స్మృతి తరంగాలు

 స్మృతి తరంగాలు

 

ఎపుడైనా  అహంకారాన్ని, తల పొగరుని, క్రూరత్వాన్ని, అసభ్యతని, అవినీతిని ఒక గిన్నెలో కలిపి పిండి బొమ్మను చేశారా? ప్రాణం పోశారా ? పెంచి పెద్ద చేశారా? లాలించి ముద్దాడార?

కానీ ఒకావిడ అనుకోకుండా, ప్రాణం పోసింది. పాపం నిజంగా అలా చేస్తున్నానని  ఆవిడకి కూడా తెలీక, వృషభ్ అనే వాడికి జన్మ నిచ్చింది.  పొత్తిళ్ళలో పెట్టుకొని లాలించింది అందరి తల్లులు లాగానే. కృష్ణుడు కాలేకపోయిన, రాముడు కాలేక పోయినా ఒక మంచి పౌరుడిని మాత్రం చేయాలనుకుంది. కానీ ప్రతి వాడికి మరో సవతి తల్లి ఉంటుంది. కన్న తల్లి తండ్రుల కలను నేల మట్టం చేస్తూ తమ బిడ్డలను పాడు చేసే ఒక తల్లి కానీ తల్లి, సవతి తల్లి ప్రేమ చూపే “సమాజం”.

మరి ఈ సమాజం అనే సవతి తల్లి ప్రేమను మనలో ఉన్న  ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిందే. మనం వద్దు అని తలుపులు బిడాయించుకున్నా కూడా, మన మీద ఎంతో అంత ప్రభావం చూపే తీరుతుంది. ఆడ పిల్లలను తల్లి తండ్రులు ఎలాగో కొంత వరకు కాపాడుకుంటారు నిద్ర ఆహారాలు మానుకొని. కానీ మగ పిల్లలను కాపాడుకోవటం కొంచెం కష్టమనే చెప్పాలి.

మరి అసలు ఈ సమాజo అంటే ఎవరు? ప్రతి ఒక్కరం ప్రతి రెండవ వారికి సమాజం, అంటే మనమే.. ఒకరికి ఒకరం సమాజం. మన నడవడిక, మనము తీసుకునే నిర్ణయాలు, మన జీవన విధానము ఇంకో పసి మనసుని ప్రభావితం చేస్తుంటుంది. ఇది మన సమాజం విస్మరిస్తున్న అతి పెద్ద నైతిక  బాధ్యత. మరి ఈ దురదృష్టాన్ని మారుతున్న వైఖరి అనుకోని సరి పెట్టుకోవాలా ? లేక మన వంతు కృషి చేయాలి అని మానసిక ప్రమాణం చేసుకోవాలా చట్టాలకు, కోర్టులకు అతీతంగా…? అపుడు ఇన్ని జైళ్ళు అవసరం ఉండవేమో!!. తప్పు చేసిన వాడే కోర్టులో లొంగిపోతే?.. హహ !!! నవ్వొస్తోంది కదా? అవును మన మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందంటే బహుశా మార్స్ మీదకి వెళ్ళి రేపే ఉండగలము, పెట్టె సర్దుకోండి అంటే నమ్ముతాం కానీ, ఒక నేరస్థుడు తానుగా వెళ్ళి లొంగుబాటా? అసంభవం!!. నూటికి నూరు శాతం నేను ఓడి పోతాను.. సర్వే పెడితే.

******************                          ******************                          **************

వృషభ్, పైన చెప్పినట్లు, తల్లి తండ్రుల కలలకు అతీతంగా, సామాజిక విలువలను అతి హీనంగా లెక్క  చేసే మామూలు మనిషి. క్రూరత్వం, అవినీతి, మితి మీరిన వ్యసనాలు పెట్టని ఆభరణాలు ఇతడికి. వీడికి ‘తాన అంటే తందాన’ అనే దుష్ట చతుష్టయము అయిన స్నేహ గణం కూడా ఉంది. ఈ పంచ పాండవులు ఎలాగో నీతిని అమ్ముకొని 30 -32 ఏళ్లకు ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అన్నట్టు వీరికి ఆడ పిల్లలను వేటాడి వేధించటం మంచి అభిరుచి. ఆ క్రమం లోనే వీరు ఒక అమ్మాయిని పటాయించారు.

