మగ సిరి
పూర్ణ బింబమైన చంద్రుడు చుర చుర ఊరంతా చూస్తున్నాడు. మరీ ముఖ్యంగా రవీంద్ర ఇంటిని, మరి సాయంత్రం నించి తన కోసమే కదా ఎదురు చూస్తున్నాడు. కిటికీ మీద లతా మాలికలు చల్ల గాలికి అల్లాడుతుంటే తనని చూసి సిగ్గు పడి పారిపోయిన మరదలు గుర్తుకొచ్చింది అతడికి. ఈ మధ్య కాలం లో అతడికి ఏది చూసిన అతనికి తన మరదలు మాత్రమే గుర్తుకొస్తోంది.
రవీంద్రకు అతడి భార్య వినీలకు వివాహము అయ్యి ఒక మూడేళ్లు అయ్యింది. తన భార్యను పెళ్లి చూపుల్లో మొదటి సారి చూసి ముగ్ధుడై పోయాడు. తన ఉన్నతమైన ఆలోచనలు తెలుసుకొని అమితంగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడు. ఆమెకు తాళి కడుతున్నపుడు, వేరే వారికి పరిచమ్ చేసేటపుడు అతడి గుండెలు గర్వం తో నిండి పోయేవి.
కానీ ఒక ఏడాది నించి అతడికి తన జీవితంలో తానే ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు, తనకంటూ ముఖ్య పాత్ర లేదన్నట్లు అనిపించ సాగింది. అన్నీ ముఖ్య విషయాలు తనే నిర్ణయిస్తుంది. కాదనటానికి పెద్ద కారణాలు అతడికి దొరకవు. తన పుట్టిన్టికి వెళ్ళినా, ఆమె పుట్టింటికి వెళ్ళినా ఆమెకే జేజేలు, తను అలా ఆకట్టుకునేలా మాట్లాడుతుంది మరి !!!
ఒకటి రెండు సార్లు గొడవ పెట్టు కుందామని ప్రయత్నించాడు కూడా, కానీ తను రవిని ఒక చిన్న పాపను బుజ్జగించినట్లు మృదువుగా బుజ్జగించి సమస్యను పరిష్కరించేది. దానితో అతనికి జీవితం ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా లేదా మూకీ టాకీ సినిమా లాగా అనిపించింది.
అతడు కావాలనే ఆఫీస్ నించి ఆలస్యంగా వచ్చే వాడు. ఎందుకంటే ఆమె తడి కన్నులతో ఎదురు చూసి చూసి ఎక్కడికెళ్ళావ్?ఎవరి తో వెళ్ళావ్? అని అలిగి అనుమాన పడితే తను బతిమిలాడాలని, అటు పై తన బిగి కౌగిలి లో భంధిoచాలని అతడి ఆశ. ఆమె ఎదురుగా వేరే అమ్మాయితో తను చనువుగా ఉంటే అది చూసి, వినీల అసూయ పడాలని అతడి మరొక ఆశ. కానీ ఆమె “ఆలస్యం అయితే మీరేం చేస్తారు, ట్రాఫిక్ అని నాకు తెల్సు” అంటుంది. “అనుమాన పడటానికి మీరు ఎథిక్స్ తెలీని పసి పిల్లాడు కాదూ గా!, అయినా మీరు నన్ను కాదని ఎవరిని చూడరని నాకు తెల్సు” అని గర్వంగా వెళ్లిపోతుంది.
ఈ మూడేళ్ల లో సినిమా ఫక్కీలో ఒక్క రొమాంటిక్ సంఘటన కూడా జరగ లేదు, కేవలం రొటీన్ బెడ్ రూమ్ రొమాన్స్ తప్ప. తన స్నేహితుల వాట్సప్ప్లో మధురమైన సంభాషణలు, కొట్లాటలు, బుజ్జగింపులు చూసి థ్రిల్ అవ్వటం తప్ప, స్వీయానుభవం లేదని అతని మనస్సు గగ్గోలు పెట్టిస్తోంది.
వారం క్రితం వినీలను పురిటికి తీసుకెళ్ళటానికి వచ్చారు ఆమె తల్లి, తండ్రి ఇంకొంత మంది బంధువులు. వారిలో డాక్టర్ కోర్సు చేస్తున్న విరజ కూడా వచ్చింది. ఒట్టి కొంటె పిల్ల, బావ బావ అంటూ అతడిని క్షణం కూడా వదలటం లేదు. చెప్పిన కబురు చెప్పకుండా చెప్తోంది, అతడు విన్నా వినక పోయిన కూడా. ఒక రోజూ విరజ ముగ్గేస్తుంటే రవి అక్కడే బస్కీలు తీస్తున్నాడు. అతడిని చూసిన ఆమె సిగ్గుల మొగ్గ అయి లోపలికి పరుగు తీసింది. ఇది గమనించిన అతడికి గమ్మత్తుగా అనిపించింది. తర్వాత ఒక రోజు ఆమె “నీతో మార్నింగ్ వాక్ కి వస్తాను, కానీ దారి తప్పుతానేమో అని భయం గా ఉంది” అన్నది.
