వారసత్వం అంటే?

డిసెంబర్ నెల, పొగ మంచు దట్టంగా అలుముకొని ఉన్నది. ఎముకలు కొరుకుతున్న చలిలో ఎస్.ఐ.  శ్రీ నికేతన్ డ్యూటీ దిగి తన భార్య హాస్పిటల్ లో ప్రసవ వేదన పడుతోందని తెల్సి బయలుదేరాడు. ఆ సమయంలో ఆమె పక్కనే ఉండాలని ఎంత ప్రయత్నించినా డ్యూటీ మీద  డ్యూటీ పడటంతో పాప పుట్టిన 45 నిమిషాల తర్వాత కష్టపడి చేరుకో కలిగాడు.

తన భార్య, పుట్టిన పాప కులాసాగా ఉన్నారని తెలిసి ప్రాణం కుదుట పరుచుకున్న అతడు అదే సమయంలో పక్కనున్న ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు కొడుకు పుట్టాడని ఇంటి వాచ్ మాన్, ఏదులయ్య ఫోన్ చేయటం తో వాళ్ళని కలిసి ఆ పిల్లాడి చదువు ఖర్చు తాను భరిస్తాను అని మాట ఇచ్చాడు.

శ్రీ నికేతన్ దంపతులు, పాప నీహారికను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి, చదివించి, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా తీర్చి దిద్దారు. ఆయన కాల క్రమేణా ఉద్యోగం మాని సొంత వ్యాపారం పెట్టుకొని కోట్లకి పడగలెత్తాడు.

ఏదులయ్య కొడుకుకి కూడా చదువుకి కావలసిన డబ్బు సహకారాన్ని అందించినా, ఏదులయ్య ఆ డబ్బుని తాగుడికి వాడి, కొడుకు యదునందన్ను చదివించక నిర్లక్ష్యం చేయటంతో వాడికి బుద్ది రావాలని డబ్బు సహాయం మానేశారు శ్రీ నికేతన్ దంపతులు. దాంతో తన అవసరాలకు, కుటుంబ పోషణకు దొంగతనాలు చేయమని యదు నందన్ మీద ఒత్తిడి తెచ్చాడు ఏదులయ్య. తనకు ఇష్టం లేకపోయినా తండ్రి ఒత్తిడి వల్ల, తల్లి మొఖం చూసి  దొంగతనాలకు పాల్పడే వాడు. కానీ ఆ తర్వాత పక్క కాంపౌండ్ లోనే ఉన్న నీహారికను చూసి ‘అంత ఉన్నతంగా’ తన జీవితం లేదని బాధతో కుచించుకు పోయే వాడు. అతడి నాన్న మనసు మార్చుకొని తాగుడు మానేస్తే తాను కూడా అందరి పిల్లల్లాగా  బడికెళ్లి చదువుకోవాలని ఆశ పడే వాడు.

కానీ ఆశ నెరవేర లేదు ఏదులయ్య వల్ల.

నీహారిక, యదునందన్ 25 ఏళ్ల వాళ్ళు అయ్యారు. ఆమె ఏడు సంవత్సరాల నించి ఇష్ట పడుతున్న అబ్బాయిని చూసి వివాహం నిశ్చయించి, అదే రోజు కూతురికి అల్లుడికి ఆస్తులు అప్పగించేయాలని నిర్ణయించారు శ్రీ నికేతన్ దంపతులు.