*********                       **************                             ***************

గోవా: సముద్రం అలుపులేకుండా నింగి కేసి ఎగసి పడుతోంది, తాకాలనో లేక గుస గుస గా రహస్యాలను పంచుకోటానికో తెలీదు. నింగి మాత్రం ఒక్క సారి కూడా కనీస కనికరం లేకుండా ఉన్న చోటే ఉన్నది, వాటి ప్రయత్నాన్ని ఆస్వాదిస్తూ. ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన దేవుడు వృషభ్ అనే విష పురుగును కూడా చేశాడు. ఆ రెంటినీ ఒక చోటకి తీసుకొచ్చాడు. అదే వారందరూ గోవా బీచ్ కి వీకెండ్ పార్టీ కోసం వచ్చారు. ఈ సారి వీరు కొంచెము వెరైటీగా అమ్మాయిలని ఏడిపిస్తే బాగుండు  అనుకున్నారు. అక్కడే వారికి నమ్రత తారస పడింది. “ప్రతి అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకోటంలో మజా లేదు మావ! ఈ అమ్మాయే మన వెంట పడేలా చేసుకోవాలి” అని అనుకున్నారు. తమ గురించి తాము గొప్పగా చెప్పుకున్నారు. ఆమె కూడా ముందు పరిచయం లేని కారణంగా వారు చెప్పినవి అన్నీ నమ్మింది. ఫోన్ నంబర్స్ ఇచ్చి పుచ్చుకోవటాలూ కూడా చక చక జరిగిపోయినా యి. వారనుకన్న విధంగా ఆ అమ్మాయిని తమ బుట్టలో వేసుకున్నారు. హైదరాబాద్  వచ్చాక కూడా   వాళ్ళు ఆమెను రోజు కలుస్తూ వున్నారు. ఇంక ముందే అనుకున్నట్లు పందెం కట్టారు “10 రోజుల్లో ఆమెను వీరిలో ఒకరు పాడు చేసి ఆ వీడియో యూ ట్యూబ్ లో పెట్టాలని, పందెం కట్టారు కిరాతకులు.

మొదటి రోజు: “వృషభ్ కి ఆక్సిడెంట్ అయింది, త్వరగా ఎస్. డి. హాస్పిటల్‌కి  వచ్చేయ్ నమ్రతా” అంటూ ఫోన్ పెట్టేశారు.

ఆమె చాలా కంగారుగా వచ్చింది. చిన్న చిన్న దెబ్బలతో  ఉన్న వృషభ్ ను చూసి “దీనికా ఇంత కంగారూ పెట్టారు” అంటూ మండి పడింది.

అతడు దొంగ ప్రేమ నటిస్తూ “చని పోమంటే చెప్పు ఇపుడే చనిపోతాను” అన్నాడు.

అందరూ నెమ్మదిగా నిష్క్రమించారు. పది నిమిషాలు మాట్లాడి ఆమెను పంపి వేశాడు అతడు.

“మిగిలిన వారందరూ, ఎక్కడ రా వీడియో?” అంటూ అతడిని తొందర పెట్టారు. దూరముగా ఉన్న కెమెరా చూపి “అందులో బ్యాటరీ తీసేశారు ఎవరో, అందుకే ఏం చేసినా అనవసరం అనిపించింది” అన్నాడు.

ఇంత సిల్లీగా దెబ్బ తిన్నందుకు అందరూ ఒకరిని ఒకరు తిట్టుకున్నారు.

రెండవ రోజు: “నమ్రత మన వృషభ్ డిశ్చార్జ్ అయి నందుకు పార్టీ ఇస్తున్నాడు, ప్లీజ్ బి దేర్ బై 6.00 టుడే” మెస్సెజ్ చేశారు ఆమెకు. వారి పన్నాగం తెలీని ఆమె అక్కడకు చేరుకున్న ది. ఈ సారి మత్తు మందు కలిపి ఆమెను ట్రాప్ చేయాలి. అనుకున్న విధంగా ఆమే తాగే జూస్లో  మత్తు మందు కలిపారు. ఎప్పుడు ఆమె స్పృహ కోల్పోతుందా..అని ఎదురు చూస్తున్నారు. ఆమె నిదానంగా రెండు గంటలు వారు చెప్పే కాకమ్మ కధలు విని నిదానంగా ఇంటికి బయలుదేరింది.

