నక్షత్ర  పోరాటం

ఆ ఊరు ప్రపంచానికి దూరంగా అడవిలో ఉండటం వల్ల కాస్త అన్నీ విషయాలలో వెనకబడినదే అనే చెప్పాలి. ఒక డాక్టరు, ఒక పోలీసు, ఒక ప్రొఫెసరు, ఒక కిరాణా కొట్టు, ఒక కాటి కాపరి, ఒక పూజారి, ఇంకొంత మన్ది జనం అక్కడ నివసిస్తున్నారు.

*************************                           ********************                *********

పున్నమి చంద్రుని చల్లని కిరణాలు తాకి అడవి తల్లి పులకరిస్తుంటే “అడవి కాచిన వెన్నెల’ అని ఒక కవి తప్పుగా ఆలోచించాడే రూకా! అన్నాడు బీడీ కలుస్తూ, నులక మంచం మీద పడుకొని, ఆకాశం కేసి చూస్తూ రుద్రయ్య.

“అదేంటి అదొక అద్భుతమైన మాట, ఎక్కువగా ఆడవారికి, కళాకారులకి వర్తిస్తుందని ప్రొఫెసరు గారు చెప్పారు”?

“నోర్మూస్కో చిన్న పిల్లవి అలా మాట్లాడకూడదు, అన్న ట్లు ఆయన ఎపుడు వచ్చారు.?”

“నిన్న నువ్వు నీ కస్టమర్ల తో మాట్లాడుతున్నావు గా, అప్పుడు వచ్చారు ఆయన”

“కస్టమర్లా?? అంటే?”

“అదే మన వస్తువులను కానీ, సేవలను కానీ తగిన ధర కి కొని వాడుకోనే వారంటా!!! ప్రొఫెసర్ గారు చెప్పారు”.

“హోసి నీ అసాధ్యం కూల! నా సేవ ‘శవాలను సాగనంపటమే’, వాళ్ళ నా కస్టమర్లు? నీ ఇంగిలీషు తగలయ్య”  అంటూ ముందు రెండు పళ్ళు ఊడిపోయినా స్వేచ్ఛగా, అందంగా నవ్వాడు కాటి కాపరి రుద్రయ్య.

“సరే ఇంక నేను పడుకుంటాను”, అని కసురుకుని వెళ్ళిపోయింది రూక”

రుద్రయ్యకు 70 ఏళ్ళు. చదువుకున్న వాళ్ళంటే గిట్టదు, కానీ వాడి వేదాంత ధోరణి, వాక్చాతుర్యం వల్ల వాడి కోసం కొంత సమయం కేటాయిస్తారు వారి స్థాయి మరిచి గొప్ప గొప్ప వాళ్ళు కూడా.  వీడు కూడా వారి చుట్టూ తిరుగుతుంటాడు. “రూక నీ కూతురా? అంటే కాదు ఉంచుకున్న” అని తెగేసి చెప్పాడు. 15 ఏళ్ల వయస్సులో ఆమె పెదనాన్న అమ్మేస్తుంటే వాడిని తన్ని లాకొచ్చాడు, శక్తి మేరకు చదివిస్తున్నాడు.

4 రోజులు ఊరంతా వేలేసింది వాడిని, 5 వ రోజు సహ జీవనం అట, వీడు చాలా అడ్వాన్సు అంటూ ఒక నవ్వు నవ్వి మళ్లా కలుపుకున్నారు తమలో.

********************            *********************                              ***********************

రూకకి ఆత్మీయురాలైన స్నేహితురాలు ఉంది. ఆమె త్రిపుర, పూజారి గారి అమ్మాయి. 10 వ తరగతి తప్పి, చదువు అటకెక్కించింది. అమ్మవారి గురించిన స్తోత్రాలు, పుస్తకాలు అన్నిటినీ అవపోసన పట్టింది. త్రిపుర తల్లి రూక ని ఉద్దేశించి “ఆ సాని దాన్ని ఇంటికి తీసుకొస్తే నా మీద ఒట్టే” అన్నది. “అలాగే కానీ” అని వారిద్దరూ ఊరు మద్య భావి గట్టు మీద పొద్దున్న, సాయంత్రం కలిసి వారి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

వీరిని త్రిపుర తండ్రి పూజారి గారు గుడి నించి వచ్చేటపుడు చూసి “శివ శివ” అని ఒక సారి, ఇంటికి వెళ్ళి ఆ నిజాన్ని భార్య దగ్గర దాచి పెట్టినందుకు మరో సారి “శివ శివ” అనుకుంటాడు.

“రూక! రుద్రయ్య నిన్ను బలవంతంగా ఉంచుకున్నాడా?” అడిగింది త్రిపుర.

