నిజాయితీ అంటే

బెంగళూరు మహా నగరం: గార్డెన్ సిటి కిటకిట లాడే రోడ్లు, జన సంద్రంతో  నిండిన రోడ్లు, ఆకాశాన్నంటే భవంతులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు  , ఉరుకుల పరుగుల జీవనం.

క్యాబు దిగి ఆఫీసు కి పరిగెత్తుకెళ్ళాలని అనిపించి, నిస్సహాయంగా ట్రాఫిక్ లో కూర్చొన్నాను. నేను  ఒక టెలిఫోన్ ఆపరేటర్ గా అంతర్జాతీయ కంపెనీ లో పని చేస్తున్నాను, నాకు ఇది ఒక జీవనోపాధి మాత్రమే. నా అసలు ధ్యేయం ఒక రచయత్రి గా స్థిర పడాలని. ఈ ఊరి  ట్రాఫిక్ కి  క్యాబ్లో కిచెన్ సౌకర్యం ఉంటే 10 మందికి వంట చేయొచ్చు ఆఫీస్ కి చేరే లోపల, 2 నుంచి మూడు మీటింగులు జరపొచ్చు.  నా కో షిఫ్ట్ మేట్ 3 రోజుల నుండి  లీవ్ లో ఉంది… డబల్ డ్యూటీ, నా రచనలు, ఈ ట్రాఫిక్ నా దైనందిన జీవనంలో భాగాలు.

“హలో మర్వెల్” అంటూ సీట్ లో కూర్చోగానే నా డ్యూటీ మొదలెట్టాను. కాల్స్ విడవకుండా వస్తూనే ఉంటాయి. అందునా ఈ సంవత్సరం ప్రభుత్వ ప్రాజెక్ట్లు కూడా వచ్చి పడ్డాయి. ఎక్కడ చూసిన మినిస్టర్ల ఫోన్లు టాప్ చేస్తుండటం తో సెక్యూరిటీ కోసం ప్రతి ఫోను మార్వెల్ నించి ( మా కంపనీ)   కనెక్ట్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు, అంటే ఒక ఫోన్ వస్తే, ఒక మంత్రి గారిని ఫోన్ ద్వారా భేటీ అవ్వాలంటే ముందుగా అది ఒక ముగ్గురు నుంచి ఐదుగురు ఆపరేటర్ల చేతులు మారి ఆయన దగ్గరకు వెళుతుంది. ఈ రకంగా నంబర్లు పట్టుకోవటం కష్ట  తరం చేస్తాయి. ఇది కేవలం కొంత మంది ముఖ్యమైన మంత్రుల వరకు మాత్రమే, చివరికి వారి భార్యలు  కూడా వీటి ద్వారానే కాల్ చేయగలరు.

ఒక ఎం.ఎల్.ఏ గారి భార్య రోజుకి వంద సార్లు ఫోన్ చేస్తుంది, ఆయన 100 సార్లూ మాట్లాడతాడు, ఒక సారి ఆయన బిజీ గా ఉండటంతో ఆవిడ ఆయనకు పంపిన లంచ్ బాక్స్లో , కూరలో ఉప్పు సరిపోయిందో లేదో నన్నే అడిగి చెప్పమంది. అప్పుడు నేను చదివిన చదువుకి చేస్తున్న పనికి అర్థం తెలియక వైరాగ్యపు నవ్వు నవ్వాను. మరో కుర్ర మంత్రి గారి భార్య మరియు గల్ ఫ్రెండ్ రోజు ఒకే సారి ఫోన్ చేసి లైన్ కలపమని నా ప్రాణాలు తోడేసే వారు. నాకు విసుగొచ్చి ముగ్గుర్కి కాన్ కాల్ కనెక్ట్ చేశాను. ఆయన మరునాడు పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది, నైతిక బాధ్యతగా..

చేస్తున్న పని చిన్నదే అయినా, నా ఉద్యోగం అంటే నాకు గౌరవం, ఎప్పటికైనా రచయతగా  స్టిర పడతానా  అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకోవటం నా దినచర్య.

పని ముగించి  తెల్లారి 6 గంటలు ఇంటికి చేరుకోగానే నా లాన్ లో ఉన్న మొక్కలు తాజా పూవులతో నాకు స్వాగతం చెప్తాయి. ఇంతలోనే పత్రిక ఎడిటర్ దగ్గర నించి కాల్ వచ్చింది, “నువ్వు వ్రాసే కధకి క్లైమాక్స్” చెప్పమంటూ.

