“ప్రజ్వల్ …ప్రజ్జు… నిన్నే ..ఒక సారి లే..” అంటూ మొద్దు నిద్ర పోతున్న భర్తను నిద్ర లేపింది సౌమ్య.
“అబ్బా మళ్ళీ మొదలెట్టావా సౌమ్యా, నీ గొడవ.. నన్ను పడుకోనీ” అంటూ మంచం వదిలి సోఫాలో పడుకున్నాడు ప్రజ్వల్.
“కాదు, మళ్ళీ ఆ ఖాళీ ఇంట్లో నించి నవ్వులు వినిపిస్తున్నాయి, ప్లీస్ ఒక సారి చూద్దాం రావా?
“నీ మొహం, దెయ్యాలకు కూడా ప్రైవేసి కావాలి, వాటి మానన వాటిని వదిలి నువ్వు పడుకో, లేక పోతే నీ బాత్రూమ్ లోకి వాటిని రమ్మంటావా”?
“నీకసలు భార్య అంటే ప్రేమ లేదు, నువ్వన్నట్లు ఇవాళ వదిలేస్తే రేపు అవి మన ఇంట్లో కి వస్తాయి, ప్రజ్జు, ఒక్క సారి రా చూద్దాం…, నువ్వు ఆఫీస్ కెళ్ళినపుడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాను….”
“అంత భయం ఉంటే నన్ను వదిలి నీ పుట్టింటికి పో, నాకు రెపొద్దున్నే 6 గంటలకే రోడ్ షో ఉంది, పడుకోని” అంటూ దిండు చెవుల మీద పెట్టుకుని మళ్ళీ నిద్రపోయాడు.
ఒక్క సారి కోపంతో ఆమె, “భార్య అని అనే లెక్క ఉందా, రాముడు సీత కోసం లంక మీద దాడి చేశాడు కానీ, నాకెందుకు వచ్చిన తిప్పలు అని వదిలేయలేదు” అని సెంటిమెంటల్ డైలాగ్ కొట్టింది.
“ఇప్పుడేమంటావ్ సౌమి, అది ఖాళీ గా ఉన్న ఇల్లు, ఆ బాత్ రూమ్ వైపు నువ్వెందుకు చూడటం, పైగా నన్నెందుకు పిలవటం, ఒక వేళ నిజంగా దయ్యం అయితే? నన్ను తినేస్తే? నిన్ను ఎవరు చూసుకుంటారు, అసలే పిచ్చి మాలోకానివి” అన్నాడు …సముదాయిస్తూ.
“వెళతావా, లేక నన్నే, నిన్ను చంపేయమంటావా” అంటూ హూంకరించింది.
“నీ రభస అంతా నా దగ్గరే, ఒక్క దానివే వెళ్ళొచ్చుగా” అంటూ నిదానంగా టార్చ్ లైట్ తీసుకొని ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు.
చుట్టూ చిమ్మ చీకటి, దూరoగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి వైపు చూసిన అతనికి గుండె ఝల్లుమన్నది. అసలు ఈ కాలనీలో ఎవరికి పట్టని సంగతులు అన్నీ ఈ సౌమ్యకే పడతాయి. భయ పడి ఆగి పోయి..తిట్టుకుంటూ నిల్చున్నాడు, ” ముందుకెళితే ఒక దయ్యం, ఇంటి కెళితే సౌమ్య అనే దయ్యం అనుకోని” ముoదుకు అడుగులు వేశాడు.
ఖాళీ ఇంటి తలుపులు ఓరగా తెరిచి ఉండటం చూసి నెమ్మదిగా లోపలికి వెళ్లాడు. టార్చి ఆన్ చేసి చూస్తే ఊడి పోయిన వయర్లు, పెచ్చులు ఊడిన శ్లాబు తప్ప ఏమి కనబడలేదు. మరి కొంచెం ముందుకు వెళ్ళాడు.. ధైర్యంగా. ఒక్క సారిగా… పెద్దగా ఒక ఆడ పిల్ల నవ్వులు వినిపించాయి.
అంతే దెబ్బకి గుండె జారీ కళ్ళు తిరిగి నేలకి ఒరిగాడు.
తెల్లవారు ఝామున 4.30 గంటలకు :
“అంకల్…అంకల్..” అంటూ పక్కన ఇంటి శ్రేయ అతడి మొహం మీద నీళ్ళు చిలకరించింది.
అతడు భయంతో “దెయ్యం దెయ్యం” అంటూ అరిచాడు.
“అంకల్..నా మాట వినండి.. దెయ్యం కాదు.. నేను శ్రేయని..” అన్నది అతడి నోరు మూసేస్తూ.
“నువ్వా.. ఇక్కడ ఏం చేస్తున్నావ్…”
“అంకల్..! నేనే కాదు. బోయ్ ఫ్రెండ్స్, గాల్ ఫ్రెండ్స్ ఉన్న మన కాలనీ వాళ్ళంతా తల్లి తండ్రులకు తెలీకుండా ఈ పాడు బడ్డ ఇంటిని వాడుకుంటాం. ఎప్పుడో ఒక అమ్మాయి చనిపోతే అది దెయ్యం అయిందని కధ ప్రచారంలో ఉంది, దాని మేము ఇలా ఉపయోగించుకున్నాము” అన్నది.
“నిండా 20 యేళ్ళు లేవు, ఇదేo పాడు బుద్ధి మీకు. మీ అమ్మ నాన్నకు చెప్తాను”.
“చెప్పుకోండి, 50 యేళ్ళు వచ్చిన అమ్మా, నాన్న కి దెయ్యాలు అనే మూఢ నమ్మకాలు ఉంటే, 20 ఏళ్ళు నిండని మేము మోసం చేయటం తప్పు లేదు” అన్నది.
ఆమె ఎవరో అని కూడా చూడకుండా అతడు ఆమెని చాచి పెట్టి కొట్టాడు. “దెయ్యాలు ఉన్నాయో లేవో మూఢ నమ్మకం కావొచ్చు కానీ మీ మీద ప్రేమ కొద్దీ వాళ్ళు ఇటు రావోద్దన్నారు. కానీ మీరు నమ్మకాన్ని పోగొట్టి తల్లి దండ్రుల ప్రేమ నిజమయిన మూఢ నమ్మకం అని నిరూపించారు” అన్నాడు ఆవేశంగా.
“సారి.. అంకల్” అన్నది.. తల దించుకొని.
“నువ్వు ఎవరితో తిరిగినా వాళ్ళు నిన్ను ఆపలేరు, అలాగే నీ జీవితం చెడిపోతే కూడా వాళ్ళు బాగు చేయలేరు, ముందు ఇంటికి వెళ్ళు” అని అరిచాడు.
ఆ తర్వాత ఆ ఇంటికి తాళం వేసి ఇంటి యజమానికి “దయ్యాలు వదిలించాను” అని ఫోన్ చేశాడు ప్రజ్వల్.
20 యేళ్లుగా కాలనీకి పట్టిన దయ్యాలు వదిలాయని అందరూ అతడిని పొగుడుతూ సత్కారం చేశారు.
సౌమ్య నిజాంయియా రాముడివి అంటూ పొగడ్తలతో ముంచేసింది.