పరిపక్వత

తను వచ్చి నిల్చున్నాడు ఎదురుగా, ఆశ్చర్యమే నా వంతుగా లోకాన్ని మరిచి చూస్తున్న,  కలా? వైష్ణవ మాయ అనిపించింది ఒక్క క్షణం. పాతికేళ్లుగా రాని వాడు ఇప్పుడెలా వచ్చాడు, సమయo కూడా దాటిపోయింది కదా! అనుకుంటూ ” ఏం కావాలి”, అన్నాను, ” మీ పేరు” అని అడగబోయి.

తనకీ మాత్రం ఇన్ని రోజుల తర్వాత మాట్లిడినందుకు సంతోషం కళ్ళల్లో స్పస్టంగా కనిపిస్తోంది.

కళ్ళెర్ర చేద్దామనుకున్న నాకు, తెలీకుండా బుగ్గలు ఎర్రబడుతున్నాయి.  మరింత కఠినత్వాన్ని తెచ్చుకొని ఇంకో సారి పలకరించటానికి కూడా భయ పడేలా పరిధులు పెట్టాను.

తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకున్నాను, “దేవుడు ఇలా కూడా శిక్షలు వేస్తాడా?” అని. అవును అందరికీ డ్రీమ్ బాయ్స్ ఉంటారు, కానీ నాకు వీడు ఊహ తెల్సినప్పటి నించి కల్లో కి వచ్చి స్పస్టంగా, “వస్తాను ఎదురు చూడు” అని చేప్పే వాడు. అన్నీ సార్లు సిల్లీ కల అనుకున్నా, కొన్ని సార్లు భయం కూడా వేసేది, ఆ హెచ్చరిక కి. దాంతో అమ్మోరి గుళ్ళో తాయిత్తు కట్టిచ్చుకున్నాను. ఆ తర్వాత పెళ్ళై బాబు  కూడా పుట్టాడు కానీ, వాడు  నా కల్లోకి రాలేదు, కనీసం గురుతుకు కూడా రాలేదు..

ఒక రోజు అకస్మాత్తుగా మా బాబు తో పార్క్ లో ఆడుతుంటే కనిపించాడు. భయంతో భూకంపం వచ్చినంత  పని అయింది, గొంతు తడి ఆరిపోయింది. అవును మరి కల్లో కనబడ్డ వ్యక్తి అకస్మాత్తుగా ఎదురు పడితే.. కాస్తైన కలవరం కలగదా, ఎందుకంటే ఇప్పుడు నేను ‘కల’, ‘వరం’ అనుకోనే సమయం కాదు కాబట్టి.

దగ్గరికి వచ్చి, “గుర్తు పట్టారా” అన్నాడు.

అతడి ప్రశాంతమైన వదనం చూస్తే ఎవరికైనా మనసు ఆహ్లాద పడుతుందేమో కానీ నాకు ఒక సమస్య గా కనబడుతుంటే “మీరెవరు” అన్నాను, పెగలని నా స్వర పేటికను పెకిలేస్తూ.

రోజు ఇక్కడే పార్క్ లో చూస్తాను, తెలుసేమో అనుకోని వచ్చాను, ఇంతకు ముందు ధైర్యం చాలేది కాదు అన్నాడు, అనాలోచితంగా.

అతను అంత చనువుగా మాట్లాడ్డం నాకు నచ్చలేదు, మనిషి కల్లో ఉన్నట్లే ఉన్నాడు కానీ, భావనలు నాకు విరుద్దంగా వున్నాయి. ఇంతలో ” డాడి! ” అంటూ చిన్న పాప వచ్చి అతడి చేయి పట్టుకుంది”.

“ఏం టైమింగ్ ఈ దేవుడిది? నా డ్రీమ్ బాయ్ ని, ఒక బిడ్డ కి తండ్రి ని చేసి, తర్వాత చూపించటంలో అర్థం ఏంటి” అనుకుంటూ సమస్య జటిలం అవ్వకూడదని అక్కడ నుండి బయలుదేరిన నన్ను ఆపి, “మీ ఇంటి దగ్గరే మా ఇల్లు” అని చెప్పి వెళ్ళి పోయాడు.

అగ్ని లో దూకినా మనసుకి స్వాంతన కలగదేమో నాకు, “ఇది నా తప్పు కాదు, నాకు గా నేను పరిచయం చేసుకోలేదు, నాకుగా మాట్లాడాలని పరితపించలేదు” అనుకోని అమ్మవారి గుడికి వెళ్ళి తాయత్తు కట్టించుకున్నాను.కల్లోకి వచ్చే అబ్బాయి ఎదురు పడితే అది దేవుడి లీలా అనాల? లేక నా దృస్టీ లోపం అనాలో తెలీక తికమక పడ్డాను.

**********************************************************************

మరుసటి రోజు నించి పార్క్ కి వెళ్ళటమే మానేశాను, నా అంతరంగం నన్ను మెచ్చుకున్నది. నా చరిత పుటలు లిఖించుకునేపుడు ఒక్క మచ్చ కూడా ఉండకూడదనే నా భావనకు, నా మనస్సు పరిణితితో ఆలోచించి నిష్కల్మషంగా సమ్మతించింది.

మరలా నాలుగు రోజులకు, అతను తారస పడ్డాడు ఇంటి దగ్గర. ” మొన్న కనిపించినపుడు కేవలం ఎక్కడో చూసినట్లు అనిపిస్తే పలకరిOచాను, తప్పుగా అనుకోకండి అన్నాడు” సూటిగా.