నా కధలో నాయిక, ‘నా’ అనే వాళ్ళు లేని ఒంటరి మహిళకు మెట్రో రైల్ లో కోటీ రూపాయల బ్యాగు దొరుకుతుంది.

దానిని వెంటనే రైల్వే అధికారులకి ఇస్తే “రేపు నా రెటైర్మెంటు, పైగా ఒంటరి వాడిని, ఇక నాకు చెప్పొద్దు”, అని పట్టించుకోలేదు.

తీసుకెళ్ళి పోలీసులకి ఇస్తే “ప్రైవేట్ ఛానెల్స్ గేమ్” అని ముట్టడానికి కూడా భయపడి, పొమ్మన్నారు. “నిజాయితీగా ఉండటం కూడా తప్పేనా?” అని కాలనీ ప్రేసిడెంట్ కిస్తే దొంగ నోట్ల తో ప్రతి పక్షాల మనిషి పంపాడు అనుకోని అవమానించి పంపుతాడు.

నిరాశగా బ్యాగుతో రాత్రి పూట వస్తుంటే నలుగురు రౌడీలు, ఆమెను అటకాయించి బ్యాగు లాక్కోటానికి ప్రయత్నిస్తారు. ఆమె వారితో పోరాడి ప్రాణాల మీదకు తెచ్చుకొని ఎలాగో బ్యాగు తో సహ ఆసుపత్రి లో చేరుతుంది. కోలుకున్నాక డాక్టరు “డబ్బు వద్దు అనుకున్న దానివి, అది వాళ్ళకి ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవచ్చు కదా, ఎలాగూ ఎవరు లేరు నీకు ఏం చేసుందామని అంతలా కత్తి పోట్లు కూడా భరించావు?”  అని అడుగుతుంది. మౌనంగా ఉన్న ఆమె ఇది “నిజమే కదా, ఎందుకలా చేశాను?” అనుకోని, చర్చిలో ఫాదర్ ముందు మోకరిల్లి జరిగింది చెప్పి “ నేను నా ప్రాణం కన్నా డబ్బుని ప్రేమిస్తున్నానా? ఒక వేళ నిజమైతే డబ్బు వారికి ఎందుకు అప్పగించాలనుకున్నాను, నాలో నిజాయితీ ఉందా లేదా? ఫాదర్ అని అడిగింది.

ఆయన ఏం సమాధానం చెప్పాలో నాకు తోచట్లేదు.

యధా విధిగా నైట్ షిఫ్ట్ లో కూర్చొని నా పని మొక్కుబడిగా చేస్తున్నాను, కానీ నా ధ్యాస అంతా కధ ముగింపు మీదే ఉన్నది. నాకే తెలీకుండా నిద్ర ముంచుకు వస్తోంది డబల్ డ్యూటీ వల్ల . కాల్ కనక్ట్ చేశాక మేము మా కాల్ డిస్కనెక్ట్ చేయాలి, అప్పుడే ఇంకో కాల్ మాకు కనెక్ట్ అవుతుంది. కానీ ఒక కాల్ మాత్రం కనెక్ట్ చేసి , నా లైన్ డిస్కనెక్ట్ చేయకుండా హెడ్ ఫోన్స్ తో సహ డెస్క్ మీద పడుకున్నాను, ఏవో మాటలు వినిపిస్తున్నాయి మగత నిద్రలో. చివరి మాటలు నన్ను ఉలిక్కి బడేలా చేశాయి.

“రేపు మద్యాహ్నం 3 గంటలకు, మినిస్టరు సోమలింగం సభలో ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరగాలి”  కాల్ కట్ అయింది. నాకు పిడుగు పడ్డన్త పని అయింది. ఒక్క సారిగా ఆ కాల్ ఎక్కడ నించి వచ్చింది అని చూసేసరికి నంబర్ ఎరేశ్ అయిపోయింది, సెక్యూరిటి పర్పస్ కోసం కల్పించిన సౌలభ్యం.

టైమ్ చూశాను, అర్ధరాత్రి 1.30 గంటలు అయింది. కారు చీకటి, నిర్మానుషమయిన రోడ్లు.  పరుగెడుతున్నాను పోలీస్ స్టేషన్ వైపు.

అన్నట్లు నా పేరు రుచిత.

********************************************************************

పోలీస్ స్టేషన్: ఆయాస పడుతూనే నేను విన్న కాల్ గురించి చెప్పాను.

సి.ఐ నా వివరాలు అన్నీ తీసుకొని, “మినిస్టర్ మీటింగ్ ఎక్కడ అని చెప్పారు మాడామ్”? అని అడిగాడు చాలా సౌమ్యంగా.

