ప్రేమ ఫార్ములా

చేతన్ తన పాడుబడిన ఇంటి గేటు తీసుకొని నెమ్మదిగా ప్రవేశించాడు. కాంపౌండ్ అంతా ఎండి రాలిపోయిన ఆకులతో దుప్పటి కప్పుకుందా అన్నట్లు ఉంది. గుబురుగా పెరిగిపోయిన గడ్డితో ఉన్నలాన్ ని చూసి కలత చెందాడు. ఎండిపోయిన మొక్కలు అతడికి స్వాగతం పలుకగా నెమ్మదిగా లోపలికి అడుగులు వేసి తాళం తీశాడు. గుప్పుమన్న దుమ్ము వాసన ఘాటుకు ముక్కుపుటాలు పగిలి పోతున్నా ముందుకు నడిచాడు. అతని చూపులు నేరుగా తన గది వైపు సోకినాయి, అతడి అడుగులు అటు కేసి సాగినాయి.

శిధిలావస్థలో ఉన్న తన గదిని చూసి కళ్ళు చెమ్మగిల్లినాయి. ఈ గదిలో బామ్మ ఓదార్పులు, అమ్మ చెప్పిన కధలు, నాన్న చెప్పిన లెక్కల పాఠాలు, తుషార చెప్పిన ముచ్చట్లు, స్నేహితుడు శ్ర్రీ మిత్ర చెప్పిన కమ్మని అబద్దాలు అన్నీ ఇక్కడే నిక్షిప్తమయి ఉన్నాయి.

అమెరికాలోని  శ్రీ మిత్ర ను చేరుకోటానికి చాలా తక్కువ వ్యవధి మాత్రమే ఉంది. లేదంటే ఒక నిండు ప్రాణo గాల్లో కలిసి పోతుంది. అర క్షణం కూడా వృధా చేయకూడదు అని నిశ్చయించుకొని నిచ్చెన వేసుకొని ఆ గదిలో ఉన్న అటక ఎక్కి, పాత ట్రంకు పెట్టెను తెరిచే ప్రయత్నం చేశాడు. తుప్పు పట్టి ఉన్న పెట్టె తెరుచుకొను అంటూ మొరాయించింది.

పాత ఇల్లు అవ్వటంతో కరెంట్ సరఫరా  లేక చిక్కని చీకట్లు అలుముకున్నాయి. కీటికీలో నించి తొంగి చూసిన అతనికి బయట వీధి దీపాలు మాత్రం ఇంతటి నిశి రాత్రిలో మేము నీకు ఇక్కడనించి మాత్రమే సహాయం  చేయగలము అంటూ మిణుకు మిణుకు మంటూ మెరిసాయి. చేసేది  లేక  ఆ పెట్టెను లాన్లోకి తీసుకొచ్చి గట్టిగా నేల కేశి కొట్టాడు. అంతే అమాంతం తెరుచుకొని ఒక్క సారిగా అతడి పాత పుస్తకాలు అన్నీ నేలన పడ్డాయి.  ఒక్కోటి తెరిచి చూస్తున్న అతనికి తన ప్రయోగాలు, తన మధుర జ్ఞ్యాపకాలు జ్ఞ్యప్తికి రా సాగినాయి. ఆ స్మృతులని బలవంతంగా పక్కకి తోసి తనకు కావలసిన “ఫార్ములా 4” రసాయనం ఉన్న ప్లాస్టిక్ సీసాను తీసుకొని  జేబులో పెట్టుకున్నాడు.

అక్కడ నించి తలుపులు అలాగే వదిలేసి సరాసరి అమెరికాలోని, సియాటేల్ వెళ్ళే విమానం ఎక్కాడు. ప్రయాణ సమయం కనీసం 8 గంటలు, తను ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇక తను జీవితంలో కోలుకోలేడు. ప్రాణాలు  గుప్పేట్లో పెట్టుకొని కూర్చొన్నాడు చేతన్. మెల్లిగా అతడి కళ్ళు మూతలు పడ్డాయి, గత కొద్ది రోజులుగా వీసా కోసం అలుపెరగని ప్రయాణాలు వల్ల బడలిన ప్రాణం నిదరోయింది.

చేతన్ కి,  శ్రీ మిత్ర  ఊహ తెలిసినప్పటి నించి స్నేహితుడు. ఇద్దరు సైన్సు మీద మంచి ఆసక్తి, పట్టు ఉండి పోటా పోటీలుగా కష్ట పడే వారు. శ్రీ మిత్ర ఎప్పుడూ చేతన్ కంటే ఒక మెట్టు ఎక్కువ లోనే ఉండే వాడు. చేతన్ అతడిని అధిగమించాలని విపరీతమయిన కృషి చేసే వాడు. ఇరువురు ప్రయోగాలు చేయటం బాల్యం లోనే మొదలెట్టి కాలేజీ దశకు వచ్చే సరికి దిన పత్రికల గుర్తింపు పొందారు. కానీ ఏం చేసినా శ్రీ మిత్రను అధిగమించలేక పోయాడు చేతన్. ఆ సమయంలో చేతన్ తల్లి ఆరోగ్యకరమయిన పోటీ మనస్తత్వాన్ని అతడికి నూరి పోసింది. అంతే అతడు ఒళ్ళు మరిచి శ్రమించటం మొదలెట్టాడు. ఆ సమయం లోనే తుషార పరిచయం అయింది అతడికి, ఆమెకి కూడా వీరి లాగానే సైన్సు, ప్రయోగాలే జీవితం.

ముగ్గురు చాలా విషయాలు చర్చించుకుంటూ తల మునకలు అయిపోయే వారు.

17 ఏళ్ల వయస్సు వచ్చే సరికి చేతన్  ఒక రసాయనం కనిపెట్టాడు. ‘ఆ రసాయనం ఒక  చుక్క తాగితే, ఆ తాగిన వ్యక్తి గాఢ నిద్రలోకి జారీ తన జీవితంలో జరిగిన అన్నీ విషయాలను అంటే నెల గుడ్డుగా ఉన్నప్పటి నించి చెప్పగలడు. రెండు చుక్కలు తాగితే గత జన్మ తాలూకు విషయాలు కూడా చెప్తాడు. మూడు చుక్కలు తాగితే తన భవిష్యత్తును  కూడా చెప్పగలడు.

4 వ చుక్క, అతి ముఖ్యమైనది తాగితే నిద్రలో ఉన్నప్పుడు తనను ఎవరైనా తమ పేరు, పుట్టిన తేదీ చెప్తే వారి పూర్వ జన్మ, వర్త మానం, భవిష్యత్తు అన్నీ చెప్తాడు. కానీ 4వ చుక్క తాగిన గంట లోపు ఆ వ్యక్తి మరణించే అవకాశాలు 90 శాతం ఉన్నాయి.’

దీనికి విరుగుడు కని పెట్టటానికి చేతన్ అహర్నిశలు కృషి చేసేవాడు. ఆ విషయమే తన ఇద్దరి స్నేహితులకి చెప్ప గా, సరి క్రొత్త ప్రయోగం తమకు చెప్పనే లేదు అని మొదట ఇద్దరు కోపం తెచ్చుకొని తర్వాత కనీసం చివరి దశలో ఉన్న ఆ విరుగుడు రసాయనం కోసం అయినా తమను చేర్చుకోమని కోరారు.

కానీ చేతన్ కు పూర్తిగా తానే ప్రయోగాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో, మరో ప్రయోగం లో తప్పకుండ కలిసి చేద్దాo అని పంపి వేశాడు వారిని.

కాల చక్రం గిర గిర మంటూ తిరిగింది. ఎన్నో ఋతువులు, ఎన్నో శుభ సమయాలను లెక్క చేయకుండా అతడు ఒంటరిగా గదిలో కూర్చొని ప్రయోగాలు చేసే వాడు. కానీ విరుగుడు రసాయనం విజయవంతం కాలేదు.  అతడికి ఇప్పుడు 23 ఏళ్ళు. అతడిలో దిగులు ఆవరించింది. పెద్ద పెద్ద ప్రోఫ్ఫెసర్లను కలిసాడు. ఎన్నో చర్చలు, నిద్రాహారాలు మాని ప్రయోగాలు చేసినా  కానీ ప్రయోజనం శూన్యం.

నైరాశ్య0 కమ్ముకున్న అతడిని ఒక రోజు తుషార కలిసింది. శ్రీ మిత్ర కి ఫారిన్ లో పెద్ద సంస్థ లో సైంటిస్ట్ గా ఉద్యోగం దొరికింది అంటూ చెప్పింది. తన స్నేహితుడు తనకు మాట మాత్రం అయినా చెప్పలేదని బాధ పడ్డా మరలా సంతోషించాడు.

ఆమె “నువ్వు కూడా ఈ విరిగుడు రసాయనం- ఫార్ములా-4 కొద్ది కాలం పక్కన పెట్టి, 3 చుక్కల రసాయనo, విజయవంతం అయింది కాబట్టి  ఫార్ములా-3 లైసెన్సు కి  అప్లై చేయి, తర్వాత నీ వీలుగా ప్రయోగాలు చేయొచ్చు కదా?? అని సలహా ఇచ్చింది.

అతను చిన్నగా నవ్వి “తుషార! ఒక మనిషి చేతిలో ఒక వస్తువును పెడితే అది మంచికి వాడలా, చెడుకి వాడాలా అనేది ఆ మనిషి మస్తిష్కం నిర్ధారిస్తుంది తప్ప మనం కాదు. ఒకే ఫార్ములా-3 ని 3 చుక్కలు మాత్రమే వాడి వదిలేస్తారని గ్యారెంటీ ఎవరు ఇవ్వ గలరు. అడవిలో క్రూర మృగాన్ని నమ్ముతాను  కానీ నాగరిక మానవుని మెదడుని, స్వార్థాన్ని నమ్మలేను నేను. నా వల్ల ఒక్క ప్రాణం పోయినా నాకు, నా తెలివి తేటలకు అర్థం లేదు.” అన్నాడు.

అతడు చెప్పిన మాటలో పరమార్థం నచ్చినా, ఎంతో విలువైన అతడి జీవితాన్ని ధార పోస్తున్నందుకు మనసు నొచ్చుకొని మౌనంగా వెళ్ళిపోయింది తుషార.

మరో రెండు రోజులకి అతడికి ఎముకలు కోరికే చలిలో, అర్ధ రాత్రి ,దిగులుతో వాకింగ్ చేస్తుండగా, ఒక మెరుపు లాంటి ఆలోచన స్ఫురణకు వచ్చింది. పెద్ద అంగలు వేసుకుంటూ ఇంటికి చేరి 78 గంటలు బాహ్య ప్రపంచంతో బంధం తెంచుకొని, శ్రమించి రసాయనాన్ని కని పెట్టాడు విజయవంతంగా.

ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. “అమ్మ, నాన్న, బామ్మ, సక్సెస్..” అంటూ ఇల్లంతా గంతులేశాడు. అతడి లాన్ లోని చెట్లు సైతం, గాలికి విసురుగా అల్లాడి తమ హర్షాన్ని తెలిపాయి. నింగి, వాన జల్లు కురిపించి తన సంతోషాన్ని వ్యక్తీకరించింది.

కాళ్ళకు చెప్పులు వేసుకోవాలనే ఆలోచన కూడా రాని అతను నేరుగా తుషార ఇంటికి పరుగులు తీశాడు ఆ హోరు వర్షంలో.

“మొన్న చాలా ముభావంగా మాట్లాడి ఆమె ఉత్సాహాన్ని నీరు కార్చాను,  ఇప్పుడు ఈ విషయం చెప్తే నా కన్నా తానే ఎక్కువ సంతోషిస్తుంది. తనదీ ఇదే వృత్తి, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎంత స్థాయిలో మాట్లాడాలో తెల్సిన అమ్మాయి. తానే నా భార్య అయితే, ఈ ఫార్ములా-4 అమ్మి జీవితం లో స్థిర పడి పోవచ్చు” అనుకోని  ఒక్క సారిగా తన జీవిత కాలపు నిర్ణయాలు ఆ వర్షంలో పరుగులు పెడుతూ తీసుకున్నాడు అతడు.

ఇంతలో శ్రీ మిత్ర నించి ఫోన్ వచ్చింది అతడికి. “ఒరేయ్! నీకో శుభ వార్త ఫార్ములా -4 విజయవంతం అయింది” అన్నాడు అతడికి మాట్లాడే సమయం ఇవ్వకుండా.

“నాకు తెల్సు రా, నువ్వు పట్టు వదలని విక్రమార్కుడివి అని, అన్నట్లు నీకు నా నించి కూడా ఓ శుభ వార్త, రేపు నాకు, తుషారకు నిశ్చితార్థం, నువ్వు అందరినీ తీసుకు రావాలి” అన్నాడు.

వెనకాల పిడుగు పడిందా అన్నట్లు ఆగిపోయి, ” నాకు తుషార ఒక్క మాట కూడా చెప్ప లేదు” అన్నాడు చేతన్.

“ఒరేయ్ నువ్వు మారవు, ఆడ పిల్లలు అన్నీ నోరు తెరిచి చెప్పరు, మనమే అన్నీ అర్థం చేసుకోవాలి, మన సైంటిస్ట్ తుషార కూడా అంతే.  అందుకే నువ్వు నా కంటే ఎప్పూడు ఒక మెట్టు తక్కువే,” అంటూ గట్టిగా నవ్వాడు.

“అవునురా! నీకు ఎలా బతకాలో తెల్సు, ఆడ పిల్లలకు కూడా కొన్ని ఫార్ములాలు ఉంటాయి అని తెలుసుకోలేదు నేను. ఇద్దరు నా స్నేహితులు రాకుండా ఎలా ఉంటాను అన్నాడు నిరాశగా.. ఫోన్ పెట్టేస్తూ.

గెలిచాడా, ఓడిపోయాడా అర్థం కానీ అతడు షుమారు దూరం తుషార ఇంటి వరకు చేరినా కూడా, ఇక అవసరం లేదని వెను తిరిగాడు. కొద్ది దూరం నించి క్యాబ్ దిగిన తుషార వర్షంలో తడుస్తూ ఎదురు వచ్చిoది. అతడిని చూసి ” సార్! మీరు బాహ్య ప్రపంచంలో  కనబడ్డారా?! అమేజింగ్!! అదీ ఈ వర్షపు జల్లులో, వెరీ రోమాంటి సీన్ కదా! మనం ఇలా కలవటం” అన్నది.

వర్షం జల్లులో తడిసిన తుషార మోము ముత్యంలా మెరిసి పోతోంది. ఏవో కబురులు చెబుతోంది, వర్షపు హోరుకో, హృదయాంతరాళ్ళలోని  హోరుకో తెలీదు కానీ అతడికి అవేమీ వినపడట్లేదు.

ఇక తన చిలిపితనం తనది కాదని మనసు చివుక్కుమన్న అతడు నవ్వి “చాల్లే ఎంటా మాటలు, శ్రీ మిత్ర వింటే నా పని గోవిందా” అన్నాడు.

“ఓ! మిత్ర ఫోన్ చేశాడా?! అప్పుడే. నేను కొన్ని రోజులు వాయిదా వేయమని అడిగాను, కానీ నాన్న, మిత్రా మంచి పని చేసారు.  అదే నిన్ను చేసుకుంటే నీ గదికి ఒక కాఫీ సప్లయిర్ ని చేసేస్తావ్ నువ్వు” అని గట్టిగా నవ్వింది.

అప్పుడు అర్థం అయింది అతడికి ఆమెకు ఏం కావాలో, చిరు నవ్వు నవ్వి “ఇద్దరికీ నచ్చినపుడు, ఇక వాయిదాలెందుకు, అన్నట్లు నా ఫార్ములా -4 సక్సెస్ అయింది, రేపు కలుస్తాను” అని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు.

ఆమె పిలుస్తుందని ఎదురు చూస్తూ ముందుకు నడిచి వెనక్కి తిరిగి చూశాడు, కానీ ఆమె వడి వడిగా తన ఇంటిలోకి పరుగెట్టింది.

శ్రీ మిత్రా స్వగృహం, తెల్లారి 8 గంటలకు : తుషార, మిత్రా చేతికి ఉంగరాన్ని తొడిగింది.

ఇద్దరినీ అభినందించిన చేతన్ వెంటనే అక్కడ నించి బయలు దేరాడు. ఇక ‘తుషార’ అనే అక్షరాలు పూర్తిగా ‘నా’ జీవితం లో నించి చెరిగి పోయినాయి. 5 సంవత్సరాల కృషి ఫలితం పది నిమిషాలు కూడా నిలబడలేదు. తుషార, మిత్రా  నా పక్కనే ఉండే వాళ్ళు కానీ ఎప్పుడు నాతో పంచుకోలేదు, బహుశా ప్రేమ అందరినీ పరాయి వారిని చేస్తుందేమో అనుకుంటూ బైకు మీద వెళుతున్న అతడి ఆలోచనలు సుడులు తిరిగినాయి. పునర్జన్మ, మరు జన్మ అంటూ, ఈ జన్మ లేకుండా చేసుకున్నా అంటూ కళ్ళు ధారాపాతకంగా కురిసాయి అతడికి. ఆలోచనలతో ఎదురుగా వున్న మ్యాను హోలును గుర్తించక అమాంతం ఆ రాకాసిలా నోరు తెరిచిన డ్రైనేజిలో పడిపోయాడు. అది 7 ఏరియాల నించి వచ్చి కలిసే డృనేజి సొరంగం, పైగా క్రితం రోజు కురిసిన వర్షానికి గండి పడి నట్లు పొర్లుతోంది మురుగు నీరు. ఆ నీటి తాకిడికి మునిగి స్పృహ తప్పి కొట్టుకు పోయాడు, ఆ నీటి తాకిడే అతన్ని దగ్గరలో ఉన్న సముద్రానికి  ఈడ్చుకెళ్ళి వదిలేసింది.

రెండు సంవత్సరాల తర్వాత: కోమా లోంచి బయటకు వచ్చాడు చేతన్. కొంత మంది బౌద్ధ మతస్థులు చేతన్ ని కాపాడారు. వారి వైద్యo చేత తిరిగి మామూలు మనిషి అయ్యాడు. వెంటనే తన తల్లి దండ్రులను  కలవటానికి  బయలుదేరాడు. తాను చనిపోయాక వారు ఇక మునపటి ఇంట్లో ఉండరని ఊహించి వాళ్ళ స్వగ్రామం చేరాడు. కొడుకుని తిరిగి పొందిన వారు ఎంతో సంతోషించారు.  బామ్మ గారు ” నాకు తెలుసు రా, నువ్వు తిరీగి వస్తావని” అని కౌగలించుకుంది ఆనంద భాష్పాలతో.

ఆ పైన వారం రోజులూ  అతడి అమ్మ, నాన్న,  బామ్మా రెండేళ్ళ ప్రేమను ఒక్క సారి గుమ్మరించేశారు. ఒక రోజు సాయంత్రం టి.వి.లో ఓ ప్రకటన కంట పడింది.” ఫార్ములా-3, మీ జీవితపు పుస్తకాన్ని మీ ముందు ఉంచే రసాయనం, సంప్రదించండి శ్రీ మిత్రా”  అంటూ. పచ్చి మోసం తాను కనిపెట్టిన ఫార్ములా, అది కూడా ఫార్ములా-4 లేకుండా? ఎంత ప్రమాదం? అనుకుంటూ ప్రకటన లో  స్క్రోల్  అవుతున్న అతడి మొబైల్ నంబర్ కి చేతన్ ఫోన్ చేశాడు గొంతు మార్చి, ఒక సంస్థ కు చెందిన సైంటిస్ట్ లాగా .

“చూడండి, మీ ప్రకటన నచ్చింది, పేటెంట్ రైట్స్ ఇస్తే నేను 1000 కోట్ల ల్యాబుని బహుమతిగా ఇస్తాను మీకు, కానీ ఎవ్వరికీ ప్రమాదం లేదని గ్యారెంటీ ఇవ్వాలి” అన్నాడు.

“…..”

శ్రీ మిత్ర మౌనం అతడి సందేహాన్ని బల పరిచింది, “అంటే ప్రాణ హాని ఉంది, కదూ!, అలా అయితే మా సి.ఈ.ఓ గారు ఒప్పుకోరు, మా కంటూ కొన్ని నైతిక విలువలు ఉన్నాయి” అన్నాడు కఠినంగా.

శ్రీ మిత్ర గొంతు సరి చేసుకొని  “మీకా భయం లేదు.  అసలు ఫార్ములా -3 & 4 రెండు,  నా స్నేహితుడే కనిపెట్టాడు, కాకపోతే వాడు నాకు కేవలం ఫార్ములా-3 ని మాత్రమే వివరించి ఫార్ములా-4 ఎక్కడ పెట్టాడో చెప్పే లోపే వాడు చని పోయాడు, వాడికి వారసులు లేరు. ఫార్ములా 3 ని, ఫార్ములా- 4 లేకుండా ఉపయోగిస్తే ప్రాణ హాని ఉన్నది. కాబట్టి మేము అదే పనిలో ఉన్నాము, కానీ సమయం వృధా కాకుండా కొంచెం ముందుగా విడుదల చేశాము”.

“ప్రయోగం మనిషి మీదే చేయాలి  కాబట్టి వారికి పూర్తిగా వివరించారా? వారి నించి సమ్మత పత్రం కూడా తీసుకున్నారా?”

అది వదిలేయండి, ” నా భార్య మాకు బాబు పుట్టినప్పటి నించి , కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది, పెద్దగా ఎవరికీ  ఉపయోగం లేని మనిషి. ఆమె మీద ప్రయోగం చేస్తాను, కాబట్టి మీకు సమస్య రాదు, నేను చూసుకుంటాను”.

అదిరి పడ్డాడు చేతన్ “ఏంటి? తుషార ని చంపటానికి సిధ్ధపడుతున్నాడా… శ్రీ మిత్రా.. నే విన్నది నిజమే నా? అనుకోని

“అంతా వదిలేయ్ ల్యాబ్ ఇచ్చేస్తాను, పసి పిల్లాడి తల్లిని ఏం చేయకు” అని ఆవేశంగా అరిచాడు చేతన్.

అతడి అసలు గొంతు గుర్తు పట్టిన శ్రీ మిత్రా ” ఓహ్! బతికి వచ్చావా, మోదట ఫార్ములాకు, ఇప్పుడు ప్రియురాలికి , ఆ తరవాత ఆస్తికి వారసత్వంగా…” అన్నాడు వెటకారంగా.

“ఎవరికి రా ప్రియురాలు? నోరు జాగ్రత్త.  ఇదేనా స్నేహితుడిని అర్థం చేసుకున్నది” అన్నాడు.

“చాలు సార్, కహానీలు, తుషారను ప్రపోస్ చేశాక, దాని చుట్టూ మూడు  సంవత్సరాలు కుక్కలా తిరిగాను. నీ కోసం ఎదురు చూస్తున్నా అని మోహాన చెప్పేది. చివరకి వాళ్ళ నాన్న ద్వారా ఒప్పించాను.  పోనీలే, పెళ్లి అయ్యాక మార్చుకోవచ్చు అనుకున్నాను, కానీ నువ్వు చచ్చావనుకొని నీ ఆలోచనలతో అనారోగ్యానికి లాండ్ మార్కులా తయారు అయ్యింది. ఇక నువ్వు ఫార్ములా కోసం దొంగలాగా ఫోన్ చేస్తావా? పర్వాలేదు, ఈ నెల 15 వ తారికున మధ్యానం 12.30 నిమిషాలకు నా ప్రయోగం తుషార మీద చేస్తున్నా”.

“ఒరేయ్ తప్పు రా, నిన్ను నమ్మిన మనిషిని అలా హింసించకురా, నేను ప్రాణ హాని కలగ కుండానే ఫార్ములా -4 విజయవంతం చేశాను, అందుకే అంత కాలం పట్టింది. కావాలంటే ఫార్ములా-౩ నువ్వు తీసుకో , ఫార్ములా- 4 ఒక్కటి నాకు మిగలని” అన్నాడు దయనీయంగా.

“కుదరదు, 15 వ తారీకు గుర్తున్నది కదా!!!” అని కాల్ కట్ చేశాడు.

ఒక్క సారిగా అతడిని అయోమయం ఆవరించింది. తుషార నన్ను 3 సంవత్సరాలు ప్రేమించిందా? ఆ విషయం చెప్పనే లేదే తను, ఇప్పుడు వీడి రాక్షసత్వానికి బలి అయిపోతోందా, నా కోసం ఆరోగ్యం పాడు చేసుకునే అంత ప్రేమించిందా???”

అంతలో శ్రీ మిత్ర నించి అమెరికా హాస్పిటల్ అడ్రెస్ మెస్సెజ్ వచ్చింది.

“కర్కోటకుడు” అనుకోని, చేతన్ ఉన్న పళంగా తన వీసా అప్ప్లికేషన్ కోసం చెన్నై పరుగు పెట్టాడు. అక్కడ నించి తన పాత ఇంటికి వెళ్ళి ఫార్ములా- 4 తీసుకొని విమానం ఎక్కాడు.

15 వ తారీకు, సియాటెల్ నగరం: ఉదయం 10 గంటలు: దట్టంగా కురుస్తున్న మంచుని లక్ష్య పెట్టకుండా చేతిలో ఫార్ములా-4 ను పట్టుకొని, శ్రీ మిత్ర  పంపిన హాస్పీటల్ అడ్రెస్ కేసి పరిగెడుతున్నాడు చేతన్.

మరో వైపు శ్రీ మిత్ర, తుషారను పిలిచి, “నీ అనారోగ్యం చూసి నాకు బెంగగా ఉంది.  ఇవాళ మొత్తం బాడీ చెకప్ చేయిస్తాను, నువ్వు రావాలి”, అన్నాడు.

“నాకు అవసరమయితే నేను చెప్తాను కదా” అన్నది.

“కనీసం మన బాబు కోసం , నువ్వు రావాలి”

“ఎందుకింత ప్రేమ, నన్ను నమ్ము.  ఇది ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే మామూలు మార్పు. నేను చేతన్ ని  ఎప్పుడో మర్చి పోయాను.”

“మరచిపోటానికి నీది మామూలు ప్రేమ కాదు, అమర ప్రేమ, అతనొక చోట హాయిగా వుంటే నీకు మనశ్శాంతి గా వుండేది. కానీ ఏం చేస్తాం.” అన్నాడు.

“వాడు నాకు ముందు స్నేహితుడు మిత్రా, తర్వాతే ప్రేమ, నా బాధ అంతా కష్టానికి తగ్గ ఫలం వాడికి దక్క లేదు అని.” అని నిట్టూర్చి, “ఒక భర్తగా, భార్య ప్రతి అంతరంగానికి ఇంత విలువ ఇస్తున్నావు…అసూయకు తావు లేకుండా! ఒక వేళ చేతన్ భర్తగా అయ్యూన్టే, ఇలా ఉండే వాడా? అని సందేహం వస్తోంది.”

“భగవంతుడు ఏది చేసిన నీ మంచికే అనుకో, లేదంటే అదే ముహూర్తానికి వాడు చనిపోయాడు, నింద నీ జాతకం మీద పడేది కానీ వాడిది  అర్ధాయుష్షు అని ఒప్పుకొనే వాళ్ళు కాదు జనం”

“నువ్వు వెళ్ళు, నేను 12.30 కి అక్కడకు వస్తాను” అన్నది తుషార.

చెకప్ కి ల్యాబుకి తీసుకెళ్లితే ఆమె కూడా సైంటిస్ట్ కాబట్టి సందేహం వస్తుందని, తన స్నేహితుని హాస్పీటల్ లో  ఒక చెకప్ ఉంది అని అనుమతి తీసుకున్నాడు.

తుషార అనుకున్న సమయానికి వచ్చింది.

బాబుని ఆమె చేతి లో నించి తీసుకుంటూ “ఇక నువ్వు నిశ్చింతగా ఉండు” అన్నాడు మిత్ర.

మీరు చెకప్ మొదలెట్టండి అని తన జూనియర్లకు నిస్సబ్ధ సందేశo అందించాడు కన్ను గీటుతూ. అతడికి ప్రమాదం రాకుండా సిటీలో తెలివి అయిన పేద విధ్యార్ధులని చేరదీసీ ఈ ప్రయోగానికి ఒప్పించాడు డబ్బు ఎరగా వేసి.

అన్యం పుణ్యం తెలీని తుషారను చూసి ఒక జూనియర్ డాక్టర్ కి జాలి కలిగిన, తన పరిస్ఢితి ఇది అంటూ చెప్పలేక ఫార్ములా-3 లో మొదటి మూడు చుక్కలను ఆమె మీద ప్రయోగించారు.

ఆమె గాఢ నిద్రలోకి జారుకున్నది.

శ్రీ మిత్ర ఆమెను ప్రశ్నించటం మొదలెట్టాడు. ” తుషార! బాబు భవిష్యత్తు చెప్పు”

“అభివృద్ధిలోకి వచ్చి, దేశ పరపతిని కాపాడతాడు”

“నా భవిష్యత్తును చెప్పు”

“జైలు కి చేరుతావు ”

అక్కడ ఉన్న అందరూ ముసి ముసి నవ్వులు నవ్వటంతో అతడికి కోపం కట్టలు తెగి, 4 వ చుక్క ని కూడా ఆమె మీద ప్రయోగించాడు.

చేతన్ పరుగున హాస్పిటల్ కు చేరి, తుషార.. వైఫ్ ఆఫ్ మిత్రా? ఎక్కడ అని  అని అడిగాడు రెసెప్షన్లో కంగారుగా..

“రిసెప్షనిస్టు,  ఫ్లోర్-16 , బట్ షీ ఇస్ ఇన్ … ” అని చెప్పే లోపు లిఫ్ట్ ఎక్కేశాడు అతడు.

ల్యాబ్ లో:  తుషారతో, మిత్ర  “ఇప్పుడు చెప్పు అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తానా” అన్నాడు, మరో సారి చివరి ప్రయత్నంగా…

“అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంటావు” అన్నది.

“అందరూ వెళ్ళిపోండి, ఇక చాలు” అని అన్నాడు మిత్ర.

వాళ్ళు తుషార కేసి జాలిగా చూస్తూ అడుగులు బయటకు వేస్తుండగా, చేతన్ రొప్పుతూ, తలుపులు తోసుకుంటూ వచ్చి  విరుగుడు రసాయనం- ఫార్ములా-4 ను వారి చేతిలో పెట్టాడు.

జూనియర్ డాక్టరులు సంతోషంగా దాన్ని ఆమె మీద ప్రయోగించారు

20 నిమిషాల తర్వాత : ఆమెలో చలనం లేదు, పైగా ఒళ్ళు చల్ల బడి, పెదవులు పాలిపోయి తెల్లని రంగుకి చేరుకున్నాయి.

“ఆలశ్యమైపోయినట్లుంది” అన్నది ఒక డాక్టరు.

చేతన్ తుషార పక్కన చతికిల బడి ఆమె చెవి దగ్గరగా రోదించ సాగాడు, “తుషార! నీ కోసం పరిగెట్టుకొచ్చాను, కళ్ళు తెరువవా? లోకం ముందు, నన్ను నేను నిరూపించుకోవటం కోసం, నన్నే లోకంగా భావించిన నిన్ను గుర్తించలేకపోయాను. నువ్వే  నా లోకం అని తెలిసే సరికి, వేరే ఒకరి లోకంలో కనిపించావు, చచ్చి బతికి వస్తే ఇప్పుడు లోకాన్నే విడిచి వెళ్ళిపోతున్నావా?” అంటూ పొగిలి పొగిలి విలపించాడు.

గది అంతా నిశ్శబ్దం ఆవరించింది. అందరూ బిక్కు బిక్కు మంటూ చూస్తున్నారు

తుషార నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అందరి మొహాల్లోనూ గొప్ప సంతోషం తొణికిసలాడింది. 2-3 సార్లు వాంతులు చేసుకుని మామూలు స్దితికి చేరుకున్నది ఆమె.

శ్రీ మిత్ర చేతన్ ని చూసి, “శ్రమ  నాది, భార్య నాది, ప్రయోగం నాది, ఇక వెళ్ళు అన్నాడు.

ఇదంతా చూసిన రిసెఫనిస్టు, తన బాస్ కి ఫోన్ చేసి చెప్పటంతో, “నార్మల్ చెకప్ అని చెప్పి హాస్పిటల్ రూమ్ తీసుకొని మర్డర్ చేయ బోయాడు” అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ బాస్.

“10 నిమిషాల్లో అతడిని పోలీసులు నిర్భందించారు”

బాబుని, తుషారను తీసుకొని ఇండియా ఫ్లైట్ ఎక్కాడు చేతన్.

ఫ్లయిట్ లో “ఆ రోజు కాఫీ సప్లయిర్ చేస్తానేమో అని భయ పడ్డావా?? అందుకే నీ భావన చెప్పలేదా?” అని అడిగాడు.

“మరి నాకు కోపం రాదా? నా ఇష్టం నువ్వే అని తెలిసి,  శ్రీ మిత్ర కి భార్యను చేసి మాట్లాడతావా?”

“మళ్ళీ నీ కోసం వెనక్కి తిరిగి చూశాను, నువ్వు సంతోషంగా గెంతులేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళటం చూశాను” అన్నాడు నీకేం ప్రేమ లేదన్నట్లు.

“ఇంట్లో కెళ్ళి నీ కోసం ఒక ఏడుపు ఏడ్చి, మర్చిపోయి వాడిని చేసుకొని గుడ్డి జీవితం జీవించాను.”

“నా మీద ప్రేమ నాకు చెప్పాలి కానీ వాడికి చెప్పటం ఎంటి”?

“వాడికి మాత్రమే కాదు, నీ కళ్ళకు చెప్పాను, నీ ఇంటి చెట్లకు చెప్పాను, నువ్వున్న గది తలుపులకు తెల్సు నీ కోసం ఎంత వేచి చూశానో, ఎన్ని సార్లు వచ్చి వెనక్కి వెళ్లానో తిక్కలోడా.” అంటూ రంకెలేసింది

బాబు కెవ్వుమని ఎడ్చాడు. చేతన్ వాడిని సముదాయించాడు. ఏర్ హోస్టెస్ “ఎనీ ప్రాబ్లెమ్” అంటూ వచ్చింది.

ఆమెని పంపి, “నువ్వే నా ప్రబ్లెమ్, నువ్వు చాలా ఇష్టమయిన బోరింగ్ రా!!!” అన్నది గోముగా.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s