లేదే త్రిపుర! అతడు నన్ను తాకడు, సంతలో అమ్మేస్తుంటే నన్ను ఈ ఊరికి తీసుకొచ్చాడు, చదివిస్తున్నాడు.  అతడు ‘ఉంచుకున్న’ అని ఊరి మీద కోపం తో అన్నాడు, కానీ అప్పటి నించి నన్నేవరు కన్నెత్తి చూడ లేదు, అందుకే ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నిజం చేయమని అడుగుతున్నాను. అవును నీ పెళ్ళి ఎపుడు?

ఒక ఆరు నెలల్లో, జూలై 29 న నక్షత్ర పోరాటం జరుగుతుంది, కొన్ని నక్షత్రాల గుంపుకి- మరొక రాక్షస నక్షత్రానికి, అని మా తాతలు వ్రాసిన తాళ పత్ర గ్రంధాలలో ఉన్నది. అప్పుడు ‘ఆది పరా శక్తి’ తానే వచ్చి ఆ రాకాసి నక్షత్రంతో పోరాడుతుందట, శక్తి పీఠం వారసురాలిని నేను,  ఆ శుభ ఘడియలు తర్వాతే ఏదైనా?

లంగా ఓణి వేసుకొని, మెరేసే కన్నులతో ఉత్సాహంగా ‘నక్షత్ర పోరాటాన్ని’ వివరిస్తున్న త్రిపురను, దూరం నుండి చూస్తుండిపోయాడు, ఆమేథ్య అతని పరిశోధకుల బృందం.

ఆ ఊరికి దగ్గరగా పరిశోధనల నిమిత్తం వచ్చింది ఆమేథ్య బృందం. వాలెంటరీగా పరిశోధనలు చేసి, సమాజానికి తమ సత్తా చూపాలని వారి ఆశ. అక్కడ త్రిపుర మాటలు విని గుడారాలు వేసుకొని అప్పటి కప్పుడు ఆవాసం ఏర్పరుచుకున్నారు ఆ అడవిలో. అక్కడే నెట్ లో సెర్చ్ చేశారు, ఆమె చెప్పిన తేదీకి నిజంగానే అద్బుతమైన పౌర్ణమి వస్తుందని, అది కూడా 300 సంవత్సరాల తర్వాత వచ్చే అపురూపమైన పౌర్ణమి గా కనుగొన్నారు.

రోజూ లాగే త్రిపుర, రూక కలిశారు.

“ఇక్కడ శక్తి పీఠం ఎక్కడో చెప్తారా?” అంటూ వచ్చారు ఆమేథ్య బృందం.

వారిని చూసిన త్రిపుర కంగారుగా “శక్తి పీఠం తో మీకేo పని” అన్నది.

“మేము పరిశోధనల నిమిత్తం ఇక్కడకు వచ్చాము, పూజారి గారు తాళం చెవులు కూడా ఇచ్చారు.”

“నాన్నకు మతి పోయిందా ఏమిటే రూక? చెప్పా పెట్టకుండా కొత్త వారికి తాళాలు ఇచ్చారట” అన్నది, గుస గుస గా

రూక ముందుకొచ్చి “మీకేం పని ఆ గుళ్ళో” అని అడిగింది.

“నీకేంటి మధ్యలో?” అన్నారు వాళ్ళు. ఆమేథ్య తాము ఆ నక్షత్ర పోరాటాన్ని చిత్రీకరించి బాహ్య ప్రపంచానికి చూపాలి,  అన్నాడు.

“శక్తి పీఠం పునరుద్ధరణకు, ఆది పరా శక్తి రావాలి, కానీ ఊరంతా ఈ విషయం తెలిస్తే ఆవిడ ఎలా రాగలదు? ఆ నక్షత్ర పోరాటం స్పష్టంగా ఆ శక్తి పీఠం కొలనులో కనబడుతుంది, కావాలంటే  ఎవరో ఒకరు వచ్చి చూడండి.  కానీ చిత్రీకరించటానికి మాత్రం వీలు లేదు” అన్నది త్రిపుర.

“మీరు చూడొచ్చా మరి?” అన్నాడు త్రిపుర కేసి కోపంగా.

“అయ్యో నేను ఆ పీఠం వారసురాలిని, అక్కడ ఆ సమయానికి  శక్తి పూజలు చేయాలి” అన్నది త్రిపుర.

“అందు కోసం దాని పెళ్లి కూడా కాలేదు ఇంకా 29 ఏళ్ళు వచ్చినా!” అన్నది రూక.

వారందరూ  ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ‘ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా?’ అనుకుంటూ “సరే ఎవరికి చెప్పము, దారి చూపించండి” అన్నారు.

బూజు పట్టి, ఎండుటాకుల తో నిండి శిథిలావస్థలో ఉన్న గుడి తలుపులు తెరిచి లోనికి ప్రవేశించారు, అందరు.

“ఈ గుడి ఎందుకు  మూసేశారు?” అడిగాడు, ఆమేథ్య బృందం లో ఒకరైన కైలాష్.