వివాహ మండపంలో, మరి కొన్ని నిమిషాల్లో ముహూర్తం ఉందనగా, ఏదులయ్య నీహారికను ఎవరు చూడకుండా  కలిసి ” నువ్వు నా కూతురివి, నిన్ను ఉఛ్ఛ స్దితిలో చూడటానికి, నీ కన్నా కొద్ది సమయం ముందు పుట్టిన యదునందన్ స్థానంలో నిన్ను ఉంచి, వాడిని నా కొడుకుగా మార్చేసుకున్నాను.  ఒక బీద తండ్రి గా నాకు అంత కన్నా మార్గం కనబడ లేదు..” అని చెప్పాడు. అక్కడితో ఊరుకోకుండా నేరుగా తన ఇంట్లో ఉన్న యదునందన్ ను పిలిచి, ‘ఒక దొంగను కొడుకుగా స్వీకరించలేను, నీహారిక మాత్రమే నా కూతురు, అని ఇంట్లో నించి అతడిని గెంటేశాడు, ఆస్తి దక్కుతున్న స్వార్థంతో.

తాను ఒక తాగుబోతుకి  కూతురిని అని తెల్సుకోని, యదునందన్ కి తన వల్ల జరిగిన అన్యాయానికి  కుంగిపోయింది ఆమె. తానుగా యదునందన్ కి విషయం చెప్పాలి, అని హుటాహుటిన బయలుదేరింది ఆమె. కానీ జరిగిన విషయం తెల్సి కోపంతో రగిలిపోయిన యదునందన్ ఆమెను ముందే చేరి, ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బంధించి, ఒక మారుమూల ప్రదేశం లో పాత బంగ్లాలో కట్టేశాడు ఆవేశంలో. తిరిగి మండపానికి వెళ్ళి, ఆమె కోసం కంగారుగా వెతుకుతున్న శ్రీ నికేతన్ వద్ద ఏమి తెలియనట్లు మిన్నకున్నాడు.

“ఇందులో తప్పేముంది, ఇది నా జీవితం, తండ్రిని అడ్డు పెట్టుకొని సకల భోగాలు అనుభవించింది. నేను తనని చూసి కుంగి పోనీ రోజు లేదు. దొంగని చేసి ఇప్పుడు నా కొడుకువే కాదు అని తరిమేశాడు ఏదులయ్య” అనుకుంటూ తనలో తానే మదన పడి చివరికి “ఎంతైనా ఆడ పిల్ల, నా చెల్లెలి స్థానంలో వున్నది, పైగా తనకు కూడా ఈ విషయం తెలీదు, పెళ్ళి అయిపోయాక మాట్లాడుకోవచ్చు కదా, అనుకోని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు.

“నన్ను క్షమించు, నీ పట్ల అమానుషం గా ప్రవర్తించిన మాట నిజమే, కానీ నువ్వు చల్లగా నీడ పట్టున పెరిగావ్ నా స్థానం లో, నేను నీ స్థానంలో నేను ఒక దొంగని అయ్యాను. తప్పు నీది కాదు, నాది కాదు, కానీ శిక్ష మాత్రం నాకే పడింది” అని తనలో నిక్షిప్తమైన రెండు దశాబ్ధాలుగా గూడు కట్టుకున్న ఆవేదనను వెళ్ళగక్కాడు.

“ఆమె మౌనంగా అన్నీ విని, ఇది చెప్పాటానికే నీ దగ్గరికి వచ్చింది, కానీ నువ్వు వినిపించుకొనే పరిస్దితిలో” లేవు అప్పుడు అన్నది నిర్మలమైన వదనంతో.

“ముందు పెళ్ళి అయిపోని, తర్వాత అమ్మకి నాన్నకి, చెప్పొచ్చు” అన్నాడు.

“ఇంకా నా కోసం వరుడు ఎదురు చూస్తాడనుకుంటున్నావా? ముహూర్తం ఉదయం 8.20 కి, ఇప్పుడు రాత్రి 7 గంటలు” అని చిన్నగా నవ్వింది.

” ఎందుకు చూడడు, చదువుకున్నావ్, మంచి వ్యాపారం చేస్తున్నావ్, తెలివి, అందం అన్నీ ఉన్నాయి, పైగా నువ్వే కావాలని కదా అతడు ఒప్పుకొని వచ్చింది , ఎదురు చూస్తుంటాడు పద త్వరగా..”