“సరిగా వినబడలేదు.  మగత నిద్రలో విన్నాను, కానీ ఇది మాత్రం నిజం”

వెంటనే పక్కన వున్న కాన్స్టేబల్ “ఆఫీసులో పీడ కల” అని ఒక కధ వ్రాసుకోండి మాడమ్, మా సమయం వృధా చేయకండి” అన్నాడు.

సి.ఐ గారికి చటుక్కున కోపం వచ్చి, “ఒక ఆడ పిల్ల అర్ధ రాత్రి, డ్యూటి వదిలి మరీ ఒంటరిగా వచ్చి కంప్లయంట్ ఇస్తుంటే పరాచకాలు ఆడతావా, ముందు కంప్లైంట్ తీసుకో” అని అరిచాడు.

నాకు  మాత్రం నా ముందు ఉన్న సమస్య ప్రభావం చేత, కాన్స్టేబల్ మాటకు కోపం కూడా రాలేదు, ఎంత త్వరగా దీన్ని ఆపాలా..  అని మాత్రమే ఆలోచిస్తున్నాను.

“ సోమలింగం గారి మీటింగ్ ఎక్కడో, ఆయన పి.ఏ కి ఫోన్ చేసి అడగండి. అలాగే ఆమె కి వచ్చిన కాల్ ట్రేస్ చేయండి”, అని ఆర్డరు వేశారు సి.ఐ గారు.

వెళ్ళిపోతున్న నన్ను  కాన్స్టేబల్ పిలిచి, “మా సి.ఐ గారు కంప్లైంట్ మాత్రమే తీసుకుంటారు, పని జరగదు” అన్నాడు.

నేను  సి.ఐ గారి మీద నమ్మకం తో అక్కడ నించి కదిలినా, ఎందుకయినా మంచిది అని అక్కడ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ వైపు పరుగులు తీసాను.

ఇంటి ముందే వాచ్ మాన్ అడ్డు పడ్డాడు. నేను  పూర్తి విషయం చెప్పినా “ఆయనకు సొంత గన్ మెన్లు లేరా, నీ లొల్లి ఏంది, పో ఇక్కడ నించి నాకు మాట వస్తుంది” అని తరిమి కొట్టాడు నన్ను.

********************************************************************

తెల్లవారింది 7.30 గంటలు : ఇంటికి వచ్చి సోఫాలో కూలబడగానే ఎడిటర్ గారి నించి కాల్, “ముగుంపు చెపుతార లేక మాకు ఏది నచ్చితే అది వ్రాసేయమంటారా” అని.

సమాధానం గంటలో చెప్తాను అని తిరిగి పోలీసు స్టేషనుకు బయలుదేరాను. దారి మధ్యలోనే సి.ఐ గారు ఫోన్ చేశారు, “ అమ్మ రుచిత ఆయన ఇవాళ ఎలాంటి సభకి వెళ్ళట్లేదు అని తెలిసింది, ఇంక నువ్వు వదిలేయ్.”

“అయితే నేను నిజంగా తప్పుగా విని అందరినీ కంగారూ పెట్టానా? థాంక్స్ సర్!” , ఫోన్ పెట్టేసి, నాకు చాలా నిశ్చింతగా అనిపించి వెనక్కి బయలుదేరాను.  నా కధకు ముగింపు ఇవాళ పంపాలి కదా, అనుకున్నానో లేదో ఒక ఆంబులెన్సు వెనక నించి గుద్దేసింది నన్ను.

కళ్ళు తెరిచి చూస్తే ఆసుపత్రి లో కాలుకి ఒక చిన్న కట్టుతో ఉన్నాను. మూడు రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది లేడి డాక్టర్.

ఇంతలో పక్క నె ఉన్న రెసెప్షన్ లో నించి “ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి సోమలింగం గారి సభ, జె.పి. గ్రౌండ్ లో” అనే వార్త వినబడింది. హతాశురాలయ్యాను, నా చెవులను నేను  నమ్మలేక పోయాను. కుంటుతూనే రెసెప్షను వైపు పరుగులు తీసాను, వార్త మళ్ళీ కనబడలేదు.

