కుసుమాలే… మనసు విప్పితే

కుసుమాలే… మనసు విప్పితే

 

చర్చి ఫాదర్ కి, తుషార మూడు రోజుల పసి గుడ్డుగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న పొదల్లో దొరికింది. అప్పట్నించీ ఆమెని సొంత తండ్రి వలే ప్రేమగా పెంచారు ఆయన. ఆయన ఆశయాలకు, వాటి ఆచరణకు, మత విస్తృతికి తుషార ని ఒక ప్రతీకగా ఈ లోకానికి చాటాలని  చాలా చాలా  చిన్న విషయాలను కూడా పరిగణించేవారు ఆమె పెంపకం లో. ఆయన అంటే గిట్టని వారు తుషార అతడి సొంత కూతురవ్వటం వల్లే ఇంత శ్రద్ధ, అనుకునే వారే కానీ ఆయన మనస్సు గ్రహించ లేకపోయారు వారు. ఎంతో కృషి తర్వాత కూడా తమ చర్చి కి తగిన గుర్తింపు రాలేదని అందుకు గాను వారు పూర్తిగా ఆ గ్రామ ప్రజలకి తమ సేవలను అందించ లేకపోయామని, ఇదంతా తుషార సమర్థించ గలదు అని ఆయన ప్రగాఢ విశ్వాసం.

తుషార శాంతం, నిర్మలత్వం, పరోపకారం ఉన్నత భావాలు బాల్యం లోనే చర్చి ఫాదర్ నించి పుణికి పుచ్చుకుంది. ఆమె ఒక్కో ఉన్నత విద్య ని పూర్తి చేస్తుంటే, ఫాదర్ ఆయనే తమ చర్చి ఔన్నత్యం చాటటానికి ఒక్కో మెట్టు ఎక్కుతున్నట్లు సంబర పడేవారు.

************                    ***************                   ********************

ఇపుడు తుషారకి 25 సం.లు. మూర్తీభవించిన మేరీ మాత లా కనిపిస్తోంది ఫాదర్ కి. కాలాను సారంగా చదివించారు కానీ చర్చికి సంబంధించి ఆమె ‘నన్’ అవ్వాలంటే కొంత తర్ఫీదు , కొన్ని పరీక్షలు అవసరం. అందుకే ఆమెను కూర్చోబెట్టీ తన మనసులోని మాటను సహృదయముతో వివరిస్తారు ఆయన తుషారకి.

ఆమెకి మొదటి సారిగా ఫాదర్ యొక్క భావాలు తెలిసి ఏ విధముగా ఆయనను సమాధాన పరచాలో అర్థం కాక కొంత సమయం అడుగుతుంది. చదువుకొని ఉన్నత విద్య అభ్యసించిన పిల్ల మీద ఒత్తిడి తీసుకు రాకూడదనే భావనతో ఆయన తనకు ఆలోచించుకోమని కొంత వ్యవధిని ఇస్తారు. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘నన్’ అనే స్థానం ఒకరి ఒత్తిడి తో కాకుండా తమకు తాముగా చేపట్టవలసిన ఒక బాధ్యత అని, ప్రభువుకి తమని తాము సేవకులగా ఆర్పించు కోవటమే అని ఆయన ఆమెకు వివరిస్తారు.

 

ఇప్పుడు తుషార ఆలోచనలు సందిగ్ధతలో పడ్డాయి. చిన్నప్పటి నించి తనను శ్రద్ధగా పెంచి పెద్ద చేసి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మాటని గౌరవించటమా? లేక తన భావాలకు  తగ్గట్టూగా, తాను కలలు కన్నట్టుగా ఒక స్వేఛ్చాయుతమయిన జీవనం ఎంచుకోవటమా? అని.

***************                                ****************                     **************

తుషార, సిస్టర్ ఆజ్ఞస్ గా మారింది. “తుషార అనబడే నేను, నేను- నా భావనలు అనుకునే మొదటి మెట్టు ఎక్కటానికి, తన జీవితాన్నే ధార పోసిన వ్యక్తి కోసం నా కలలను త్యజించటం లో చేసే త్యాగం ఏ పాటిది” అనుకుంటుంది. తన దుస్తులు, వేష ధారణ త్యజించి ‘నన్ గా’ మారి తన కొత్త జీవితాన్ని ఆరంభిస్తుంది.