“అలాగా? ఒక సారి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో, బయలుదేరే  ముందు” అన్నది.

అతను ఏదులయ్య భార్యకు ఫోన్ చేసి పరిస్థితి అడిగాడు, ఆవిడ ముహూర్తం మించితే తన బంధువుల ముందు పరువు పోతుందని వేరే ఎవరినో చేసుకొని వెళ్ళి పోయాడని చెప్పింది.

ఫోన్ కట్ చేస్తూ నోట మాట రాక స్థబ్దుగా ఉండిపోయి ఆమె కేసి చూశాడు యదు నందన్.

“వ్యక్తిత్వం నాకు మాత్రం ఉంటే  సరిపోదు, ఒక బంధం ముడి పడాలన్నా, నిలబడాలన్నా ఇరు వైపులా ఉండాలి”.. అన్నది చిరు నవ్వుతో.

“అన్ని  సంవత్సరాల ప్రేమను, పరువు కోసం మర్చిపోయాడంటే, నమ్మ సఖ్యంగా లేదు” అన్నాడు ఇదంతా తన వల్లే అని బాధ పడుతూ.

“అతడిని తప్పు పట్టాలని ఉద్దేశ్యం మానుకో, రోజులు కూడా అలాగే ఉన్నాయి, నేనే మోసం చేశానని అతడు అనుకునే అవకాశం 100 శాతం వుంది, మాట మాత్రం చెప్పకుండా వచ్చేశాను కనుక, అలాగే ఒకరు నీ జీవితాన్ని ఛీద్రమ్ చేస్తుంటే,   చూస్తూ ఊరుకొనే సహనాన్ని కోల్పోవటం నీకున్న నిర్దిస్టమైన హక్కు”  అన్నది ప్రశాంతంగా.

“కానీ ఇది సరి అయిన సమయం మాత్రం కాదు, అందులోనూ నేను ఎంచుకున్న విధానం అస్సలు సరి అయినది కాదు”

“ప్రశాంతంగా పడుకో, అన్నీ మర్చిపో , నాన్నని రేపు ఉదయమే కల్సి నిదానంగా వివరించి నువ్వే చెప్పు, నాకు ఆయన తండ్రి కాదని, ఆయనతో చెప్పే శక్తి నాకు లేదు” అని వెళ్ళి పోయింది, చెమర్చిన కళ్ళతో.

యదునందన్  శ్రీనికేతన్ ను కలిసి జరిగిందంతా చెప్పాడు. కానీ వాళ్ళు డబ్బు కోసం యదు నందన్ నాటకాలు ఆడుతున్నాడని భావించి, పోలీసులకి ఫిర్యాదు చేశారు.

అక్కడ నించి తప్పించుకున్న యదు మీద శ్రీ నికేతన్ తన పాత మిత్రుడి ద్వారా ఒక డిటెక్టివ్ సంస్థ కి పని అప్పజెప్పి, నీహారికను వెతకే పని అప్పచెప్పాడు.

యదు తానేo కోల్పోయాడో తెల్సుకోని, తప్పించుకొని మరలా నీహారిక వద్దకు చేరాడు. ఆమెను చూస్తూనే మండి పడ్డాడు.

“అయిపోయింది, అంతా అయిపోయింది, నేను నిజం చెప్పినా నమ్మే స్దితిలో వాళ్ళు లేరు. పైగా పోలీసులకి పట్టించారు, తప్పించుకు వచ్చాను” అన్నాడు ఆయాస పడుతూ.

“డి‌ఎన్‌ఏ టెస్ట్ చేయిద్దాం, కంగారూ పడకు అన్నది.”

“అంటే ఏంటి”

“మన నెత్తురు పరీక్షించి, మన వంశీకులను గుర్తించే పరీక్ష, ఎవ్వరి దయ నీకు అవసరం లేదు” అన్నది ధైర్యాన్ని నూరి పోస్తూ.