మూడవ రోజు, నాలుగవ రోజు : ఎందుకు తమ ప్లాన్ బెడిసి కొట్టిందో తర్జన-బర్జన పడుతూ కూర్చొన్నారు.

అయిదు, ఆరు : నమ్రత కి వేరే ప్రయాణాలు ఉండటం వల్ల రాలేక పోయింది.

ఏడవ రోజు: మినీ వాన్లో చిన్న అవుటింగ్  అని పిలిచారు. కొంత దూరం తర్వాత వారి బుద్ధి చూపుదామని వారి పన్నాగం.  కానీ సిటీ లిమిట్స్ దాటే సరికి వాన్ బ్రేక్ డౌన్ అయ్యి వెను తిరగాల్సి వచ్చింది. ఇలా పరి పరి విధాలుగా వారి పన్నాగాలు బెడిసి కొట్టటం తో,  వారికి ఎక్కడ లోపం జరుగుతోందో తెలీక తలలు పట్టుకున్నారు.

వృషభ్ ఉన్న వారిలో బలవంతుడవ్వటంతో మిగిలిన నలుగురినీ  విడి విడిగా, వంతుల వారీగా  చావా బాది నిజం రా బట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరికీ నిజం తెలియ లేదు. ఏ దేవత దయో కాపాడుతోంది అని ప్రయత్నం విరమించుకున్నారు ..

వృషభ్ కి మాత్రం తన స్నేహితుల మీద నమ్మకం తిరిగి కుదర లేదు. వారికి తెలీకుండా నిఘా పెట్టాడు వారి మీద. కానీ ఆ నిఘా వల్ల అతడు తను ఎలాంటి స్నేహితులతో ఇన్ని రోజులు కలిసి మెలిసి తిరిగాడు అనేది అర్థం అయింది.  వారి క్రూరత్వం అతి దగ్గరగా చూశాడు. ఇంత కాలం తను మోస్తున్నది కేవలం తన పాపపు భారం మాత్రమే కాదు, వారివి కూడా. ఒక్క సారి చిన్నతనం గుర్తొచ్చి తన తల్లి వడిలో పడుకుంటాను అని అడిగాడు. ఆమె మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది, అప్పుడు అతడికి అర్థం అయింది, తాను ఎంత  పాతాళాని

కి దిగ జారీ పోయాడో అని.

అతడి కంటికి కమ్మిన మాయా  పొరలు వీడినాయి. అన్నింటిలోకి కఠినమైన శిక్ష ‘పశ్చాత్తాపం’ అది అతడిని ఇల్లు విడిచి రోడ్డున పడేలా చేసింది. తమ స్నేహితుడు తమతో కలవటం లేదని ఆరా తీయగా అతడు రోడ్డు మీద ఎక్కడో పడి ఉండటం తెల్సి ఆసుపత్రి లో చేర్పించారు. ఎన్ని మందులు వేసినా అతడికి నయం కాలేదని స్నేహితులు ఆశ వదిలేసుకున్నారు చివరికి. కానీ వైద్యం అందించే డాక్టరు కి ఒక ఛాలెంజ్ గా తయారు అయి మెరుగైన వైద్యం అందించటానికి ప్రయత్నించి, అతడికి మానసిక ఒత్తిడి వుందని గమనించి ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు. అందులో భాగంగా అతడు తన పాపాలను తన స్నేహితుల పాపాలను వెళ్ళగక్కి, నమ్రతను మాత్రం తానే రక్షించినట్లు చెప్పాడు. అది విన్న అతడి స్నేహితులు నివ్వెర పోయారు. డాక్టరు అతడి తల్లిని పిలిచి అతడు చెప్పిన దానికి సరి పోల్చుకున్నాడు. అతడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అని  తేలింది.

మరి అతడు స్నేహితులని  మోసం చేశాడా? అంటే కాదు, మనస్ఫూర్తిగా వారితో కలిసి నమ్రత జీవితం నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ అతడికి తెలీకుండా అతడే, చివరి క్షణంలో ఆమెను రక్షించాడు, ఆ మరు క్షణం అన్నీ మర్చిపోయి తన స్నేహితులకి జోడీ కట్టాడు. మొదట  సారి ఆమె ఒంటరిగా దొరికినపుడు తన స్నేహితులకి తెలీకుండా బ్యాటరీ తీసేశాడు. …వెంటనే మర్చిపోయాడు.

రెండవ ప్రయత్నం లో కూడా జూస్ గ్లాస్స్ మార్చి, తానే మరచిపోయి, స్నేహితులని తిట్టిపోస్తాడు.

మూడవ ప్రయత్నం వాన్ ని తానే ఒక డివైడర్ కీ గుద్ది, బ్రేక్ డౌన్ చేశాడు. . మరిచిపోయి మిగిలిన వారి మీద తన కండ బలం చూపించాడు. కానీ ఎందుకు?

 

************                          *************              **************

సైన్స్ ప్రకారం పిల్లలని ప్రతి దానికి తిట్టకుండా మనకు నచ్చినట్లు మార్చాలంటే, నిద్రపోయిన మొదటి రెండు నిమిషాలలో వారి చెవిలో మనం అనుకున్న విషయాలను క్లుప్తంగా – స్పష్టంగా రెండు మూడు సార్లు చెప్పాలి.  అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న వారి సబ్కాంషియస్ మైండ్ లో రిజిస్టర్ అయి వాటిని పాటిస్తారు. కొంత మంది వెంటనే, ఇంకొంత మంది పిల్లలు నిదానంగా, ఫలితానికి సమాయా నిర్దేశం లేదు, అయితే వారి హృదయాంతరాళ్ళలో స్మృతి తరంగాలుగా మాత్రం నిలిచి పోతాయి.

ప్రతి తల్లి తన బిడ్డ ను ఒక అబ్దుల్ కలాం చేయాలనుకుంటుంది, అందరూ పొగిడేలా తీర్చి దిద్దాలనుకుంటుంది. వృషభ్ తల్లి కూడా అలాగే ఎవరి సలహా మీదనో,  తన బిడ్డకు రోజు రాత్రి అతడు నిద్రపోయాక, చెవిలో కొన్ని మంచి మాటలు చెప్పేది. “నీకు మంచి తప్ప చెడు తెలీదు, చెడు అనిపిస్తే నువ్వు మార్చే ప్రయత్నం చేస్తావు, బాగా చదువుకుంటావు.”

అన్ని ప్రయత్నాలు చేసినా, సవతి తల్లి సమాజం ప్రేమను కూడా అతడి సబ్కాంషియస్  మైండ్  రిజిస్టర్ చేసింది. సొంత తల్లి మాటలను మర్చిపోయేలా చేసింది. నమ్రతా అదృష్టము కొద్ది,  ఆమె అపాయములో  ఉన్న ప్రతి సారి తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి వృషభ్ కి.

ఒక తల్లి చేసిన అపురూపమైన ప్రయత్నం, గుడ్డి నమ్మకమో తెలీదు ఆమెకు, కానీ ఒక సదుద్దేశ్యంతో చేసింది, ఒక అమ్మాయి భవిష్యత్తుని కాపాడింది.

 

రచయిత్రి అంతరంగం: తెలిసో తెలీకో తప్పులు చేస్తాం, కానీ తప్పు అని తెలిస్తే మాత్రం మార్చే ప్రయత్నo చేద్దాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.. కుల మతాలకు, వృత్తులకు, జాతి, వర్ణాలకు అతీతంగా… నవ సమాజ నిర్మాణమే ప్రతి తల్లి ఆశించే కల, దానిని సమిస్టిగా నెరవేరుద్దామా?? అప్పుడు ప్రతి వారికి తల్లి ప్రేమ తప్ప సవతి తల్లి ప్రేమ ఉండదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s