నాకు మరింత గౌరవం పోయింది, అప్పుడొక వంక , ఇది మరో వంక అనిపించింది.నిజమా అబద్దమా అని ఆలోచించే అవసరము- అగత్యము నాకు లేదనిపించి వడి వడి గా ఇంటికొచ్చేశాను.

********************************************************************************

మా ఇంటి కాంపౌండ్ లో ఆడుకుంటున్న మా బాబు దగ్గరకు, ఆ పాపతో సహ అతను మళ్ళీ వచ్చాడు. నా సమస్య గుమ్మంలో వచ్చి నుంచున్నది. తరిమి కొట్టలేను కనుక ” బాబు కి జ్వరం గా వుంది, మీ పాప కి కూడా అంటుకోవచ్చు, తీసుకెళ్ళండి” అని నికచ్చిగా చెప్పేశాను. కొన్ని విషయాల్లో చాలా నికచ్చిగా ఉండాలి కదా మరి!

” మీరు ఎంత వరకు చదువుకున్నారో నాకు తెలీదు కానీ, కొన్ని స్నేహాలకి పేరు, అర్థం వెతక కూడదు” అన్నాడు అంత కంటే నిక్కచ్చిగా.

“ఎంత చదువుకున్నా ఏం లాభం, ” బలవంతపు స్నేహాలు అంటకట్టకూడదని తెలియనపుడు”  అన్నాను ముభావంగా.

అతను మాత్రం నా మాట పట్టించుకోకుండా పాపకి, మా బాబు తో గొడవ పడొద్దని చెప్పి వెళ్ళి పోయాడు.

అతని తీరు నచ్చకపోయినా పాప మాత్రం చాలా బాగా ముద్దోచ్చేది,  మా బాబు కూడా దానితో కలిసిపోవటం, మా వారు కూడా ఆ పాపను చేర దీయటం మాత్రం నన్ను కలవర పెట్టేది.

కొద్ది రోజులకు పాప పూర్తిగా మా ఇంటి పిల్ల అయిపోయింది. అంతలోనే మాకు తెలిసింది పాప మమ్మల్ని వదిలి ఉండలేక పోవటానికి కారణం తన తల్లి దండ్రుల మనస్పర్ధలే అని. నాకు తెలీని ఆవేదన నన్ను కమ్మేసింది. నాకు ఎందుకు అని వదిలేయాలా? నా కూతురు అనుకోని తనకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వాలా? తేల్చుకొనలేని సందిగ్ధం.

మొత్తానికి పాప భవిష్యత్తు వైపు నా మనస్సు దృస్టీ పెట్టింది. పాప తండ్రి నాతో మాట్లాడాలనే  చేసే ప్రయత్నం పాప తల్లి  కంట పడేలా చేశాను. ఆమెలో అతడు పట్ల ఉన్న అలుసు పోయి, భయం మొదలయింది. తన చేతిలో ఉన్నంత వరకు ఎవరికి మనిషి విలువ తెలియదు, వేరే ఒకరి చేతిలో పడగానే వారు అమూల్యమైన గనిగా కనిపిస్తారు. చిన్న కిటుకు పని చేసింది.

అటు తర్వాత ఆ ఇంటిలో విరిసిన ఆనంద హేల మా ఇంటి తలుపులను చొచ్చుకొని నా చెవుల పడేది. అనుకున్న పని సాధిoచినందుకు మనస్సు కుదుట పడ్డా కూడా, పాప రావటం తగ్గి పోవటం తో మాలో ఏదో కొరత మొదలయింది. మా బాబు, మా వారు బెంగ పెట్టుకున్నారు.

కానీ తప్పదు, ఏది శాశ్వతమో, ఏది ఆశాశ్వతమో తెలియటమే కదా అసలు పరిణితి.

*****************************************************************************

మూడు నెలల తర్వాత ఒక రోజు వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారని తెల్సి బయటకు వెళ్ళాను. ట్రక్కులో సామాను సర్దుతున్న అతడు చెమర్చిన కళ్ళతో ధన్యవాదాలు  చెప్పాడు. వెళ్లిపోతున్న నిమిషాన  అతడి నిజమైన వ్యక్తిత్వం అర్థం చేసుకున్న నేను  ఆ కళ్ళకు నిట్టూర్పు సమాధానం గా చెప్పి లోపలికి వచ్చేశాను.

రాత్రి 11.00 గంటలకు పూర్తిగా ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు.

ఎంత విచిత్రమయిన బంధం ఈ ఆలూ మగల సంబంధం. చిన్న విషయాలకే  మనసు నొచ్చుకొని, కనీసం చిక్కు ముడులు విడ తీసే సమయం కూడా ఇవ్వకుండా వేరే దారిని వెతకటం పరిపక్వత చెందిన బంధం అనిపించుకుంటుందా అనుకుంటూ బెడ్ మీద వాలాను.

మా శ్రీ వారికి ఇలాంటి ఆలోచనలు ఏవి ఉండవు, సుఖ ప్రాణి ,హాయిగా బజ్జున్నారు. పెళ్ళైన దగ్గర నించి  నన్నే దేవతగా ఆరాధిస్తారు, నన్నే రాక్షసి గా భావిస్తారు, నన్నే దాసిగా చూస్తారు, నన్నే ప్రేయసి గా చేరదీస్తారు.

ఆ మాట అనుకోగానే ఎందుకో  తను  బాగా ముద్దోచ్చారు, నా తల ఆయన ఎద పై పెట్టి నన్ను నేను మరిచాను ఒక్క క్షణం.

తను రచితా..అని పిలిచారు మగత నిదురలో … నా కల్పిత కలను కూలదోస్తూ…అవును, ఆ పేరు ఖాళీ చేసి వెళ్ళిన పాప తల్లి పేరు.

*************************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s