“ఓ రాణి గారిని, ఒక రాత్రి , పరాయి రాజ్యం వాడు చెర పట్ట పోతే, ఈ గుళ్లో తల దాచుకున్న ది. కానీ చీకట్లో కలిసి పోయిన ఆవిడ మీద ఒక రాక్షస నక్షత్రము, వెలుగులు చిమ్మి ఆ రాజు కంట పడేసింది ఆవిడని. వాడు తన వాంఛ తీర్చలేదని ఆవిడ తల నరికేసాడట. అప్పుడు ఆ నెత్తురు  అమ్మవారి ముఖం మీద చిమ్మింది అంట. దాంతో అమ్మవారికి కోపం కట్టలు తెంచుకొని వచ్చి, రాజును వధించింది, కానీ అప్పటికే ఘడియలు దాటిపోవటం తో రాక్షస నక్షత్రం తప్పించుకున్నది. “మళ్ళీ ఆ రాక్షస నక్షత్రాన్ని నాశనం చేసాకే వస్తాను” అని ఆవిడ శపధం పట్టి వెళ్ళిపోయింది.” అని చెప్పి ఊపిరి పీల్చుకుంది త్రిపుర.

కధ విని అందరు “చిన్నప్పుడు బామ్మ చెప్పిన కధలా ఉన్నది”, మేము నమ్మాలా? అన్నారు.

“తాళ పాత్ర గ్రంధాలు చెప్తున్నా యి” అన్నది నెత్తి మీద ఒట్టు పెట్టి.

వారు నమ్మనట్లు గా వెళ్ళిపోయారు. త్రిపుర వారికి నమ్మకం కలగనందుకు “ఈ చదువుకున్న వాళ్ళని నమ్మించటం చాలా కస్టమ్” అని బుంగ మూతి పెట్టింది.

“వాళ్ళు అడిగారు, నువ్వు చెప్పావు… నమ్మకపోతే అది వాళ్ళ ఖర్మ కానీ, నీ తప్పు కాదు, నీ నమ్మకమo నీది, ఒప్పించే ప్రయత్నo చేయకు” అని వెళ్ళిపోయాడు ఆమేథ్య.

“ఇదిగో ఇది రెండవ సెట్టు తాళాలు నీ దగ్గర ఉంచు” అని వెనక్కి పిలిచి అతడి చేతిలో పెట్టింది త్రిపుర.

అక్కడే నిలబడి గుడి మీద పడిన హరివిల్లుని అద్భుతంలా చూస్తున్న త్రిపురను, అతడు అద్భుతములా చూసి వెను తిరిగాడు, మరలా…మరలా..

 

*******************                            *********************                        ***************

“రుద్రయ్య! రుద్రయ్య!” అంటూ గంభీరమైన గొంతు వినబడింది ఇంటిలో ఉన్నవాళ్లకు..

పరుగున వెళ్ళాడు రుద్రయ్య, “చెప్పం డయ్య!”

“ఈ మధ్య కనబడనే లేదు”

“అదీ.. పక్క ఊరి రుద్ర భూమి కోర్టు కేసులో ఉందంట, అక్కడి సవాలు ఇటు మళ్లించారు, కాస్త …పని ఎక్కువ అయింది.”

“సరే వచ్చే ఏడు రూక కాలేజికి వెళ్ళాలి కదా, డబ్బులు కావాలా?”

“రూక అడిగిందా?”

“ఇస్తే వద్దన్నది”

“రేపు ఆషాఢానికి 30 యేళ్ళు దానికి, ఇంటి కాడే చదివిస్తాను, డబ్బు వద్దు, మీరు ఇంటి కేసి రావద్దు, నేనే వస్తాను వీలు చూసుకొని”

“అది సరే, మీ రూక , ఆ పూజారి గారి అమ్మాయి త్రిపుర ,ఆ పట్నం కుర్రోళ్లతో తిరుగుతున్నారు, ఓ కన్నేసి ఉంచు.”

“ ఆ పట్నం గుంపులో ఆడపిల్లలు కనబడ లేదే మీ కంటికి, అయినా త్రిపుర నా కూతురు కాదు, ఇహ రూక గురించా..? హహ!! నేను దాని మీద కన్నేసి ఉంచాలా?

“ఎంత అందరినీ కాదని నీ దగ్గరే ఉన్నా, సిటీ మాయ నీకు తెలీదు.”

రుద్రయ్య, క్రితం రోజు శవం తాలూకు చితా భస్మము ఎత్తి పెడుతూ “అది వెళ్తాన్టే నేను ఎప్పటికీ కాదనను, నా తర్వాత దానికి ఒక తోడు కావాలిగా?” అన్నాడు.

అతడి నల్లని, ఎముకల గూడు లాంటి శరీరం చూసి ప్రొఫెసర్ తనలో తాను నవ్వుకొని “ అగ్గి పెట్టె మరిచాను, కాస్త ఆ కాలే కట్టే ఇవ్వు” అన్నాడు మూడొంతులు కాలిపోయిన చితిని చూపిస్తూ..

