నిరీక్షణ

రోజు లాగే ఇవాళ కూడా మా ఇంటి ముందు తుషార బిందువులు పచ్చని పచ్చిక మీద వాలి వజ్రాలుగా రూపాంతరం  చెంది మెరుస్తున్నాయి. గాలి కెరటాలకు తాళ లేక ఎగిరిపోతున్న నా కురులను ఒక పక్క, ఉద్థృతంగా ఎగసి పడుతున్న నా ఆలోచనా ప్రవాహాన్ని సంభాళించుకోలేక  మరో పక్క నేను మదన పడుతుంటే, నా కన్నులు మాత్రం అలసిపోకుండా వెదురు వంతెన వైపు చూస్తూనే ఉన్నాయి.  నీ నిరీక్షణకు  అర్థం లేదు అన్నట్లు  పారిజాతాలు నేల రాలి సంకేతాన్ని అందించాయి. అన్నీ అర్థ వంతంగా, సమంగా ఉంటే నిరీక్షణ అనే పదం ఎందుకు  పుడుతుంది, అసలు అది నిరీక్షణ ఎందుకు అవుతుంది, బదులుగా ఇంకోటేదో ఇచ్చి కొనుగోలు కాబడే వస్తువు అవుతుంది.

అవును నా మాటలు మీకు అర్థం అవుతున్నాయో లేదో కానీ, ఎప్పుడయానా దేని కోసమయినా ఎలాంటి ఆధారం లేకుండా ఎదురు చూసారా, కేవలం మీ మనసు చెప్పిన మాట విని.నేను చేస్తున్న ..అంతు లేని నిరీక్షణ, ఒక దారి తెన్ను లేని గమ్యం కోసం, నేను చేస్తున్న- ఒక సుదీర్ఘ ప్రయాణం….. కేవలం గమ్యం మాత్రమే తెలిసి, కను చూపు మేరలో కనబడని అగమ్యగోచరం వైపు , కనురెప్పల మాటునే ఉండి దొబుచ్చులాడుతున్న నేను  కట్టుకున్న బంగారు కల.. కోసం నేను చేస్తున్నాను అంపశయ్య మీద  ప్రయాణం… దయ చేసి రక్షించొద్దు అని వేడుకుంటున్న దారి కాచి చూస్తున్న గడ్డి పూవులను.

ఈ రోజు కూడా రాలేదు-నా ఆశలు నీరు కారుస్తూ.. నా పట్టుదలను మరింత పటిస్టమ్ చేస్తూ

ఈ రోజు కూడా రాలేదు-నా నిజాయితిని శంకిస్తూ… నాలో ఉన్న అంత్: శత్రువుల బలానికి  ఉత్ప్రేరకంగా మారుతూ

ఈ రోజు కూడా రానే లేదు- నేను కట్టుకున్న బంగారు కల నన్ను కాదని వెళ్ళ కలదా..అంటూ ఆలోచనల్తో కొట్టుకుపోతున్న నాకు  “చిన్నమ్మ ! ఇవాళ కూడా ఓడ రాలేదు, ఇంక వెళ్ళు అంటూ ముసలయ్య చెప్పి నిట్టూర్చాడు.

“కాదు ముసలయ్య.., గట్టు మీద పున్నాగ పువ్వులు చూశాను, తను వచ్చిన రోజు అవి పూస్తాయి అని చెప్పాడు.”

“పిచ్చి తల్లి, వెళ్ళు గుడి  గంట కొట్టేస్తున్నారు, వినబడట్లా….వెళ్ళు,  మధ్యాహ్నం 12 అయింది.”

రెప రెప లాడే……కొంగుని గాలికి అలాగే వదిలేసి తిరుగు ప్రయాణం పట్టిన ఆమెకు…

సంగీతా… ” నీ భావ కవితలు ఆపి నా వైపు చూస్తావా ..?, నీ కొక మొగుడున్నాడు, వాడిని చూసుకునే భాద్యత నీకు ఉంది అని గుర్తుందా?” అంటూ వచ్చాడు అభిలాష్.

అతనిని చూడ గానే కళ్ల నీళ్ళ పర్యంతం అయింది సంగీత.

“చూడు అభిలాష్, రేపే కవితలు, కధల పోటీ ఆఖరు తేదీ, ఒక్క ఆలోచన కూడా రావట్లేదు, నువ్వు మీ స్నేహితుల తో వెళ్ళు ఈ వీకెండ్, ఏమి అనుకోకు” అన్నది  చాలా నిరుత్సాహంగా.

“దానికయినా కాస్త కడుపులో ఏదన్నా పడితే కదా వెళ్ళగలను. లేదంటే చెప్పు హోటల్ కు వెళ్ళి సర్దుకుంటాను”  అని కస్సుమన్నాడు.

“ఒక్క రోజుకి ఎక్కడో తినొచ్చు గా,.? ఎటూ స్నేహితులతో అలవాటు ఉన్న వాళ్ళకి నా అనుమతి కావాలా, నా పని కి అడ్డు పడక పోతే”? అని తిట్టుకుంటూ పొయ్యి వెలిగించింది సంగీత.

తన ఆలోచనలు అన్నీ కధలో నాయిక, ఎవరి కోసమో ఎదురు చూస్తోంది, ఆమెను తను అనుకున్న తీరం ఎలా చేర్చాలి అనే తపనతో కొట్టుకుపోతున్నాయి.

“అభిరామ్  మరీ విడ్డూరం, పాత కాలపు మనిషి, ఊరికి వెళ్ళాలంటే నేనే అన్నీ సర్దాలా? అనుకుంటూ మొత్తానికి అన్నీ బట్టలు సూట్కేసులో సర్డింది. మనసు మాత్రం ఒక పక్క నాయికను ఎలా తన  తీరానికి చేర్చాలో  తెలియక , మరో పక్క కధల పోటీ ఎలా జయించాలో తెలీక  చాలా నలిగి పోతోంది.

ఈ సారి పోటీ చాల తీవ్రంగా ఉంది, కధల మీద, పుస్తక పఠనం మీద ప్రపంచం మళ్ళీ ఒక్క సారి తిరిగి చూసింది.. టెక్నాలజీ ఇంత పెరిగిన రోజుల్లో కూడా..

“నా షేవింగ్ సెట్ పెట్టావా”? అంటూ అరిచాడు కంప్యూటర్ దగ్గర కాలు మీద కాలు వేసుకొని అభిరామ్.

అలా అన్నీ నాకే చెప్పకపోతే చిన్న చిన్న వస్తువులు  తను సర్దుకోవచ్చు కదా.. కనీసం, తన పర్సనల్ వస్తువులు కూడా నన్నే అడగాలా అనుకుంటూ..”పెట్టాను” అని గది లోనించే సమాధానం ఇచ్చింది.

“అన్నట్లు నా స్నేహితుడు అరవింద్ కూడా వాళ్ళ కొడుకుతో వస్తున్నాడు, వాళ్ళవిడ పురిటికని పుట్టింటి కెళ్లింది, ఆ బాబుకు ఏదన్నా స్వీట్ చేసి పెట్టు, ప్రయాణంలో ఇస్తాను.”

“ఇంకా ఒక పెద్ద లిస్టు చెప్పొచ్చుగా, మిమ్మల్ని ఊరికి, నా కధని కంచికి పంపిస్తాను” ఈ సారి గట్టిగా అరిచింది ఉండబట్టలేక.

“అంత కోపం ఎందుకు? చిన్న పిల్లాడి కోసమే కదా అడిగింది,  నీ పేరు చెపుతాను లే ఆంటీ ఇచ్చింది”  అని అన్నాడు, ఆమెను  శాంత పరిచే ప్రయత్నం చేస్తూ..

ఆమె, అతని టిఫిన్ బాక్స్ సర్ది, బట్టలు సర్ది , అతని చుట్టూ తిరిగి అలసిపోయి, పోటీకి నీళ్ళు ఒదిలేసుకుంది.

రాత్రి 7 గంటల వరకు అతడు, ఆమెకు చెప్పిన కబురు చెప్పకుండా చెప్తుంటే అన్నీ శ్రద్ధ లేకపోయిన శ్రద్ధ గా విని  నవ్వుతూ అతడిని బస్ ఎక్కించింది.

ఇంటికి చేరే సరికి 10 అవ్వటంతో అలసి పోయి అన్నిటిని పక్కకి పెట్టి మగత నిద్రలోకి జారుకున్న ఆమెకు  బహుమతి ఎవరికో సొంతమయినట్లు కల వచ్చి మరింత కలవర పెట్టింది.

ఒక్క ఉదుటున దుప్పటి తన్ని మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేసింది. నీరీక్షణ అనే కవితను పూర్తి చేయటానికి కూడా నిరీక్షించాను  అనుకుంటూ, ఫైల్ తెరిచి చూడగానే అసంపూర్ణంగా ఉన్న ఆమె భావ కవిత సంపూర్ణం అయి ఉన్నది….

“రెప రెప లాడే నీ పైట కొంగు నా వైపే వస్తుంటే నువ్వు మాత్రం నన్నొదిలి  వెళుతున్నావా,

గాలి తాకిడికి తట్టుకోలేని నీ కురులను సంభాళించ లేక  వెళుతున్నావ లేక

నీ ఎగసి పడే ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేక వెళుతున్నావా,

నిరీక్షణ అనే పదం నీ కోశమే పుట్టిందా, లేక నీకు మాత్రమే ఆ పదం మీద హక్కులున్నాయా,

బంగారు కలలే ఉన్నాయా లేక  నీ కలలో నాకూ చోటుందా?

ని-రీ-క్షణలోని క్షణాలన్నీ నీవే అనుకుంటే మరి ‘నీ’ అనే ‘నేనెక్కడ’? మనవే అయిన “క్షణాలెక్కడ”?

అంటూ ఆమె స్నేహితుడు ఓడ దిగుతున్నాడు.

భావ కవిత చదవటం ముగించి ఆమె ఉద్వేగానికి లోనవగా, చిరునవ్వుల సమ్మేళనంతో కనుల ముత్యాలు జాలు వారాయి.

పరుగున ఫోన్ అందుకున్న ఆమెకు స్క్రీన్ మీద వాట్సప్ప్  లో అన్రీడ్ మెస్సేజ్ దర్శనమిచ్చింది… “చిన్న చిన్న పనులు చేసుకోలేని , నా నిరీక్షణలో క్షణాలన్నీ నీవే అయితే, ‘నీ’ అనే నేను ఎక్కడ…?

మిస్ మీ…ప్లీస్…..అభిలాష్.

కవితను మరో సారి చదువుకొని పోటీ కి పంపిన సంగీత, నిరీక్షణ అవసరం లేని బహుమతి తనకు భర్త రూపం లో దొరికినందుకు తృప్తిగా నిద్రలోకి జారుకున్నది.

***********************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s