కానీ తనలో సహజ సిద్ధంగా ఉన్న భావనలు, స్వేచ్ఛా జీవనం యొక్క మాధుర్యతను తను పూర్తిగా మర్చిపోలేక పోతుంది. పరోపకారం అంటే పూర్తిగా తనని తాను మరచిపోవాలా? ఇంతలా మనస్సుని చంపుకోవాలా? నాకు కావలసిన జీవనం కొనసాగిస్తూ కూడా ఫాదర్ ఆశయాన్ని నిలబెట్టవచ్చు కదా? అని ఆయనను అడగాలని విఫల యత్నం చేస్తుంది ఆజ్ఞస్ రూపము లోని తుషార. ఆయన తన మాట కాదన లేరు. కానీ అపుడు వ్యక్తిగా తుషార అంటే ఇంతేనా? స్వార్థమా? ఈ ప్రశ్నే ఆమెను నలు వైపుల నించి బంధించి వేస్తుంది.

*************                                  *********************

మనస్సు ఉన్నా లేకున్నా ఫాదర్ ఆశయం కోసం అహర్నిశలు కృషి చేస్తుంది సిస్టర్ ఆజ్ఞస్. తన సొంత తెలివి, సహృద్యత తో అందరి మన్ననలను అందుకుంటుంది. ఫాదర్ ఆశయాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తుంది. చర్చి వైభవం మునుపటి కన్నా ఎంతో మెరుగు పడింది. ‘దేవుడికి కూడా భక్తులు వస్తూ ఉంటేనే గుర్తింపు. తమ సమస్యలను పూరించగలరు అన్న చోటుకే మానవుడి కాళ్ళు పరుగులు తీస్తాయి’, అదే గ్రహించింది తుషార. ఆమే తన చల్లని సహాయ హస్తం మతాలకు అతీతం గా అందించింది వేరే మతాలకు కూడా వారి మతస్తులతో సమానంగా. ఇపుడు అన్ని వైపుల నించి ఆమెకి ఇబ్బడి ముబ్బడి గా తిరిగి సహాయ సహకారాలు అందుతున్నవి. విదేశీ ప్రయాణాలు ఎక్కువ అయినవి. ఇక్కడ కూడా ఆమె ఒక పదవిని, గుర్తింపుని పొందినది.

కానీ రోజు రాత్రి పడుకునే ఒక్క నిమిషం ముందు, ఆమెని ఒక ప్రశ్న కలచి వేస్తుంది “ఇదేనా నీ జీవితం”? వెంటనే ఆమె పరోపకారము లో ఉన్న తృప్తి ఇంకెందులోనూ లేదు’ అంటూ ఆ ఆలోచనను మొగ్గ తొడగకుండా తుంచి వేస్తుంది.

************                     *******************                        ****************

మూడు సంవత్సరాల తరువాత:

ఒక మనిషి ముందుగా తనని తను పూరించుకున్నాకే, వేరొక మనిషి గూర్చి ఆలోచించగలడు. అలా కానీ పక్షంలో ఆ సేవ నిరర్థకమే.

వినటానికి, అనిపించటానికి ఇది పచ్చి స్వార్థపు ఆలోచనే, కానీ యదార్థం కూడాను సుమండీ!! అసలు తీపి రుచి తెలిస్తేనే కదా అమ్మ పిల్ల వాడికి తీపి తినిపించ గలదు, మరి అసలు అమ్మకి తీపి అంటేనే తెలియదు అనంటే, పిల్లవాడికి దేనిని ఆధారంగా చేసుకొని తీపిని చవి చూపించ గలదు చెప్పండి? అదే జరిగింది మన తుషార విషయం లో కూడా, తను ఇంకా పసి పాపే, లోకాన్ని ఇపుడిపుడే కళ్ళు విప్పార్చుకొని చూసే ప్రయత్నం మొదలెట్టింది, అంత లోనే ఫాదర్ ఆశయం తన భుజాల మీద వేసుకొని అమ్మ కానీ ఒక అమ్మ అయింది దీనులకి.

