొని.

“అబిడ్స్ ”

క్యాబు ఒక పది నిమిషాలకు వచ్చింది.

.”మీరు ఎక్కడికి వెళ్ళాలి” అన్నది అతడిని సందేహంగా చూస్తూ ఆమె.

“భారత రాజ్యాంగం మీద మీ అభిప్రాయం”  అని అడిగాడు అతడు.

” నీకేమన్నా తిక్క? నేను ఏం అడిగాను, నువ్వేం చెప్తున్నావు” అని కార్లో ఎక్కి కూర్చుంది. అతడు కార్లో ఎక్కి కూర్చుని మళ్ళీ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు.

ఆమె మౌనాన్ని ఆభరణంగా చేసుకున్న కాసేపటికి మగత నిద్రలోకి జారుకున్నది.

కాసేపటికి కార్ బ్రేక్ డవున్ అయిందని కార్ ఆపాడు డ్రైవర్.

“ఎంత సేపు పడుతుంది?” అని అడిగింది తీక్షణ.

“కనీసం నా పేరు అడిగారా మీరు? “అని అడిగాడు అతడు.

“సరే మీ పేరు ఏంటి? ఎంత సేపు పడ్తుంది?”

“నా పేరు సముచిత్.  అరగంట పడుతుంది రిపేర్ పూర్తి అవ్వటానికి. మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారేమో నా ఫోనే తీసుకొని ఇన్ఫార్మ్ చేయండి” అన్నాడు  అతడు.

“ఆమె కంగారూ పెట్టటానికే  కదా వచ్చేశాను నెల రోజుల క్రితం” అన్నది స్ఠిరంగా.

“ఎందుకు? ఇష్టం  లేని చదువా? ప్రేమా? పెళ్ళా?”

“ఒక ఆడ పిల్ల ఇంట్లో నించి పారిపోయిందంటే ఇంతకు మించి కారణాలు ఉండకూడదా?

“ఓహ్..సినిమాల్లో చేరాలనా లేదా కొంప దీసి హత్య చేశావా?” అన్నాడు అతడు ఆమెను ఉడికిస్తూ.

ఆమె చిరు నవ్వుతో “మరి కాస్త లోతుగా ఆలోచించి, ఒక్క good reason guess చేయ గలరా?” అన్నది.

“నాకు అంత సీన్ లేదు, మీరే చెప్పండి”

“మా ఊరిలో కులం పేరుతో కొట్టుకుంటున్నారు. ఆగ్ర కులాలు అని ఒకరు, ఉగ్ర కులాలని మరొకరు తమ అహంకారాలు చాటుకుంటున్నారు. తక్కువ కులాల పేరుతో కొందరు అకృత్యాలు చేస్తున్నారు.

కానీ నా దృష్టిలో కులం ఒక ఆక్సిడెంట్ మాత్రమే . ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు ఒక ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుంటే ఇరు వైపుల కుటుంబాలను వెలి వేసి నరకం చూపిస్తుంటే, అన్నీ తెల్సిన గ్రామ సర్పంచు అయిన మా అమ్మ వాళ్ళకి ఒత్తాసు పలికింది.

ఇప్పుడు చూస్తాను ఆవిడ కనీసం కూతురు కోసమైన  తన స్వార్ధ బుద్ధిని పక్కన పెడుతుందో లేదో అని. ”

“సార్! కార్ రెడీ అయింది, ఎక్కండి” అన్నాడు డ్రైవరు.

ఇద్దరు కార్లో ఎక్కి నిస్సబ్ధాన్ని ఆహ్వానించారు.

చల్ల గాలికి ఆమె మనస్సుకి కాసింత స్వాంతన చేకూరింది.

కార్ ఉన్నట్లుండి ఒక చోట ఆపాడు డ్రైవర్, సముచిత్ సైగ చేయటంతో.

ఆమె విస్తు పోతుండగా నలుగురు ఒక్క సారిగా వచ్చి ఆమెను కారు దిగమని ఒత్తిడి చేశారు.

ఆమె సముచిత్ వైపు చూడగా అతడు ” తీక్షణ, అంత తీక్షణంగా చూడకు, ఇది నా వృత్తి  ధర్మం. ” అని ఆమెను ఆమె తల్లికి అప్పగించాడు.

ఆమె మౌనంగా తన తల్లి కార్లో కూర్చొని, ఆమెను వేరే కార్లో రమ్మని చెప్పి వెళ్ళి పోయింది.

“థాంక్స్! సి.ఐ సముచిత్ “,  అన్నది తీక్షణ తల్లి శాంతా బాయి.

“నాకు మీ థాంక్స్ వద్దు. అస్సలు స్వీకరించను. మీ పవర్ బయట జనానికి ఉపకరించదు. మీ కుటుంబం మనస్సుని అర్థం  చేసుకోటానికి ఉపకరించదు. ఎవరికి న్యాయం చేయని మీ ధర్మాలు ఎవరి కోసం? మీ కూతురు, మీ పద్దతి నచ్చక పారిపోతే అది పోలీసుల బాధ్యతా? అదే ఒక్క నిమిషం ఆమె ఆశయాలను మీరు  అర్థం చేసుకుని ఉంటే భవిష్యత్తులో మీ పార్టీ కి ఒక అండగా ఉండేది కదా!

ఆమె మీకు కనిపించే వరకు ఆమె ఫోటోలు పంపమని, ఎలా ఉంది అని 116 మెస్సేజులు పెట్టారు. ఇంత శ్రధ్ధ ఆమె గడప దాటక ముందు తీసుకొని ఉంటే, నా పోలీసు నిజమయిన ధర్మంగా జనానకి ఈ సమయం ఉపకరించేది” అని తన జెర్కిన్ విసిరి కొట్టి వెళ్ళి పోయాడు సముచిత్.

*******************************************************************************

మారు నాడు ఉదయం: తీక్షణ, భారంగా ఉన్న తన  తల పట్టుకొని, సముచిత్ ను తిట్టుకుంటూ హాల్లో కి వచ్చి, దినా పత్రిక  పట్టుకుని తన తల్లి ఫోటో కనబడటంతో హేయమయిన భావన తో చూసింది, ఆ శీర్షికను.

“కులాంతర వివాహం తన చేతుల మీదుగా చేసి తన గొప్ప మనసుని చాటుకున్న శాంతా కుమారి” అని పెద్ద పెద్ద అక్షరాలు కనబడ్డాయి ఆమెకు.

కింద ఫోటోలో, కొత్త జంట పక్కన నవ్వుతూ ఫోజు ఇస్తోంది తీక్షణ తల్లి, పెద్ద మనస్సు అంతా తన  చిరు నవ్వులో గుప్పించి.

పక్కన ఉన్న ఫోన్ లో  మెస్సెజ్ రావటంతో ఆమె చెక్ చేస్తే, సముచిత్ వద్ద నుంచి-  ” సమస్య  నించి  పారిపోకండి, నిలబడి పోరాడండి, మీ గమనం ఎటో తేట తెల్లం చేయండి ” అని.

 

**********************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s