అతడు “నేనుండగా ఎందుకు దారి తప్పుతావు” అన్నాడు ‘షూ’ లేస్ బిగించుకుంటూ.
“నీ వల్లే దారి తప్పుతానేమో అని భయం బావా” అన్నది గోముగా…
అతడు భయపడి వినీల వంక చూశాడు. వినీల, విరజ చెవి మృదువుగా మెలేసి “నీ అతి తెలివితేటలు ఆయనకు అర్థం కావు, వెళ్ళు, నాలుగు వీధులు చూసిరా” అని పంపింది ఇద్దరినీ.
దారి పొడవునా లొడ లొడ మాట్లాడుతూ, అతడు చిరాకు పడినా, వెంట పడి మరీ నవ్విస్తోంది విరజ. ఒక రోజు “బావ ఏడడుగులు వేస్తే పెళ్ళి అయిపోయినట్లే అంట, అయితే మనకు….” అని ఓరగా చూసింది అతడిని.
అది వినగానే అతడు అదిరి పడి “ అదే నిజమైతే నా కాలేజీ స్నేహితురాళ్లు, కొలీగ్స్ కలిపి 60 మంది అయ్యే వాళ్ళు” అన్నాడు.
ఇంతలో ఆమే చేతిలోని పాల పాకెట్ కోసం వీధి కుక్కలు ఆమె మీద దండెత్తాయి. ఆమే పరుగున వచ్చి అతడి నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా కరచుకుంది. కుక్కల్ని తరిమి కొట్టిన అతడు “భయం లేదంటూ” ఆమెకు ధైర్యం చెప్ప బోయా డు. ఆమె భయం తో ఒణికి పోతూ అతడిని మరింత గట్టిగా చుట్టుకుంది. రవి రోడ్ మీద ఉన్నామని గమనించి ఆమెను మృదువుగా దూరం చేశాడు ..అయిష్టంగా….
******************* ***************** *******************
ఈ సంఘటన జరిగి 2 రోజులు అవుతున్నా కూడా అతడి మనసు పదే పదే గురుతు తెచ్చుకొని మరీ మురిసి పో సాగింది.
విరజ కూడా రోజు అతడిని పది మందిలో ఉన్నా కూడా తదామ్యత తో చూస్తుంది. “విరజకు ఎన్ని తెల్సు వినీల కంటే?” అనుకోని భారంగా నిట్టూర్చే వాడు రవి.
మరు నాడు అందరూ వినీలను తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు అన్నీ సరుకులు తెప్పించి ఉంచింది, ఎక్కడ ఉన్నాయో అన్నీ ఒక లిస్ట్ వ్రాసిచ్చింది. నెలకు సరి పడ బట్టలు ఐరన్ చేయించింది. వంట మనిషికి వార్నింగ్ ఇచ్చింది ‘ఏ లోటు రాకూడదని’. ఆమె వెళ్ళిన తర్వాత కూడా రవి కి పెద్దగా బాధ అనిపించ లేదు, ఎందుకంటే రోజు పక్కనే ఉన్నా అతనిలో ‘మమేకం’ కాలేక పోయింది.
************ ****************************** ***********
వారం తర్వాత విరజ ఫోన్ చేసింది, “బావ! హౌస్ సర్జన్ గా ఎప్పాయింట్ అయ్యాను, హాస్టల్ దొరికే వరకు ఉంటాను మీ ఇంట్లో” అంటూ.
మనసు ఎగిరి గంతేసినా, “సరే” అన్నాడు ముభావంగా. ఇంటికి వస్తూ తను చేసేది తప్పు కాదని ‘బెల్లం తానుగా వస్తుంటే చీమలు ఆశ పడటం తప్పు కాదని’ సమర్ధించుకొన్నాడు. ఆ రోజూ సాయంత్రం విరాజే వంట చేసింది. అతడు చండ్రుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. పొద్దు పోతున్న కొద్ది అతని మది హద్దులు దాటుతోంది. విరజ కూడా అతడికి నీ కోసమే వచ్చాను అన్నట్టు ‘చూపులతో’ అతడిలో ధైర్యాన్ని నింపి, అతడి పక్కనే కూర్చొంది ఆమె భుజం తగిలేలా. అతడు ఆమెను దూరం జరగ మనలేదు, అతడు జరగ లేదు. ఆమె కురుల మల్లెల మాల అతడికి మత్తెక్కిస్తుంటే, ఏం తెలీని చిన్న పిల్లలాగా “ఏం బావ ఒంట్లో బాలేదా” అంటూ నుదుటన చేయి వేసింది.