రుద్రయ్య ఆయన కేసి వైరాగ్యంగా  నవ్వుతూ చూస్తూ “ఏ కట్టే , కాలుతున్న కట్టె నా, కాలిపోయిన కట్టె నా?” అన్నాడు.

ఆయన మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి అక్కడి నించి, సరాసరి పూజారి గారి ఇంటికి వెళ్ళాడు. ఆయన్ని చూస్తూనే పంతులు గారి భార్య తల తిప్పుకొని  గోడ మీద కాకిని తిట్టటం మొదలెట్టింది, ఆయన చిన్నగా నవ్వుకొని కుర్చీ వేయరా కనీసం “అతిధీ దేవో బావ కాదా!? అదే అతిధి దేవో భవా! అని మన స్కూల్లో నేర్పారు గా  మీనాక్షీ  గారు” అన్నాడు కొంటెగా.  వారిద్దరూ ఒకటే బడిలో చదువుకున్న చనువు చూపిస్తాడు ప్రతి సారి ఆవిడ దగ్గర, ఆవిడకు అది నచ్చదు. ముఖం మాడ్చుకొని మడత కుర్చీ వాల్చబోయింది, ఇంతలో అతడు “వచ్చేది రుద్రయ్య ఇంటి నించి, కూర్చోమంటారా? అన్నాడు వ్యంగ్యంగా…

ఆవిడ చటుక్కున కుర్చీ మడిచి గోడకి పెట్టి, “ఏవీటో చెప్పండి” అని కోపంగా అన్నది.

మీ త్రిపురను ఆ పట్నం కుర్రోళ్లతో చూసి కళ్ళు మండిపోతున్నాయి, అందుకే మీ ఇంట్లోనే ఆ మంట చల్లార్చాలి, కాస్త మజ్జిగ చల్ల పోస్తారు.. నా  మొహాన? అన్నాడు.

అప్పటికే వచ్చి నించున్న పూజారి గారు అంతా విని “నా కూతురు అమ్మ వారి అంశ తో పుట్టింది, ఇహ మీరు వెళ్ళి రావచ్చు” అన్నాడు.

ప్రొఫెసర్ గారు నెమ్మదిగా జారుకున్నాక పూజారి గారు,  “ నీ చిన్న నాటి స్నేహితుడికి, నీకు 50 యేళ్ళు వచ్చినా చిన్న పిల్లలా కనబడుతున్నావు” అన్నాడు ఆవిడ బుగ్గన చిటికేస్తూ..

ఆవిడ “మరే” అంటూ  ఆయనకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళ చెంబు అందించింది.

*********************                   ******************                     *****************

త్రిపురకు శక్తి పీఠం తాళం చెవులు వారి చేతిలో పెట్టింది కానీ, మనసు  ఎందుకో కీడు శంకిస్తోంది. అందుకే రూక తో సహా ఎప్పుడూ ఆమేథ్య బృందం తో నే ఉంటోంది.

ఆమేథ్య కు, త్రిపుర తో ఒక్క విషయంలో కూడా ఏకాభిప్రాయం కల్గటం లేదు, కానీ ఆమె కనబడని క్షణం అతడికి అంతా అగమ్య గోచరంగా ఉంటుంది.

ఎప్పుడు మిరపకాయలు తిన్న దానిలా, అందరి మీద మండి పడుతూ ఉంటుంది. “పని కోసం వచ్చాము, రేపో మాపో వెళ్ళిపోతాము  కదా!” అని ఓర్పు వహిస్తారు వారందరూ.

రూక మాత్రం వారి పరిశోధనలకు సహాయంగా, తలలో నాలుకలా ఉంటుంది వారికి. 6 గజాల నేత చీర కట్టుకొని, పచ్చని పసిమి ఛాయతో మెరిసి పోతుంటుంది. పైగా త్రిపుర ద్వారా ఆమె గూర్చి పూర్తిగా తెలుసుకున్న వారికి ఆమె మీద గౌరవం మరి కాస్త ఎక్కువ అయింది.

****************                           **********************             ******************

ఆమేథ్య పరిశోధనలో “అన్నీ నక్షత్రాలు అవి పుట్టిన కోట్ల సంవత్సరాల తర్వాత మరణిస్తాయని, అంటే రాలిపోయి భస్మము అయిపోతాయి, కానీ కొన్ని మాత్రం అలా రాలిపోయే సమయంలో వాటి పక్క నక్షత్రాలను తమలో కలుపుకొని మరింత బలిష్టంగా తిరిగి తమ శక్తి ని పుంజుకుంటాయి. వీటిని రాక్షస నక్షత్రాలు అంటారు అని కనుగొన్నారు.  కానీ త్రిపుర చెప్పినట్లు తాళ పత్ర గ్రంధాల ఆధారమగు నక్షత్ర పోరాటానికి ఆధారాలు లభించ లేదు వారికి.  అందరూ నిరుత్సాహముతో ఇంక వెళ్ళిపోతామని నిశ్చయించుకోగా, “ఇంత వరకు వచ్చి చివరలో వదిలేస్తే ఎలా? సైన్స్ అంటే శాస్త్ర వ్యతిరేకం అనే అపోహ మానుకోండి. ఆ రెంటి సమ్మేళనం పరిశోధనలను వేగవంతం చేస్తాయి” అని ఆపాడు వారిని.