కుంటి పరుగులు తీస్తూ నా బెడ్ దగ్గరకు చేరి సి.ఐ గారికి ఫోన్ చేసాను, స్విచ్ ఆఫ్ఫ్ అని వచ్చింది. నా అనుమానo బల పడింది, వెంటనే ఆటో తీసుకొని మంత్రి గారి ఇంటికి బయలుదేరాను, అదే వాచ్ మెన్ మళ్ళీ అడ్డు పడ్డాడు. అతన్ని ఒక్క తోపు తోసి పెద్ద లాన్ దాటుకుంటూ, పెద్ద గదులు దాటుకుంటూ పరుగెట్టాను, ఆయన లేకున్నా ఆయన భార్యకు చెబుదామని. కానీ ఆవిడ పక్షవాతం వచ్చి మంచంలో పడి తన అన్న చేత సపర్యలు చేయించుకుంటోంది. ఆయనను పిలిచి మంత్రి గారిని జాగ్రత్త పడమని చెప్పాను, ప్రతిగా ఆయన “ మా బావ గాడు పోతే పోనీ, మధ్యలో నీకెందుకు, మా చెల్లి స్థానం నీకు ఇస్తా అన్నాడా?” అని వెకిలిగా నవ్వాడు.

అతడి పరుషమైన మాటలు నాకు  అతడంటే ఏంటో తెలిసేలా చేశాయి.

తిరిగి మినిస్టరు గారి సభా ప్రాంగాణం వైపు పరుగులు తీసాను , కానీ అప్పటీకే సమయం మధ్యాహ్నం రెండు గంటలు అయింది.

సరిగ్గా సభా స్థలానికి కొద్ది దూరంలో ట్రాఫిక్ లో చిక్కుకుపోయి, ఆటో దిగి అటు కేసి పరుగు లంకించుకున్నాను. ఆయన ఉపన్యాసం మైకుల్లో వినబడుతోంది. స్టేజి మీదకి వెళుతున్న నన్ను సి.ఐ గారు ఆపేశారు, “ రుచిత నీకు తెలీదు, అంతా తర్వాత చెప్తాను, పద ఇక్కడ నించి” అన్నారు.

“బాంబు పేలితే ఎంత మంది చనిపోతారో తెలిసి కూడా, నాకు అబద్దం చెప్పారు”

“అబద్దం కాదు, ఎవరికి తెలీకుండా సెర్చ్ చేస్తున్నాము”

“అబద్దం! ఇక నమ్మలేను. చాల తక్కువ సమయం ఉంది, ఇప్పుడు 2.55 అయింది. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది.” అన్నాను నిక్కచ్చిగా.

గన్ నా  వెన్నుకి పెట్టి పక్కకి రమ్మని హెచ్చరించాడు, అంత మంది జనంలో సి.ఐ.

చేసేది లేక స్టేజి వెనకాలకొచ్చిన నన్ను, గన్ వెనక భాగంతో కొట్టి గాయపరిచి స్టేజి కింద తోసేశాడు.

ఆ పడేటప్పుడే నాకు స్టేజి కింద ఉన్న  బాంబు కంట పడింది, టైమర్లో 4 నిమిషాలు చూపిస్తున్నాయి, పేలుడు ఎలా ఆపాలో కూడా తెలీదు, గూగుల్ ఓపెన్ చేసి చూశాను , రక రకాల ఫోటోలు, సమయం లేదు.

ఎటు చస్తామన్నపుడు, ఏదో ఒకటి చేద్దామనుకొని కళ్ళు మూసుకొని ఒక ఫ్యూజు లాగేశాను, అంతే టైమరు ఆగిపోయింది. ఊపిరి పీల్చుకొని ఆ మట్టి నేల మీద ఒరిగిపోయాను.

పేలుడు సమయానికి సి.ఐ అక్కడ నుండి వెళ్ళిపోతాడని నాకు తెల్సు. మంత్రి గారెకి తన మీద జరిగిన హత్యా ప్రయత్నం చెప్పాలి అనుకోని ఆయన దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేశాను, కానీ జన సంద్రం తోసేసింది. ఇవాల్టికి కాపాడాను, రేపు మరెవరో కాపాడకపోరు అని వెనుతిరిగాను.

పది నిమిషాల్లో ఒక కాల్ వచ్చింది, “ నేనమ్మ సోమలింగం.  కాన్స్టేబల్, వాచ్ మెన్, మా బావ మరిది వెంట వెంటనే ఫోన్లు చేసి చెప్పారు. నిన్ను రేపు వచ్చి కలుస్తాను”, ఫోన్ కట్ అయింది.

మరో కాల్ వచ్చింది, ముగింపు చెప్తారా? అంటూ ఎడిటర్ గారి దగ్గర నించి.

“వ్రాసుకోండి . “ ఆ డబ్బు సరి అయిన చోటకి చేర్చే ఉద్దేశ్యం తో పోరాడవు, నీ ప్రాణం కోసం కూడా బ్యాగు వదల లేదు, అదే నిజాయితీ అంటే అన్నారు ఫాదర్”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s