అంతే, కోటీ కరెంటు తీగల షాక్ కొట్టినట్లు, రాకెట్ టేక్ ఆఫ్ ముందు రాజుకునే నిప్పులా అతడి శరీరం కంపించింది.ఒక్క సారి ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. ఆమె ఎద మీద తన ముఖాన్ని బలంగా అదుముకున్నాడు. ఆమె కాదనలేదు. తన పెదాలతో అతడి బుగ్గలను సుతారంగా తాకీ, తన సమ్మతాన్ని తెలిపింది. అతడు దొరికిన అవకాశాన్ని కైవసం చేసుకోటానికి తహ-తహలాడుతూ, తన బాహువుల బలంతో ఆమెను తన బెడ్రూం లోకీ తీసుకెళ్లాడు. ఆమె కళ్ళు అరమోడ్పులయినాయి. ఆమెను దగ్గరకి తీసుకోబయిన అతనికి, ఆమె ముఖములో ఒక్క సారి వినీల కనబడింది. విరజ “ఏంటి బావ ఆలోచిస్తున్నావు” అంటూ అతడిని కవ్వించింది. ఆమెను అత్యంత బలంగా వెనక్కు తోసేసీ వేరొక గది లోకి వెళ్ళిపోయాడు.
“ఏమైపోయింది నా సంస్కారం, ఏమైపోయింది నా నిగ్రహ శక్తి. మా నాన్న నాకు మూడేళ్ల వయస్సులో చనిపోతే అమ్మ కళ్లలో ఒత్తులేసుకొని పెంచింది, కానీ ఏనాడూ రెండవ పెళ్ళి మాట అనుకోలేదు. బావ గారు 5 ఏళ్ళ నించి అమెరికాలో ఉంటే అక్క ఒక్కతే క్లినిక్ రన్ చేస్తూ పిల్లలను చూసుకుంటోంది తప్ప వేరే దారి వెతుక్కోలేదు. వారికి లేవా అనుభూతులు? ఉన్నాయి. కానీ తమ భర్తలతోనే అలాంటివి పంచుకోవాలని అనుకున్నారు, వేరొకరితో పని అయిపోతే చాలు అనుకోలేదు. ఒకే కుటుంబం, వారు ఆడువారు, నేను మగాడిని. వినీల నా బిడ్డ కోసం పురిటి నొప్పులు పడుతుంటే నా బుద్ధి గడ్డి తింటోంది ఇక్కడ? ‘శారీరకంగానే కాదు మానసిక నిగ్రహంలో కూడా మగాడు ఆడ దాని కంటే బలంగా ఉండాలి’.” అని తల పట్టుకున్నాడు.
ఇంతలో విరజ అతడిని అనుసరించి అక్కడికి వచ్చి, అతడిని మరలా ఆకర్షించే ప్రయత్నం చేసింది. అతడు ఆమెను చాచి పెట్టి కొట్టి, “చదువుకునే పిల్లవి.. జాగ్రత్త”!! అంటూ వేరొక గదిలోకి వెళ్ళి తనను తాను బంధించుకున్నాడు.
మరలా ఆలోచనలో పడ్డాడు. “నాకేం కావాలో ఒక్క పది నిమిషాలు ఆమెను కూర్చో బెట్టి చెప్పే ప్రయత్నం చేయలేదు, కానీ పక్క దారులు పట్టాను. ఆమెకు కావల్సింది నా శరీరం కాదు, నా క్షేమం. నా మనశ్శాంతి కావాలి, అందుకే అలసి వచ్చిన నన్ను అర్థం చేసుకోటానికి తన కోపాన్ని దిగమింగేది. అనుమానించదు, నా మీద ఉన్న నమ్మకం. కానీ నేను రస స్పందన పేరు తో ఆమె వ్యక్తిత్వాన్ని అవమానించాను,” అనుకుంటూ భారమైన ఆలోచనల తో గోడకు జారబడి సొమ్మసిల్లాడు.
***************** ************* ******************
తెల్లవారింది: హాల్లోకి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న రవిని చూసి విరజ “ఓ వంట ఆంటీ గారు, మా బావకు కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసి పెట్టండి”!! అని అన్నది.
రవి విసురుగా ఆమె గది లోకి వెళ్ళి తన సూట్ కేసును తెచ్చి బయటకు విసిరేసి “నీ లాంటి ఆడ దానికి, ఇంటికి రోడ్డుకి పెద్ద తేడా ఉండదు. వెళ్ళు” అన్నాడు.
“జరిగింది అక్కతో చెప్తాను” అని ఫోన్ అందుకున్న ది విరజ
రవి ఆమె చేతలోని ఫోన్ లాక్కొని, తానే వినీలకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు.
“బాబుకి మీ నాన్న గారి పేరు పెడుతున్న” అని ఆమె ఫోన్ పెట్టేసింది.
విరజ విసురుగా ఆ ఇంటి నించి నిష్క్రమించింది.
రచయిత్రి అంతరంగం: ‘నిజమైన మగ సిరి అంటే మానసిక నిగ్రహం’.