వారందరినీ ఆపిన ఆమేథ్యకు, త్రిపుర ను ‘నక్షత్ర పోరాటం’ చిత్రీకరణకు ఒప్పించటానికి మాత్రo పెద్ద తల నెప్పి అయ్యింది.

కేవలం ఆమేథ్యను కొలనులో ప్రతిబింబించే నక్షత్ర పోరాటాన్ని నేరుగా చూడటానికి సమ్మతించింది.

***************                                   ****************               *****************

రాత్రి 7.00 :

“రూక! నీ గురించి త్రిపుర చెప్పింది, నీ గూర్చి తెలియక ముందు నువ్వంటే  ప్రేమ మాత్రమే, కానీ ఇపుడు గౌరవం కూడా..” అన్నాడు కైలాష్.

“నా గురించి నీకు ఏం తెల్సు?”

“రుద్రయ్య నిన్ను కాపాడి పోషిస్తున్నాడు”

“కాదు, నన్ను ఉంచుకున్నాడు.”

“ఛ, అలా మాట్లాడక!, వాడు ఒక ముక్కోపి, ఏదో అందరి మీద కోపం తో అన్నాడు. ఒక వేళ నిజమైనా నాకు ఏం అభ్యంతరం లేదు.”

“నాకు రుద్రయ్యే దేవుడు”

“ఈ పాత చింత కాయ కబురులు ఆపు”

క్షమించండి, ప్రేమకు కొత్త పాత ఉండవు.

“నీది మూర్ఖత్వం రూక!”

“ అమరత్వం అని నేను అనుకుంటున్నా”

***********                   *******************                 ********************

రాత్రి 7.00 : ఇదే సమయంలో అక్కడ ఆమేథ్య , త్రిపురను నక్షత్ర పోరాట చిత్రీకరణకు ఒప్పిస్తున్నాడు.

“త్రిపుర, నాకు ఒక్కడికి చిత్రీకరణకు అనుమతించాలి నువ్వు”

“ఎందుకంత పంతం ఆమేథ్య, అది మా కుల దైవం శక్తి పీఠం, ఆ సమయంలో ఎవరూ ఉండకూడదు, చిత్రీకరణ నిషిద్దం. మీ రీసెర్చ్ సెంటర్ లోకీ మా ఊరి వారంతా వస్తే అనుమతిస్తారా? అప్పుడే పుట్టిన పాపను అందరూ తాకుతార? మీ సైన్స్ ఒప్పుకుంటుందా?”

“త్రిపుర నువ్వు ఈ కాలపు ఒరవడిని బాగా అర్థం చేసుకున్నావు, కానీ ఈ విషయంలో ఎందుకంత మొండితనం. నువ్వు సహాయం చేస్తే అది నా కెరీర్ కి ఉపయోగ పడుతుంది.”

“ఈ కాలం పిల్లనే చెప్తున్నా, టేస్ట్ ట్యూబ్ బేబీని పొందకుండా ఎందుకు అందరూ పెళ్ళి చేసుకుంటున్నారు, కాలం మారింది కదా, ఎందుకు పురాతన కుటుంబ వ్యవస్థను తుంగ లో తొక్క లేదు.”

ఇక అతడు మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా  ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది.

*****************                            ******************                         *************

రూక తనను కాదన్న బాధలో వస్తున్న కైలాష్ కి, ఆమేథ్య తో జరిగిన వాదులాట వల్ల విసిగి పోయిన  త్రిపుర, తారస పడింది మార్గ మధ్యలో.

“త్రిపుర! రూక ఎంత చెప్పినా వినటం లేదు. కనీసం నువ్వు అయినా నచ్చ చెప్పు ఆమెకు.”

“ఆమె ఏమన్నది”

“ నాకు తను ప్రాణం అంటే ఆమెకు రుద్రయ్య ప్రాణం అంటోంది.”

“వారిని వేరు చేస్తారో  లేక రూకకు నచ్చ చెప్పి పుణ్యం కట్టుకుంటారో మీ ఇష్టం”

“ మీ ప్రాణం నించి కాసేపు ఊపిరిని వేరు చేయగలరా?”

కైలాష్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

*******************                            *******************                         *****************

“సమయం దగ్గర పడుతోంది నాన్న, మీరు కూష్మాండ  యాగానికి సిద్ధం చేసుకోండి.”

“త్రిపుర, నేనున్నానమ్మ, నువ్వు స్థిమితంగా ఉండు”, అన్నాడు ఆమె తండ్రి.