అతడు చలించిపోయి, నన్ను ఇంకో సారి క్షమించవా!? నాకు నీ మీద కోపం లేదు, కానీ నీ సుఖం కోరుకున్న నీ తండ్రి, నా కనీస అవసరాల కోసం కూడా నన్ను  దొంగని చేశాడు. దొంగలించిన ప్రతి సారి నేను పెట్టుకున్న వాతలు ఇవిగో” అని చూపాడు తన గుండెల  మీద తేలిన పాత  వాతల గురుతులని.

“నన్ను నువ్వే క్షమించాలి, యదు అన్నయ్య, నిన్ననే చెప్పాను, ఒకరు నీ హక్కులు కాల రాస్తుంటే పోరాడటం, నీ జన్మ హక్కు అని”

“ఇది ఆస్తి కోసం కాదమ్మా నీహారిక, నేను.. నా వ్యక్తిత్వం…కోసం,  దొంగని కావాలని అవ్వలేదు అని నిరూపించుకోవాలి” అని కూలపడి పోయాడు  వివరించలేక.

“నీలో ఉన్న రక్తాన్ని పీల్చి పిప్పి చేయగలరు కానీ, నీ వ్యక్తిత్వాన్ని ఎవరూ తాకనైనా తాకలేరు, రేపు మనిద్దరం వెళ్ళి నాన్న గారిని కలిసి ఒప్పిద్దామ్” అన్నది.

“డి‌ఎన్‌ఏ టెస్ట్ ఇంకా అవ్వలేదు కదా!”, ఎలా నన్ను అన్నయ్య అని ఒప్పుకున్నావ్, ఒక వేళ ఏదులయ్య అబద్దం చెప్పి ఉండొచ్చు కదా ?”.

“పరీక్షలు  బయట ప్రపంచానికి, నా కోసం కాదు , నీ కళ్ళల్లో స్వచ్ఛత చూస్తుంటే నాన్న ప్రేమ గుర్తుకు వస్తోంది, నీ పశ్చాత్తాపపు మాటలు వింటే, అమ్మ దగ్గర పెరగక పోయినా, ఆవిడ లక్షణాలు నీలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.” అన్నది ప్రశాంత వదనంతో.

తెల్లారిన మరు క్షణం నిహారిక కోసం ఎదురు చూస్తున్నాడు యదు, తన తండ్రిని కలిసి నిజం చెప్పాలి అని. కానీ ఆమె ఎంతకీ బయటకు రాకపోయేసరికి ఆమె గదిలోకి  నెమ్మదిగా వెళ్ళి చూశాడు. ఆమె అక్కడ లేదు, పైగా పెద్ద కన్నం కలిగిన గోడ లోంచి సూర్య కిరణాలు అతడి కళ్ళ మీద పడి చురుక్కుమనిపించి వెక్కిరించాయి. ఒక్క సారిగా సూర్యరశ్మికి తాళ లేక కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకొని, “నమ్మక ద్రోహి” అంటూ పిచ్చిగా ఆక్రోసిoచాడు.

“ఎవర్ని అడిగి నన్ను లాక్కొచ్చావ్ “? అంటూ నీహారిక డెటెక్టివ్ సుహాస్ మీద విరిచుకు పడింది.

“మీ నాన్న గారు” అన్నాడు, క్లుప్తంగా.

“మా నాన్న గారిని కలవటానికే ఇద్దరం బయలుదేరాం, నువ్వు ఒక్క మాట చెప్పున్డొచ్చు కదా?!” అని, జరిగింది చెప్పింది.

“అయితే యదునందన్ నిన్ను అపార్ధం చేసుకోక ముందే వేళదాo పదా” అన్నాడు తల పట్టుకుని.

మరో పక్క ఏదులయ్య, తన కూతురిని దాచేసింది యదు అని  తెల్సి, ఒక నాటు తుపాకి కొని అతన్ని  కాల్చి చంపటానికి  అతడిని వెతకటం మొదలెట్టాడు.

మరో పక్క అడవిలో యదు నందన్, నీహారిక  ఒకరిని ఒకరు వెతుకుతూ కనబడక, వేరే వేరే ప్రాంతాల్లో ఉండిపోయారు ఆ రాత్రి.

చుట్టూ చీకటి, నట్టడివి. మిణుగురు పురుగుల కాంతిని, చల్లటి గాలులను ఆస్వాదిస్తూ ఆకలి బాధ మర్చిపోయారు  సుహాస్, నిహారిక. వెన్నెల కిరణాలు, తిమిరాన్ని మూలకి ఉండవమ్మ అని పక్కకి నెడితే, ఈ విషయం తెలీని వారిద్దరు గంభీరమైన చర్చలో మునిగిపోయారు.

సుహాస్ నీహారికను చూస్తూ ” రేపు డి‌ఎన్‌ఏ   టెస్ట్లో యదునే వాళ్ళ అబ్బాయి అని తెలిస్తే, ఆస్తి నీకు దక్కదు సారి కదా, ఏదులయ్య చేసిన పనికి నిన్ను నీ పెంపుడు తండ్రి వెలి వేసినా ఆశ్చర్య పోనక్కరలేదు.  మరి ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా?

“నా భవిష్యత్తుని గూర్చి ఆలోచిస్తే నేను యేదులయ్య   కూతుర్ని అని ఒప్పుకున్నట్లే, డి‌ఎన్‌ఏ పరీక్షలు అవసరం లేకుండా” అన్నది నిశ్చలంగా.

తన పెంపుడు తండ్రిని వదులుకోలేక, అసలు తండ్రిని అంగీకరిచలేక, కళ్ళ ముందే తన భవిష్యత్తు కూలిపోతున్నా కూడా, ఆమెదే అయిన  దృఢమైన మానసిక సౌందర్యానికి   అచకితుడై చూస్తూ ఉండిపోయాడు అతడు.

“పెంచినందుకు నీకు వాటా ఇవ్వాల్సిందే. దాంతో నువ్వు..” అని అతడు ఏదో చెప్పేంతలో

అతడిని వారిస్తూ “తెలియక ఒక సారి యదు అన్నయ్య జీవితం లాక్కున్నాను, ఇప్పుడు తెల్సి అదే తప్పు చేయలేను, ఇక్కడ సమస్యా నేనే, పరిష్కారము నేనే” అన్నది  నిర్ధిస్టమయిన అభిప్రాయంతో.

సుహాస్ మరియు నీహారిక, యదు ను ఎలాగో మొత్తానికి చేరుకోగలిగారు.

“అన్నాయ్య! ఎక్కడికి వెళ్ళిపోయావ్? నీ కోసం పాత బంగ్లాకి వెళ్ళాను” అన్నది ఆతృతగా.

“నువ్వు పారిపోలేదా? అన్నాడు ఆశ్చర్యంగా.

“నీ జీవితం నీ చేతికి అప్పగించకుండా ఎక్కడికి వెళ్ళగలను”, అని సుహాస్ గురించి చెప్పింది.

అతను భారంగా నిట్టూర్చి, “ఆలోచిస్తుంటే… నాన్నకి నువ్వే అసలయిన వారసురాలివి అనిపిస్తోంది, నేను ఆయన రక్తానికి మాత్రమే వారసుడిని, నేను బుద్ధి పరంగా  ఏదులయ్య కొడుకునే, నాన్న ఆలోచనా విధానానికి మాత్రం నువ్వే వారసురాలివి, ఎందుకంటే నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నిన్ను అనుమానిస్తూ, అవమానిస్తూనే వున్నాను” అన్నాడు.

“నీది నిజంగా ఏదులయ్య బుద్ధి అయితే ఈ పాటికి నన్ను చంపి, అడ్డు తొలగించుకునే వాడివి. కానీ ఎందుకు చేయ లేకపోయావ్?, ఇది అసలు సిసలైన యదు నందన్ వ్యక్తిత్వం కనుక” అన్నది నొక్కి వక్కాణ్స్తూ.

