బృందావనం

1957: ప్రపంచం  అంతా కుంచె తో రంగులు అద్దిన నాకు నుదిటిన  రంగు అద్దుకోలేను. చిన్నతనంలో తెల్లటి మంచును చూసి మురిసిపోయిన నాకు, ఊహ తెలిసే సరికే  ప్రకృతి బహుమానంగా మంచు అంతటి తెల్లని చీరను ఇచ్చింది.

ఈ సంవత్సరం నాకు శాంతినికేతన్ కి నా చిత్రాలను పంపాలి అని ఒక ఆశయం.

కానీ తాత గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. డాక్టరు గారు అమెరికా తీసుకెళ్తే తప్ప లాభం లేదని చెప్పారు. లాయరు గారు తమ దూరపు బంధువు అయిన నికేతన్, మా కూడా వస్తున్నారని చెప్పారు.

అది విన్న మా తాత గారు “ అమ్మ బృంద ఆడపిల్లవి ఇంటి పట్టున ఉండు, నా వల్ల నీకెందుకు ఈ శ్రమ” అన్నారు.

మన వాళ్ళ దగ్గర కూడా శ్రమ పడకపోతే శ్రమకి అర్థం ఏమిటి, ఉన్న శక్తి ఎందుకు అసలు, అది అసలు  శ్రమ ఎందుకు అవుతుంది, అనుకోని ఆయన్ని ఎక్కువ మాట్లాడొద్దని సైగ చేశాను.

తాత గారు, మా నాన్న గారు మంచి స్నేహితులు. ఆయనకు నా అన్నవాళ్లు లేరు కానీ కోట్ల ఆస్తి ఉంది. అందుకే 14 ఏళ్ళకి నన్ను తన కూతురిగా భావించి తన సొంత ఖర్చులతో పెళ్ళి చేశాడు, తన దూరపు బంధువు అయిన  18 సంవత్సరాల యువకుడికి  ఇచ్చి.

కానీ అతడికి భారత సైన్యంలో చేరాలని ఆశయం. ఆ విషయం పెళ్ళి రోజు రాత్రి ఉత్తరంలో వ్రాసి వెళ్ళిపోయాడు. అతడిని 6 సంవత్సరాలు వెనక్కి తిరిగి తీసుకురావాలని తాతయ్య విఫల ప్రయత్నం చేశారు. కానీ అతడు చివరికి  యుద్ధ సమయంలో వీర మరణం పొందాడు.

అమెరికా: పేరు తెలీని ఎర్రటి ఆకుల చెట్లు, మంచు తెరల మాటున చూస్తుంటే ఒక భారతీయ స్త్రీ నుదిటిన సింధూరం లా కనిపిస్తోంది.

ఈ ఆసుపత్రిలో వారికి కావల్సినంత ఇంగ్లీషు నాకు రాదు. అంతా నికేతన్ చూసుకుంటాడు. నేను తాతయ్యకు సపర్యలు చేస్తాను. నికేతన్ కి, నన్ను ఇంప్రెస్ చేయమని  లాయరు గారు బాగా నూరి పోసి పంపారు. ఆయనకు తాత గారి ఆస్తి మీద ఆశ ఉందని అందరికీ తెల్సు. ఆయనే నిజాయితీగా ఒప్పుకున్నాడు “ ఆస్తి కోసం కాకపోతే రాత్రి పగలు ఎందుకు కష్ట పడతాను, మీరే ఎంతో అంతా చూసి ఇవ్వన్డి” అన్నాడు.

ఇక్కడ నికేతన్ సమయం దొరికినప్పుడు అల్లా డాబుసరి మాటలతో విసిగిస్తాడు. ఒకింత నవ్వు, ఒకింత బోరు కలిగిస్తాయి.

30 రోజుల తర్వాత:  నికేతన్ నన్ను పిలిచి “ఎంత సేపు ఇక్కడే ఉంటావు, కాసేపు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి రా, నేను ఇక్కడ తాతగారితో ఉంటాను” అన్నాడు. తాత గారు కూడా బలవంతం  పెట్టటంతో దగ్గరలోని ఆర్ట్ ఎక్ష్హిబిషన్కి వెళ్ళాను.

ఎన్నో చిత్రా కళా ఖండాలు, ఎన్ని చూసినా తనివి తీరదు. ఒక చిన్న రంగుల కుంచె మాటున వున్న,  ఏ మనోహర హృదయo ఈ చిత్రాలను గీసిందో అన్నంత అద్భుతంగా ఉన్నాయి అవి. కొన్ని అర్థం కానీ చిత్రాలు, మరి కొన్ని వర్ణననకు అతీతమయిన చిత్రాలు.

కానీ అందులో ఒక చిత్రం నాకు ఒకింత కోపాన్ని తెప్పించింది. అందులో కృష్ణుడు రాధ నాభి మీద పిల్లనగ్రోవిని ఆనించి వాయిస్తూ ఉంటాడు. ఆమె పరవసిస్తూ ఉంటుంది. నేను పుట్టి బుద్ధి ఎరిగాక ఇలాంటి విచిత్రమయిన భంగిమ చూడలేదు.

నా ముఖ కవళికలను గమనించిన ఒకతను నా వైపుకు వచ్చి “ఈ చిత్రం లో మీకు నచ్చని విషయం ఉందా, ఎందుకడుగుతున్నానంటే నేనే చిత్రకారుడిని ” అని అన్నాడు.

నాకు అతని మృదువైన స్వభావాన్ని గాయ పరచట0 ఇష్టంo లేక “ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది” అన్నాను క్లుప్తంగా.

అతడు నీలి కళ్ళ తో అందంగా నవ్వి “నాకు అర్థమయింది, మా అమ్మ ఒక తమిళ మహిళ, నాన్న మాత్రం అమెరికెన్. భారత సంస్కృతి పట్ల అమ్మ వల్ల గౌరవం పెరిగింది. కానీ నేను కూడా కృష్ణుడిని తన భార్యకు తల దువ్వుతున్నట్లు, సత్య భామ కాళ్ళు పట్టుకున్నట్లు, రుక్మిణీ ని నడుం మీద చేయి వేసి రధంలో ఒక్క చేత్తో కూర్చో బెట్టినట్లు చూశాను. అందుకే వెన్నెల్లో కలిసిన రాధ కృష్ణులు ఇలా ఉoడొచ్చు కాబోలు అని ఒక చిన్న ఊహ తో ఇలా చిత్రించాను”, అన్నాడు.

అతడి బదులు నచ్చినా, ఒప్పుకోవాలని అనిపించలేదు. ఎలాగో అక్కడ నించి బయట పడ్డాను.

ఇది జరిగిన 10 రోజులకి నయాగరా ఫాల్స్ కి వెళ్ళాను.

జలపాతం అందాన్ని నా హృదయం లో బంధించటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇంతలో నీలి కళ్ళ అబ్బాయి ఇక్కడ కూడా కనిపించాడు, కానీ ఎదురుగా ఉన్న జలపాతపు అందాన్ని వదిలి తన కుంచెలు, కాన్వాసుల మధ్యలో  ఇరుక్కుపోయాడు. ఒట్టి జడ పదార్ధం అనుకుంటా.అతడి కంట పడకుండా రెస్టారెంటు లోకి దూరాను. కాసేపటికి అతనే నా టేబల్ దగ్గర వచ్చి కూర్చొన్నాడు.

“ఎలా ఉంది జలపాతం” అన్నాడు పలకరింపుగా.

అంటే నన్ను ఇతను చూసాడా అనుకోని “చాలా బాగుంది”  అన్నాను.

ఒక తెల్లటి చిన్న కాగితం  నా చేతికి అందించాడు. అది తెరిచి చూస్తే రెండు విప్పారిన కళ్ళు ఉన్నాయి.

“మొదటి సారిగా నయాగర జలపాతాన్ని చూసిన కళ్ళు ఇవి” అని చెప్పాడు.

నిజంగానే ఒక అద్భుతాన్ని చూస్తూ, తమదయిన అద్భుతమయిన అందాన్ని మరిచిపోయిన కళ్ళు అవి, కానీ ఎక్కడో చూసినట్లు ఉంది.

అతడు నా సందేహాన్ని నివృత్తి చేస్తూ కిటికీ అద్దం చూపాడు. చిత్రంలో ఉన్నవి’ నా కళ్ళు’, ఇంత అందంగా ఉంటాయి అని నాకు కూడా తెలీదు.

“థాంక్స్” చెప్పి అక్కడ నుండి బయటకు నడిచాను.

అతను నన్ను అనుసరిస్తూ వచ్చి “మీ పేరు చెప్పలేదు?” అని అన్నాడు.

“మీరు అడిగారా?” అని నవ్వి “బృందా” అన్నాను. అంతకు మించి పరిచయాలు వద్దనిపించి ” ఇక్కడితో మీరు ఆగిపోండి” అన్నాను.

అతడు ఉన్న చోటే ఆగిపోయి “నా పేరు అగస్త్య, మీరు అడగక పోయినా చెప్పాను. బృందా అంటే ఏంటి? అని అడిగాడు.

నాకు భావుకత జోడించి చెప్పాలని అనిపించలేదు, “రాధా కృష్ణుల డైలీ లవ్ మీటింగ్ స్పాట్” అన్నాను ఒక్క ముక్కలో.

అతడు బిగ్గరుగా నవ్వాడు. అలాగే ఆసుపత్రి దాకా వచ్చి దిగబెట్టి వెను తిరిగాడు.

అతన్ని వెనక్కి పిలిచి “మా తాత గారి చిత్రం చిత్రించగలరా, మేము రేపే వెళ్ళిపోవాలి” అని అడిగాను.

“విత్ ప్లెజర్” అని తాత గారి గదికి ఉత్సాహంగా వచ్చి, ఎంతో సహనంగా చిత్రం పూర్తి చేసి ఇచ్చాడు.

 

భారత దేశం: తాతగారిని ఎవరూ గుర్తు పట్టలేనంత హుషారుగా తయారు  అయ్యారు. అమెరికా నించి వచ్చాక నాలోను ఏదో తెలీని మార్పు. చాలా సంతోషంగా వున్నాము.

లాయరు గారు తాతయ్య గారిని తొందర పెట్టటంతో నికేతన్కి నాకు పెళ్ళి చేస్తానని మాట ఇచ్చారు. ఒక నెల రోజుల్లో అయిపోవాలని ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఇక నేను మాట్లాడే ఆస్కారం లేక పోయింది. పెద్దగా అతడి అలవాట్లు నాకు నచ్చట్లేదు. కానీ తాతగారి కోసం పడ్డ శ్రమ వృధా అయిపోతుంది ఇపుడు నేను పెళ్ళి వద్దంటే.

చిన్నప్పటి నించి మాలో ఒకడిగా తిరిగిన లాయరు గారిని  కూడా నానా మాటలు అంటాడు నికేతన్ . ఎప్పుడూ ఆస్తి తగాదాలు పడుతుంటాడు, తాతయ్యకు తెలీకుండా. దాంతో లాయరు గారు సుమన్ అనే 20 యేళ్ల కుర్రోడిని తీసుకొచ్చారు “ఎవరో అనామకుడు, రైలు లో  కనిపించాడు, మనమే దిక్కు అంటూ”. అప్పుడర్థమయింది నాకు,  ఆస్తి తగాదాలు పెళ్లి కొడుకును కూడా మార్చే అంత దూరం వెళ్ళినాయి అని.

ఈ లోగా అగస్త్య మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు, తాత గారే పెళ్ళి కార్డు వేయటంతో. లాయరు గారు, నికేతన్, సుమన్ రోజు గొడవలు పడుతూ ఉంటారు, తాతయ్యకు తెలీకుండా.

నేను నికేతన్ తో సినిమాకు వెళ్ళినపుడు కూడా సుమన్ ని కూడా పంపుతారు లాయరు గారు. వాడు నాకు తమ్ముడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్లు ఉంటాడు. కానీ వాడిని నియమించింది నన్ను నికేతన్ కు దూరం చేయటానికి, 20 రోజుల్లో కి వచ్చింది, కానీ లాయరు గారికి  ఆశ చావట్లేదు.  నికేతన్ అత్యాశ అలాంటిది.

ఒక రోజు నికేతన్, నాకు ఒక ఫ్లవర్ బొకే ఇచ్చాడు. దాని మీద “ప్రియమైన ప్రియంవదకు ప్రేమ తో, నికేతన్” అని వ్రాసి  ఉంది .

అప్పుడు అర్థం అయింది నాకు, అతడి  “చిత్తం ప్రేయసి మీద, మనిషి ఆస్తి దగ్గర” ఉన్నాయని. అతడు చేసిన పొరబాటు తెలుసుకొని , నాలుక తెగేలా కరుచుకున్నాడు. బిoకo నటిస్తూ “ఆమెతో కొన్ని రోజుల పరిచయం మాత్రమే, అయినా నువ్వు అమెను మరిపిస్తావు, నాకు తెలుసు” అన్నాడు దేవదాసులా ముఖం పెట్టి.

నాకు నికేతన్ మీద కోపం రాలేదు కానీ, తాత గారి మీద జాలి కలిగింది, ఎందుకంటే ఆయన నా మంచి కోసం చేసిన రెండో ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. కానీ ఈ సారి నేను ఆ పెద్ద ప్రాణాన్ని నిరుత్సాహ పరచాలనుకోలేదు. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, బహుశా ఇదే దేవుడు ఇచ్చిన తీర్పు అనిపించింది.

మా తగాదాలు అన్నీ తెలుసుకొని కూడా ఏమి తెలీనట్లు నటించలేక వధ అయిపోతున్న అగస్త్యను చూసి నవ్వు వచ్చేది నాకు. చల్లటి కబురులు చెప్పి అన్నీ మరిపించేస్తాడు. ఒక రోజు మాటల్లో “నీ పేరు కి మంచి సార్ధకతను నువ్వు ఇస్తున్నావ్” అన్నాడు.

అర్థం కాక అతడి వైపు చూశాను.

అతడు నిట్టూరుస్తూ ” బృందావనం  ప్రేమికులను కలిపే ఒక తీరం మాత్రమే, కానీ అది ఎవ్వరిని ప్రేమించి స్వీకరించదు. రేపు నీకు పెళ్ళి అయ్యాక వారిద్దరిని కలిపే ఒక తీరం ఈ బృంద- నువ్వు!!” అన్నాడు.

అతడి గొంతులో నిష్టూరo అర్థం అయింది నాకు, కానీ చేయి దాటి పోయిందని మిన్నకున్నాను.

 

 

ఇవాళ నికేతన్ పుట్టిన రోజు అవ్వటంతో తాత గారు వేరే లాయరు ద్వారా దస్తావేజులు అతడి పేరు మీద వ్రాసి మమ్మల్ని సర్ప్రైస్ చేశారు. లాయరు గారు నిరాశగా ఇంటికి వెళ్ళి పోయారు. సుమన్ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నేకేతన్ కి ఇంక పట్ట పగ్గాలు లేకుండా పోయినాయి.

రెండు రోజుల తర్వాత తెల్లారు ఝామున దస్తావీసులతో సహా మాయం అయి, వాటిని తనకు నచ్చిన అమ్మాయి తండ్రికి చూపి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఫోన్ చేసి మరి నాకు చెప్పి, “కావాలంటే నిన్ను కూడా ఉంచుకుంటాను, నీ పరువు కోసమైనా, తాత గారి కోసమైనా ఒప్పుకో” అని బెదిరించాడు.

ఈ విషయం స్వయంగా ఫోన్లో విన్న తాత గారు కొన్ని గంటలు మౌనం వహించిన తర్వాత, “ఆ సగం మెదడు వెధవకి నేను గుణపాఠం చెప్తాను”, అని లాయరు గారిని పిలిచి మరలా తన పేరున మార్చుకున్నారు దస్తావీజులని . అతడి విషయం తనకు చెప్పనందుకు నాకు నాలుగు అక్షింతలు కూడా వేశారు.

మా తగాదాలతో అలసిపోయిన అగస్త్య, నాన్న తో మాత్రం చెప్పి అమెరికా ప్రయాణం అయ్యాడు. ఆలస్యంగా తెలుసుకున్న మేము అతడు ఇంత కాలం ఉన్న గదిలోకి వెళ్ళాము. అక్కడ నాన్న, తాతయ్య, నేను రోజు వారి జీవనంలో ఎలా ఉంటామో అన్నీ భావుకతను జోడించి, చిత్ర పటాల మాలిక లాగా వేలాడ దీసీ ఉంచాడు.

తాత గారు “అతడు ఆణి ముత్యం తల్లి, జార విడుచుకోకు, త్వరగా బయలుదేరు అన్నారు.

“ఓ బహుదూరపు బాటసారి, ఇక్కడే నీ శాశ్వత మజిలీ” అనుకుంటూ రైల్వే స్టేషన్ వైపు పరుగులు తీశాను.

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s