నక్షత్ర పోరాటాన్ని దొంగ చాటుగా చూడాలని రహస్య కేమారాలను గుళ్లో ఏర్పాటు చేశాడు ఆమేథ్య.

కైలాష్ కు దెబ్బ మీద దెబ్బ పడింది , రూక మరియు, త్రిపుర అన్న మాటలకు , కోపం తో రగులుకుపోయాడు. “ఒసేవ్ త్రిపుర! కోరుకున్నది దక్కకపోతే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను” అని గుడారo లో నించి బయలుదేరాడు.

*************        ***************************                      ****************************

“అమ్మ త్రిపుర! ఊరంతా మన ఇంటి ముందు వున్నారు, ఏవీటో చూడు” అన్నారు పూజారి గారు.

ఆమె వెళ్ళి చూడగా 60 మంది దాకా జనం ఉన్నారు, ఫూలు- పళ్ళతో. “అమ్మ! త్రిపుర, అమ్మోరు వస్తోందంటగా! మాకు కూడ ఒక్క అవకాశము ఇస్తావా?”

త్రిపురకి పచ్చి వెలగకాయ నోట్లో పడ్డట్లు అయింది. “నాకుగా ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ తాళ పత్ర గ్రంధాలలో మా ఇంటి వాళ్ళు తప్ప ఎవరూ చూడకూడదని ఉన్నది”, అన్నది.

“దేవుడికి వారు- వీరు అంటూ భేదం ఉండదు తల్లి అన్నారు, వారు అనునయంగా”

“అప్పుడే పుట్టిన పాప దగ్గరకు ఎవర్ని అనుమతించము, ఎందుకు? ఆ పై మీ ఇస్టమ్” అన్నది ఆమె ముక్కు సూటిగా.

రుద్రయ్య కూడా రూక సహాయం తో అక్కడికి చేరాడు, “ఒరేయ్ ఆపండిరా మీ గొడవ, త్రిపురమ్మ తన పెళ్లి ఆపుకొని మరి ఎదురు చూస్తోంది. ఈ సమయం లో మీరంతా చేరి ఆటంకం కలిగించకండి అన్నాడు.

“ఒరేయ్ రుద్రయ్య, నీ స్థాయి మరిచి పోయి మాటాడక, నిన్ను నెత్తిన ఎక్కించుకున్న మాదే తప్పు. నీ స్థానం ఊరి అవతలి వల్ల కాట్లో,  దయ చేసి దూరoగా ఉండి మా పవిత్రతను కాపాడు” అన్నారు జనంలో ఒకరు.

“హ హ!! అలాగా సరే ఒప్పుకుంటాను, నా వల్ల మీ పవిత్రత పోతుందని.  అలాగే త్రిపురమ్మ కు మాత్రమే అనుమతి ఉన్నది గుళ్లో, మీరు వచ్చి అపవిత్రం చేయకండి” అన్నాడు రుద్రయ్య.

వారి కోపం కట్టలు తెంచుకున్న ది, కానీ అంతలోనే పూజారి గారు కలగ చేసుకొని “క్షమించండి, ఏ కాలమైనా ఆచారం ఆచారమే కదా, అంత ఎందుకు, నాకు- నా భార్యకు కూడా అనుమతి లేదు.  కన్యా ముత్తయిదువు, మా వంశస్థురాలు అయి ఉండాలి, అందుకే 29 ఏళ్లొచ్చినా, త్రిపురను ఇంకో ఇంటికి పంపే ప్రయత్నం చేయలేదు, దయ చేసి సహకరించండి” అన్నారు.

అందరూ కిమ్మనకుండా వెళ్ళిపోయారు.

***********************                           ******************                    *********************

త్రిపుర, ఆమేథ్య ఇదంతా చేశాడని అనుకోని అతడి గుడారం వద్దకు వెళ్లింది. ఏదో పని లో ఉన్న అతడిని పిలిచి చెంప పగలు కొట్టింది. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిపోయి “ నేనేం చేశాను” అన్నాడు అగమ్యగోచరంగా.

“నా దైవం, నా నమ్మకం.  దాని జోలికి రావద్దని చిలక్కీ చెప్పినట్లు చెప్పాను కదా! మరి ఊరంతా ఎలా తెల్సింది. మా నాన్న నచ్చ చెప్ప  బట్టి గొడవ సమిసింది. అయినా నీ లాంటి కోతి వెధవలు ఎక్కడ నించో దూరటానికి ప్రయత్నిస్తే, మేమూ ఆపగలమా!?”

“త్రిపుర! నన్ను నమ్ము, నిన్ను ఎలా ఒప్పించాలా? అని రిహార్సల్ చేసుకుంటున్న ఇక్కడ, అంతే గాని ఇలా చేయను నేను.”

“నువ్వు నీ పని కోసం చేస్తున్న ద్రోహం దైవానికి, నాకు కాదు గుర్తుంచుకో, ఇప్పుడు నీకు కూడ కొలనులో చూసే అవకాశం లేదు” అని విసురుగా వెళ్ళిపోయింది.

************                   ******************                      ***************

జూలై 29 తెల్లవారు ఝామున:

త్రిపుర, ఆమె తండ్రి చండీ యాగం, కూష్మాండ యాగం మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నవి ఊరంతా ఆ రోజు.

సాయంకాలం 6 గంటలు: ఆమె పసుపు నీటి కుండలని, వేప మండలను, కుంకుమ రాసులను గుడి చుట్టూ అమర్చింది.

గుడి కొలను పసుపు నీటితో నింపబడింది.

ఎవ్వరు రాకుండా తలుపులు బిగించి, ఊరి వారే గుడి చుట్టూ నిలబడి కాపలా కాస్తూ, త్రిపురకు అండగా నిలబడ్డారు. కానీ వారెవ్వరికీ, త్రిపురకు, తెలీని ఒక విషయం అక్కడ ఉన్నది. క్రితమ్ రాత్రి  త్రిపుర అతడిని తిట్టీ వెళ్లిపోయాక, ఆమేథ్య ఆలోచనలో పడ్డాడు. ఊరంతా ఆమెకు తమ ఆశను వీడి మరి అండగా నిలబడ్డారు, కానీ నేను అందరికీ ఇవ్వాళ చెప్పకపోయినా, చిత్రీకరించాలని ఆమెకు తెలీకుండా రహస్య కేమారాలను  పెట్టాను, నా ఒక్కడి నమ్మకము కోసం ఇంత మంది నమ్మకాన్ని దెబ్బ తీయకూడదు,” అని గుడికి వెళ్ళాడు. కానీ కైలాష్ రహస్య కేమారా తొలగించటానికి వీలు లేదని అడ్డుపడి, ఆ పై అతడి తల మీద రాడ్ తో కొట్టి పరారయి పోయాడు. స్పృహ తప్పిన ఆమేథ్య గుడి లో ఒక గది లో పడున్నాడు.

సమయం 7 గంటలు: ఆకాశం అంతా పండు వెన్నల పరుచుచున్నది. ఆ వెన్నల శోభకు గుడి నల్ల రాతి శిలలతో మెరిసిపోతోంది. త్రిపుర, మడితో పసుపు బట్టలు కట్టుకొని, త్రికరణ శుద్ధిగా మంత్రోచ్ఛారణ చేస్తోంది పద్మాసనం వేసుకొని.

సమయం 10. 40: ఆమేథ్య నిదానముగా లేచాడు స్పృహ లోకీ వచ్చి. త్రిపురను చూసి చీకటిలో ఉండిపోయాడు, చడీ చప్పుడు లేకుండా.

11:00 గంటలు: నక్షత్రాలు నెమ్మదిగా కదులుతున్నవి, ఒక దాని కొకటి జత కట్టి నక్షత్ర సమాహారంగా రూపాంతరం  చెందాయి.

ఉన్నట్లుండి ఒక రాక్షస నక్షత్రం వచ్చి పడింది. ఆ నక్షత్ర హారం, రాక్షస నక్షత్రాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశాయి. అది అన్నిటినీ గిరా గిరా తిప్పి ఒక్క విసురు విసిరింది.

11.20 గంటలు:

తిరిగి కొద్ది క్షణాలకు నక్షత్ర గుంపు ఒక బలమయిన ఎద్దు ఆకారాన్ని సంతరించుకొని , రాక్షస నక్షత్రాన్ని బలంగా ఢీ కొట్టాయి. కానీ ఆ గుంపులో కొన్ని నక్షత్రాలు నేలకు రాలాయి. కొంత సేపటి నిశబ్ధం తర్వాత, తిరిగి ఆ నక్షత్ర గుంపు ఒక ముంగీస అవతారాన్ని ఎత్తి, విష సర్ప ఆకారంలోని లోని రాక్షస నక్షత్రంతో తల పడ్డాయి. ఫలితం లేక పోయింది.

ఆమేథ్య, త్రిపుర ని- ఆకాశాన్ని పదే పదే మార్చి మార్చి చూస్తున్నాడు. త్రిపుర నిశ్చలముగా కళ్ళు మూసుకొని మంత్రోచ్ఛారణ చేస్తోంది.

11.25 గంటలు: నక్షత్ర గుంపు ఒక వజ్రాయుధం గా మారి తిరిగి యుద్దం ఆరంభించాయి, ఈ సారి రాక్షస నక్షత్రo గింగిరాలు తిరుగుతూ కింద పడబోయి, వేరే నక్షత్రాలను తనలో ఐక్యం చేసుకొని,  తిరిగి శక్తిని పుంజుకొని విఝ్రంబించింది.

అడవిలో ఆ సబ్ధాలకు దిక్కు తోచక, జంతువులు హా హా కారాలు పెడుతున్నాయి.

11.30 గంటలు:

త్రిపుర కళ్ళు తెరిచి కొలను కేసి నడిచింది. ఆమేథ్య ఆమెను నిశబ్ధంగా అనుసరించాడు. ఇంకో రెండు నిమిషాలలో ఆది పరా శక్తి విజ్రభించబోతోంది. అది ప్రత్యక్షంగా కొలను నీటిలో  వారు చూడ గలరు.

11.32:పలు మార్లు రాక్షస నక్షత్రo కింద పడుతూ, మళ్ళీ వేరే నక్షత్రాలను తనలో కలుపుకొని, తిరిగి అత్యంత వేగంగా నక్షత్ర గుంపును మట్టుపెట్టింది.  అమ్మ వారు రాలేదు. భయంకరమైన  నిశబ్ధం ఆవరించింది. నిరాశకు గురు అయిన త్రిపుర కళ్ళు తిరిగి కొలనులో పడబోయింది. అమాంతం ఆమెను పట్టుకున్నాడు ఆమేథ్య.

ఒక్క సారిగా వారిద్దరికీ కొలనులో త్రిశూలాకారంలో ఉన్న నక్షత్ర  గుంపు, రాక్షస నక్షత్రము వైపు పరుగు తీస్తూ కనిపించాయి. కొద్దిగా వెనుకంజ వేసిన అది తిరిగి తల పడటం ప్రారంభించింది. చివరికి తానుగా వెళ్ళి ఢీ కొట్టబోగా, నక్షత్ర గుంపు అమ్మవారిలా మారి దానిని మట్టు పెట్టింది. పెద్ద ధ్వని తో ఆ రాక్షస నక్షత్రము నేలకు ఒరిగింది.

త్రిపుర –ఆమేథ్య ఈ అద్భుతమైన దృశ్యాలను చూస్తుండి పోయారు చేతులు జోడించి.

 

************                          *******************                   ***************

జూలై 30 :

శక్తి  పీఠం పునరుద్దరించ బడినది వేదాల ఘోష నడుమ. కుంకుమార్చనలు, నవ రాత్రుల పూజలతో  దేదీప్యమానముగా వెలిగి పోతోంది పూర్వం వలె. ఆమేథ్య,   త్రిపురకు తెలీకుండా ఆ కేమారాలను తొలగించటానికి వెళ్ళి “ఒక్క సారి ఉత్సుకతతో ఫూటేజీని తెరిచి చూశాడు. అందులో త్రిపుర చేసిన పూజలు, వారు కొలను దగ్గరకు వెళ్ళటం వరకు రికార్డ్ అయింది, మరలా వారిద్దరూ తిరిగి వెళిళ్ళిపోవటo ఉన్నది, కానీ అమ్మవారి రూపం మాత్రం రికార్డ్ అవ్వ లేదు.

అతడు నిశ్చేష్టుడై అమ్మవారి విగ్రహం ముందు నిలబడి చేతులెత్తి నమస్కరించాడు.

*************                  *******************               ****************

“రూక అంతా చెప్పింది, నీకు ఆమేథ్య అంటే ఇష్టం అయితే ముహూర్తాలు పెట్టిస్తాను” అన్నది త్రిపుర తల్లి.

“నా మాటకు, నమ్మకానికి విలువ ఇవ్వలేదు అతడు, నాకు ఇష్టం లేదు” అన్నది త్రిపుర.

అక్కడే నించున్న ఆమేథ్య పక్కకి రమ్మని రెక్వస్ట్ చేసి జరిగిందంతా చెప్పాడు. “కేమారా పెట్టటం, తప్పు కాదా?” అని నిలదీసింది.

క్షమించమని అడిగాడు.

“కుదరదు” అనింది .

“ఇన్ని రోజుల పరిచయము లో నువ్వు నాకు ఇచ్చిన బహుమతులు ఉన్నాయి, ఎటు బ్రేక్అప్ప్ అయింది కనుక నీది నీకు తిరిగిస్తాను” అన్నాడు.

“ఏంటది” అన్నది ఆమె అసహనంగా..

అంతే అతడు చెంప పగలు కొట్టి, అక్కడున్న అమ్మవారి కుంకుమను ఆమెకు పెట్టి వెళ్ళిపోయి, ఆమె తల్లి దండ్రుల దగ్గర నిల్చున్నాడు.

త్రిపురకు అప్పుడు గుర్తుకు వచ్చింది, అతడిని కొట్టిన విషయం, ఒక సారి గుళ్లో అతడికి కుంకుమ అద్దటం.

త్రిపుర సందిగ్ధతతో వెళ్ళి అక్కడ నించున్నది.

“మీరు ముహూర్తాలు పెట్టుకోండి, మా చర్చలు ఫలించాయి” అన్నాడు అతడు త్రిపురను చూస్తూ..

 

********************                శుభం భూయాత్   ***************************

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s