వీరిలా మాట్లాడుకుంటుండగానే ఏదులయ్య వీరిని చేరుకోవటం , “నా కూతురినే కిడ్నాప్ చేస్తావా” అనటం, యదు చెంప పగలు కొట్టటం జరిగి పోయాయి రెప్ప పాటు కాలం లో.

యదు తప్పు చేశాననే భావన తో తల దించుకు నిల్చనున్నాడు.

సుహాస్ చూస్తూ ఊరుకోలేక “ తప్పు చేసింది నువ్వు, సరిదిద్దుతున్నది నీహారిక, అతడు కొడుకు కాదు అని గెంటేసిన నీకు కొట్టే హక్కు ఎరవిచ్చారు?” అంటూ మండి పడ్డాడు ఏదులయ్య చొక్కా పట్టి గుంజుతూ…

ఏదులయ్య, సుహాస్ ని సైతం లెక్క చేయక “వాడిని పెంచాను” అని అతడిని తోసేసీ గుండెలు బాదుకున్నాడు కసిగా.

నీహారిక కలగ చేసుకొని “ పెంచావ్. అతడి జీవితాన్ని తారు మారు చేసి. కనీసం వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బుతో చదివించలేక పోయావ్. పైగా నీ జల్సాల కోసం అన్నయ్యను దొంగని చేశావ్”, అని రంకెలు పెట్టింది.. సహనం కోల్పోయి అతడి ప్రవర్తన కి .

“ఏంటే ఎలాగో నేను ముసలోడిని, తండ్రిగా ఒప్పుకుంటే పరువు తక్కువ, అని వాడితో అన్నయ్య అని సంబంధాలు కలుపుతున్నావా?” అని గన్ ఆమె కు గురి పెట్టాడు.

ముగ్గురూ అవాక్కైపోయారు అతడి క్రూరత్వానికి.

సుహాస్ ఏదులయ్య కన్ను కప్పి గన్ ను తుప్పల్లోకి విసిరేసి వారిద్దరితో సహ తప్పించుకు పోయే ప్రయత్నం చేశాడు. కానీ ఏదులయ్య మళ్ళీ గన్ సంపాదించి.. తనకు వ్యతిరేకి గా మారిన, నిహారిక మీద కాల్పులు జరుపగా, యదు అడ్డుపడి ఆమెను కాపాడి ఆ బుల్లేట్ గాయాలు తను తిన్నాడు.

గన్ విసిరి కొట్టి ఎదులయ్య పారిపోయాడు.

ఆసుపత్రిలో నిదానంగా కళ్ళు తెరిచిన యదు కళ్ళకి ముందు నీహారిక కనిపించి, “ ఎందుకిలా మళ్ళీ నువ్వే బలి పశువు అయ్యావు, ఇంత పోరాటం చేసింది ఇందుకేనా,?” అన్నది.

“వాళ్ళ ఇంట్లో స్థానం సంపాదించాలంటే డి‌ఎన్‌ఏ టెస్ట్ అవసరం, కానీ వారి మనసుల్లో సంపాదించలేను కదా! తల్లి తండ్రులకు ఏం కావాలో తెలుసుకొని, వారికి ఇచ్చినపుడే నిజమైన కొడుకును అవుతానని అనిపించింది.” అన్నాడు ఎంతో పరిపక్వత చెందిన మనస్సుతో.

అతడి బెడ్ కి అటు వైపు ఉన్న శ్రీ నికేతన్ దంపతులు “రెండు కళ్ళల్లో ఏది లేకపోయిన బతుకు దుర్భరమనే విషయం మాకు కూడా తెల్సు” అన్నారు.

నీహారిక , యదు సంతోషానికి అవధులు లేవు.

నీహారిక ఎదులయ్యను పోలీసులకి అప్పజెప్పింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s