అదే ఫాదర్‌కి కొద్ది కొద్దిగా అర్థం అయినది. అప్పుడప్పుడు ఆమె యొక్క పరధ్యానం, ఉక్రోషపు ఛాయలు, అసహనం సూచనలు, చెమర్చిన కళ్ళు ఆయనకు చెప్పకనే చెప్పినవి. అందుకే నేరుగా సిస్టర్ ఆజ్ఞస్ ను అడిగారు ఆయన, ” సిస్టర్ ఆజ్ఞస్ మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం అడుగుతాను, మీరు ఇక్కడ మనస్ఫూర్తిగా ఒక ‘సిస్టర్ ఆజ్ఞస్ గా’ ఉంటున్నారా లేక తుషారని అదిమి పెట్టి మమ్మల్ని, మిమ్మల్ని మోసం చేస్తున్నారా?” అని.

అంత సూటి ప్రశ్నకు ఆమెలోని ‘తుషార’ కన్నీరు కార్చినా, మేలి ముసుగులా ఉన్న సిస్టర్ ఆజ్ఞస్ మాత్రం వెంటనే సంభాళించుకొని  చిరునవ్వుతో అన్నది, “అదేం ప్రశ్న ఫాదర్? నా అంకిత భావనలో లోపాలుంటే వివరించండి, నన్ను నేను సరి దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అంతే కాని శంకించి నన్ను అవమానించకండి” అని.

ఫాదర్‌కి పసి పాప తుషార ప్రస్ఫుఠంగా, సిస్టర్ ఆజ్ఞస్ ముఖము లో గోచరించింది. … “ప్రభువు నీకు మేలు చేయును గాక” అని ఆమె తల నిమిరి అక్కడ నించి నేరుగా ప్రభువు జీసస్ ముందు మోకరిల్లుతారు ఆయన. “ప్రభూ! నీ సేవే జీవిత ఆశయంగా పెట్టుకొని దీన జన సేవ పేరుతో నీ బిడ్డలని కాపాడుతున్నాను అనుకున్నాను కాని, తుషార కూడా నీ బిడ్డలలో ఒకటి అని మరచి పోయాను తండ్రీ. ..గుడ్డిగా ఒక జీవిని హింసించాను, నన్ను క్షమించు, ఒక పసి గుడ్డుని నీ సేవకి సమాయత్తము చేస్తున్నా అనుకున్నాను కాని, ఆమె ఇష్టాలను గుర్తించలేక పోయాను. హే జీసస్!!! నువ్వుగా ఆమెకి ఊపిరి పోసావు, నువ్వు కదా ఆమెకి భావనలు కలిగిస్తున్నావు, మరి నేనెవరిని అయ్యా వాటిని తుంచి వేయటానికి? నీవు నాకు ఆమెని పెంచుకోమని మాత్రమే ఆజ్ఞ ఇచ్చిన విషయం మరిచి నా ఆశయాల పేరుతో ఒక చట్రంలో బిగించాను ఆమెని. ఇప్పటికయినా నా కళ్ళు తెరిపించి నన్ను సన్మార్గం లో పెట్టినందుకు  నీకు ఋణ పడి ఉంటాను” అని కన్నీరు పెట్టారు ప్రభువు సమక్షంలో ఆయన.

******                         *******************                                   *****************

ఇపుడు తుషార ఒక బహుళ జాతీయ సంస్థ కి సి.ఈ.ఓ గా పని చేస్తోంది. అంతేగాక ప్రవృత్తిగా రచనలు చేయటం, వివిధ దేశాలకు యాత్రలు కూడా చేస్తూ తన స్వేచ్ఛని సద్వినియోగ పరచుకుంటోంది. వారాంతం లో ఫాదర్‌కి చర్చి పనులలో అండగా ఉంటూ చర్చి కి విదేశాల్లో కూడా గుర్తింపు తీసుకు రావటానికి సాయ శక్తులా కృషి చేసి సాధించింది మన తుషార.

ఫాదర్ తుషారని తలుచుకొని మనస్ఫూర్తిగా గర్విస్తూ ప్రభువుకి ధన్య వాదాలు తెలుపుకున్నారు ఇలా.. “హే ప్రభు! కుసుమాలు ఎక్కడున్నా వాటి పరిమళం నీ కోసమే తండ్రీ, వాటిని పూర్తిగా వికసించక ముందే మేము వాటిని నలిపి నీకు అర్పించాలని చూసినా నువ్వు ఒప్పుకోవు అని నిరూపించావు..  ఆమెన్”

 

****        రచయిత్రీ అంతరంగం : పర పీడన కు దేవుడు ఎప్పటికీ వ్యతిరేకి…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements